నల్లమల ప్రయాణం... ఓ నిర్వేద జ్ఞాపకం! | Vardhelli Venkateswarlu Special Article On Nallamala Journey | Sakshi
Sakshi News home page

నల్లమల ప్రయాణం... ఓ నిర్వేద జ్ఞాపకం!

Published Wed, Jun 8 2022 11:09 PM | Last Updated on Wed, Jun 8 2022 11:09 PM

Vardhelli Venkateswarlu Special Article On Nallamala Journey - Sakshi

ఆర్తి అంజన్న ... ‘తల్లి నల్లమల’ నాకు ఇచ్చిన అన్న! దివంగత సోలిపేట రామలింగన్న తరువాత అంతే గాఢమైన ప్రేమను పంచే ఆత్మ బంధువు. నల్లమల కీకారణ్య ఆదివాసీ. కుమ్మెనపెంట పెద్దమనిషి. ఆయనతో 21 ఏళ్ల అనుబంధం. వయసులో నాకంటే చాలా పెద్ద. కానీ ఆయన ఇంట జరిగే ప్రతి కార్యానికి నేనే పెద్ద. పెళ్లి, పండగ, పురుడు, పుణ్యం... కార్యం ఏదైనా నాదే పెద్దరికం! 

తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్‌ రావు పోరాట స్ఫూర్తిని విని ‘హరీష్‌ అన్న ఎట్లుంటడు’ అని అడిగి, ఆయన్ను నల్లమల సానువు మన్ననూరు వరకు రప్పించి, చెంచులతో ఆత్మీయ సభ పెట్టించింది ఈ అంజన్నే. ఇప్పుడు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తన ఇంటి గుమ్మం వరకు నడిపించిండు.

చెంచులకు క్యాలెండర్‌ లేదు. నాగరిక కాలమానం లేదు. రేల పూతలు, కోయిల కూతలతోనే కాల కొలమానం ఆరంభం అవుతుంది. కోయిల పిట్ట రేల పూత మేసి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మల కొన చివుర్ల నుంచి నీళ్లు తాగి, కమ్మని కూతతో తోటి పిట్టలను పిలుస్తుంది. అట్లా కోయిల తొలి కూత నుంచి కోయిలలు విరివిగా కూసే కాలాన్ని తొలి కార్తెగా గుర్తిస్తారు. చెంచుల తొలి కార్తె రోణి (రోహిణి). 

ఆ కార్తె ప్రాంభ నేపథ్యంలో అంజన్న దేవర్లకు పెట్టుకున్నడు. అమ్రాబాద్‌ కు వచ్చి నాకు ఫోన్‌ చేసిండు. నేనప్పుడు యాదృచ్ఛికంగా ప్రజాకవీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న; టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌ కలిసే ఉన్నాం. ‘నా పెంటకు రాయే... పండ్గ సేద్దం’ అని గోరటినీ, సాగర్‌నూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. వెంకన్న కూడా నాగరికపు నీడ సోకని దట్టమైన అడవిలో, ప్రిమిటివ్‌ తెగల మధ్య ఓ రాత్రి గడపాలనీ, ఓ కావ్యం రాయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు... సాగర్‌ ఆయన ఛానల్‌ కోసం ఓ స్టోరీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. డీఎఫ్‌ఓ కిష్ట గౌడ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిండు. అడవికి తొవ్వ సాగింది.

చీకటి ప్రయాణం! అంజన్న దండు రక్షణగా వచ్చింది. అమ్రాబాద్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి పాలకుర్వ ఎక్కినం. కుందేటి సుక్క పొడిచే యాళ్లకు ఇంకో ఆరు కిలోమీటర్లు సాగి మర్రి సెట్టు సార్వ దిగి కోయిలపడె చేరినం. చెలిమ నీళ్లు దొరికినయి. చల్లటి, తియ్యటి నీళ్లు దోసిళ్లతో కడుపారా తాగినం. అసలు సిసలైన అడవి ఆరంభం అయింది. కింద పదును తేలిన ఏనె రాళ్లు... పైన మొన తేలిన కొక్కెల్లాంటి పరిక కంప... దారికి రెండు వైపులా జిట్టీత పొదలు... నాకు పాత తొవ్వే. వెంకన్న అడవి జంతువును మించిన సంచార జీవి. 60 ఏళ్ళ వయసులోనూ అలుపు లేకుండా... అడుగు తడబడకుండా నడుస్తుండు. గోరటి పాటలతో, పరిశీలనతో తెలవకుండానే అడవి సాగిపోతున్నం. నర్లింగల పొదలకు కలేవచ్చినం. దీన్నే ఎలుగల బయలు అంటారట. ‘ఎలుగులు ఉంటయి... చూసి నడువురి’ అంజన్న ఆదేశం .

అంజన్నకు అడవి మీద అంతులేని పట్టుంది. ఏ కుర్వన ఏ జంతువు ఉంటదో... ఏ సార్వకు ఏ పాము ఉంటదో... కార్తెను బట్టి పొద్దును చూసి వాటి నడత, నడక అంచనా వేసి చెప్పగలడు. ‘ఇది పులి తిరిగే సోటు.. మాట్లాడకుంటా నడువురి’ అని అంజన్న హెచ్చరించిండు.

అంజన్న బావమర్ది ఈదన్న చేతిలో సోలార్‌ టార్చి లైటు ఉంది. దాని ఫోకస్‌కు ఎర్రటి కొర్రాయి తీరున రెండు కండ్లు మెరుస్తూ కనిపించాయి. రెండో సారి ఈదన్న టార్చిలైటు ఫోకస్‌ను రెండు కళ్ల మీద కేంద్రీకరించాడు. ఈ సారి ఒక్క కన్నే కనిపించింది. ‘పులి’ అని గట్టిగా అరిచిండు. అంజన్న, ఈదన్న, లింగయ్య, అంజన్న కొడుకు చిన అంజన్న అంతా ఆరేడు మంది పెద్ద కత్తులు, దబ్బలు పట్టుకొని మా చుట్టూ రక్షణగా నిలబడ్డారు. లైటు వెలుతురుకు ఒక కన్ను మూసి, ఇంకో కన్నుతో చూడటం పులి సహజ లక్షణమట. మాకు సరిగ్గా వంద మీటర్ల లోపే కడితి పోతు చెంగున ఎగిరి దూకింది. పులి వెంట పడ్డది అని అర్థం అయింది. ఈ పులి కోపగొండిదనీ, ఎప్పుడూ ఆకలి మీదనే ఉంటదనీ అంజన్న చెప్పిండు.

తెలంగాణ పరిధిలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో 2018లో తీసిన గణనలో 19 పులులు ఉన్నట్లు తేలింది. ఆ సంఖ్య ఇప్పుడు 30కి పెరిగినట్టు అటవీ అధికారులు చెప్పారు. వీటిలో 7 నుంచి 8 పులికూనలు ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 63 పులులను కెమెరా ట్రాప్‌ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా... ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా... మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. 

నల్లమలలో లక్ష ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఈ భూమిని చెంచులకు స్వాధీన పరిచి, వ్యవసాయం ప్రోత్సహించాలని భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్‌ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్‌ 1940వ దశకంలో నైజాం సర్కార్‌కు సిఫారసు చేశాడు. ఆమేరకు నైజాం సర్కార్‌  ఫర్మానా జారీ చేసింది. 

కానీ స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. కానీ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అటవీ హక్కుల చట్టానికి సాధికారత కల్పిస్తూ నల్లమలలో ప్రతి చెంచుకు ఎకరన్నర భూమిని పట్టా చేసి,  దాదాపు 11 వేల చెంచు కుటుంబాలకు హక్కులు కల్పించారు. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే హక్కుదారులకు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసీఆర్‌ ‘రైతు బంధు’ పథకం అందిస్తున్నారు. అవన్నీ మనసులో మెదులుతుండగా అర్ధ రాత్రి వేళ కుమ్మినిపెంటకు చేరుకున్నాం.

మా అంజన్న పెంట ఇదే. ఓ గుడిసె మాకు విడిది ఇల్లుగా ఇచ్చారు. వేడి వేడి తైద అంబలి కాసి పోశారు. నులక మంచం ఆల్చుకొని పడుకున్నం. నెమలి పిట్ట, అడవి కోడి కూసింది...  తెల్లారింది.   గోరటి వెంకన్న కలం ‘కథం’ తొక్కుతోంది. గళం పదం పాడుతోంది.

‘వెదురు తడకలతోని ఎంతందమీ ఇండ్లు, ఆవు పేడ తోని అలికిన వాకిల్లు, చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు, రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ, ఉరిమె నగరి కెరవ అడవి చెంతకు నడువ, అమ్మలా లాలించి అన్నిటిని మరిపించే పరుసుకున్న, రావి నీడల తావున పట్టిన కునుకులో పుట్టెనే ఈ పదం’ అంటూ కమ్మటి పాట పొద్దు పొద్దున్నే చెవులకు ఇంపుగా తాకంగ నిద్ర లేచినం. దేవర్ల కార్యం మొదలైంది. మేకపోతు తెగింది. రక్త తర్పణం జరిగింది. కూర ఉడికింది. తంతు ఆరంభం అయింది... జోరందుకుంది... సూర్యాస్తమయంతో పాటే ముగిసింది.

మిత్రుడు మారుతీ సాగర్‌ తన ఛానల్‌ స్టోరీ కోసం మైక్‌ ముందు పెట్టినప్పుడు చెంచుల్లో ఓ భయం బయట పడ్డది. అదీ అంతులేని భయం! మృత్యు భయం. తల్లి పాల పొదుగు నుంచి లేగ దూడను వేరు చేసినట్టుగా... అడవి తల్లి నుంచి చెంచులను వేరు చేయడానికి కేంద్ర పాలకులు పన్నిన ఉచ్చుల భయం!

అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ... వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ‘అడవి బయట బతకలేమనీ... వనం విడిచిన కోతి బతుకు అయితదనీ’ దండం పెట్టి చెప్పినా కేంద్ర పాలకులకు వినపడటం లేదు. చెంచుల తరలింపునకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమని స్పష్టం చేసినా... కేంద్రం తన పంతం వీడలేదు. 

ఇప్పటి దాక జాతి సమస్యగా ఉన్నదాన్ని పాలకులు దిగ్విజయంగా జాతుల వైరంగా మార్చేశారు. నల్లమల నుంచి బయటికి రావటానికి ఇష్టపడే జాతి... ససేమిరా అంటున్న జాతి అని రెండు వర్గాలను నిట్ట నిలువుగా చీల్చేశారు. తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ జిల్లా వటువార్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎస్సీ, బీసీ, లంబాడాలు ఎక్కువ ఉన్నారు. వీళ్లు రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకొని అడవిని వదలటానికి సిద్ధపడ్డారు. చెంచులు ఆ ప్యాకేజీని తృణీకరించారు.

‘అడవి నుంచి బయటికి వెళ్ళటానికి ఇష్టపడని చెంచులతోనే మీరు కూడా నష్టపోతున్న’రంటూ ఫారెస్ట్‌ అధికారులు గిరిజనేతరులకు నూరి పోస్తున్నారు. ఇది చెంచు, లంబాడీ, ఇతర జాతుల మధ్య ఘర్షణకు దారి తీసింది.

వటువార్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచునే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ‘మల్లెల తీర్థా’నికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా?

గిరిజనుడికి అడవి... తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమిస్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? యురేనియం నిక్షేపాల కోసం అడవినే బలిపెట్ట చూసిన మోదీ సర్కారుకు పులి మీద జాలి ఎందుకో అని మదిని తొలుస్తుండగా మర్మం తెలియక నిర్వేదంతో నల్లమలను వీడాం!


వ్యాసకర్త: వర్ధెల్లి వెంకటేశ్వర్లు, 
మీడియా కో ఆర్డినేటర్,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement