ప్రకాశం జిల్లా తుమ్మలబయలు సఫారీ క్యాంప్..
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై .. నునులేత రెమ్మనై .. ఈ అడవీ సాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని తన కృష్ణపక్షం తొలి కవితగా రాసుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది నల్లమల. ఈ అభయా రణ్య విహారం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. పచ్చని ప్రకృతి సోయగాలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, నింగిని తాకుతున్న మహావృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులను చూస్తూ సాగే జంగిల్ సఫారీ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, ప్రకాశం జిల్లా పెదదోర్నాల సమీపంలోని తుమ్మలబయలు క్యాంపుల్లో ఏకో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. పలువురు పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తున్నది.
కొండల్లో..కోనల్లో..
ఎకో టూరిజంలో భాగంగా ఆరుగురు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లో గంటన్నర పాటు జంగిల్ సఫారీ సాగుతుంది. స్థానిక చెంచుజాతి యువత గైడులుగా జంగిల్ క్యాంప్, ప్రకృతి వీక్షణం, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్‌ఫ్లై వాకింగ్, హెరిటేజ్ వాక్, సిద్ధాపురం ట్యాంక్ వాక్.. అటవీ అందాలను పరిచయం చేస్తుంది. ఆదిమ గిరిజన జాతి ‘చెంచులు’ సంప్రదాయ విలువిద్య సాధన యువతలో సరదాను నింపుతోంది.
మూడు క్యాంపుల్లో..
► పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని గోర్లెస్ కాలువ నుంచి లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తుమ్మలబయలు సఫారీ ఉంటుంది. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సుమారు 13కిలో మీటర్ల ప్రయాణం 1.30 గంటల పాటు ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సఫారీకి అనుమతిస్తారు.
► మహానంది సమీపంలోని పచ్చర్ల గిరిజన గ్రామం నుంచి సుమారు 10 కిలో మీటర్ల జంగిల్ ట్రాక్ ఉంది. దాదాపు గంటర్నరకుపైగా సాగే సఫారీలో సూర్యుడు కంటికి కనిపించనంతగా ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన చెట్ల కింద ప్రయాణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ సందర్శకులు బస చేసేందుకు రెండు కాటేజీలు, నాలుగు టెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి.
► ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గిరిజన గ్రామంలో 10 కిలో మీటర్ల సఫారీ ట్రాక్ ఉంది. ఈ గ్రామం నుంచి మూడు కిలో మీటర్లు దూరం వెళ్తే టైగర్ జోన్ ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, డార్మెట్రీలు అందుబాటులో ఉన్నాయి.
► సఫారీకి ఆరు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లను వినియోగిస్తున్నారు. ఒక రైడ్‌కి రూ.800 (ఒక వ్యక్తికి రూ.150) వసూలు చేస్తున్నారు. ఇక కాటేజీలు, టెంట్‌లకు రూ.5వేల నుంచి రూ.4వేల వరకు ధర ఉంది. ఇందులోనే భోజన సదుపాయం, సఫారీ కూడా కలిపి ఉంటుంది.
జీవ వైవిద్యానికి నిలయం..
తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష, జంతుజాలానికి నిలయంగా ఉంది. పులులు, మచ్చల జింకలు, ఇండియన్ బస్టర్డ్స్, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులతో పాటు దాదాపు 70 రకాల క్షీరదాలు, 300 రకాల పక్షులు, 100 రకాల సీతాకోక చిలుకల ఆవాసాలున్నాయి. గ్రే హార్న్‌బిల్ (పొడవాటి ముక్కు పక్షి), డ్రోంగో, కోయెల్, ఇండియన్ రోలర్, ప్యారడైజ్ ఫ్లై చోచర్, బ్లాక్ హెడ్ ఓరియోల్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, పర్పుల్ సన్‌బర్డ్ జాతులు కనువిం దు చేస్తాయి. వీటిని చూడటానికి సందర్శకులు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగా ప్రకృతి నడకకు వెళ్తారు. అడవుల పరిరక్షణ, స్థానిక తెగల జీవన ప్రమాణాల పెంపు, అటవీ సంపదను రక్షించుకోవడంపై పర్యాటకులకు అవగాహన కల్పనలో భాగంగా పర్యాటక, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వన్యప్రాణి వారోత్సవాలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment