వన్యప్రాణాలకు రక్షణేదీ..!
Published Sun, Dec 4 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
ఆలేరు
దట్టమైన అడవులు కనుమరుగవుతుండడం, తాగునీరు లభ్యం కాకపోవడంతో మూగజీవాలు వలసబాట పడుతున్నాయి. మరికొన్ని రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్నాయి. కరువు పరిస్థితి కూడా వన్యప్రాణుల మనుగడకు ప్రతిబంధకంగా మారింది. ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడం, వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చడం, పోడు వ్యవసాయం చేయడం, పరిశ్రమల ఏర్పాటు, సెజ్‌ల పేరిట అడవులు అంతమవుతున్నాయి. దీంతో మూగజీవాలకు శాపంగా పరిణమించింది. ఇదే అదనుగా భావించి కొన్ని చోట్ల వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి మూగజీవాలను హతమార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు రోడ్డు దాటుతూ చనిపోతున్నారుు. ప్రతి ఏటాఆదివారం ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
తానుకూర్చున్న కొమ్మనే..
పర్యావరణంలో కీలకమైన అడవులను నరికివేస్తుండడంతో మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా ఉంది. ప్రకృతి.. చెట్లు, కొండలు, అడవులు, నదులు, జంతుచరాలు, మానవుల సమాహారమే ప్రకృతి. వీటిలో వేటికి ఆపద జరిగినా చివరకు నష్టం జరిగేది మనిషికే. ఇంతకు ముందు వణ్యప్రాణులను సర్కస్‌లలో చూసే అవకాశముండేది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సర్కస్‌లలో జంతువులను వినియోగించడం లేదు. అడవి జంతువులను చూడాలంటే జూపార్క్‌లు, టీవీలో చూడాల్సిందే.
అంతరిస్తున్న పక్షులు
ఒకప్పుడు అడవుల్లో జంతువులతో పాటు పక్షుల చప్పుళ్లు వినబడేవి. నెమళ్లు, కముజులు, రామచిలుకలు, పావురాలు, గద్దలు, పాలపిట్టలు, గువ్వలు, రకరకాల సోయగాలతో కనువిందు చేసేవి. అడవుల్లో వృక్షాలు కనుమరుగు కావడం, చెట్ల మీద పండ్లు లేకపోవడంతో పక్షుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పురుగు మం దుల వాడకంతో, నీటి వనరుల్లో నీరు నిల్వలేకపోవడం, పక్షులను వేటాడడంతో పక్షులు అంతరిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అడవులు ఇలా..
ఉమ్మడి జిల్లాలో 14.24లక్షల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఇందులో 83, 700 హెక్టార్లలో అడవులు, 7, 700హెక్టార్లలో వృక్షసంపద ఉన్నట్లు తెలుస్తోంది.
సంరక్షణ చర్యలు ఇలా..
ప్రభుత్వ భూముల్లో విస్తారంగా మొక్కల పెంపకం చేపట్టాలి.
వన్యప్రాణులను వేటాడకూడదు.
ప్రత్యేకంగా ఆహారం, నీటి కేంద్రాలను అడవుల్లో ఏర్పాటు చేయాలి.
సహజ ఆవాసాలు విచ్ఛిన్నం కాకుండా సంరక్షణకు నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ప్రజల్లో జీవకారుణ్య స్వభావం పెరగాలి.
వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. అభయరణ్యాల చుట్టూ ముళ్లకంచెలు ఏర్పాటు చేసి గార్డులను ఏర్పాటు చేయాలి.
గ్రామాల్లో వివిధ రకాల వృక్షజాతులను పెంచాలి.
Advertisement
Advertisement