నల్లమలలో ‘జంగిల్ సఫారీ’
శ్రీశైలం ఘాట్ రోడ్డులో గోర్లెస్ కాలువ ప్రాంతం నుంచి ప్రారంభం
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం... ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చికబయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ ఓపెన్ జిప్సీల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీశాఖ పర్యాటకులకు కల్పించింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి ‘జంగిల్ సఫారీ’ పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వివిధ ప్యాకేజీలతో పర్యాటకులు సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని చుట్టి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.
విభిన్న ప్యాకేజీలతో టైగర్ సఫారీ..
పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద ఉన్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి ఓపెన్ జిప్సీల్లో ‘టైగర్ సఫారీ’ ప్రయాణం మొదలవుతుంది. మొదటి ప్యాకేజీగా రాను, పోనూ కలిపి 26 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. దీని ధర రూ.2,400. (ఆరుగురు) లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూ పాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా సాగే ఈ ప్రయాణం తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ముగుస్తుంది. రెండవ ప్యాకేజీ ధర రూ.4 వేలు(ఆరుగురు). ఈ ప్యాకేజీలో 40 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రయాణం ఉంటుంది. నల్లమలలోని పెద్దారుట్ల గేట్, పెద్దారుట్ల వాచ్ టవర్, బేస్ క్యాంపు, పుల్లలదొన, గుడిమెట్ల, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణం ఉంటుంది.
కనువిందు చేస్తున్న వన్యప్రాణులు
జంగిల్ సఫారీలో భాగంగా నల్లమలలో జిప్సీ వాహనంలో పర్యటిస్తున్న సందర్శకులకు రాజసానికి ప్రతీకగా నిలిచే పెద్దపులులు కనువిందు చేస్తుంటాయి. పులిచెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులులు, చిరుతలు, కృష్ణజింకలు, దుప్పులు, నెమళ్లు తారసపడుతుండటంతో పర్యాటకులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నారు. అదేవిధంగా జంగిల్ సఫారీ ప్రారంభమయ్యే గోర్లెస్ కాలువ ప్రాంతం వద్ద ఏర్పాటుచేసిన పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రంలో పెద్దపులి, జింకలు, కృష్ణజింక, నీల్‌గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలు, రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలితోపాటు ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్టించారు.
దీంతోపాటు సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి బొమ్మ వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి అరుపులతోపాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్‌లో వినబడేలా ఏర్పాట్లుచేశారు. వాహనాలు ప్రయాణించే దారి పొడవునా ఉండే వివిధ జాతుల వృక్షాలపై వాటి పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటుచేసి సందర్శకులకు అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సాగే ఈ జంగిల్ సఫారీని సుక్షితులైన అటవీ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో వాహనాలు మరమ్మతులకు గురైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి మరో వాహనాన్ని ఘటనాస్థలానికి పంపించేలా అధునాతన టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment