తాళ్ళపాక అన్నమయ్యను మనం చూడలేదు. గోరటి వెంకన్నను చూసినప్పుడల్లా అన్నమయ్య గుర్తుకొస్తాడు. గొప్ప వాగ్గేయం అంటే స్పష్టంగా తెలియదు గానీ, విశ్వవ్యాప్తంగా గొప్ప వాగ్గేయకారులు ఎవరూ అన్నప్పుడల్లా వెంకన్న మదిలో కొస్తాడు. బైరాగులు, సంచారులు, సిద్ధులు రామగిరి కోవెలను కొలవవచ్చి, దుందుభి వాగొడ్డున సేద తీరుతూ సాహిత్య సారమంతా తీసి వెంకన్నకు ఉగ్గు పోసినట్టున్నారు. జనజీవన లోతుల్ని, దుఃఖాన్ని, వెతలను, కథలను, కన్నీళ్లను, పీడనను, ధిక్కారాన్ని, అంగీకారాన్ని అలవోకగా కైగడుతాడు. పిట్ట వాలిన చెట్టును రెండు చేతుల్తో కౌగిలించుకుంటాడు. అన్యాయాన్ని దునుమాడటానికి, రాజ్య హింస మీద దూలాడటానికి సిద్ధంగా ఉంటాడు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్నది ఇప్పుడో సరికొత్త వేదిక. మన రాజ్యం మనకు వచ్చిన ఈ సందర్భంలో వెంకన్న తాత్వికం, సాత్వికం సమాజానికి అవసరం. పాలకపక్షమో, ప్రజాపక్షమోగానీ దళిత సాహిత్యకారుడిగా చట్టసభల్లో ఆయన ఉండటం అవసరం. మతోన్మాదం బలవంతంగా మీద పడి తరుముతున్న వేళ, దాన్ని ఆపటానికి వామపక్ష భావజాల శక్తుల పునరేకీకరణ ఇప్పుడొక చారిత్రక అవసరం.
ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని గుర్తించే ఆయనను శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేశారు. పాలక పక్షం సిఫారసు మేరకు శాసనమండలిలో అడుగుపెట్టిన ప్రజా కవులలో వెంకన్న మొదటి వాడేమీ కాదు. విశ్వనాథ సత్య నారాయణ, బోయి భీమన్న, గుర్రం జాషువా, వానమామలై వరదాచార్యులు వంటి కవులంతా మండలిలో; డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభలో తమ గళాన్ని వినిపించిన వాళ్ళే. ప్రజాకవుల వారసత్వాన్నే అందుకొని గోరటి చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నాడు.
శాసన మండలి సభ్యునిగా తనకు అవకాశం వస్తుందని వెంకన్నకు రెండు నెలల కిందే తెలుసు. కానీ ఎక్కడా బయట పెట్టలేదు. వెంకన్నది బోళాతనమే గానీ పరమ గుంభనుడు. మనసులో మాట ఒక పట్టాన బయట పెట్టడు. తన మలి ప్రయాణంపై తీవ్ర సంఘర్షణ పడ్డాడు. సహజంగానే అయన లో కాంట్రడిక్షన్ ఎక్కువ. ఆ సంఘర్షణతో ప్రకృతిని, పరి సరాలను, దూర, కాలమానాలను మర్చిపోయి మైళ్ళకు మైళ్ళు నడిచిపోతాడు. అలసిపోయినప్పుడు ఒక్క గ్లాసు కల్లు తాగి ప్రపంచాన్నే మరచి పోతాడు. లొట్టి మీది నురగ చూసి కల్లు గుణం చెప్పగలడు. వెంకన్నను దగ్గర నుంచి చూసిన వాళ్లలో నేను ఒకడిని.
పదవి వస్తుందని తెలిసిన రోజు నాగర్‌కర్నూల్ అబ్దుల్లా, నేను వెంకన్నతో తలకొండపల్లి పొలం దగ్గర కలిసే ఉన్నాం. మనసులో ఏదో మథనం. పెద్ద పాప పెళ్ళి గురించి ఆలోచన చేస్తున్నాడో ఏమో అనుకు న్నాను. ఆ ఆందోళనకు అక్షర రూపం ఇస్తే ‘తీసుకుంటే తప్పేంటంటుంది ఆత్మ. బంధువులు, హితులు సన్నిహితు లందరి మద్దతూ ఆత్మకే. కానీ అంతరాత్మ వ్యతిరేకిస్తోంది. ప్రతిఘటిస్తూ ఉంది. పాలకవర్గాలు ఇచ్చిన పదవి తీసుకొని ప్రజాకవికి కళంకం తెస్తావా?’ అని నిలదీస్తోంది. అదో తెగని సంఘర్షణ.
వెంకన్నలో వామపక్ష భావజాల తాత్వికత ఉంటుంది. అది పిడుచకట్టుకుపోయేది కాదు, ఆవిరయ్యేది కాదు. అది ఎంత సువిశాలమో ఓ సంఘటనతో చెప్పాలి. సాధారణంగా పుస్తకాల ఆవి ష్కరణకు పరిశోధకులు, విమర్శకులు, సాహితీ ప్రియులను, కవులు కళాకారులను మాత్రమే ఆహ్వానిస్తారు. కానీ గతేడాది నవంబర్ 5న వల్లంకి తాళం, పూసిన పున్నమి, ‘ద వేవ్ ఆఫ్ ద క్రెసెంట్’ మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది.
దీనికి ఓ రాజకీయ నాయకుడిని ఆహ్వానించారు. ఆయన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. దానికి కారణం రామలింగారెడ్డి చట్టసభల్లో ఉన్నప్పటికీ తన మూలాలను మరచిపోని వ్యక్తిత్వం. రాజ్యహింసను ఖండించిన నాయ కుడు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు నిర్బంధాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామ్య పాలకుడు. వెంకన్న భావ జాలమూ అదే. అందుకే రామలింగన్నను మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు.
అంతర్మథనంతోనే రెండు నెలల సంచారం చేశారు. ‘అన్నా! నన్నేం చేయమంటావు’ అని ఈ మధ్యనే ఓ రోజు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి ఫోన్ చేశాడు. అలవికాని భారాన్ని నారాయణమూర్తితో పంచు కోవటం వెంకన్నకు అలవాటు. ఆత్మ సంఘర్షణ, సత్యా న్వేషణ అనంతరం సిద్ధునిగా బాధ్యతను ఎత్తుకునేందుకు సంసిద్ధునిగా ముందుకొచ్చాడు. చట్టసభల్లో తనేం చేయాలో, ఏం చేయగలడో, ఏమేం చేయబోతున్నాడో అంతరాత్మకు విడమరిచి చెప్పుకున్నాడు. అంతరాత్మ అంగీకరించింది. ఇప్పుడు వెంకన్న సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో మండలి లోకి అడుగు పెడుతున్నాడు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు
సీనియర్ జర్నలిస్టు,
మీడియా సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment