vardelli venkateswarlu
-
చరిత్రను కాటేయ జూస్తున్నారు!
తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ మీద భీమిరెడ్డి ఫైరింగ్. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి, పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్ సైన్యం! నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్ పటేల్‌ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. బీఎన్ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, పరిశోధక రచయిత -
నల్లమల ప్రయాణం... ఓ నిర్వేద జ్ఞాపకం!
ఆర్తి అంజన్న ... ‘తల్లి నల్లమల’ నాకు ఇచ్చిన అన్న! దివంగత సోలిపేట రామలింగన్న తరువాత అంతే గాఢమైన ప్రేమను పంచే ఆత్మ బంధువు. నల్లమల కీకారణ్య ఆదివాసీ. కుమ్మెనపెంట పెద్దమనిషి. ఆయనతో 21 ఏళ్ల అనుబంధం. వయసులో నాకంటే చాలా పెద్ద. కానీ ఆయన ఇంట జరిగే ప్రతి కార్యానికి నేనే పెద్ద. పెళ్లి, పండగ, పురుడు, పుణ్యం... కార్యం ఏదైనా నాదే పెద్దరికం! తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావు పోరాట స్ఫూర్తిని విని ‘హరీష్ అన్న ఎట్లుంటడు’ అని అడిగి, ఆయన్ను నల్లమల సానువు మన్ననూరు వరకు రప్పించి, చెంచులతో ఆత్మీయ సభ పెట్టించింది ఈ అంజన్నే. ఇప్పుడు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తన ఇంటి గుమ్మం వరకు నడిపించిండు. చెంచులకు క్యాలెండర్ లేదు. నాగరిక కాలమానం లేదు. రేల పూతలు, కోయిల కూతలతోనే కాల కొలమానం ఆరంభం అవుతుంది. కోయిల పిట్ట రేల పూత మేసి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మల కొన చివుర్ల నుంచి నీళ్లు తాగి, కమ్మని కూతతో తోటి పిట్టలను పిలుస్తుంది. అట్లా కోయిల తొలి కూత నుంచి కోయిలలు విరివిగా కూసే కాలాన్ని తొలి కార్తెగా గుర్తిస్తారు. చెంచుల తొలి కార్తె రోణి (రోహిణి). ఆ కార్తె ప్రాంభ నేపథ్యంలో అంజన్న దేవర్లకు పెట్టుకున్నడు. అమ్రాబాద్ కు వచ్చి నాకు ఫోన్ చేసిండు. నేనప్పుడు యాదృచ్ఛికంగా ప్రజాకవీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న; టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ కలిసే ఉన్నాం. ‘నా పెంటకు రాయే... పండ్గ సేద్దం’ అని గోరటినీ, సాగర్‌నూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. వెంకన్న కూడా నాగరికపు నీడ సోకని దట్టమైన అడవిలో, ప్రిమిటివ్ తెగల మధ్య ఓ రాత్రి గడపాలనీ, ఓ కావ్యం రాయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు... సాగర్ ఆయన ఛానల్ కోసం ఓ స్టోరీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. డీఎఫ్ఓ కిష్ట గౌడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అడవికి తొవ్వ సాగింది. చీకటి ప్రయాణం! అంజన్న దండు రక్షణగా వచ్చింది. అమ్రాబాద్ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి పాలకుర్వ ఎక్కినం. కుందేటి సుక్క పొడిచే యాళ్లకు ఇంకో ఆరు కిలోమీటర్లు సాగి మర్రి సెట్టు సార్వ దిగి కోయిలపడె చేరినం. చెలిమ నీళ్లు దొరికినయి. చల్లటి, తియ్యటి నీళ్లు దోసిళ్లతో కడుపారా తాగినం. అసలు సిసలైన అడవి ఆరంభం అయింది. కింద పదును తేలిన ఏనె రాళ్లు... పైన మొన తేలిన కొక్కెల్లాంటి పరిక కంప... దారికి రెండు వైపులా జిట్టీత పొదలు... నాకు పాత తొవ్వే. వెంకన్న అడవి జంతువును మించిన సంచార జీవి. 60 ఏళ్ళ వయసులోనూ అలుపు లేకుండా... అడుగు తడబడకుండా నడుస్తుండు. గోరటి పాటలతో, పరిశీలనతో తెలవకుండానే అడవి సాగిపోతున్నం. నర్లింగల పొదలకు కలేవచ్చినం. దీన్నే ఎలుగల బయలు అంటారట. ‘ఎలుగులు ఉంటయి... చూసి నడువురి’ అంజన్న ఆదేశం . అంజన్నకు అడవి మీద అంతులేని పట్టుంది. ఏ కుర్వన ఏ జంతువు ఉంటదో... ఏ సార్వకు ఏ పాము ఉంటదో... కార్తెను బట్టి పొద్దును చూసి వాటి నడత, నడక అంచనా వేసి చెప్పగలడు. ‘ఇది పులి తిరిగే సోటు.. మాట్లాడకుంటా నడువురి’ అని అంజన్న హెచ్చరించిండు. అంజన్న బావమర్ది ఈదన్న చేతిలో సోలార్ టార్చి లైటు ఉంది. దాని ఫోకస్‌కు ఎర్రటి కొర్రాయి తీరున రెండు కండ్లు మెరుస్తూ కనిపించాయి. రెండో సారి ఈదన్న టార్చిలైటు ఫోకస్‌ను రెండు కళ్ల మీద కేంద్రీకరించాడు. ఈ సారి ఒక్క కన్నే కనిపించింది. ‘పులి’ అని గట్టిగా అరిచిండు. అంజన్న, ఈదన్న, లింగయ్య, అంజన్న కొడుకు చిన అంజన్న అంతా ఆరేడు మంది పెద్ద కత్తులు, దబ్బలు పట్టుకొని మా చుట్టూ రక్షణగా నిలబడ్డారు. లైటు వెలుతురుకు ఒక కన్ను మూసి, ఇంకో కన్నుతో చూడటం పులి సహజ లక్షణమట. మాకు సరిగ్గా వంద మీటర్ల లోపే కడితి పోతు చెంగున ఎగిరి దూకింది. పులి వెంట పడ్డది అని అర్థం అయింది. ఈ పులి కోపగొండిదనీ, ఎప్పుడూ ఆకలి మీదనే ఉంటదనీ అంజన్న చెప్పిండు. తెలంగాణ పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 2018లో తీసిన గణనలో 19 పులులు ఉన్నట్లు తేలింది. ఆ సంఖ్య ఇప్పుడు 30కి పెరిగినట్టు అటవీ అధికారులు చెప్పారు. వీటిలో 7 నుంచి 8 పులికూనలు ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా... ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా... మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. నల్లమలలో లక్ష ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఈ భూమిని చెంచులకు స్వాధీన పరిచి, వ్యవసాయం ప్రోత్సహించాలని భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్ 1940వ దశకంలో నైజాం సర్కార్‌కు సిఫారసు చేశాడు. ఆమేరకు నైజాం సర్కార్ ఫర్మానా జారీ చేసింది. కానీ స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అటవీ హక్కుల చట్టానికి సాధికారత కల్పిస్తూ నల్లమలలో ప్రతి చెంచుకు ఎకరన్నర భూమిని పట్టా చేసి, దాదాపు 11 వేల చెంచు కుటుంబాలకు హక్కులు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే హక్కుదారులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసీఆర్ ‘రైతు బంధు’ పథకం అందిస్తున్నారు. అవన్నీ మనసులో మెదులుతుండగా అర్ధ రాత్రి వేళ కుమ్మినిపెంటకు చేరుకున్నాం. మా అంజన్న పెంట ఇదే. ఓ గుడిసె మాకు విడిది ఇల్లుగా ఇచ్చారు. వేడి వేడి తైద అంబలి కాసి పోశారు. నులక మంచం ఆల్చుకొని పడుకున్నం. నెమలి పిట్ట, అడవి కోడి కూసింది... తెల్లారింది. గోరటి వెంకన్న కలం ‘కథం’ తొక్కుతోంది. గళం పదం పాడుతోంది. ‘వెదురు తడకలతోని ఎంతందమీ ఇండ్లు, ఆవు పేడ తోని అలికిన వాకిల్లు, చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు, రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ, ఉరిమె నగరి కెరవ అడవి చెంతకు నడువ, అమ్మలా లాలించి అన్నిటిని మరిపించే పరుసుకున్న, రావి నీడల తావున పట్టిన కునుకులో పుట్టెనే ఈ పదం’ అంటూ కమ్మటి పాట పొద్దు పొద్దున్నే చెవులకు ఇంపుగా తాకంగ నిద్ర లేచినం. దేవర్ల కార్యం మొదలైంది. మేకపోతు తెగింది. రక్త తర్పణం జరిగింది. కూర ఉడికింది. తంతు ఆరంభం అయింది... జోరందుకుంది... సూర్యాస్తమయంతో పాటే ముగిసింది. మిత్రుడు మారుతీ సాగర్ తన ఛానల్ స్టోరీ కోసం మైక్ ముందు పెట్టినప్పుడు చెంచుల్లో ఓ భయం బయట పడ్డది. అదీ అంతులేని భయం! మృత్యు భయం. తల్లి పాల పొదుగు నుంచి లేగ దూడను వేరు చేసినట్టుగా... అడవి తల్లి నుంచి చెంచులను వేరు చేయడానికి కేంద్ర పాలకులు పన్నిన ఉచ్చుల భయం! అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ... వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ‘అడవి బయట బతకలేమనీ... వనం విడిచిన కోతి బతుకు అయితదనీ’ దండం పెట్టి చెప్పినా కేంద్ర పాలకులకు వినపడటం లేదు. చెంచుల తరలింపునకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమని స్పష్టం చేసినా... కేంద్రం తన పంతం వీడలేదు. ఇప్పటి దాక జాతి సమస్యగా ఉన్నదాన్ని పాలకులు దిగ్విజయంగా జాతుల వైరంగా మార్చేశారు. నల్లమల నుంచి బయటికి రావటానికి ఇష్టపడే జాతి... ససేమిరా అంటున్న జాతి అని రెండు వర్గాలను నిట్ట నిలువుగా చీల్చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వటువార్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎస్సీ, బీసీ, లంబాడాలు ఎక్కువ ఉన్నారు. వీళ్లు రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకొని అడవిని వదలటానికి సిద్ధపడ్డారు. చెంచులు ఆ ప్యాకేజీని తృణీకరించారు. ‘అడవి నుంచి బయటికి వెళ్ళటానికి ఇష్టపడని చెంచులతోనే మీరు కూడా నష్టపోతున్న’రంటూ ఫారెస్ట్ అధికారులు గిరిజనేతరులకు నూరి పోస్తున్నారు. ఇది చెంచు, లంబాడీ, ఇతర జాతుల మధ్య ఘర్షణకు దారి తీసింది. వటువార్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచునే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ‘మల్లెల తీర్థా’నికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుడికి అడవి... తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమిస్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? యురేనియం నిక్షేపాల కోసం అడవినే బలిపెట్ట చూసిన మోదీ సర్కారుకు పులి మీద జాలి ఎందుకో అని మదిని తొలుస్తుండగా మర్మం తెలియక నిర్వేదంతో నల్లమలను వీడాం! వ్యాసకర్త: వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా కో ఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -
మారిన ‘స్వరం’లో పునరుజ్జీవన జాడలు!
సంచారం అంటే ప్రయాణం.. చలనశీల జగత్తులో నిత్య కదలికే సంచారం.. మార్క్సిజం.. లెనినిజం.. దళితవాదం.. అస్తిత్వ ఉద్యమం.. రాజ్యాధికారం ఇవన్నీ ప్రయాణాలే... వేటికవే.. ఒక్కొక్కటి ఒక్కొక్క చౌరస్తా.. అస్తిత్వ ఉద్యమం వరకు అంతా బాగానే ఉంది.. గోరటి వెంకన్న పాట పాడితే కోరసిచ్చారు.. ఆట ఆడితే అడుగు కలిపారు.. ఎవరూ ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడలేదు... తన భార్య అనారోగ్యం పాలైనప్పుడు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో దేశ దిమ్మరైనప్పుడు వెంకన్న గమనం.. గమ్యం ఎవరికీ పట్టలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలిచి రాజ్యసభ ఇస్తా తీసుకో అంటే.. ‘వద్దు సార్’ అన్నప్పుడు వెంకన్న త్యాగాల మూటన్నారు. 60 ఏళ్ల కొట్లాట ఫలించి.. జన కల సాకార రాజ్యంలో ప్రజాకవికి ఇంత చోటు దొరికితే మాత్రం నొసలు చిట్లిస్తున్నారు.. భ్రుకుటి ముకిలిస్తున్నారు... కాళ్లలో కట్టె పెట్టి గమన సంక్లిష్టం చేయజూస్తున్నారు.. బల్దియా మేయర్ ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ వెంకన్న పాటను ప్రస్తావిస్తూ.... ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ అనే పాట వినండి.. నేను వందసార్లు విన్నాను. ఆ పాటలో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి.. వారి బాధలు అర్థం చేసుకోవాలి.. పేదలను ఆదరించాలి.. బస్తీ సమస్యలు తీర్చాలి.. అదే ప్రధాన లక్ష్యం కావాలి‘ అని హితబోధ చేశారు. ఒక అంశాన్ని సమయస్ఫూర్తితో చెప్పడంలో కేసీఆర్ కంటే దిట్ట ఎవరు? నగర జీవనంలో కృత్రిమ రాజకీయాలకు అలవాటుపడ్డ కార్పొరేటర్ల హృదయానికి హత్తుకునేలా చెప్పటానికి ఇంతకుమించిన గొప్ప సందేశం ఇంకేం ఉంటుంది. తన పాట ఏలికలకు మేలుకొలుపు బాట కావాలని ప్రతి ప్రజాకవి కోరుకుంటాడు. ఆ గౌరవం వెంకన్నకు దక్కింది. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారానికి వారితో కలిసి బస్సులో వెళ్తున్న సందర్భంలో... ‘తరి మల్లలోన వరి పాపిట పసిడి పంటలు.. ఆ..బీడు మడిలో వేరుశనగ పసుపు పూతలునూనె పోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లు రా.. అద్దం లేకున్న మొఖం అండ్లనే చూడొచ్చు రా’ అంటూ సందర్భానికి అనుగుణంగా రాగమెత్తి పాడారు.. ఆశువుగా కై గట్టడమే ఆయన సహజ శైలి. ఇది ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఓ వర్గం పనిగట్టుకొని దాన్ని వైరల్ చేసింది. పాట దొర గడీలో బందీ అయిందని.. కేసీఆర్ భజన చేస్తున్నాడని మాటలు అంటున్నారు.. బస్సులో పాడిన పాటలో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు.. అది కావ్య గుణం. ఆ మాట కొస్తే.. పారే నీళ్ళు.. పచ్చటి పొలాలను నేనూ చూశాను. కందనూలు జిల్లా తెలకపల్లి ఊరంచు నుంచి మొదలు పెట్టి పాలమూరు.. ఇందూరు... సూర్యాపేట.. ఓరుగల్లు కరీంనగర్... ఆదిలాబాద్ జిల్లాలలో ఊరూరు తిరిగి తరి మళ్ళను, మత్తడి దుంకిన చెరువులను చూశాను. ఆ సదృశ్యాలను ఎత్తిపట్టుకుని ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకంలో పొందుపరిచాను. కర్విరాల కొత్తగూడెం వేదికగా మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. జగదీష్‌రెడ్డి, అల్లం నారాయణ, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, మా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు వెంకన్న వచ్చాడు. డిసెంబర్లో మా ఊరి చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అదే వేదిక మీద మాట్లాడుతూ.. కళ్ళముందు పారుతున్న ఈ నీళ్లను చూసి కూడా.. ఇంకా ‘వాగు ఎండిపాయెరో.. పెదవాగు తడిపేగు ఎండిపాయెరో’ అని పాడనా? పాడితే మీరు అంగీకరిస్తారా? అని సభి కులను అడిగారు. ‘వందల పాటలు తెలంగాణ దుఃఖం మీద.. కన్నీళ్ళ మీద.. కష్టాల మీద పాడి పాడి అలసిపోయినా.. పుస్తకంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన తీరు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు దుంకుతున్నాయి. ఇలాంటప్పుడు నేనేం చేయాలి మంచిని, మార్పును గుర్తించకపోతే ఎట్లా..! కవిగా నేను సమాజానికి అనుగుణంగా ఉండాలి’ అంటూ.. పాట అందుకున్నాడు. ‘కేసీఆర్ దీక్ష ఫలం.. గోదారి, కొత్తగూడెం ఎంత దూరముందీ.. నీళ్ల మంత్రి హరీషన్న మోము ఎట్లా వెలుగుతోంది’ అని ఆశువుగా పాట కైగట్టి పాడాడు. ఇది పాజిటివ్ కవి లక్షణం. కులాలు, మతాలు, దేవుడు వ్యక్తిగతం నుంచి వేరు పడి రాజకీయంగా మారిన నేపథ్యంలో వెంకన్న లాంటి దళిత, విప్లవోద్యమ భావజాల కవుల అవసరం సమాజానికి ఉంది. మతఛాందస వాదులు ఓట్లకోసం సాన పెడుతున్న ఈ తరుణంలో వెంకన్న నికార్సయిన ప్రజా ప్రభుత్వం వైపు నిలబడడమే సమంజసం. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా సమన్వయ కర్త -
గ్రీవెన్స్.. నాన్సెన్స్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుని సమస్యలకు పరిష్కారమే అంతిమ లక్ష్యంగా ఏర్పాటుచేసిన ‘ప్రజావాణి’ జిల్లాలో గాడి తప్పింది. గ్రీవెన్స్‌ను జిల్లా అధికారులు మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారు. ఫిర్యాదుదారుని నుంచి అర్జీ తీసుకుని 30 రోజుల పాటు నాన్చడం.. ఆ తర్వాత ‘మీ సమస్య పరిష్కరించడమైనది’ అని కలెక్టర్ కార్యాలయం నుంచి ఓ ఉత్తరం పంపి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పరిష్కరించారో లేదో తెలియక ఫిర్యాదుదారులు తలపట్టుకుంటున్నారు. అయినా ఆశ చావని ముసలవ్వలు కళ్లు కనిపించకపోయినా కట్టె పొడుచుకుంటూ... కట్టుకున్నవాడు కాలంజేస్తే సంసారాన్ని మోయలేని వితంతువులు... కంపెనీల కాలుష్యపు కోరలకు చిక్కి తల్లడిల్లుతున్న జనం... రేషన్ కార్డని.. కొత్త ఇళ్లని.. ఫీజు రీయింబర్స్మెంటని ఇలా జనాలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసు మెట్లెక్కుతున్నారు. కష్టనష్టాల కోర్చి ప్రజలు చేస్తున్న ఫిర్యాదులపై అధికారుల పని తీరును పరిశీలించేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడినపుడు ‘ప్రజావాణి’ డొల్లతనం బయటపడింది. చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నట్లు కనిపించింది. మండలాల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సంగారెడ్డికి పంపితే జిల్లాఅధికారులు మళ్లీ మండలానికే పంపిస్తున్నారు. మండలస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించలేక, పెండింగ్‌లో ఉంచలేక డిస్పోజ్డ్ అని చూపిస్తున్నారు. కాలంతీరిన ఫిర్యాదులను పరిష్కరించిన జాబితాలో చేర్చి జిల్లా కలెక్టర్‌ను, ప్రజలను మోసం చేస్తున్నట్టు తేలింది. అధికారులు పరిష్కరించినట్లు చూపిస్తున్నవి కాకి లెక్కలే అని బయటపడింది. గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటివరకు 15,502 ఫిర్యాదులు రాగా వాటిలో 14,730 కేసులు పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. మిగిలిన 772 ఫిర్యాదులు కూడా కోర్టు కేసులు, ఇతర వివాదాలు ఉండటం వల్లే పరిష్కరించలేకపోయామని నివేదికల్లో పొందుపరిచారు. గత ఏడాది మొత్తం 9,568 ఫిర్యాదులు అందగా 9,095 కేసులు పరిష్కరించినట్లు చూపించారు. దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన కె. లింగమ్మ గత ఏడాది నవంబర్ 11 గ్రీవెన్స్‌కు అర్జీ పెట్టుకున్నారు. తన బావ ప్రభాకర్ అనే వికలాంగుని పేరు మీద 148/9లో ఎకరం భూమి ఉంది. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో ప్రభాకర్ పేరే ఉంది. కబ్జాలో మాత్రం మరో వ్యక్తి ఉన్నారు. తన భూమి తనకు ఇప్పించాలని విన్నవించారు. ఆమెకు 148/9 సర్వే నంబర్ భూమిలో మోఖా ఇవ్వకుండానే అదే ఏడాది డిసెంబర్ 9న ఫిర్యాదు పరిష్కరించినట్టు కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమెకు లేఖ అందింది. పైగా వేరొకరు కబ్జాలో ఉన్నారు కాబట్టి పొజిషన్ ఇవ్వలేమని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అధికారుల సమాధానంతో అవాక్కైన లింగమ్మ మళ్లీ గ్రీవెన్స్‌కు వచ్చి మరో అర్జీ పెట్టుకున్నారు. పుల్కల్ మండలం వెండికోల్ గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతుకు ఓ రెవెన్యూ అధికారి నకిలీ 13బీ సర్టిఫికెట్, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి మోసం చేశారు. సదరు అధికారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గత ఏడాది డిసెంబర్ 2న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు సదరు అధికారి మీద చర్యలు లేవు, ఆయనకు న్యాయం జరగలేదు, కానీ సమస్య పరిష్కరించినట్టు ఈ నెల 2వ తేదీన తిరుపతికి లెటర్ అందింది. జిన్నారం మండలం కిష్టాయిపల్లి 166/2అ సర్వే నంబర్లో పుల్లంగారి ఎల్లమ్మ, ఆమె బావ ఎంకయ్యలకు 3.24 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి పక్కనే ఓ వెంచర్‌ను నిర్మాణం చేస్తున్నారు. ఈ వెంచర్ యాజమాన్యం కొంతమేరకు ఎంకయ్య, ఎల్లమ్మల భూమిలోకి చొచ్చుకొచ్చారు. సర్వే చేసి తమ భూమిని కాపాడాలని వారు మండల గ్రీవెన్స్‌లో 2012లో ఫిర్యాదు చేశారు. 2014లో జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. గిరిజనులకు గుక్కెడు నీళ్లు కూడా ‘ప్రజావాణి’ ఇవ్వలేకపోయింది. కాంజీపురం, కొత్తపల్లి, చౌహాన్వాడి తండాలకు చెందిన గిరిజనులు తాగునీటి సమస్యను తీర్చాలని 30 రోజుల కిందట కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. తండాలో రెండు బోర్లుండగా... ఒక బోరు నుంచి ఫ్లోరైడ్ నీరు వస్తోంది. మరో బోరు చెడిపోయింది. చెడిపోయిన బోరుకు మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తుంది. అధికారులు కనీసం ఆ పని కూడా చేయలేదు. తాగునీటి కోసం ఇక్కడి మహిళలు దాదాపు కిలోమీటర్ నడిచి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకుంటున్నారు. కోహీర్ పట్టణ ంలోని మొల్లవాడికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నియామకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంగలి స్వరూప అనే మహిళ ఈ నెల 6న కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. బీసీ(డీ) గ్రూపునకు చెందిన మహిళకు బీసీ(ఎ) కుల ధ్రువీకరణ పత్రం కింద అంగన్వాడీ కార్యకర్తగా అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ స్వరూప ఫిర్యాదు చేశారు. దరఖాస్తు ఇచ్చి 17 రోజులవుతున్నా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వలేదు. కులధ్రువీకణ పత్రం విచారణ నిమిత్తం కలెక్టర్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని కోహీర్ తహశీల్దార్ చెప్పారు. తూప్రాన్ మండలం రంగాయిపల్లి గ్రామస్థులను స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీ కాలుష్య భూతం పట్టింది. ఈ కంపెనీ కాలుష్యం దెబ్బకు సమీప పల్లెలు అల్లకల్లోలమవుతున్నాయి. పసిపిల్లలు ఆరోగ్యంగా ఎదగటం లేదు. పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. పరిశ్రమ సమీపంలోని కిలోమీటరు దూరంలో ఉన్న భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయి. దీంతో ప్రజలు తాగేందుకు నీరు దొరకక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీటితో స్నానాలు చేస్తే వంటిపై దద్దుర్లు వస్తున్నాయి. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ గత డిసెంబరు 16న గ్రామానికి చెందిన నవచైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్‌కు గ్రీవేన్స్ డే సందర్భంగా ఫిర్యాదు చేశారు. రోజులు గడిచాయి కానీ అధికారుల జాడ లేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు. వర్గల్ మండలం తున్కిఖల్సా గ్రామం సమీపంలో సామ్రాట్ టైర్ల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో పాత టైర్లను కాల్చి నూనె, ఐరన్, బూడిద తీస్తారు. గతంలో ఉన్న తహశీల్దారు ఏదీ చూడకుండానే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్యంతో తున్కిఖల్సా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. అయినా పరిస్థితి ఇప్పటికీ యథాతథం. పరిశ్రమ నిర్వాహకులు కాలుష్యం పొగను రాత్రి వేళ విడుదల చేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చోద్యం చూడటం గమనార్హం. పరిశ్రమ నుంచి వచ్చే వాసన భరించలేక సమీప పంట పొలాల్లో పనిచేయడానికి కూలీలు కూడా రాని పరిస్థితి నెలకొంది.