wildlife protection
-
నల్లమల ‘మన్ కీ బాత్’.. చెంచులే చేయూత!
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమలలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక చెంచులు రక్షణగా ఉంటున్నారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న వారు ఇక్కడి చెట్లు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన జలధారల పట్ల ఎంతో మమకారంగా ఉంటారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ సిబ్బందిలోనూ చెంచులు క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటూ అడవికి పహారాగా నిలుస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన కోర్ ఏరియాలో 20 వరకు చెంచుపెంటలు, చెంచుల ఆవాసాలు ఉండగా, వీరి సంపూర్ణ తోడ్పాటుతో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 2018లో 12 పులులు ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 32కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు 187 వరకు చిరుతలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు, మిశ్రమ జంతుజాతులకు నల్లమల నిలయమైంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నల్లమలలోని చెంచుల కృషిని ప్రస్తావించారు. ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తున్న చెంచులు నల్లమలలో టైగర్ ట్రాకర్లుగా గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ సంఘర్షణకు తావులేదు.. దేశంలో చాలాచోట్ల పులుల అభయారణ్యాల్లో మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణ తలెత్తుతోంది. మనుషులపై పులుల దాడులు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అయితే నల్లమలలోని అమ్రాబాద్ కోర్ ఏరియాలోని దట్టమైన అరణ్యంలో చెంచులు నివసిస్తుండగా.. చెంచులు, పులులకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంఘర్షణ తలెత్తలేదు. అడవిలో పులులు, వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా జీవనం సాగిస్తున్నారు. అడవిలో ఎప్పుడైనా పులితోపాటు ఇతర వన్యప్రాణులు ఎదురైన సందర్భంలో దూరం నుంచే గమనించి వాటి స్వేచ్ఛా విహారానికి భంగం కలిగించకుండా మసులుకుంటారు. క్షేత్రస్థాయిలో వాచర్లుగా చెంచులు.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు పులుల అడుగుజాడలను గుర్తించడం, క్షేత్రస్థాయి విధుల్లో అటవీశాఖ ఇక్కడి స్థానిక చెంచులనే భాగస్వాములను చేస్తోంది. పులుల జాడ తెలుసుకునేందుకు, పాదముద్రలు, విసర్జితాల సేకరణ, పులులు తిరగాడిన ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 130 మంది చెంచు సిబ్బందిని అటవీశాఖ నియమించుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మొత్తం 27 బేస్‌క్యాంపులకు గానూ 24 క్యాంపుల్లో చెంచులే పనిచేస్తున్నారు.టైగర్ ట్రాకర్లు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లుగా చెంచులే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లమలలో చెంచులు, సమీప ఆవాసాల ప్రజల సహకారంతోనే పులుల సంతతి పెరిగిందని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు. అడవిలో క్షేత్రస్థాయి విధుల్లో ఎక్కువగా చెంచులే సేవలందిస్తున్నారని, భవిష్యత్‌లోనూ వీరి సంఖ్యను మరింత పెంచనున్నట్టు వివరించారు.పులి కనిపిస్తే ఆగిపోతాం.. అడవిలో పోతున్నప్పుడు పులి ఎదురైతే దూరం నుంచే చూసి అక్కడే ఆగిపోతాం. చప్పుడు చేయకుండా ఉండి పులి అక్కడి నుంచి వెళ్లే దాకా వేచిచూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మమ్మల్ని ఏమీ చేయవు. పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటాం. – గురువయ్య, మేడిమల్కల చెంచుపెంట, నాగర్‌కర్నూల్ జిల్లా -
చీతాల రక్షణ కోసం.. సూపర్ సైన్యం
ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి తెప్పించిన చీతాలను భద్రంగా చూసుకునే పనిలో ఉన్నారు కునో నేషనల్ పార్క్(మధ్యప్రదేశ్) అటవీశాఖ అధికారులు. నెలపాటు అవి క్వారంటైన్‌లోనే ఉండాలి గనుక.. బయటి ప్రాంతపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వీటి పహారా కోసం రెండు గజరాజులను మోహరించారు. ఇక ఇప్పుడు నాలుగు కాళ్ల కమాండర్లు వాటిని పరిరక్షించేందుకు శిక్షణ తీసుకోవడంలో తలమునకలయ్యాయి. నమీబియా చీతాల సంరక్షణ కోసం సూపర్ స్నిఫర్ బృందాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐటీబీపీ(ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్) సెంటర్ వద్ద శిక్షణ తీసుకున్న ఇలూ అనే ఆడ జర్మన్ షెపర్డ్ ఈ బృందంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు దేశంలోని వివిధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వద్ద పని చేసిన ఐదు శునకాలు ఇలూకు తోడు కానున్నాయి. నమీబియా చీతాలను వేటగాళ్ల బారి నుంచి రక్షించడంలో ఈ స్నిఫర్ బృందం కీలకంగా వ్యవహరించబోతోంది. ► మూడు నెలల ప్రాథమిక శిక్షణ, మరో నాలుగు నెలల అడ్వాన్స్డ్ శిక్షణ పూర్తి చేసుకున్నాక వీటిని కునో నేషనల్ పార్క్ వద్ద మోహరిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి రంగంలోకి దిగుతాయి. ► శిక్షణలో.. పెద్దపులి, చిరుతల చర్మాలను, ఎముకలను, ఏనుగు దంతాలు, ఇతర భాగాలను, వన్యప్రాణులను అక్రమంగా తరలించడాన్ని ఇవి పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ► దేశంలో సూపర్ స్నిఫర్ స్క్వాడ్స్ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో ఇప్పటికే ఈ తరహా టీంలు పని చేస్తున్నాయి. ► సూపర్ స్నిఫర్ స్క్వాడ్స్‌లో.. శునకాలు నెలల వయసు ఉన్నప్పటి నుంచే శిక్షణ ప్రారంభిస్తారు. శిక్షణ మొదటి రోజు వాటి రిటైర్మెంట్ వరకు ఒకే శిక్షకుడు వెంటే ఉంటాడు. ► కేవలం చీతాలకు మాత్రమే కాదు.. కునో నేషనల్ పార్క్‌లోని ఇతర వన్యప్రాణులను సైతం వేటగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ బృందం పని చేస్తుందని ఇలూ శిక్షకుడు సంజీవ్ శర్మ చెప్తున్నారు. ► ఐటీబీపీ కేంద్రాల్లో శిక్షణ పొందిన శునకాలు.. వన్యప్రాణుల నేరాలను గుర్తించడంలో ఎక్కువ విజయాన్ని సాధించాయి. వేటగాళ్లను పట్టించడంలో.. వన్యప్రాణుల అవశేషాలను పట్టించడంలో ఇంతకు ముందు అవి ఎంతో కీలకంగా వ్యవహరించాయి. ► భారత దేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కూడా వైల్డ్‌లైఫ్ స్నిఫర్ డాగ్ బృందాల సేవలను వినియోగించుకుంటున్నాయని ఐటీబీపీ అధికారులు చెప్తున్నారు. ► రైల్వే నెట్‌వర్క్‌ల గుండా జరిగే అక్రమ రవాణా, అరుదైన జీవజాలం తరలింపు ప్రయత్నాలను ఇవి భగ్నం చేసిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. ► వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు.. 2008లో TRAFFIC, WWF-Indiaలు సంయుక్తంగా వైల్డ్ లైఫ్ స్నిఫర్ డాగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన శునకాలు.. ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వద్ద మోహరించబడ్డాయి. -
వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని
తిరువనంతపురం: కేరళలోని ఆర్పూకర నివాసి సుజిత్ ఆగస్టు 2న మలప్పురం వెళ్లారు. అక్కడ వజికడవు చెక్‌పోస్ట్ వద్ద తన కారు ఆగింది. ఆ సయమంలోనే ఒక విషసర్పం కారు వద్దకు వచ్చి అందులో దాగి ఉంది. ఈ విషయం తెలియని కారు యజమాని సుజిత్ ఆర్పూకర్లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. సుజిత్ ఒక రోజు కారులో వేలాడుతున్న కుబుసం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు. దీంతో ఈ విషసర్పం ఇక్కడే ఎక్కడే సంచరిస్తుందని సుజిత్ తన ఇంటి కాంపౌండ్‌ని, కారుని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. అయినా ప్రయోజం ఉండదు. దీంతో సుజిత్ కుటుంబం ఒకింత భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని తన చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. ఐతే అక్కడ ఉన్న కొంతమంది స్థానికు పాము కారు వద్ద ఉండటం చూశామని చెప్పడంతో వన్యప్రాణుల సిబ్బందిని పిలిపించారు. వారు వచ్చినప్పుడూ గానీ తెలియలేదు పాము ఎక్కడ ఉందనేది. ఆ విషసర్పం ఏకంగా కారు ఇంజన్ బేస్‌లో ఉంది. బహుశా వజికడుపు చెక్ పోస్ట్ వద్ద ఆగినప్పుడే ఈ పాము వచ్చి ఉంటుందని భావించారు అంతా. అంతేకాదు ఈ పాము ఏకంగా కారు ఇంజన్ బేలోనే వారం రోజులపాటు ఉంది. అలాంటి విషసర్పం సంచరించని ప్రదేశంలోకి వస్తే ఎవరైన కలవరపాటుకి గురవ్వడం సహజమే. (చదవండి: బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...) -
వన్యప్రాణాలకు రక్షణేదీ..!
ఆలేరు దట్టమైన అడవులు కనుమరుగవుతుండడం, తాగునీరు లభ్యం కాకపోవడంతో మూగజీవాలు వలసబాట పడుతున్నాయి. మరికొన్ని రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్నాయి. కరువు పరిస్థితి కూడా వన్యప్రాణుల మనుగడకు ప్రతిబంధకంగా మారింది. ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడం, వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చడం, పోడు వ్యవసాయం చేయడం, పరిశ్రమల ఏర్పాటు, సెజ్‌ల పేరిట అడవులు అంతమవుతున్నాయి. దీంతో మూగజీవాలకు శాపంగా పరిణమించింది. ఇదే అదనుగా భావించి కొన్ని చోట్ల వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి మూగజీవాలను హతమార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు రోడ్డు దాటుతూ చనిపోతున్నారుు. ప్రతి ఏటాఆదివారం ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. తానుకూర్చున్న కొమ్మనే.. పర్యావరణంలో కీలకమైన అడవులను నరికివేస్తుండడంతో మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా ఉంది. ప్రకృతి.. చెట్లు, కొండలు, అడవులు, నదులు, జంతుచరాలు, మానవుల సమాహారమే ప్రకృతి. వీటిలో వేటికి ఆపద జరిగినా చివరకు నష్టం జరిగేది మనిషికే. ఇంతకు ముందు వణ్యప్రాణులను సర్కస్‌లలో చూసే అవకాశముండేది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సర్కస్‌లలో జంతువులను వినియోగించడం లేదు. అడవి జంతువులను చూడాలంటే జూపార్క్‌లు, టీవీలో చూడాల్సిందే. అంతరిస్తున్న పక్షులు ఒకప్పుడు అడవుల్లో జంతువులతో పాటు పక్షుల చప్పుళ్లు వినబడేవి. నెమళ్లు, కముజులు, రామచిలుకలు, పావురాలు, గద్దలు, పాలపిట్టలు, గువ్వలు, రకరకాల సోయగాలతో కనువిందు చేసేవి. అడవుల్లో వృక్షాలు కనుమరుగు కావడం, చెట్ల మీద పండ్లు లేకపోవడంతో పక్షుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పురుగు మం దుల వాడకంతో, నీటి వనరుల్లో నీరు నిల్వలేకపోవడం, పక్షులను వేటాడడంతో పక్షులు అంతరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అడవులు ఇలా.. ఉమ్మడి జిల్లాలో 14.24లక్షల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఇందులో 83, 700 హెక్టార్లలో అడవులు, 7, 700హెక్టార్లలో వృక్షసంపద ఉన్నట్లు తెలుస్తోంది. సంరక్షణ చర్యలు ఇలా.. ప్రభుత్వ భూముల్లో విస్తారంగా మొక్కల పెంపకం చేపట్టాలి. వన్యప్రాణులను వేటాడకూడదు. ప్రత్యేకంగా ఆహారం, నీటి కేంద్రాలను అడవుల్లో ఏర్పాటు చేయాలి. సహజ ఆవాసాలు విచ్ఛిన్నం కాకుండా సంరక్షణకు నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజల్లో జీవకారుణ్య స్వభావం పెరగాలి. వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. అభయరణ్యాల చుట్టూ ముళ్లకంచెలు ఏర్పాటు చేసి గార్డులను ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో వివిధ రకాల వృక్షజాతులను పెంచాలి. -
వైల్డ్ లైఫ్ గార్డ్స్
జంతువుల పాలిట లైఫ్‌గార్డ్స్ వాళ్లు. ఆపదలో చిక్కుకున్న మూగజీవాల పాలిట ఆపద్బాంధవులు. వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా సంఘటితమైన నిస్వార్థ సేవకులు. జంతు సంరక్షణపై భావసారూప్యం గల వారంతా కలసి ‘యూనివుల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్’ (ఏఆర్‌పీఎఫ్) పేరిట స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డారు. జూ కాప్స్గా, గ్రీన్ వారియర్స్‌గా విభిన్న సేవలందిస్తూ ముందుకు సాగుతున్న ‘ఫ్రంట్’పై ప్రత్యేక కథనం.. ఏఆర్‌పీఎఫ్.. ఈ పేరు వింటే చాలు.. జంతువుల వేదన అరణ్య రోదన కాబోదు. మూగజీవం ఆపదలో ఉంటే ‘మేమున్నామంటూ..’ వెంటనే ‘ఫ్రంట్’ రంగంలోకి దిగిపోతుంది. అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణపై నగరంతో పాటు దేశవ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్న యానిమల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్ (ఏఆర్‌పీఎఫ్)లో ఆటోడ్రైవర్లు మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు.. విద్యార్థులు మొదలుకొని విశ్రాంత ఉద్యోగుల వరకు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఇందులో చేరడానికి, సభ్యత్వం పొందడానికి విద్యార్హతలు, హోదాల తో పనిలేదు. అవి అవసరం లేదు కూడా!. వుూగజీవాలను ప్రేమించగలిగే కాసింత మంచి మనసుంటే చాలు.. ఎవరైనా ఇందులో చేరవచ్చు. స్వచ్ఛందంగా సేవలందించవచ్చు. గాయపడ్డ జంతువులకు ప్రాథమిక చికిత్స చేయుడం, అవసరమైతే పశువైద్యుల చేత చికిత్స చేరుుంచడం, జంతు ప్రదర్శనశాలల్లో ఆకతాయిల వేధింపుల నుంచి జంతువులకు రక్షణ కల్పించడం వంటి సేవలను ఏఆర్‌పీఎఫ్ అందిస్తోంది. వన్యప్రాణులను పరిరక్షించుకోవలసిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ 51వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఏఆర్‌పీఎఫ్ సభ్యులు జూపార్కులో ‘జూ డే రన్’ నిర్వహించారు. జూ పార్కు నుంచి చార్మినార్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై నగర వాసుల్లో అవగాహన పెంపొందించేందుకు విరివిగా కార్యక్రవూలు చేపడుతూ అనతికాలంలోనే దేశంలోని నలుమూలలకూ విస్తరించింది ఏఆర్‌పీఎఫ్. ఇదీ నేపథ్యం.. నగరానికి చెందిన నీహార్ పరులేకర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ‘యానిమల్ రెస్క్యూ అండ్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను 2011 జనవరి 23న ప్రారంభించారు. సంస్థను ప్రారంభించినప్పుడు ఇందులో ఇరవై వుంది విద్యార్థులు మాత్రమే చేరారు. వేర్వేరు నేపథ్యాలు గల వీరంతా వన్యప్రాణి ప్రేమికులు. జంతు సంరక్షణ కోసం వీరు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆకట్టుకోవడంతో వివిధ వర్గాల వారు ఇందులో చేరడం ప్రారంభించారు. అదే ఏడాది మార్చి 31న ఈ సంస్థ ‘యానిమల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్’గా ఆవిర్భవించింది. అనతి కాలంలోనే ఈ సంస్థ దేశంలో ఐదు శాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం ఏఆర్పీఎఫ్కు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ఇండోర్, భువనేశ్వర్, పుణేలలో శాఖలు ఉన్నాయి. త్వరలోనే బెంగళూరు, నాగపూర్లలోనూ శాఖలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలో దాదాపు మూడువేల వుంది సభ్యులు ఉన్నారు. సంస్థలో ఐదు విభాగాలను ఏర్పాటు చేసుకున్నారు. జూ కాప్స్ ఈ విభాగంలోని సభ్యులు దేశంలోని జూపార్క్లను సందర్శిస్తూ, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తుంటారు. సందర్శకులకు జంతువుల తీరుతెన్నులు, వాటిని కాపాడుకోవాల్సిన వైనంపై వివరిస్తుంటారు. ఎవేర్నెస్ టు యూక్షన్ ఇందులోని సభ్యులు పాఠశాలలను సందర్శిస్తుంటారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రవూలు నిర్వహిస్తారు. ట్రెక్కింగ్ కార్యక్రవూలను నిర్వహిస్తారు. ఫీల్డ్ వర్క్, గెడైడ్ టూర్స్ ద్వారా జంతు సంరక్షణ.. ఆవశ్యకతపై పాఠాలు బోధిస్తారు. గ్రీన్స్ వారియర్స్ ఈ విభాగంలోని సభ్యులు పర్యావరణ యోధులు. ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గ్రీన్ వారియర్స్ ధ్యేయం. ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ వివిధ సందర్భాలలో గాయుపడిన జంతువులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తుంటుంది ఈ స్క్వాడ్. జంతువులు ఆపదలో చిక్కుకున్నాయని ఫోన్ వచ్చినా, సమాచారం అందినా చిటికెలో అక్కడకు ఇందులోని సభ్యులు చేరుకుని వైద్యసాయుం అందిస్తారు. పెంపుడు జంతువులైనా, అడవి జంతువులైనా.. ఎలాంటి వాటినైనా వుచ్చిక చేసుకోవడంలో వీరు సుశిక్షితులు. జనసంచార ప్రాంతాల్లోకి వచ్చే పాములు, ఇతర జంతువులను నేర్పుగా పట్టుకుని అడవుల్లో వదిలిపెడతారు. దీపావళి వంటి సందర్భాలలో శబ్ద కాలుష్యం ఇతరత్రా కారణాలతో గాయపడిన ప్రాణుల్ని చేరదీసి రక్షిస్తారు. యూంటీ పోచింగ్ స్క్వాడ్ వన్యప్రాణుల వేటను నిరోధించడంలో అటవీ శాఖకు, వన్యప్రాణి సంరక్షణ శాఖకు ఈ విభాగం సహకరిస్తూ ఉంటుంది. ఈ టాస్క్‌ఫోర్స్ విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. పాములు, ఇతర ప్రాణుల్ని ఇబ్బందులకు గురిచేసే చర్యల నుంచి కాపాడుతారు. పక్షుల్ని నిర్బంధం నుంచి విడిపిస్తారు. - శిరీష చల్లపల్లి -
ప్రణాళిక ప్రకారం రక్షణ కల్పించాలి
జన్నారం : అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళికబద్ధంగా ఉండాలని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీ డెప్యూటీ డెరైక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్, మేనేజ్మెంట్పై జన్నారం అటవీ శాఖ కమ్యూనిటీ హాలులో ఇస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా సోమవారం ఫారెస్ట్ లా పై అధికారులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు వేటాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిందితుడికి శిక్ష పడాలంటే ఎలాంటి సెక్షన్లతో కేసులు పెట్టాలో వివరించారు. అలాగే కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు పెట్టాలో, కలప అక్రమ రవాణా నిరోధానికి ఏం చేయాలో తెలిపారు. ఒక్కోసారి కేసు ఏ సెక్షన్ కింద నమోదు చేయాలో తెలియక కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నందున, ఆచి, తూచి వ్యవహరించాలని సూచించారు. తెలియకపోతే వేరే వారి సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. హెక్ట్కాస్ సంస్థ నిర్వాహకుడు ఇమ్రాన్, వివిధ డివిజన్లకు చెందిన రే ంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
ఇక అడవి సురక్షితం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీశాఖకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ఫైలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అటవీశాఖను పటి ష్ట పరచాలని మూడున్నరేళ్లుగా అధికారులు చేసిన సిఫారసులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఉన్నతస్థాయి అధికారులు సమర్పించిన నివేదికల మేరకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని నిజామాబాద్, మెదక్ డివిజన్లలో అటవీ డివి జన్లు, రేంజ్‌లు, సెక్షన్, బీట్ల సంఖ్య పెరగనుంది. సర్కిల్, డివిజన్, రేంజ్ కార్యాలయాల పెంపుతో పాటు అధికారులు, సిబ్బంది కొరత నివారణకు ఉద్యోగుల నియామకం, తదితర అంశాలపై మార్గదర్శకాలను నిర్దేశిస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లకు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నర్పట్‌సింగ్ నివేదికతో కదలిక మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్‌సింగ్ ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, అధ్యయనం చేశారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, కలప రవాణాలను అడ్డుకునేందుకు ఆయన నివేదికలో మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్ఎస్ క్యాడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డీఎఫ్ఓలుగా నియమించాలని సూచించారు. అధికారులకు తగ్గనున్న పరిధి అటవీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గనున్నది. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో 1,473 చదరపు కిలోమీటర్లు కాగా, 750 చదరపు కిలోమీటర్లకు తగ్గనుంది. ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలోమీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు తగ్గనుంది. నిజామాబాద్ అటవీ సర్కిల్ పరిధిలో నిజామాబాద్, మెదక్ డివిజన్లు ఉండగా.. ఈ రెండిం టిని త్వరలోనే విడదీసి రెండు సర్కిళ్లు చేయనున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని రెండు డివిజన్లు నాలుగుకు పెరగనున్నాయి. రేంజ్‌లు 7నుంచి 12కు పెరగనున్నాయి. మెదక్ డివిజ న్లో మాత్రం ఫారెస్టు డివిజన్లు, రేంజ్‌లు యథాతథంగా ఉంటాయి. అదే విధంగా రెండు డివిజన్లలో ప్రస్తుతం ఉన్న 52 సెక్షన్లు 61కి, 207గా ఉన్న బీట్లు 239కి పెరుగుతాయి. అమలుపై అధికారుల కసరత్తు అటవీశాఖ పునర్వ్యస్థీకరణ ఉత్తర్వుల అందడంతో వాటి అమలుకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను దశల వారీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు మొదటగా నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల పరిధిలో వర్ని, సిరికొండలలో రేంజ్ కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ డివిజన్లో 3 రేంజ్‌లు, 14 సెక్షన్లు, 52 బీట్లు, కామారెడ్డి డివిజన్లో 4 రేంజ్‌లు, 18 సెక్షన్లు, 60 బీట్లుండగా పునర్వ్యవస్థీకరణలో మరిన్ని పెగనున్నాయి. అలాగే భవిష్యత్‌లో ప్రత్యేక సర్కిల్‌గా రూపుదిద్దుకోనున్న మెదక్ డివిజన్లో ఇప్పటికే ఆరు రేంజ్‌లు, 20 సెక్షన్లు, 95 బీట్లుండగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాటి సంఖ్య మరింత పెరగనుంది. మొత్తానికి మూడున్నరేళ్ల కిందటి ప్రతిపాదనలు, సిఫారసులకు ప్రభుత్వం దశల వారీగా ఆమోదం తెలుపుతుండటం.. డివిజన్లు, రేంజ్‌లు, సెక్షన్లు, బీట్లు పెరగనున్న నేపథ్యంలో అటవీశాఖకు కొత్త జవజీవాలు రానున్నాయి. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ జరిగితే మంచి ఫలితాలుఉంటాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.