అడవిలో పులులు, వన్యప్రాణుల సంరక్షణలో వారి భాగస్వామ్యం
అటవీ అధికారులతోపాటు వాచర్లుగా చెంచుల సేవలు
మన్ కీ బాత్‌లో నల్లమల చెంచుల సేవలను కొనియాడిన ప్రధాని మోదీ
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమలలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక చెంచులు రక్షణగా ఉంటున్నారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న వారు ఇక్కడి చెట్లు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన జలధారల పట్ల ఎంతో మమకారంగా ఉంటారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ సిబ్బందిలోనూ చెంచులు క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటూ అడవికి పహారాగా నిలుస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన కోర్ ఏరియాలో 20 వరకు చెంచుపెంటలు, చెంచుల ఆవాసాలు ఉండగా, వీరి సంపూర్ణ తోడ్పాటుతో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 2018లో 12 పులులు ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 32కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు 187 వరకు చిరుతలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు, మిశ్రమ జంతుజాతులకు నల్లమల నిలయమైంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నల్లమలలోని చెంచుల కృషిని ప్రస్తావించారు. ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తున్న చెంచులు నల్లమలలో టైగర్ ట్రాకర్లుగా గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు.
ఇక్కడ సంఘర్షణకు తావులేదు..
దేశంలో చాలాచోట్ల పులుల అభయారణ్యాల్లో మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణ తలెత్తుతోంది. మనుషులపై పులుల దాడులు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అయితే నల్లమలలోని అమ్రాబాద్ కోర్ ఏరియాలోని దట్టమైన అరణ్యంలో చెంచులు నివసిస్తుండగా.. చెంచులు, పులులకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంఘర్షణ తలెత్తలేదు. అడవిలో పులులు, వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా జీవనం సాగిస్తున్నారు. అడవిలో ఎప్పుడైనా పులితోపాటు ఇతర వన్యప్రాణులు ఎదురైన సందర్భంలో దూరం నుంచే గమనించి వాటి స్వేచ్ఛా విహారానికి భంగం కలిగించకుండా మసులుకుంటారు.
క్షేత్రస్థాయిలో వాచర్లుగా చెంచులు..
అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు పులుల అడుగుజాడలను గుర్తించడం, క్షేత్రస్థాయి విధుల్లో అటవీశాఖ ఇక్కడి స్థానిక చెంచులనే భాగస్వాములను చేస్తోంది. పులుల జాడ తెలుసుకునేందుకు, పాదముద్రలు, విసర్జితాల సేకరణ, పులులు తిరగాడిన ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 130 మంది చెంచు సిబ్బందిని అటవీశాఖ నియమించుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మొత్తం 27 బేస్‌క్యాంపులకు గానూ 24 క్యాంపుల్లో చెంచులే పనిచేస్తున్నారు.
టైగర్ ట్రాకర్లు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లుగా చెంచులే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లమలలో చెంచులు, సమీప ఆవాసాల ప్రజల సహకారంతోనే పులుల సంతతి పెరిగిందని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ రోహిత్ తెలిపారు. అడవిలో క్షేత్రస్థాయి విధుల్లో ఎక్కువగా చెంచులే సేవలందిస్తున్నారని, భవిష్యత్‌లోనూ వీరి సంఖ్యను మరింత పెంచనున్నట్టు వివరించారు.
పులి కనిపిస్తే ఆగిపోతాం..
అడవిలో పోతున్నప్పుడు పులి ఎదురైతే దూరం నుంచే చూసి అక్కడే ఆగిపోతాం. చప్పుడు చేయకుండా ఉండి పులి అక్కడి నుంచి వెళ్లే దాకా వేచిచూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మమ్మల్ని ఏమీ చేయవు. పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది
లేకుండా పనులు చేసుకుంటాం. – గురువయ్య, మేడిమల్కల చెంచుపెంట, నాగర్‌కర్నూల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment