మారిన ‘స్వరం’లో పునరుజ్జీవన జాడలు! | Vardelli Venkateshwarlu Article On Goreti Venkanna | Sakshi
Sakshi News home page

మారిన ‘స్వరం’లో పునరుజ్జీవన జాడలు!

Published Sat, Feb 20 2021 1:28 AM | Last Updated on Sat, Feb 20 2021 1:28 AM

Vardelli Venkateshwarlu Article On Goreti Venkanna - Sakshi

సంచారం అంటే ప్రయాణం.. చలనశీల జగత్తులో నిత్య కదలికే సంచారం.. మార్క్సిజం.. లెనినిజం.. దళితవాదం.. అస్తిత్వ ఉద్యమం.. రాజ్యాధికారం ఇవన్నీ ప్రయాణాలే... వేటికవే.. ఒక్కొక్కటి ఒక్కొక్క చౌరస్తా.. అస్తిత్వ ఉద్యమం వరకు అంతా బాగానే ఉంది.. గోరటి వెంకన్న పాట పాడితే కోరసిచ్చారు.. ఆట ఆడితే అడుగు కలిపారు.. ఎవరూ ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడలేదు... తన భార్య అనారోగ్యం పాలైనప్పుడు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో దేశ దిమ్మరైనప్పుడు వెంకన్న గమనం.. గమ్యం ఎవరికీ పట్టలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పిలిచి రాజ్యసభ ఇస్తా తీసుకో అంటే.. ‘వద్దు సార్‌’ అన్నప్పుడు వెంకన్న త్యాగాల మూటన్నారు. 60 ఏళ్ల కొట్లాట ఫలించి.. జన కల సాకార రాజ్యంలో ప్రజాకవికి ఇంత చోటు దొరికితే మాత్రం నొసలు చిట్లిస్తున్నారు.. భ్రుకుటి ముకిలిస్తున్నారు... కాళ్లలో కట్టె పెట్టి గమన సంక్లిష్టం చేయజూస్తున్నారు..

బల్దియా మేయర్‌ ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ వెంకన్న పాటను ప్రస్తావిస్తూ.... ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ అనే పాట వినండి.. నేను వందసార్లు విన్నాను. ఆ పాటలో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి.. వారి బాధలు అర్థం చేసుకోవాలి.. పేదలను ఆదరించాలి.. బస్తీ సమస్యలు తీర్చాలి.. అదే ప్రధాన లక్ష్యం కావాలి‘ అని హితబోధ చేశారు. ఒక అంశాన్ని సమయస్ఫూర్తితో చెప్పడంలో కేసీఆర్‌ కంటే దిట్ట ఎవరు? నగర జీవనంలో కృత్రిమ రాజకీయాలకు అలవాటుపడ్డ కార్పొరేటర్ల హృదయానికి హత్తుకునేలా చెప్పటానికి ఇంతకుమించిన గొప్ప సందేశం ఇంకేం ఉంటుంది. 

తన పాట ఏలికలకు మేలుకొలుపు బాట కావాలని ప్రతి ప్రజాకవి కోరుకుంటాడు. ఆ గౌరవం వెంకన్నకు దక్కింది. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల  ప్రమాణస్వీకారానికి వారితో కలిసి బస్సులో వెళ్తున్న సందర్భంలో... ‘తరి మల్లలోన వరి పాపిట పసిడి పంటలు.. ఆ..బీడు మడిలో వేరుశనగ పసుపు పూతలునూనె పోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లు రా.. అద్దం లేకున్న మొఖం అండ్లనే చూడొచ్చు రా’ అంటూ సందర్భానికి అనుగుణంగా రాగమెత్తి పాడారు.. ఆశువుగా కై గట్టడమే ఆయన సహజ శైలి. ఇది ఎవరో సోషల్‌ మీడియాలో పెట్టారు. ఓ వర్గం పనిగట్టుకొని దాన్ని వైరల్‌ చేసింది. పాట దొర గడీలో బందీ అయిందని.. కేసీఆర్‌ భజన చేస్తున్నాడని మాటలు అంటున్నారు.. బస్సులో పాడిన పాటలో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు.. అది కావ్య గుణం. ఆ మాట కొస్తే.. పారే నీళ్ళు.. పచ్చటి పొలాలను నేనూ చూశాను.

కందనూలు జిల్లా తెలకపల్లి ఊరంచు నుంచి మొదలు పెట్టి పాలమూరు.. ఇందూరు... సూర్యాపేట.. ఓరుగల్లు కరీంనగర్‌... ఆదిలాబాద్‌ జిల్లాలలో ఊరూరు తిరిగి తరి మళ్ళను, మత్తడి దుంకిన చెరువులను చూశాను. ఆ సదృశ్యాలను ఎత్తిపట్టుకుని  ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకంలో పొందుపరిచాను. కర్విరాల కొత్తగూడెం వేదికగా మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. జగదీష్‌రెడ్డి, అల్లం నారాయణ, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, మా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు వెంకన్న వచ్చాడు.

డిసెంబర్‌లో మా ఊరి చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అదే వేదిక మీద మాట్లాడుతూ.. కళ్ళముందు పారుతున్న ఈ నీళ్లను చూసి కూడా.. ఇంకా ‘వాగు ఎండిపాయెరో.. పెదవాగు తడిపేగు ఎండిపాయెరో’ అని పాడనా? పాడితే మీరు అంగీకరిస్తారా? అని సభి కులను అడిగారు. ‘వందల పాటలు తెలంగాణ దుఃఖం మీద.. కన్నీళ్ళ మీద.. కష్టాల మీద పాడి పాడి అలసిపోయినా.. పుస్తకంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన తీరు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు దుంకుతున్నాయి.

ఇలాంటప్పుడు నేనేం చేయాలి మంచిని, మార్పును గుర్తించకపోతే ఎట్లా..! కవిగా నేను సమాజానికి అనుగుణంగా ఉండాలి’ అంటూ..  పాట అందుకున్నాడు. ‘కేసీఆర్‌ దీక్ష ఫలం..  గోదారి, కొత్తగూడెం ఎంత దూరముందీ.. నీళ్ల మంత్రి హరీషన్న మోము ఎట్లా వెలుగుతోంది’ అని ఆశువుగా పాట కైగట్టి పాడాడు. ఇది పాజిటివ్‌ కవి లక్షణం. కులాలు, మతాలు, దేవుడు వ్యక్తిగతం నుంచి వేరు పడి రాజకీయంగా మారిన నేపథ్యంలో వెంకన్న లాంటి దళిత, విప్లవోద్యమ భావజాల కవుల అవసరం సమాజానికి ఉంది. మతఛాందస వాదులు ఓట్లకోసం సాన పెడుతున్న ఈ తరుణంలో వెంకన్న నికార్సయిన ప్రజా ప్రభుత్వం వైపు నిలబడడమే సమంజసం. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా సమన్వయ కర్త
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement