
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం..
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి.
30కి పైగా ప్రదేశాలు..
తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది.
థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు..
ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్‌డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు.
తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్‌లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్నో పర్యాటక అద్భుతాలు
అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి.
– మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి