Goreti Venkanna
-
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
మునుగోడులో కమ్యూనిస్టులతోనే టీఆర్ఎస్ గెలుపు: గోరటి వెంకన్న
నల్లగొండటౌన్: మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతోనే టీఆర్ఎస్ గెలుపు సాధ్యమైందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రజానాట్యమండలి నిర్వహిస్తున్న వీధినాటకోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రజా నాట్యమండలి కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు గొప్పవని కొనియాడారు. తాను ఇక్కడికి ఒక కళాకారునిగా వచ్చానని, కళాకారునిగా ఉండడంలోనే సంతృప్తిని పొందుతానని తెలిపారు. నాజర్, సుద్దాల హనుమంతు వారసులుగా ప్రజానాట్య మండలి కళాకారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళలు, సాహిత్యం ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కమ్యూనిస్టు నాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ఆటాపాటలతో అలరించారు. కార్యమ్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కె.శాంతారావు, వేల్పుల వెంకన్న, కట్ట నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
గోరటికి సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసిద్ధ తెలుగు కవి, గేయకర్త, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్, గోరటికి పురస్కారాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని 24మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను అవార్డులు అందించింది. గ్రహీతలకు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికను అందించారు. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబరులో జన్మించిన గోరటి వెంకన్న అనేక పాటలు రాసి, పాడటంతో పాటు ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్ర వంక’, ‘పూసిన పున్నమి’, ‘వల్లంకితాళం’ వంటి కవితా సంపుటాలను రచించారు. గోరటి 2006లో కళారత్న (హంస) పురస్కారం, 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారంతోపాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన గోరటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను గోరటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. తన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా గోరటి ని జస్టిస్ ఎన్వీ రమణ పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం సీజేఐ అభ్యర్థన మేరకు గోరటి ‘అడవి తల్లి’పై పాట పాడి వినిపించారు. -
గోరటి ‘వల్లంకి తాళం’ని వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాహిత్యం తన ప్రతిభను చాటింది. సాహితీ ప్రపంచంలో సగర్వంగా నిలబడింది. ఏకంగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులు చేజిక్కించుకుంది. తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’అంటూ ‘కుబుసం’సినిమాలోని పాటతో బహుళ ప్రజాదరణ పొందిన జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు –2021 దక్కింది. ఆయన రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. డాక్టర్ సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయిని విద్మహేలతో కూడిన జ్యూరీ.. ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తెలుగు విభాగంలో ‘వల్లంకి తాళాన్ని’ఎంపిక చేసింది. కాగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తగుళ్ల గోపాల్‌ను వరించింది. ‘దండ కడియం’అనే కవితా సంపుటికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’అనే నాటకానికి దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల అవార్డులను త్వరలో ప్రకటిస్తామని అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వారు కాగా, తగుళ్ల గోపాల్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. ఇక దేవరాజు మహారాజు వరంగల్ జిల్లాకు చెందినవారు. జీవితానికి ఇది చాలు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అవార్డు తీసుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అన్నంత గొప్ప పురస్కారమిది. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన నేను, ఒక విధానం, సిద్ధాంతం, ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఇమిడి, వదగని నేను అదే పరంపరతో సాహిత్య కృషి కొనసాగించాను. – గోరటి వెంకన్న -
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్డు.. సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. ‘వల్లంకి తాళం’ కవిత్వానికి ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 'దండకడియం' రచనకు గాను తగుళ్ల గోపాల్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021’ దక్కడం పట్లసీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమని అన్నారు. గోరటి వెంకన్నకు ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దైనందిన జీవితంలోని ప్రజాసమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని చెప్పారు. మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షిజీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటిజం పెరుగుతున్న సమయంలో సాహిత్యానికి గౌవరం పెరగాలని తెలిపారు. కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు అందరి ప్రభావం తనపై ఉంటుందని చెప్పారు. వాగ్గేయం కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిందని, జరుగుతున్న పరిస్థితులను వాగ్గేయం చేయడం కొంత ఇబ్బందేనని పేర్కొన్నారు. ఓటముల నుంచే గెలుపుకు బాట పడుతుందని, తాను రాసిన ప్రతిదీ వ్యక్తిగత అనుభవంతోనే వచ్చిందని తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌కు సాహిత్యంపై మంచి అవగాహన ఉందని చెప్పారు. -
పీర్ల పండుగలో ‘గోరటి’ సందడి
తెలకపల్లి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసనమండలికి ఎంపికైన తర్వాత తొలిసారి వచ్చిన పీర్ల పండుగలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో పీర్ల చావడిలో గురువారం రాత్రి ఫాతేహా నిర్వహించారు. పీర్లకు దట్టీలు సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఆడిపాడారు. టీఆర్ఎస్ను గద్దె దించుతాం: ఠాగూర్ సాక్షి, నాగర్‌కర్నూల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దించుతా మని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో గుణాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. పార్టీలో సెప్టెంబర్ 30లోగా ప్రతి బూత్‌కు ముగ్గురుసభ్యుల చొప్పున కమిటీ నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ నేతలు మల్లు రవి, బోసు రాజు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, మహేశ్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మారిన ‘స్వరం’లో పునరుజ్జీవన జాడలు!
సంచారం అంటే ప్రయాణం.. చలనశీల జగత్తులో నిత్య కదలికే సంచారం.. మార్క్సిజం.. లెనినిజం.. దళితవాదం.. అస్తిత్వ ఉద్యమం.. రాజ్యాధికారం ఇవన్నీ ప్రయాణాలే... వేటికవే.. ఒక్కొక్కటి ఒక్కొక్క చౌరస్తా.. అస్తిత్వ ఉద్యమం వరకు అంతా బాగానే ఉంది.. గోరటి వెంకన్న పాట పాడితే కోరసిచ్చారు.. ఆట ఆడితే అడుగు కలిపారు.. ఎవరూ ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడలేదు... తన భార్య అనారోగ్యం పాలైనప్పుడు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో దేశ దిమ్మరైనప్పుడు వెంకన్న గమనం.. గమ్యం ఎవరికీ పట్టలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలిచి రాజ్యసభ ఇస్తా తీసుకో అంటే.. ‘వద్దు సార్’ అన్నప్పుడు వెంకన్న త్యాగాల మూటన్నారు. 60 ఏళ్ల కొట్లాట ఫలించి.. జన కల సాకార రాజ్యంలో ప్రజాకవికి ఇంత చోటు దొరికితే మాత్రం నొసలు చిట్లిస్తున్నారు.. భ్రుకుటి ముకిలిస్తున్నారు... కాళ్లలో కట్టె పెట్టి గమన సంక్లిష్టం చేయజూస్తున్నారు.. బల్దియా మేయర్ ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ వెంకన్న పాటను ప్రస్తావిస్తూ.... ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ అనే పాట వినండి.. నేను వందసార్లు విన్నాను. ఆ పాటలో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి.. వారి బాధలు అర్థం చేసుకోవాలి.. పేదలను ఆదరించాలి.. బస్తీ సమస్యలు తీర్చాలి.. అదే ప్రధాన లక్ష్యం కావాలి‘ అని హితబోధ చేశారు. ఒక అంశాన్ని సమయస్ఫూర్తితో చెప్పడంలో కేసీఆర్ కంటే దిట్ట ఎవరు? నగర జీవనంలో కృత్రిమ రాజకీయాలకు అలవాటుపడ్డ కార్పొరేటర్ల హృదయానికి హత్తుకునేలా చెప్పటానికి ఇంతకుమించిన గొప్ప సందేశం ఇంకేం ఉంటుంది. తన పాట ఏలికలకు మేలుకొలుపు బాట కావాలని ప్రతి ప్రజాకవి కోరుకుంటాడు. ఆ గౌరవం వెంకన్నకు దక్కింది. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారానికి వారితో కలిసి బస్సులో వెళ్తున్న సందర్భంలో... ‘తరి మల్లలోన వరి పాపిట పసిడి పంటలు.. ఆ..బీడు మడిలో వేరుశనగ పసుపు పూతలునూనె పోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లు రా.. అద్దం లేకున్న మొఖం అండ్లనే చూడొచ్చు రా’ అంటూ సందర్భానికి అనుగుణంగా రాగమెత్తి పాడారు.. ఆశువుగా కై గట్టడమే ఆయన సహజ శైలి. ఇది ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఓ వర్గం పనిగట్టుకొని దాన్ని వైరల్ చేసింది. పాట దొర గడీలో బందీ అయిందని.. కేసీఆర్ భజన చేస్తున్నాడని మాటలు అంటున్నారు.. బస్సులో పాడిన పాటలో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు.. అది కావ్య గుణం. ఆ మాట కొస్తే.. పారే నీళ్ళు.. పచ్చటి పొలాలను నేనూ చూశాను. కందనూలు జిల్లా తెలకపల్లి ఊరంచు నుంచి మొదలు పెట్టి పాలమూరు.. ఇందూరు... సూర్యాపేట.. ఓరుగల్లు కరీంనగర్... ఆదిలాబాద్ జిల్లాలలో ఊరూరు తిరిగి తరి మళ్ళను, మత్తడి దుంకిన చెరువులను చూశాను. ఆ సదృశ్యాలను ఎత్తిపట్టుకుని ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకంలో పొందుపరిచాను. కర్విరాల కొత్తగూడెం వేదికగా మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. జగదీష్‌రెడ్డి, అల్లం నారాయణ, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, మా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు వెంకన్న వచ్చాడు. డిసెంబర్లో మా ఊరి చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అదే వేదిక మీద మాట్లాడుతూ.. కళ్ళముందు పారుతున్న ఈ నీళ్లను చూసి కూడా.. ఇంకా ‘వాగు ఎండిపాయెరో.. పెదవాగు తడిపేగు ఎండిపాయెరో’ అని పాడనా? పాడితే మీరు అంగీకరిస్తారా? అని సభి కులను అడిగారు. ‘వందల పాటలు తెలంగాణ దుఃఖం మీద.. కన్నీళ్ళ మీద.. కష్టాల మీద పాడి పాడి అలసిపోయినా.. పుస్తకంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన తీరు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు దుంకుతున్నాయి. ఇలాంటప్పుడు నేనేం చేయాలి మంచిని, మార్పును గుర్తించకపోతే ఎట్లా..! కవిగా నేను సమాజానికి అనుగుణంగా ఉండాలి’ అంటూ.. పాట అందుకున్నాడు. ‘కేసీఆర్ దీక్ష ఫలం.. గోదారి, కొత్తగూడెం ఎంత దూరముందీ.. నీళ్ల మంత్రి హరీషన్న మోము ఎట్లా వెలుగుతోంది’ అని ఆశువుగా పాట కైగట్టి పాడాడు. ఇది పాజిటివ్ కవి లక్షణం. కులాలు, మతాలు, దేవుడు వ్యక్తిగతం నుంచి వేరు పడి రాజకీయంగా మారిన నేపథ్యంలో వెంకన్న లాంటి దళిత, విప్లవోద్యమ భావజాల కవుల అవసరం సమాజానికి ఉంది. మతఛాందస వాదులు ఓట్లకోసం సాన పెడుతున్న ఈ తరుణంలో వెంకన్న నికార్సయిన ప్రజా ప్రభుత్వం వైపు నిలబడడమే సమంజసం. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా సమన్వయ కర్త -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
జీహెచ్ఎంసీ పాలనపై గోరటి పాట వైరల్
హైదరాబాద్: ప్రజా కవి, వాగ్గేయకారుడిగా ఉన్న గోరటి వెంకన్నను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలిచి మరి ఎమ్మెల్సీగా నియమించారు. శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అంతగా కనిపించని ఆయన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో మెరిశారు. ప్రమాణస్వీకారం చేయడానికి టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కలిసి బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సులో వారితో పాటు ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆసువుగా పాట ఎత్తుకున్నారు. ‘రాములోరి సీతమ్మో సీతమ్మో’ అంటూ అప్పటికప్పుడే పాట అందుకున్నారు. పక్కన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ వెంకన్నను ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతుండగా పాట పాడారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన మార్పులను వివరిస్తూ వెంకన్న పాట పాడారు. వ్యవసాయం బాగా జరిగిందని.. అద్దాలుగా రోడ్లు ఉన్నాయని.. గులాబీ రేకుల తీరుగా నగరమెల్ల వెలుగులే అంటూ అభివర్ణిస్తూ పాట అందుకున్నారు. పచ్చనైన పార్కులు ఉద్యానవనాలు.. అంటూ పాట పాడారు. దీనికి బస్సులో ఉన్న ఎమ్మెల్సీ నారదాసు, కార్పొరేటర్లు కోరస్ పాడుతూ ఉత్సాహంగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ ట్విటర్లో పంచుకున్నారు. ‘సీఎం కేసీఆర్ గొప్పతనం.. పరిపాలన దక్షతను వివరిస్తూ అప్పటికప్పుడు గోరేటి వెంకన్న గారు పాట పాడారు’ అని ట్వీట్ చేశారు. -
ఎమ్మెల్సీ నియామకాలపై రిట్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా, దయానందల నియామకాలను చాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం ఎమ్మెల్సీ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరును రెండుసార్లు గవర్నర్‌కు ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రానున్న నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. -
ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కేసీఆర్
-
ముగ్గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు. (చదవండి: పెద్దల సభకు ఉద్యమ పాట) -
పెద్దల సభకు ఉద్యమ పాట
తాళ్ళపాక అన్నమయ్యను మనం చూడలేదు. గోరటి వెంకన్నను చూసినప్పుడల్లా అన్నమయ్య గుర్తుకొస్తాడు. గొప్ప వాగ్గేయం అంటే స్పష్టంగా తెలియదు గానీ, విశ్వవ్యాప్తంగా గొప్ప వాగ్గేయకారులు ఎవరూ అన్నప్పుడల్లా వెంకన్న మదిలో కొస్తాడు. బైరాగులు, సంచారులు, సిద్ధులు రామగిరి కోవెలను కొలవవచ్చి, దుందుభి వాగొడ్డున సేద తీరుతూ సాహిత్య సారమంతా తీసి వెంకన్నకు ఉగ్గు పోసినట్టున్నారు. జనజీవన లోతుల్ని, దుఃఖాన్ని, వెతలను, కథలను, కన్నీళ్లను, పీడనను, ధిక్కారాన్ని, అంగీకారాన్ని అలవోకగా కైగడుతాడు. పిట్ట వాలిన చెట్టును రెండు చేతుల్తో కౌగిలించుకుంటాడు. అన్యాయాన్ని దునుమాడటానికి, రాజ్య హింస మీద దూలాడటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్నది ఇప్పుడో సరికొత్త వేదిక. మన రాజ్యం మనకు వచ్చిన ఈ సందర్భంలో వెంకన్న తాత్వికం, సాత్వికం సమాజానికి అవసరం. పాలకపక్షమో, ప్రజాపక్షమోగానీ దళిత సాహిత్యకారుడిగా చట్టసభల్లో ఆయన ఉండటం అవసరం. మతోన్మాదం బలవంతంగా మీద పడి తరుముతున్న వేళ, దాన్ని ఆపటానికి వామపక్ష భావజాల శక్తుల పునరేకీకరణ ఇప్పుడొక చారిత్రక అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని గుర్తించే ఆయనను శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేశారు. పాలక పక్షం సిఫారసు మేరకు శాసనమండలిలో అడుగుపెట్టిన ప్రజా కవులలో వెంకన్న మొదటి వాడేమీ కాదు. విశ్వనాథ సత్య నారాయణ, బోయి భీమన్న, గుర్రం జాషువా, వానమామలై వరదాచార్యులు వంటి కవులంతా మండలిలో; డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభలో తమ గళాన్ని వినిపించిన వాళ్ళే. ప్రజాకవుల వారసత్వాన్నే అందుకొని గోరటి చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నాడు. శాసన మండలి సభ్యునిగా తనకు అవకాశం వస్తుందని వెంకన్నకు రెండు నెలల కిందే తెలుసు. కానీ ఎక్కడా బయట పెట్టలేదు. వెంకన్నది బోళాతనమే గానీ పరమ గుంభనుడు. మనసులో మాట ఒక పట్టాన బయట పెట్టడు. తన మలి ప్రయాణంపై తీవ్ర సంఘర్షణ పడ్డాడు. సహజంగానే అయన లో కాంట్రడిక్షన్ ఎక్కువ. ఆ సంఘర్షణతో ప్రకృతిని, పరి సరాలను, దూర, కాలమానాలను మర్చిపోయి మైళ్ళకు మైళ్ళు నడిచిపోతాడు. అలసిపోయినప్పుడు ఒక్క గ్లాసు కల్లు తాగి ప్రపంచాన్నే మరచి పోతాడు. లొట్టి మీది నురగ చూసి కల్లు గుణం చెప్పగలడు. వెంకన్నను దగ్గర నుంచి చూసిన వాళ్లలో నేను ఒకడిని. పదవి వస్తుందని తెలిసిన రోజు నాగర్‌కర్నూల్ అబ్దుల్లా, నేను వెంకన్నతో తలకొండపల్లి పొలం దగ్గర కలిసే ఉన్నాం. మనసులో ఏదో మథనం. పెద్ద పాప పెళ్ళి గురించి ఆలోచన చేస్తున్నాడో ఏమో అనుకు న్నాను. ఆ ఆందోళనకు అక్షర రూపం ఇస్తే ‘తీసుకుంటే తప్పేంటంటుంది ఆత్మ. బంధువులు, హితులు సన్నిహితు లందరి మద్దతూ ఆత్మకే. కానీ అంతరాత్మ వ్యతిరేకిస్తోంది. ప్రతిఘటిస్తూ ఉంది. పాలకవర్గాలు ఇచ్చిన పదవి తీసుకొని ప్రజాకవికి కళంకం తెస్తావా?’ అని నిలదీస్తోంది. అదో తెగని సంఘర్షణ. వెంకన్నలో వామపక్ష భావజాల తాత్వికత ఉంటుంది. అది పిడుచకట్టుకుపోయేది కాదు, ఆవిరయ్యేది కాదు. అది ఎంత సువిశాలమో ఓ సంఘటనతో చెప్పాలి. సాధారణంగా పుస్తకాల ఆవి ష్కరణకు పరిశోధకులు, విమర్శకులు, సాహితీ ప్రియులను, కవులు కళాకారులను మాత్రమే ఆహ్వానిస్తారు. కానీ గతేడాది నవంబర్ 5న వల్లంకి తాళం, పూసిన పున్నమి, ‘ద వేవ్ ఆఫ్ ద క్రెసెంట్’ మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. దీనికి ఓ రాజకీయ నాయకుడిని ఆహ్వానించారు. ఆయన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. దానికి కారణం రామలింగారెడ్డి చట్టసభల్లో ఉన్నప్పటికీ తన మూలాలను మరచిపోని వ్యక్తిత్వం. రాజ్యహింసను ఖండించిన నాయ కుడు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు నిర్బంధాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామ్య పాలకుడు. వెంకన్న భావ జాలమూ అదే. అందుకే రామలింగన్నను మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. అంతర్మథనంతోనే రెండు నెలల సంచారం చేశారు. ‘అన్నా! నన్నేం చేయమంటావు’ అని ఈ మధ్యనే ఓ రోజు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి ఫోన్ చేశాడు. అలవికాని భారాన్ని నారాయణమూర్తితో పంచు కోవటం వెంకన్నకు అలవాటు. ఆత్మ సంఘర్షణ, సత్యా న్వేషణ అనంతరం సిద్ధునిగా బాధ్యతను ఎత్తుకునేందుకు సంసిద్ధునిగా ముందుకొచ్చాడు. చట్టసభల్లో తనేం చేయాలో, ఏం చేయగలడో, ఏమేం చేయబోతున్నాడో అంతరాత్మకు విడమరిచి చెప్పుకున్నాడు. అంతరాత్మ అంగీకరించింది. ఇప్పుడు వెంకన్న సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో మండలి లోకి అడుగు పెడుతున్నాడు. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, మీడియా సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ -
కళాకారులకు దక్కిన గౌరవం ఇది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా గోరేటి వెంకన్నకు శుభాకాంక్షలులు తెలిపారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది’ అని ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్విట్లో ‘గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్న గారిని సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్ గారికి వందనాలు’ అని అన్నారు. (చదవండి : గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ) కాగా, మండలి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినందుకు గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. (చదవండి : ‘గవర్నర్ కోటా’ ఖరారు) తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD — KTR (@KTRTRS) November 15, 2020 -
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాట..
సాక్షి, నాగర్‌కర్నూల్: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఈయనకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ) విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాటలకు నాంది పలికారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. విదేశాల్లోనూ సత్కారాలు పొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు. రాసిన పుస్తకాలు.. ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్ ఆఫ్ ద క్రెస్సెంట్ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు. అవార్డులు ఇవే.. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు. -
మండలికి గోరెటి వెంకన్న, దేశపతి!
సాక్షి, హైదరాబాద్ : త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. మూడు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగినే కేబినెట్లో చర్చించిన అనంతరం జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో కవి గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. (గ్రేటర్లో గెలవాల్సిందే) తెలంగాణ ఉద్యమ సమయమంలో గోరెటి వెంకన్నతో పాటు, దేశపతి శ్రీనివాస్ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసింది. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుతూ బస్వరాజు సారయ్య టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒకపదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఈసారి అవకాశం దకొచ్చని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు గుజరాతీ సామాజికవర్గానికి చెందిన వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేటి మంత్రిమండలి భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. -
నిఖార్సయిన విప్లవకవి
అప్పుడు విరసం (విప్లవ రచయితల సంఘం) సభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ సభలో రావిశాస్త్రిగారు, కె.వి.రమణారెడ్డిగారు.. ఇలా మహామహులు ఎందరో ఉన్నారు. అప్పుడు నేను ‘అందుకోరా గుత్తందుకో..’ అనే పాట రాశాను. నేను స్టేజి మీద పాడుతూ, మనిషి ఎత్తుకు ఎగురుతున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి డోలక్ కొడుతూ, కోరస్ ఇచ్చారు. ఆయనే వంగపండు ప్రసాదరావు. ఆ తర్వాత నేను, వంగపండు.. నారాయణమూర్తి గారి సినిమాల ద్వారా కలిసి చాలాసార్లు వారాలు, నెలలపాటు గడిపాము. వంగపండు చేతిలో చిన్న అందెలు ఉండేవి. అవి పోయాయి. నేను దుబాయ్ వెళ్లినప్పుడు తీసుకొచ్చిన అందెలు నా దగ్గర పది జతలు ఉన్నాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నాకివ్వమని అడిగితే ఇచ్చాను. ఆయనకు ఇచ్చిన అందెలే నాకు ఇప్పుడు చివరి జ్ఞాపకంగా మిగిలాయి. గద్దరన్న, వంగపండు రాసిన ప్రతి పాటా అపురూపమే. ఎందుకంటే వాళ్లు పేరు కోసమో, డబ్బు కోసమో పాటలు రాయరు. ఒక మహోన్నతమైన ఉద్యమం కోసం వాళ్లు పాటలు రాశారు. వంగపండు నిరాడంబరుడు. ఆయన జీవితానుభవాలే పాటలుగా ఆయన గుండెలోతుల్లో నుండి వచ్చాయి. ఆ కాలంలో గద్దరన్న ప్రవాహానికి, ఉప్పెనకు నిలబడ్డ ఏకైక వ్యక్తి వంగపండు. తర్వాత ఆయన స్టెప్పు, మాటతో ఎంతో విభిన్నంగా ఉండేవారు. చాలా నిఖార్సయిన విప్లవ కవి ఆయన. ఆయనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆర్. నారాయణమూర్తి చాలా సాయం చేశారు. ఆయన సినిమాల ద్వారా వంగపండుగారి పాటలు ఎంతోమందికి దగ్గరయ్యాయి. -
నా ప్రతి చరణం ఒక ఆత్మ విమర్శ
మట్టిపొరలను సుతిమెత్తగా తొలగించుకుంటూ వచ్చే లేతమొక్కలా గోరటి వెంకన్న పాట మొలకెత్తుతుంది. పల్లె పొత్తిళ్ళ నుంచి ఎగిరొచ్చిన పసితనం అద్దుకున్న పాట రాజ్యధిక్కారాన్ని నింపుకుని నల్లతుమ్మముల్లులా గుచ్చుకుంటుంది. గోరటి పాట ప్రకృతిలోని నిసర్గ సౌందర్యాన్ని దోసిట్లో పోసుకొని తాగుతున్నట్లుగా ఉంటుంది. ఒక జీవితానికి సరిపడినంత తాత్త్విక దాహం తీర్చుకున్నట్లుగా దేహం విశ్వాంతరాల్లోకి తేలిపోతుంది. ఎవరూ పట్టుకోని హీనప్రతీకలను, ఎవరూ ముట్టుకోని కవిసమయాలను అందుకున్న సహజకవి. ప్రబంధ కవితా పాదాల వరుసలో సాగుతూ, ప్రజా వ్యథల్ని వినిపిస్తున్న వాగ్గేయకారుడు. ‘వాగు ఎండిపాయెరో పెదవాగు తడి పేగు ఎండిపాయెరా!’ అని వెంకన్న వేదనా చెందాడేమోగాని ఏనాటికీ ఎండిపోని పాటల వాగును తెలుగుజాతికి అందించిన గోరటి వెంకన్నతో ప్రత్యేక సంభాషణ. మీ పాట ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలిగారా? ఆ సంకేతం మీకు అందిందా? అది ప్రజలు చెప్పాలి. నేనైతే ప్రభావితం చేశానని అనుకోవటం లేదు. పాట ఎప్పుడూ ఒక అసంపూర్తి వాక్యమే. ఉద్యమ చైతన్యం, ఆ బలమైన నేపథ్యమే సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పాట అందుకు ఒక ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. నాకు నేను బయటపడటానికి, నా బాధల బరువును దించుకోవటానికి పాడుకున్న. పల్లెతో నాది గాఢానుబంధం. పల్లెల దుస్థితిని చూశాక, సంక్షోభ స్థితిని అనుభవించాక పల్లె కన్నీరు పెడుతుందని గీతం రాశాక గాని కొంత ఉపశమనం కలగలేదు. నాది ప్రిమిటివ్ స్వభావం. నాలోని వెలితిని, బాధను, వేదనను దూరం చేసుకోవడానికి పాటను ఆశ్రయించా. ఇంత వేగవంతమైన ప్రపంచంలో నా పాట ఏమేరకు ప్రభావితం చేసిందో సమాజమే చెప్పాలి. మీ రచనా ప్రయాణంలో మిమ్ముల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకున్న సందర్భాలున్నాయా? పాట రాస్తున్నప్పుడు ప్రతి చరణం నాలో ఆత్మవిమర్శను ప్రేరేపిస్తుంది. నాలో కాంట్రడిక్షన్ ఎక్కువ. ఆత్మసంఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నేను రాసిందంతా వాస్తవమా, కాదా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ‘పాపాలు, శాపాలు లోకమందు ఉంటాయి. కోపాలు, తాపాలు సహజంగా వస్తాయి.’ ఉద్యమ స్ఫూర్తి ఉ«ధృతంగా ఊపేస్తూ ఉంటుంది. అట్లా అని హింసకు వ్యతిరేకం. ప్రతిక్షణం తెలియని ఆత్మసంవేదనకు, అసంతృప్తికి గురవుతూ ఉంటాను. సంచారమే నన్ను నేను సరిదిద్దుకునేటట్లుగా చేస్తుంది. మీ పై యక్షగానాలు, పద్యనాటకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది? దానికి కారణం ఏమిటి? మా నాన్న మంచి యక్షగాన కళాకారుడు. ఊహ తెలిసిన నాటినుంచే యక్షగానం నా ఎదలో ప్రతిధ్వనించింది. చిన్నప్పటి నాటకాలు బలమైన ముద్రలు వేశాయి. యక్షగానాల్లోని రాగఛాయలు, తాళగతులు, సంగతులు నా పాటకు శిక్షణనిచ్చాయి. నా పాటల్లో యక్షగానాల్లోని నడక కనిపిస్తుంది. నేను పనిగట్టుకొని అల్లిక చేయనవసరం లేదు. చిన్నప్పటి జ్ఞాన ప్రభావంతో అలవోకగా రాగం మొలకెత్తుతుంది. నా పాటలోని పిట్ట, చెట్టు, వేకువ, వెన్నెల, తత్వాలన్నింటికి మూలం నేను విన్న పద్యాలు, గేయాల్లోంచే ఉబికివచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకం కంటే వందేళ్ళ ముందేవచ్చిన కందాల రాఘవాచార్యులు, రామాచార్యుల పద్యధార, సంస్కృత పదజాలం నన్ను ప్రభావితం చేసింది. నేను రాసిన తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్‌మీద ‘అడిగెదనని కడువడి జను...’ లాంటి పోతన పద్యాల ప్రభావం ఉంది. ఈ మధ్య మీరు అలంకార శాస్త్ర అధ్యాపకుడిగా, వర్ధమాన సాహిత్య విమర్శకుడిగా కనబడుతున్నారు. ఈ మార్పుకు కారణాలేంటి? నాకు చిన్నప్పటినుంచి చదవడం అలవాటు. అది ఒక వ్యసనం. ఒక ఆరాధన. నాకు పాట ఎంత ఇష్టమో, విమర్శ అంతే ఇష్టం. ఎం.ఏ. తెలుగు చదివాను. దొరికిన ఏ పుస్తకాన్ని వదల్లేదు. చిన్నప్పుడు క్లాసిక్స్ దొరకని ప్రదేశంలో ఉన్నాను. ఇప్పుడు అర్థం కాకపోయినా అలంకారశాస్త్రం లాంటి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుటికైనా అర్థంకాకపోదా? అనే నమ్మకం. నా అభిప్రాయాలు, పరిశీలనలు పంచుకునే సందర్భంలో అనుభవంలోంచి వచ్చిన విశ్లేషణల వల్ల నాలో విమర్శకుడు కనిపించవచ్చు మీకు. ‘జీవనసారం నిలుపుకున్న పామరులే నిజ సిద్ధుల’న్న మీరు వారి గాఢతత్త్వాన్ని ఎలా అందుకోగలిగారు? నా బాల్యం, మా ఊరు, ఆ మట్టిదారులు, అక్కడి పల్లెజనులు, పెద్దలు... నా బలమంతా అక్కడే ఉంది. మా ఊరి మాదిగ నారాయణదాసులాంటి వారి ప్రభావం నా మీద ఉంది. అతనిలాగా నేను ఉండాలని ప్రయత్నించానా అనే అనుమానం వస్తుంది. ఆ అనుభవాలు సామాన్యమైనవేం కాదు. ప్రతిపాటను మా ఊరి పామరులే రాయించారు. పామరులే నా హీరోలు. పామరత్వంలోనే పరమతత్వం ఉంది. పామరులు ఏ సమస్యనైనా సంక్లిష్టం చేసుకోరు. వారి సహజ సంభాషణలో లోతైన లోకతత్వం నెలకొని ఉంటుంది. పామరత్వంలో వున్న శోభ, అలంకారాల్ని నిత్యం నేను ఆస్వాదించాను. అదే నా పాటలో ప్రతిఫలించింది. రచయితలు కేశవరెడ్డి, బండి నారాయణస్వామిలో పామరత్వం, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిలో సౌందర్యం నేను దర్శించాను. అవే నా పాటలో పామరతత్వంగా ప్రతిఫలించాయి. తెలంగాణ ఉద్యమం కంటే ముందునుంచే మీరు అనేక సామాజిక రాజకీయ సమస్యల మీద రాశారు. ఇప్పుడెందుకు రాయడం లేదు? తెలంగాణ వచ్చాక కూడా రాస్తున్నాను. కాకపోతే వస్తువులు మారాయి. పొద్దునే లేచి కనబడిన సమస్యల మీద రన్నింగ్ కామెంట్రీ రాయాలన్న కండీషన్ కవికి లేదు. అలా రాయాలనే ఆసక్తి, అభినివేశం నాకు లేదు. ఉద్యమం చేయనప్పుడు రాయడం ఎందుకు? రాయడం ఐదు నిముషాల పని. ‘నా పల్లె కన్నీరు పెడుతుంది, సంత, అడవి’ పాటలు కొన్ని యేండ్ల తరబడి నలిగిపోయి వచ్చిన పాటలు. అయినా ఇటీవల యురేనియం సమస్య మీద నేనే మొదట రాశాను. ఈ మధ్య ట్రంప్ వచ్చినప్పుడు ‘రక్తపింజర చూపు ఎట్లుందో ట్రంప్ చూపు అట్లుంది’ అని రాశా. తెలంగాణ వచ్చాక వెలువడిన ‘వల్లంకితాళం’లోనూ కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ ప్రకృతి, సమాజం, ఉద్యమమే నా గేయాలకు మాతృక. బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వస్తాయేమో. దేశమంతటా అనేక చర్చలు, వాదనలు అలుముకుంటున్న వేళ ప్రత్యేకంగా ఏమన్నా రాయదలుచుకుంటున్నారా? చెడుకాలం కమ్ముకుంటున్నప్పుడు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. క్రూరత్వం అలుముకున్న వేళ ప్రకృతే ఆ పరిణామం తీసుకొస్తుంది. కులాలు, మతాలు, దేవుడు వ్యక్తిగతం నుంచి రాజకీయంగా మారాయి. ఈ గోడు ఎల్లకాలం ఉండదు. ‘దుష్టరిగే బంధ సంపత్తు, సజ్జనరిగే బంధ విపత్తు, యశ్టో కాల ఇరలారదు’ (దుష్టులకొచ్చిన సంపద, సజ్జనులకొచ్చిన ఆపద ఎల్లకాలం వుండవు). కవి గూడా సరైన అదును కోసం ఎదురు చూస్తుంటాడు. పాటకు, వచన కవితా ప్రక్రియల మధ్య వ్యత్యాసాలున్నాయా? మిమ్ముల్ని ప్రభావితం చేసిన వచన కవులు ఉన్నారా? పాటకు, వచన కవితకు కొన్ని వ్యత్యాసాలున్నా రెండూ ఒకటే. భావనా పటిమ, రసనిష్ఠ, అభివ్యక్తి వైవిధ్యం ఉంటేనే ఏదైనా కవిత్వమౌతుంది. కబీర్, గాలిబ్, గుల్జార్, జావేద్ అలాంటివారు. వచన కవితలో సంక్లిష్ట ప్రతీకలు, కఠినమైన పదప్రయోగాలు చేయొచ్చు. పాటకు అది కుదరదు. కాని పాట ప్రజల్లోకి సులువుగా వెళుతుంది. ఈ సందర్భంలో పాటను ప్రజాపరం చేసిన గద్దర్ స్ఫూర్తిని విస్మరించలేం. పాట నడక నాకిష్టం. పాట నా స్వభావం. శివసాగర్, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, నండూరి, పుట్టపర్తి, సినారె గేయాల ప్రభావం నా పాటల్లో వినిపిస్తుంది. వచన కవుల్లో అజంతాను చాలా ఇష్టపడతాను. ఆలూరి బైరాగి, తిలక్‌ను మర్చిపోలేను. అస్తిత్వ ఉద్యమాల్లో పైడి తెరేష్‌బాబు, మద్దూరి నగేష్‌బాబు, త్రిపురనేని శ్రీనివాస్, అయిల సైదాచారి ఇంకా చాలా మంది మంచి కవులున్నారు. ఇప్పుడు రాస్తున్న కవులందరిది ఎవరి ప్రత్యేకత వారిదే. వారందరిని ఇష్టపడతాను. సీనియర్ కవుల్లో ఎన్.గోపి, శివారెడ్డి కవిత్వాన్ని అభిమానిస్తాను. గోరటి వెంకన్నలో ఆనాటి ధిక్కారస్వరం మూగబోయిందా? ప్రభుత్వం నుండి పదవులు, అవార్డులు ఆశిస్తున్నాడా? ఇంతకు ముందే చెప్పినట్లు నేనేం మూగపోలేదు. మూగబోయే అదృష్టం, ప్రాప్తం నాకెక్కడిది. ఇది మౌనం మాత్రమే. నా అలజడిలో ప్రశాంతత, ప్రశాంతతలో అలజడి. నా మౌనంలో ఒక అంతర్మథనం, ఒక చలనం, జ్వలనం దాగి వున్నాయి. అవార్డులు కోరుకుంటే వస్తాయా? ఆశిస్తే వస్తాయా? గుర్తించి ఇచ్చిన సాహితీ మూర్తుల గొప్పతనం అది. సంభాషణ: డాక్టర్ ఎస్.రఘు -
జీవనానందం, జీవనదుఃఖం
ప్రపంచవ్యాప్తంగా వున్న గొప్ప ప్రజావాగ్గేయకారులు స్ఫురణలో కొచ్చినప్పుడు, గోరటి వెంకన్న గుర్తుకొస్తాడు. లేదు గోరటి వెంకన్న గుర్తుకొచ్చినప్పుడు విశ్వ ప్రజావాగ్గేయకారులు గుర్తుకొస్తారు. నిన్న మొన్నటి దాకా ప్రపంచసాహిత్యంలో పాటకి మొదటిస్థానం యివ్వటానికి మేధావులు, విమర్శకులు వెనుకాడారు. కానీ అమెరికన్ ప్రజావాగ్గేయకారుడు బాబ్ డిలాన్‌కు నోబెల్ అవార్డు వచ్చాక ఆ రేఖ చెరిగిపోయింది; ఏ ప్రక్రియలో వున్నా గొప్ప సాహిత్యం గొప్ప సాహిత్యమే. అన్ని దేశాలు తమవయిన వాగ్గేయకారులను సృష్టించుకున్నాయి. ప్రజాజీవన లోతుల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, వెతల్ని, హింసల్ని, పీడనల్ని ఈ వాగ్గేయకారులు అద్భుతంగా పట్టుకుని, స్థిరస్థాయిని కల్పించారు. ఎరిక్ క్లాప్టన్ను వినండి; ట్రేసీ చాప్‌మన్‌ను వినండి; సర్వమానవుల ఉనిక్కి సంబంధించిన సారమేదో, వేదనేదో ప్రతిధ్వనిస్తుంది. జీవనానందాన్ని, జీవనదుఃఖాన్ని పాట బ్రహ్మాండంగా పట్టుకుంది. వీళ్ల పాట విన్నాక ఒక సమరోత్సాహం, ఒళ్లు తెలియని అనంతమయిన ఆశ ఉబుకుతుంది. ఒక్కసారి వేలవేల పక్షులు ఆకాశంలోకి లేస్తాయి. మనలోని నదులు కదలబారతాయి. ఈ అఖండ భూమిని రెండు చేతుల్తో కౌగిలించుకుంటాం. అన్యాయాన్ని అధర్మాన్ని సహించం. దునుమాడటానికి సిద్ధమవుతాం. కొన్ని వేల సంవత్సరాల దేశ సంచారుల, బైరాగుల, భక్తికవుల సారమంతా, వారసత్వమంతా వెంకన్న పుణికిపుచ్చుకున్నాడు. ఒక ఆశ సాంప్రదాయపు జీవలక్షణాన్ని, తాజాదనాన్ని తత్కాలపు మేలిమి గుణాల్ని అందుకున్నాడు. అన్ని సాహిత్య ప్రక్రియలు అందులో లీనమై, కరిగిపోయి పాటగా ప్రత్యక్షమవుతాయి. పాట నివేదిస్తుంది. నీచే మాట్లాడిస్తుంది. దేహాన్ని ఖడ్గంగా మారుస్తుంది. ఒకానొక ఉద్యమం వున్నప్పుడు పాట జన్మించి ఉ«ధృతమై ఉనికి రహస్యాన్ని విప్పిచెప్పవచ్చు. ఏకవ్యక్తి నిర్మితమయిన పాట ఈ దశలో బహుముఖమై, జాజ్వల్యమానమై బహు సోయగాల్తో విరాజిల్లుతుంది. ఈ పాటల్ని వాళ్లు వేదికమీద ప్రదర్శించేటప్పుడు బహు భంగిమల్తో, బహు అర్థాల్తో లోలోపలికి తొలుచుకుపోతాయి. ఆ పాట నాదం జీవితాంతం లోలోపల వెలుగుతూనే వుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్న ఈ ఉచ్ఛస్థాయినందుకున్నాడు. పాటకి ఒక శాశ్వతత్వాన్ని అద్భుతమయిన అందాన్ని లాలిత్యాన్ని మృదుత్వాన్ని, ఒక గొప్ప మెలకువను ప్రసాదించాడు. ప్రకృతిని యింతగా సంలీనం చేసుకున్న కవి అరుదుగా కనిపిస్తాడు. లీనంగాకుండా జీవితంలో, జనజీవితంలో పాటెట్టా రాస్తాడు; వరుసలు వరుసలుగా ఎలా కడతాడు, తీర్చిదిద్దుతాడు. కరిగిపోవటం, లీనం కావటం కవి ప్రథమ లక్షణం. తర్వాత ఆ ద్రవస్థితిని, పాటగా, కవితగా ఘనీభవింపజేస్తాడు. ఆ గడ్డ కట్టిన పాట మళ్లీ పాఠకుల, శ్రోతల, గాయకులలో కరిగి, కరిగి పాట ప్రవాహమై పోతుంది. ఈ పాటలు ఊరక రావు. అనేక తత్వాలు కలిసి, అనేక దేశాల జీవన రీతుల్ని లీనం చేసుకుని, తనకేమీ పట్టనట్టు జనప్రవాహాల మీద పారబోసుకుంటూ వెడతాడు. అతను సమస్త దేహంతోనూ, దేహాత్మతోనూ బతుకును పట్టుకుని పాటల్ని సీతాకోక చిలుకల్లా అంతటా ఎగరేసుకుంటూ పోతాడు. అతనికొక కచ్చితమయిన తాత్వికత వుంది. జీవన దర్శనముంది. అతనికి మార్గనిర్దేశం చేసే ఒక వామపక్ష భావజాల తాత్వికత వుంది. అది గడ్డ కట్టుకుపోయేది కాదు. బహుముఖమైంది. ‘ఆకలా, దాహమా, చింతలా, వంతలా’ అని కృష్ణశాస్త్రి పాడుకున్నట్టు వెంకన్న మనమధ్య పాడుకుంటూ తిరుగుతున్నాడు. వెంకన్న వామపక్ష పక్షపాతయినా బహు ప్రజాస్వామికవాది. మన రాజ్యం ఏర్పడ్డాక గూడా రాజ్యంమీద కవి విజిలెన్స్ అవసరం. ప్రకృతి సమాజపు మేలికలయిక వెంకన్న కవిత్వంలో స్పష్టంగా కన్పడుతుంది. వెంకన్న పాటలు విన్నాక మనలో మనం దృశ్యమానం చేసుకున్నాక, మన రూపురేఖలే మారిపోతాయనుకుంటా. ప్రతి అంశంలోనూ అందాన్ని, శోభని చూడగల సౌందర్యవాది. ‘‘అందాల తనువెల్ల వంపుకున్న అడవి అలరించి తలపించె ఆకుపచ్చని కడలి’’ షెల్లీ అనుకుంటా సముద్రాన్ని ‘వాటర్ మెడో’ అన్నాడు. అలవోకగా అద్భుతమయిన ఇమేజెస్ పడుతూ వుంటాయి. అపురూపంగా, హాయిగా వుంటాయి. మనదయినతనమేదో వాటికంటుకుని వుంటుంది. ‘నీడల ఊడ’ అనే పాట చూడండి. ‘‘పూసిన పూలకు దోసిలొగ్గితె వాసన పరిమళమొంపునుర కోసి మెడలో వేసుకు తిరిగితె వాడి తాడయి మిగులునురా’’ వెంకన్న సారం నిలుపుకున్న, వడకట్టిన సిద్ధుడుగా పరిణామం చెందుతూ వస్తున్నాడు. అతని పాటలన్నీ ఈ పరిణామ ప్రతిఫలనాలే. పైపైన పలకటం, పాడటం అతనివల్ల కాదు. నిండా మునగాలి, లోతులకెళ్లి జీవనసారాన్ని తీసుకురావాలి. ‘నల్లతుమ్మ చెట్టు’ గానీ, ‘బెడలగువ్వ’ గానీ, ‘కానుగనీడ’ గానీ, ఏదయినా సరే, తనే పాటలా బయటికొస్తాడు. ‘సిగమొగ్గ’ పేరుతో ఉత్తరాంధ్రమీద గొప్పపాట కట్టాడు; ఉత్తరాంధ్ర చరిత్రని, దాని పోరాట పటిమని, దాని నైసర్గిక స్వరూపాన్ని, దాని జీవతత్వాన్ని అద్భుతంగా పట్టుకున్నాడు.వెంకన్నకడ్డేముంది. జీవనస్థలిలో బతుకు పండుగ జరుపుకుంటున్నాడు. అతని పాటలన్నీ బతుకులను ఊరేగించటం, గొప్పగా మురిసిపోవటం, గొప్పగా ఆనందించటం, నృత్యం చేయటం! (గోరటి వెంకన్న మూడు పుస్తకాల– వల్లంకి తాళం, పూసిన పున్నమి, గోరటి కవితలకు ఆంగ్లానువాదం ‘ద వేవ్ ఆఫ్ ద క్రెసెంట్’– ఆవిష్కరణ సభ నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది.) - కె.శివారెడ్డి -
నీడల ఊడ
పూసిన పూలకు దోసిలొగ్గితే వాసిగ పరిమళమొంపునుర కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునుర జీవన సారం నిలుపుకున్న పామరులే నిజ సిద్ధులుర బావిల కప్పల బెకబెక అరిసే బోధలు వెర్రి సుద్దులుర నీడల ఊడల ఉయ్యాల్లూగిన పసితనమెంతో మురిపెముర మేడల తేరులపయి ఊరేగిన అతిశయమే ఓ కృతకముర కవులను పీఠము లెత్తకపోతే కవిత వెలగదని అనుకోకు రసములూరి రంజిల్లె కవితకు కాలమె తోరణమవుతదిర నిజమును శోధించె ఓ కవి నిను నీవె మరువాలన్న కర భజనల మురిపెంబులకన్న ఎద నుబికె తడి ఎంతో మిన్న యుగాలుగ పగ సిగమె ఊగిన సహనం జగాన వెలిగెనుర ఉరిమే ఉప్పెన వరదై ముంచిన ఇసుక రేణువులు మెరిసెనుర పొద్దు వెన్నెల సుక్కల కాంతులు ఆరక వెలిగె దివ్వెలుర పలకని ప్రతిమల మహిమల కోసం తైలపు దీపాలెందుకుర ఆకసమే తన గోపురమయిన దేవునికీ గుడులెందుకుర అంతట తానై ఉండిన వానికి ఆగమ నియమాలెందుకుర కాసుకు లొంగిన బంధమందున ప్రేమను ఎందుకు వెతికేవు కందెన ఇంకిన బండిన నీవు ఎందాకని పయనించేవు గనిలొ పుట్టిన ఇనుము రూపం మారి గనినె తవ్వుతున్నది ఓటమికి నీ గెలుపునకు నీ గుణమె కారణమవుతున్నది సీకటినెలిగె వజ్రములున్నవి నా సరి ఎవరని అనకన్న ఆకటికి వరి అన్నమె కాని వజ్రములు తినలేవన్న భూమి సొంతం కావాలనుకొనె దాహం నీలో ఉన్నదిర నీవె తనలోకెన్నడొస్తవని నేల ఎదురు చూస్తున్నదిర -గోరటి వెంకన్న -
‘సంక్రాంతి అంటే అదే’
సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. స్వాగతం మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం. రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం. – సుద్దాల అశోక్‌తేజ సమైక్య క్రాంతి పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి. ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి. ఎలక్ట్రికల్ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). – సిరివెన్నెల అందుకే ఈ పండగంటే ఇష్టం సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం. కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు. – గోరటి వెంకన్న, కవి అలా రెండు సంక్రాంతులు గడిచాయి సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్ ఫేవరేట్ ప్లేస్ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి. విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది. – శ్రీమణి ఇది కర్షకుల పండగ పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. – రామజోగయ్య శాస్త్రి -
ఆష్టా నుంచి లండన్ దాకా..
భైంసా(ముథోల్) : చదువుల తల్లి నిలయమైన ముథోల్ నియోజకవర్గంలో జానపద కళాకారులు ఎంతోమంది ఉన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి పాదాల చెంత పెరిగిన ఆష్టా గ్రామానికి చెందిన గంగా ధర్ జానపదంతో ప్రజలకు దగ్గరయ్యాడు. పుట్టిన ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ముథోల్‌లో ఇంటర్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే ముథోల్‌లోని గ్రామ సంస్థలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతూ బతుకుదెరువు కోసం అదే జిల్లాలో ఉండిపోయాడు. ఆ సమయంలోనే శిక్షణ పొందిన గంగాధర్ జానపదంలో రాణించాడు. నవరసాల జానపదంతో పల్లె ప్రజలను ఆకట్టుకున్నాడు. నగర బాటలో గళం విప్పి... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో నగర బాట కార్యక్రమాన్ని చేపట్టాడు. భైంసా పట్టణంలోనూ నిజామాబాద్‌లోనూ సీఎం చేపట్టిన నగర బాటలో గంగాధర్ జానపదాలు పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలపై గళం విప్పిన గంగాధర్‌కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటి నిజామాబాద్ కలెక్టర్ బీవీ రాయుడు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం జిల్లా కల్చరర్ కో ఆర్డినేటర్‌గా గంగాధర్ పనిచేస్తున్నాడు. ఊరిపేరే ఇంటి పేరుగా.. అబ్బోల్ల వీరి ఇంటిపేరు అయినప్పటికీ ఆ పేరుతో ఎవరూ గంగాధర్‌ను పిలువరు. పుట్టిపెరిగిన ఆష్టా గ్రామమే గంగాధర్‌కు ఇంటి పేరు అయ్యింది. ఇప్పటికీ ఎవరైనా ఆష్టా గంగాధర్ అనే ఈ కళాకారున్ని పిలుస్తారు. రేలారేరేలాలో రషీదు, గంగా, రాజేశ్, గోదావరి, పూజతోపాటు ఎంతో మందిని పరిచయం చేసింది ఆష్టా గంగాధరే. ఎంతో మంది కళాకారులను శిక్షణ ఇచ్చి వేదికల్లో పరిచయం చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గజ్జెకట్టి జానపదం పాడిన గంగాధర్‌ను గోరేటి వెంకన్నతోపాటు ఎంతోమంది అభినందించారు. వివిధ దేశాల్లో ప్రదర్శనలు.. కాళ్లకు గజ్జెలు కట్టి పల్లె పుట్టుకను జానపదంతో వివరించే గంగాధర్ ఆష్టా గ్రామం నుంచి లండన్ వరకు వెళ్లగలుగుతున్నాడు. అక్టోబర్‌లో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు లండన్ రావాలంటూ యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆష్టా గంగాధర్‌కు ఆహ్వానం కూడా అందింది. ఇప్పటివరకు దుబాయ్, మలేషియా, సింగపూర్ దేశాల్లోనూ నిర్వహించిన జానపద వేదికలపై ఈ కళాకారుడు పాల్గొని జానపదం వినిపించాడు. అమ్మ ఆశీస్సులతోనే.. చదువుల తల్లి సరస్వతీ అమ్మ ఆశీస్సులు నాపై దండిగా ఉన్నాయి. అమ్మదయతో నేను ఆష్టా నుంచి లండన్వరకు వెళ్లగలుగుతున్నా. పల్లెపుట్టిన సమయంలో జానపదం పుట్టింది. ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే జానపదం. జానపదమే ప్రజలకు ప్రాణప్రదమైంది. జానపద కళాకారుడిగా అభిమానిస్తున్న శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జానపదం నాకు జీవనోపాధిని చూపింది. నలుగురిలో గౌరవం పెంచింది. మున్ముందు ఎంతోమంది కళాకారులను పరిచయంచేసే గొప్ప అవకాశం నాకు సరస్వతీ అమ్మ కల్పించింది. స్వీయరచనలతో పాటలు రాసి రికార్డింగ్ కూడా చేశాను. నన్ను ఆదరిస్తున్న ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. -
‘కళ’గా బతికి...!
పూసిన జ్ఞాన వసంత గోపురం మోహన్ సుదీర్ఘ స్వప్న సంచారి కళాసాహిత్యాలే బతుకై బతుకే సాహిత్యమై బతికినవాడు తరగని మేధో గని కవులకు కళాకారులకు ఆశ్రయ నిధి (కార్టూనిస్టు మోహన్‌కి నివాళి) – గోరటి వెంకన్న -
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
9న విశాఖలో ప్రదానం ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాలాది జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా ఆవిష్కరించారు. ఈ నెల 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. -
నేడు ఏయూలో పీవీ స్మారకోపన్యాసం
-
నేడు ఏయూలో పీవీ స్మారకోపన్యాసం
గోరటి వెంకన్నకు ’లోక్‌నాయక్’ పురస్కార ప్రదానం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఐదవ స్మారకోపన్యాసాన్ని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఆర్ అంబేడ్కర్ హాలులో శనివారం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ’నాగరికత–సంస్కృతి–సమాజం’ అనే అంశంపై ప్రసంగిస్తారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభకు అధ్యక్షత వహిస్తారని, సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జ్యుడిషియల్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జస్టిస్ గోడె రఘురాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో అధిపతి దూపాటి విజయకుమార్‌లు పాల్గొంటారని చెప్పారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 13వ వార్షిక పురస్కార ప్రదాన కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ఏయూ అసెంబ్లీ హాల్లో జరుగుతుందని యార్లగడ్డ తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది గోరటి వెంకన్నకు ఈ పురస్కారానికి ఎంపిక చేశామని, అవార్డుతో పాటు రూ.లక్షా 50 వేల నగదును అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. -
కవిత చెలికాడు.. పాట విలుకాడు
విశ్లేషణ ‘‘వెంకన్న పాటను వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవించడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు. రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు. అక్షరాల కూర్పు అకారణంగా జరగదు. ఒక లక్ష్యం అంగాంగాన్ని విహంగం చేసి నప్పుడే అది సాధ్యమవుతుంది. ఉత్సాహం కళని తోడువేసుకుని మనిషిని ఉరకలేయి స్తుంది. అప్పుడు నిజమైన ఉద్యమం ఊపిరై శ్వాసిస్తుంది. నేడు అదే ధ్యాసలో నిమగ్నమై జీవిస్తున్నవాడు ప్రజాకవి ‘గోరటి వెంకన్న’. ప్రకృతి, పల్లె జీవితంలోని స్థితిగతుల్ని, మార్పుల్ని, వైరుధ్యాల్ని పాటల్లో చెబు తున్నాడు. తెలుగుపల్లె ప్రజల జీవనగాధలను తన సైద్ధాంతిక భూమిక మీద నిటారుగా నిలబడి ఆలపిస్తున్నాడు. ఈ ఆలాపన కూనిరాగం కాదు. ఒక మహోన్నత గర్జన. అతడే పాటకు పదనిసలు నేర్పించినట్టుంది. గజ్జెకు కాళ్ళను కట్టించినట్టు కనిపిస్తుంది. మహా కవి శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యశక్తితో ‘పల్లె కన్నీరు’ మీద పాట కట్టి జనసంతకం చేయించినట్టుంటుంది. అందుకే ‘కుబుసం’ దర్శకుడు ఎల్.శ్రీనా«ద్ వెంకన్న పాట కోసమే సినిమా తీశానన్నాడు. ‘‘వాడు మట్టికి మాటలు నేర్పిన వాగ్గేయకారుడు’’ అన్నారు జూలూరి గౌరీ శంకర్. ఏ కాలానికి చెందిన పదజాలాన్ని ఆ కాలం పాటలో అమరు స్తున్నాడు ఆయన. గల్లీని సిన్నది చేసి గరీబోల్ల కధను పెద్దది చేసి దీనజన పక్షం వహించాడు. అందుకే వర్తమానాన్ని నర్తింపజేసే ఆట గాడయ్యాడు వెంకన్న. అందుకే ‘‘వెంకన్న పాటలో పల్లె అందాలే కాదు. ప్రపంచ రాజకీయాలూ పలుకుతాయి’’ అంటారు ఓల్గా. బైరాగి ఆలాపన, తాత్వికుని తలంపులు, వాగ్గేయకారుల ఆగ్రహం వెంకన్న పల్లవిలో అమరిపోయి, చరణాలై చిందేస్తున్నాయి. నేడు అభినందనల పల్లకిలో ఊరేగుతున్నాయి. అనేక అవార్డులను అక్కున చేర్చుకొని సాఫల్య పురస్కారాలను సరసన చేర్చుకున్న వెంకన్నను నేడు ‘లోక్ నాయక్ పౌండేషన్’ పురస్కారం వరించింది. పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షు లుగా నిర్వహిస్తున్న ఈ సంస్ధ రెండు దశాబ్దాలుగా సాహితీ ప్రముఖు లకు ఘనసత్కారాలను అందిస్తూ వస్తోంది. ఆచార్య వైఎల్పి ‘సత్తా’ ఉంటే తప్ప ‘సానుభూతి’తో ఎవర్నీ గుర్తించరు. అందుకే ఆయన ఈ పురస్కారాన్ని తెలుగు జ్ఞానపీuŠ‡ అవార్డుగా ఖ్యాతికెక్కించగలిగారు. అలాంటి సత్కారమే నేడు వెంకన్నకు దక్కింది. సాహిత్యప్రక్రియల్లో కీలకస్థానాన్ని ఆక్రమించుకున్న ‘పాట’కు పాఠకుడు, శ్రోత, ప్రేక్షకుడు ముగ్గురు మిత్రులయితే .. పాటను పాడుతూ .. ఆడుతూ.. జనచైతన్యాన్ని సాధించిన గోరటి వెంకన్నకు మాత్రం లోకమంతా అభిమానులే అయ్యారు. ‘గోరటి’ పాటను సామాన్యులు విని, వీక్షించి ఆనందిస్తారు. పాలకులు తెలుసుకొని ఆలోచిస్తారు. ఉద్యమకారులు కెరటాలై కదంతొక్కుతూ ఉప్పొంగే తరంగాలవుతారు. అందుకే.. ‘‘వెంకన్న పాటను, వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవిం చడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు. రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు. వామపక్షం నుంచి దళితతత్త్వం వైపు పయనం సాగించాడు. అక్కడితో ఆగలేదు. ప్రపంచీకరణ పర్యవసానాల మీద గేయ చిత్రాలు గొంతెత్తి గీశాడు. ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘అలచంద్రవంక’, ‘పూసిన పువ్వు’ మెుదలైన ప్రచురణలను పాఠకలోకానికి అందించాడు. కొన్ని ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పటికే ప్రజల సినిమాలకు పాటలు రాశాడు. తెలిసినవారి కోసం తెరకెక్కాడు. నచ్చిన సినిమాకు నృత్యం చేశాడు. గోరటి వెంకన్న కవిత్వంలో... దోపిడీకి గురవుతున్న జనం ఆవేదనల్నీ, ఆత్మ స్థైర్యాల్నీ, అనుభూతుల్నీ, ఆవేశాల్నీ, ఆగ్రహాల్నీ, ఆనం దాల్నీ ఆయా దేశాల జానపదపాటలతో పోల్చి చూడాలని, ఆపై అతని ప్రతిభకి అక్షరరూపం ఇవ్వాలనే శివారెడ్డి వాఖ్య సమర్థనీయం. నాజర్, సుద్దాల హనుమంతు, గద్దర్, వంగపండు మెుదలయిన ప్రజావాగ్గేయకారులు జనజీవనానుభవాల్నీ వ్యక్తీకరించారు. వెంక న్నది అదే దారి అయినా కొన్ని ప్రత్యేక ఆకర్షణలను సాధించారు. సాంప్రదాయ భక్తి కవుల్లో, కీర్తన పదకవుల్లోని, శతక కవుల్లో గల ధిక్కారం, అవహేళన, అపహాస్యం వెంకన్న కవితలోనూ, గేయం లోనూ వున్నాయి. అంతకు మించి సాంçస్కృతికాంశాలు, ప్రకృతి పరమైన అంశాల మీద శ్రద్ధ కనబరిచారు. ఖాదర్ మెుహియుద్దీన్ మాటల్లో .. ‘‘గోరటి వెంకన్న కవిత్వం కేవలం మానవ కేంద్రం కాదు. ప్రధానంగా అది ప్రకృతి కేంద్రకం. మనిషి అశాశ్వతం, ప్రకృతి శాశ్వతం.’’ అందుకే వెంకన్న సాహిత్యంలో గ్రామీణ జనజీవన సౌందర్యం తేలియాడుతుంది. అందుకే గోరటి వెంకన్నను పర్యావ రణ జ్ఞానకవిగా వాస్తవీకరించారు విమర్శకుడు సీతారాం. ‘‘ఈ సమస్త ప్రకృతిని పర్యావరణ పరిరక్షణ కోణం నుంచి కాపాడేందుకు ఊగుతూ, ఊరేగుతూ, పాడుతూ, ఆడుతూ, ఎగురుతూ రంజింప జేస్తున్నాడు.’’అన్నారు. అందుకే యాకూబ్ కవి ‘‘వెంకన్న జీవించిన కాలంలో నేను కూడా జీవిస్తుండటం నేను చేసుకున్న గొప్ప అదృష్టం’’ అంటాడు. ‘‘వెంకన్న çహృదయ కవితానేత్రం దృష్టిలో పడని వస్తువులేదు..అతని గొంతులో పలికేSజీర లక్షలాది ప్రజల కన్నీటిధారలా అనిపిస్తుంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. వెంకన్న అక్షరాలు తూనీగల మేల్కొలుపులా ఉంటాయి. అతనికి పాట పూనకం, కవిత కలవరం, గేయమే అతని విజయం. తొలి సారిగా సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ ‘ననుగన్న నా తల్లి రాయలసీమ’ పాట సీమ ప్రజలను ఆకట్టుకున్న సంఘటన నన్నెంతో ఉత్తేజపరిచింది. సినిమా రంగం వెంకన్న పాట లను ఎంతగానో ఉపయోగించుకోవలసి ఉంది అన్నారు. గోరటి వెంకన్న ఆంధ్రనాట ‘అన్నపూర్ణమ్మ’నూ కీర్తించారు. గోదావరిని స్తుతించడమంటే అన్నపూర్ణమ్మను గుర్తు చేసుకోవడ మేనని భావించారు. ఆపై వానమ్మను కృష్ణమ్మ ఒడికి చేర్చాడు. ఇదే సందర్భంలో మూసీ నది దుస్థితిని పాలకులకు గుర్తు చేయటాన్ని తాను మర్చిపోనేలేదు. విశ్వరమణీయాల వింత జలచక్రం జీవితం అనే అతని ఆకాంక్షకు... పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయవలసిందే.(నేడు లోక్‌నాయక్ పౌండేషన్ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు ప్రదానం చేస్తున్న సందర్భంగా...) డాక్టర్ జీకేడీ ప్రసాద్ యూజీసీ పోస్ట్ డాక్టరల్ ఫెలో, జర్నలిజం విభాగం, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ‘ 93931 11740 -
డబ్బులు కాదు.. విలువలు పెంపొందించుకోవాలి
యువతకు గోరేటి వెంకన్న దిశానిర్దేశం ఘనంగా కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల ‘మైత్రీ మీట్’ న్యూశాయంపేట : ప్రేమ, దయ, కరుణ అనే మహోన్నత విలువలకు సమాజం దూరమవుతున్న ప్రస్తుత తరుణంలో.. వాటిని అందిపుచ్చుకోవడంపై యువత దృష్టిసారించాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న సూచించారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ‘మైత్రీ మీట్’ పేరిట ఫ్రెషర్స్ డే నిర్వహించారు. దీనికి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైత్రి అనేది మౌనంగా ఉంటుందని, మౌనంలో చాలా గొప్పశక్తి దాగి ఉంటుందన్నారు. డబ్బులు ఎలా సంపాదించాలనే విషయం కాకుండా, నిజాయితీగా జీవించడం ఎలాగో నేర్చుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. అనంతరం కార్యక్రమ గౌరవ అతిథి ప్రముఖ రచయిత్రి, ఆంధ్రాబ్యాంక్ సీనియర్ మేనేజర్ నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి అయిన ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. చదువుపైనే దృష్టిపెట్టి ఉన్నత శిఖిరాలను అధిరోహించాలన్నారు. అనంతరం గోరేటి వెంకన్న ఆటపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ గుండా హరినారాయణ, సెక్రెటరీ, కరస్పాండెంట్ మట్టెవాడ మాధవ్, ఎం.రవీందర్‌రెడ్డి, దయాకర్, ప్రిన్సిపాల్ మంజులా దేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరేటి వెంకన్నను కళాశాల యాజమాన్యం సన్మానించింది. -
గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం
-
గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు. -
ప్రజల వేదనలోంచే తెలంగాణ ఉద్యమం
-సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, -ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న వనపర్తి టౌన్ : కోట్లాది మంది ప్రజల వేదన, ఆత్మఘోష, ఆరణ్యరోదన, అంతులేని వివక్షలోంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించిందని సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నేతత్వంలో ‘పుడమి తల్లికి కష్ణ పుష్కర శోభ’పై జరిగిన జిల్లాస్థాయి కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో రతనాలు ఉన్నాయని, దాని ఫలాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం కషి చేయాలన్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు వరంగా మారనున్నాయన్నారు. అనంతరం వారిద్దరికీ మూడు తులాల బంగారు గండపిండేరంతో వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డిలను బంగారు ఉంగరాలు, మాజీ ఎమ్మెల్యే స్వర్థసుధాకర్‌రెడ్డి సహా కవితగానం చేసిన వందమంది కవులను ఘనంగా సన్మానించారు. -
కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది
One of the pleasant things in the world is going a journery; but I like to go by myself. I can enjoy society in a room; but out of doors, Nature is company enough for me. I am then never less alone than when alone. ‘ఆన్ గోయింగ్ ఎ జర్నీ’ గురించి విలియం హాజ్లిట్ చెప్పిన మాటలు గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. ‘‘ఏ బంధనాలూ లేకుండా తమ జీవితానుభవంతో లోకానికి మంచిని బోధిస్తూ తిరుగాడిన ఎందరో లోక సంచారులు... పోతులూరి వీరబ్రహ్మం, వేమన.. ముఖ్యంగా శైవదాసులు నాకు ఆదర్శం’’ అన్నాడు వెంకన్న. అదే తత్వానికి అద్దం పడుతూ రాసిన పాట ‘సంచారం’. ‘ఇల్లు పొల్లు లేని, ముల్లె మూట లేని...’ ఐహిక కౌటుంబిక లంపటాలూ, సిరిసంపదల వ్యామోహాలూ లేని సంచారమే ఆనందమంటాడందులో. ‘కిరీటమేమో భారమై ఉన్నది/ కిందేసితే నడక భలే ఉన్నది..’-- మతమూ, కులమూ, సంపదా, హోదా, కీర్తీ లాంటి వాటి వల్ల అహాన్ని పెంచుకుంటే, చివరకు ఆ అహ మే బరువైన కిరీటంగా మారి, గమనానికే ఆటంకమవుతుందని ధ్వనించాడు. ‘మంచుతో మెరిసేటీ కొండున్నది/ మిహ మల తొవ్వెంట సెవ్విన్నది/ కొంచెం ఎడం బోతే ఏదో మేలున్నది/ మురిపాల మెరుపులు అడ్డున్నవి/ దాటిపోతె నడకతీరె వేరున్నది’ అన్నాడు. ఇక్కడ ‘మంచుతో మెరిసే కొండ’ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతీకగా ప్రయోగించానని ఒక ఉపన్యాసంలో ఆయనే చెప్పాడు. పటాటోపాలనూ, ఆడంబ రాలనూ వదులుకున్నప్పుడే జీవిత వాస్తవాన్ని తెలుసుకోగలమనే భావాన్ని ‘పైవన్నీ వదులుకొమ్మన్నది/ పైరగాలి తడిపి పోతున్నది’ అని మార్మికంగా వ్యక్తం చేశాడు. పండిన జానపండు రుచికరంగానే ఉన్నా, దాని గింజ చేదుగా ఉంటుంది. ఆ చేదు గింజను కూడ నమిలే కొద్దీ తీపిని ఇస్తుందన్నాడు. సుఖాల వెనుక ఉండే కష్టాలకూ, ఆనందాల మరుగున దాగిన విషాదాలకూ ప్రతీక చేదుగింజ. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనేది భావం. ‘ఊరి ఊరికి దారులేరున్నవి/ ఊటలోలె బాటలొస్తున్నవి/ వింత వింత పూలు పూసున్నవి/ తోవ ఎంత నడిసిన వొడువకుంటున్నది’-- ఈ సంచారంలోనే వివిధ సిద్ధాంతాలూ, మార్గాలూ, లక్ష్యాలూ, వివిధ నాగరికతలూ, సంస్కృతులూ, వాటిలోని వైవిధ్యాలూ తెలుస్తుంటాయి. ఈ ‘తెలివిడి’ వల్లనే తనకు తెలిసింది చాల తక్కువనీ, తెలుసుకోవలసింది అంతులేనంత ఉన్నదనీ బోధపడుతుంది. ఈ లోకంలో తన అల్పత్వం పట్ల ‘ఎరుక’ కలుగుతుంది. ‘పండితులకూ కవులకూ దేశాటనం అనివార్యమైన విహిత ధర్మం. మానరానిదది. కీర్తి, ధనము మాత్రమే కాదు, అనేకాలు చూడ్డమూ, అనేకాలు వినడమూ, జ్ఞానం పరిణతం కావడమూ, ప్రతిభ నిశితం కావడమూ వంటి అనుభావాలు కలిగి, ప్రౌఢిమ అబ్బుతుంది’’ అన్నారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. ‘గాలిలో తేలాడే గద్దున్నది/ గగనమంచుల దాక పోతున్నది/ ఏటిలో గాలాడే చేపున్నది/ నీటిపాతి దాక ఈతున్నది’-- ఏ బంధాలూ, బంధనాలూ లేని గద్ద, నింగి అంచుల దాక విహరించ గలుగుతున్నదనీ, చేప నీటి అడుగు దాకా ఈద గలుగుతున్నదనీ, భూమ్యాకాశాల మధ్యన ఉన్న మనిషి మాత్రమే మోహపాశ బద్ధుడవుతున్నాడనీ సారాంశం. ‘సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి’ అనే చివరి పంక్తుల్లో rolling stone gathers no moss అన్న వాక్య భావం నిక్షిప్తం చేయబడింది. ఒక సందర్భంలో వెంకన్నే అన్నట్టు, సంచారమంటే ఒక్క కాళ్ళతో తిరగడమనే కాదు, చలనశీలమైన జగత్తులో చేసే నిరంతర ప్రయాణం, ఆలోచనల ప్రయాణం, ఆసక్తుల ప్రయాణం. పాటతో, పదముతో నిత్య పథికుడు గోరటి వెంకన్న. - పెన్నా శివరామకృష్ణ 9440437200 -
నన్ను పస్తుపెట్ట లేదు
అమ్మ జ్ఞాపకం మనిషి ప్రకృతికి దూరమవుతున్నాడు. మనిషి స్వచ్ఛత కోల్పోతున్నాడు, సహజత్వాన్ని కోల్పోతున్నాడు. కొన్నిసార్లు మనిషితనాన్నే కోల్పోతున్నాడు. కానీ... అమ్మ... తనలోని అమ్మతనాన్ని ఎప్పటికీ కోల్పోదు. అదే అమ్మతనంలోని గొప్పతనం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్ప కవికైనా అమ్మ గురించి పూర్తిగా చెప్పగలిగే పాండిత్యం ఉండదని నమ్ముతాను. తనకు తెలిసిన భాషలో, తెలిసిన పదాలతో, నేర్చుకున్న పాండిత్యంతో ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మప్రేమ గురించి చెప్పాలంటే ఏ పాండిత్యమూ చాలదు. వినమ్రంగా ఆమెకు తలవంచడం, ఆమె ఒళ్లో తలపెట్టుకుని ఆమె ఆత్మీయస్పర్శను ఆస్వాదించడమే. అమ్మ ప్రేమను కరువు తీరా ఆస్వాదించిన జీవితం నాది. అది అనిర్వచనీయమైన అనుభూతి. సంపదలో పుట్టి పెరిగిన చాలామందికి అందనంత ప్రేమను మా అమ్మ పేదరికంలోనూ పంచింది మా అమ్మ. పేదరికంలోనూ మమ్మల్ని గారాబంగా, సంస్కారం నేర్పించి పెంచింది మా అమ్మ. నా పాటల్లో సాగే లాలిత్యానికి, అనురాగానికి ప్రేరణ మా అమ్మే. ‘పురిటిలో నీ తనువు పచ్చి పుండయినా... నా ఆకలి పాల జున్నుకుండ’ వంటి ప్రయోగాలు చేయగలిగానంటే అమ్మ పంచిన ప్రేమతోనే సాధ్యమైంది. వెన్నెల్లో మచ్చ ఉంటుందేమో, నీటిలో నాచు ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వచ్ఛత మాత్రమే ఉంటుంది. పుడమి తల్లికి, కన్నతల్లికి మరేదీ సాటిరాదు. నేను తింటుంటే! మా అమ్మ ఇప్పటికీ మమ్మల్ని చంటిబిడ్డల్లాగానే అనుకుంటుంది. నేను అన్నం తిన్నంత సేపు నా ఎదురుగానే ఉంటుంది. తన కంటితో చూస్తే తప్ప నేను తృప్తిగా కడుపు నిండా తిన్నానని చెప్పినా ఆమెకు తృప్తి ఉండదు. ఆమె కంటితో చూస్తేనే సంతోషం. చిన్నప్పుడు మాకు జ్వరమొస్తే రాత్రంతా ఆమెకూ నిద్ర ఉండేది కాదు. జ్వరం తగ్గి మేము తిన్న తర్వాతనే ఆమె అన్నం తినేది. పంట గింజలు మాకు పెట్టి మా అమ్మానాన్న పరిగి గింజలతో కడుపు నింపుకునే వారు. డెబ్బైలలో వచ్చిన తీవ్రమైన కరువు రోజుల్లోనూ మమ్మల్ని పస్తు పెట్టలేదు. మా కడుపు నింపడానికి వాళ్లు కడుపు మాడ్చుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదంటే నమ్ముతారా? ఆమెకు బిడ్డలైన మమ్మల్నే కాదు ఎవరినీ పల్లెత్తు మాట అనే తత్వం కాదు. ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసి మేము తిరిగి బదులు చెప్పబోతే వారిస్తుంది. ‘రోజులు గడిస్తే ఏది నిజమో వారే తెలుసుకుంటారు. అప్పటి వరకు ఓపిక పట్ట’మని చెబుతుంది. ‘రోజులు గడిస్తే కాయ పండవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలె’ అంటుంది. ఆమెతో మాట్లాడుతుంటే సాహిత్యకారుల ప్రసంగం వింటున్నట్లు ఉంటుంది. తప్ప సాధారణ పల్లె మహిళ మాట్లాడినట్లు ఉండదు. చిన్నప్పుడు మంగళహారతులు, శ్రుతితో కూడిన పాటలు పాడిన అనుభవం ఆమెది. తన భావాన్ని ఎంత సున్నితంగా చక్కటి మాటలతో చెబుతుంది. తాత్విక మూర్తి! చేతిలో డబ్బు లేని రోజుల్లోనే కాదు, మేమిప్పుడు సంపాదిస్తున్న రోజుల్లోనూ తన కోసం ఏమీ కావాలనుకోదు. నేను డబ్బిచ్చినా కూడా ‘నాకెందుకు బిడ్డా డబ్బులు’ అంటుంది. హైదరాబాద్‌లో పెద్ద డాక్టర్‌కి చూపిస్తానంటే తెలకపల్లిలో ఆమె ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి దగ్గరే చూపించుకుంటుంది. జీవితం ప్రశాంతంగా, ఘర్షణలు లేకుండా జీవించాలనే సత్యాన్ని ఆమె ఆచరించి చూపించింది. నాకిప్పటికీ ఏ కష్టమొచ్చినా ఆమె దగ్గరకెళ్లి కూచుంటే... చల్లటి మాటలతో బాధను మైమరిపిస్తుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. చెబుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయి. ఆ ప్రేమ ఎప్పటికీ కావాలని గుండె ఆర్ద్రమవుతుంది. వెంకన్న సొంతూరు: మహబూబ్‌నగర్ జిల్లా, తెలకపల్లి మండలం, గౌరారం పుట్టింది: 1965,వైశాఖ పౌర్ణమి రోజు అమ్మ: ఈరమ్మ, నాన్న... నరసింహ చదువు: ఎంఎ తెలుగు లిటరేచర్ ఉద్యోగం: నాగర్‌కర్నూల్ కో ఆపరేటివ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తింపు: రచయిత, గాయకులు -
బతుకు..పూలపాట
-
బతుకు..పూలపాట
కనిపించని బాధలతో కన్నీరు పెట్టే పల్లెకు.. బతుకమ్మ పండుగ ఓదార్పునిస్తుంది. పట్నంలో క నుమరుగైన సంస్కృతిని బతుకమ్మ పండుగ ఏడాదికోసారి గుర్తుచేస్తుంది. జనపదాలలో ఎదిగిన జానపదుల బతుకమ్మ పాటలు తరాలు మారినా.. వనితల నాల్కలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి. ఉయ్యాలలో జోగుతున్న చరిత్రను ఉయ్యాల పాటలతో నిద్రలేపి తర్వాతి తరాలకు అందించిన ఘనత బతుకమ్మ పాటలది. వెన్నెల మకుటంతో సాగే పాటల వన్నె నేటికీ తగ్గలేదు. బతుకమ్మ పాటలు.. వాల్మీకికీఅందని రామాయణ ఘట్టాలు వినిపిస్తాయి.. వ్యాసుడు చెప్పని పురాణగాథలను వర్ణిస్తాయి. ఇక బతుకమ్మ ఆటలో లయబద్ధంగా సాగిన నాటి ఆడపడుచుల అడుగుల్లో.. నేటి ముదితలూ మురిపెంగా నడుస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆటపాటల్లో ఉన్న మహిళలను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా ప్రజాకవి గోరటి వెంకన్న పలకరించారు. గోరటి వెంకన్న: మనం బతుకుతూ అన్నింటినీ బతికించే సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ. ప్రకృతిలోని సమస్త జీవులనూ ప్రేమించి, ఆరాధించి వాటి మనుగడను కోరుకునే పండుగ ఇది. అమ్మవారిని పూలలో చూసుకునే పండుగ ఇది. స్త్రీలు.. పూలు ఒక్కటే. అగో.. అక్కడ అందంగా పేర్చిన బతుకమ్మలు ఎలాగున్నాయో.. ఇక్కడ అమ్మలు కూడా అలాగే ఉన్నారు. తెలంగాణ వచ్చాక, రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించాక ఎలా జరుపుకుంటున్నారు తల్లీ..? సావిత్రమ్మ: చాలా సంతోషంగా ఉంది. పిల్లలంతా చాలా ఘనంగా చేసుకుంటున్నారు. సులోచన: పదిహేనురోజులు సెలవులు ఇచ్చిండ్రు సార్. కానీ తొమ్మిదిరోజుల పండుగలా కూడా ప్రకటించాలి సార్. గోరటి వెంకన్న: అమ్మా.. కౌసల్యమ్మా! ఈ బతుకమ్మ ఎప్పటి పండుగమ్మా..? కౌసల్య: తరతరాల నుంచి చేసుకుంటున్నరు. మన పరిస్థితి మంచిగున్నా, లేకున్నా.. బతుకమ్మ పండుగొచ్చిందంటే రంగురంగుల పూలతో పండుగచేసుకునేటోళ్లం. గోరటి వెంకన్న: బతుకమ్మ పూల కోసం అప్పట్లో కొండలుగుట్టలు తిరిగి కట్ల పూలు, గునుగు పూలు, బంతులు, చేమంతులు అన్నింటినీ కోసుకుని తెచ్చుకునేటోళ్లు.. మరి ఇప్పడు ఏం చేస్తున్నారు? రేఖ: కొనుక్కుంటున్నం సార్ పద్మ: మా చిన్నప్పడు ఊళ్ల ఆడపిల్లలమంతా చెట్లంట, పుట్లెంట తిరిగి రకరకాల పూలు తెచ్చుకునేటోళ్లం. పూల కోసం చాలా తిరిగేటోళ్లం. సరిత: ఇప్పుడు ఏ పువ్వు కొనాలన్నా.. కిలో వంద రూపాయలకు తక్కువ లేదు. ఏం చేస్తం.. ప్రతి రోజూ బతుకమ్మ పేర్చాలంటే మార్కెట్వోయి పూలు కొనాల్సిందే. గోరటి వెంకన్న: ముఖ్యంగా ఏమేం పూలు వాడుతున్నరు తల్లీ..? కౌసల్య: తంగేడు పువ్వు, కట్ల పువ్వు, పార్వతీపరమేశ్వరుని పువ్వు, పుట్నం పువ్వు, గునుగు పువ్వు, గన్నేరు పువ్వు, ఉప్పు పువ్వు, అడవి చేమంతి, గుమ్మడి పువ్వు, బంతి పువ్వు.. ఇట్ల చానా పువ్వులను పెట్టేటోళ్లం. గిప్పుడు ఏవి దొరికితే గవ్వే.. గోరటి వెంకన్న: పూర్వం యోగులు, రుషులు చెట్లతో మాట్లాడేవారని మన పెద్దలు చెప్పేవాళ్లు. స్వయంగా మొక్కల దగ్గరికి వెళ్లి మీ చేతులతో పూలను కోసుకుంటే పొందే అనుభూతి మార్కెట్లోని పూలమ్మేవారితో బేరం చేస్తే రాదు కదా ! రేఖ: రాదు సార్. కానీ ఏం చేస్తం. మాకు అందుబాటులో ఉన్న పూలతోనే బతుకమ్మను అందంగా తయారుచేసుకుంటున్నాం. సరిత: పండుగ రాష్ట్ర పండుగయ్యింది కాబట్టి ఈ పూల పెంపకంపై కూడా దృష్టి పెట్టాలి. గోరటి వెంకన్న: అమ్మా.. సావిత్రమ్మా! మీరు.. మూడు రోజుల పాటు ఆపకుండా బతుకమ్మ పాట రూపంలో రామాయణం చెబుతారని విన్నాను. సావిత్రమ్మ: మేం ఆనాటి మనుషులం సార్. ఎంతసేపైనా ఆపకుండా పాట పాడతనే ఉంటం. గిప్పటి పిల్లలకు ఒక పాట పాడంగనే ఆయాసమొస్తది. గోరటి వెంకన్న: బతుకమ్మ పాటకు, ఆటకు ఒక లయ ఉంటుంది కదమ్మా.. ? కౌసల్య: అవును.. హైరానా పడకుండా పాడాలి. అందరి అడుగు ఒక్కలెక్కనే పడేలా ఆడాలి. మా చిన్నప్పుడు ఆపకుండా ఐదారు గంటలు ఆడేటోళ్లం. గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డల పండుగంటరు? పద్మ: అవును సార్. అన్నకు అక్కచెల్లెళ్లు గుర్తుకొచ్చేరోజు. బతుకమ్మ పండుగెప్పుడొస్తదా అని.. అత్తారింట్లున్న ఆడపిల్ల వెయ్యికళ్లతో ఎదురుచూసే పండుగ. ఇంటి ఆడపిల్లతో బతుకమ్మ పేర్చుకోవాలి. బతుకమ్మ పండుగప్పుడు అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలుపుతూ పాడే పాటలు కూడా చానా ఉంటయి. గోరటి వెంకన్న: ఎంత మంచి మాట చెప్పినవ్ తల్లీ.. బతుకమ్మ అంటే మన ఇంటి ఆడపిల్ల. ఆమె చల్లగ ఉండి, తన పుట్టింటి వారి క్షేమం కోరుకుంటూ బతుకమ్మకు మొక్కుకుంటే మనకు ఏ కష్టాలు రావు. అమ్మా.. బతుకమ్మ అలంకరణలో ముఖ్యమైనది తంగేడు పువ్వు. దాని గురించి చెప్పండి. సరిత: చాలా ముఖ్యమైనది సార్. కానీ ఆ పువ్వును కూడా కొంటున్నం. గోరటి వెంకన్న: హిమాలయాల్లో బ్రహ్మకమలం పువ్వుని పూజించినట్టు మన దగ్గర తంగేడు పువ్వుని పూజించే రోజు వస్తదంటరా? పద్మ: వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది. సులోచన: సార్.. ఇంకో ముఖ్యమైన విషయం. మా చిన్నప్పుడు బతుకమ్మలను చెరువులో వదిలి ఆ చెరువులో నీరు తాగి ఇంటికొచ్చేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. మంచినీళ్ల సంగతి పక్కన పెట్టండి. అసలు చెరువులే కానొస్తలేవు. గోరటి వెంకన్న: అవునమ్మా.. బతుకమ్మను మనం తయారుచేసుకోగలం. కానీ ఆ గంగమ్మని చేసుకోలేం. . అయినా ఊరికో చెరువులాగా మన పట్నంల కూడా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. సురేఖ: మన సిటీల ఏ చెరువులకు పోయిన మురుగునీరే సార్. నీళ్లల్ల దిగేటట్టే లేదు. గోరటి వెంకన్న: ఇప్పుడైనా అంతే తల్లీ.. రాష్ట్ర పండుగైన బతుకమ్మ మన దేశ పండుగలా చేసుకోవాలి. ప్రాంతాలు, జాతులకు అతీతంగా పూలను ఆరాధించే పండుగగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనదే. గోరటి వెంకన్న: బొడ్డెమ్మ పాటలు ఎవరికన్నా వచ్చామ్మా. రేఖ: అందరికీ వస్తయి సార్. గోరటి వెంకన్న: ఏదీ.. ఒక పాట పాడు తల్లీ. రేఖ: బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో... ఇట్ల చానా పెద్దగ ఉంటది సార్. గోరటి వెంకన్న: ఎంత అందమైన, అద్భుతమైన సాహిత్యమో చూడండి. బిడ్డ దగ్గర మొదలుపెడితే ఎక్కడికో వెళ్లింది. బతుకమ్మ పాటలంటే.. మన బతుకు పాటలు. కౌసల్య: మొత్తం నాలుగు రకాలుగా బతుకమ్మ పాటలుంటయి. ఉయ్యాలో, రామ, వెన్నెల, చందమామ.. ఇట్ల ముగింపు పదాలతో చరిత్రను చెబుతాయి. పురాణాలు చెబుతాయి. ఏ విషయానైన్నా చెప్పొచ్చు. సావిత్రమ్మ: పదాలకంటే పాట బలమైంది. అందులోనూ బతుకమ్మ పాటకుండే ప్రత్యేకత చాలా గొప్పది. ఈ పాట రూపంలో చెప్పిన ఏ విషయమైనా వినడానికి ఇంపుగా ఉంటుంది. గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగప్పుడు చేసే ఫలహారాల గురించి చెప్పండి తల్లీ. సులోచన: కుడుములు, గుడాలు, మలిదలు, సద్దులు, పెరుగన్నం.. రకరకాలు కౌసల్య: ఒక్కొక్క తాన ఒక్కోతీరు ఉంటయి సార్. నైవేద్యాలు ఎవరిష్టమున్నట్టు వారు పెట్టుకుంటరు. మా చిన్నప్పుడైతే పచ్చొడ్లు, జొన్నలు, తైదలు దంచుకుని నైవేద్యం తయారు చేసేటోళ్లు. అప్పట్ల బతుకే బతుకమ్మ అన్నట్లు ఉండేది సార్. బతుకమ్మ కారు విలక్షణమైన కార్ల రూపకర్త, గిన్నిస్ రికార్డు గ్రహీత సుధాకర్ తాజాగా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ ఆకారంలో కారును జీహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది అడుగుల వ్యాసం, పదమూడు అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ మూడు చక్రాల కారు 150 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బతుకమ్మ కారులో రెడ్‌లైట్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. సుధాకర్ ఇంతకుముందు వినాయకుడి ఆకారంలో కూడా ఒక కారు రూపొందించారు. -బహదూర్‌పురా -
‘అరుణోదయ’ మహాసభలకు సర్వం సిద్ధం
ప్రజాపోరాట, విప్లవ కళా సంస్కృతిని పాదుకొల్పే లక్ష్యంతో పురుడు పోసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు నగరం ముస్తాబైంది. 1980లో ఒంగోలులో మొదటి మహాసభలు నిర్వహించగా సరిగ్గా 34 ఏళ్ల తరువాత శనివారం మళ్లీ ఆ కళా వైభవం సాక్షాత్కరించనుంది. వెయ్యి మంది కళాకారులు గజ్జకట్టి ఆడి, గళమెత్తి పాడి తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. ఒంగోలు టౌన్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. 34 ఏళ్ల తర్వాత మరోసారి మహాసభలకు జిల్లా కేంద్రం వేదికైంది. శని, ఆదివారాల్లో మహాసభలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది కళాకారులు హాజరు కానున్నారు. మహాసభలను విజయవంతం చేసేందుకు కొన్ని రోజుల నుంచి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. విప్లవ కళా సంస్కృతులతో పురుడు బూర్జువా, భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతిని ధ్వంసం చేసి ప్రజాపోరాట సంస్కృతిని, విప్లవ కళా సంస్కృతులను నెలకొల్పాలనే లక్ష్యంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా పోరాటాలు పెల్లుబుకుతున్న 70వ దశకంలో ఉస్మానియా ఇంజినీరింగ్ విద్యార్థి జంపాల చంద్రశేఖరరావు చొరవతో 1974లో అరుణోదయ మొగ్గ తొడిగింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన సంస్థ కార్యకలాపాలు క్రమేణా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. 1980లో ఒంగోలులో ప్రథమ మహాసభ జరుపుకొని రాష్ట్ర స్థాయి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొంది. దేశంలో, రాష్ట్రంలో అనేక కళా సంస్థలు ఉన్నా చారిత్రక అవసరాల రీత్యా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. ప్రపంచ పురోగతి.. శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఉందని నమ్మింది. సకల సంపదలే కాకుండా సమస్త కళలు, సంస్కృతి శ్రమ నుంచే పుట్టాయని ఎరిగింది. ప్రజాకళారూపాలైన బుర్రకథ, హరికథ, జముకుల కథ, ఒగ్గుకథ, వీధి భాగోతం, నాటిక, నాటకం, నృత్యరూపకం తదితర ప్రజాకళారూపాలను ఆయుధంగా మలచుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వస్తోంది. గజ్జతో ఆడటం.. గళంతో పాడటం.. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గజ్జ కట్టి ఆడటం.. గళం విప్పి పాడటం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. కళ.. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కళల్ని ప్రజాపథం చేసిన గరికపాటి రాజారావు మొదలు, తన పెన్నూ గన్నూ పీడిత ప్రజల కోసం అంకితం చేసిన సుబ్బారావు పాణిగ్రాహి వరకు అనేక మంది కవులు, కళాకారులు చేసిన పోరాటాలు, త్యాగాలను కళారూపాల ద్వారా ప్రదర్శించి వారి ఆశయాలు, భవిష్యత్ పోరాటాలను మరింత పట్టుదలగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు తీసుకెళ్తోంది. నేడు కళాకారుల మహా ప్రదర్శన : తొలిరోజైన శనివారం ఒంగోలులో కళాకారుల మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. స్థానిక ఏబీఎం కాలేజీ నుంచి హెచ్‌సీఎం కాలేజీ వరకు మహా ప్రదర్శన జరగనుంది. అనంతరం హెచ్‌సీఎం కాలేజీ గ్రౌండ్‌లోని డాక్టర్ గాండ్ల వెంకట్రావు నగర్లో బహిరంగ సభ జరగనుంది. సభలో సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గోరేటి వెంకన్న, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు ప్రతినిధుల సభ స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్లో ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది. ప్రముఖ సంపాదకులు సతీష్‌చందర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచీకరణ, సాంస్కృతికోద్యమం గురించి ప్రముఖ కళాకారుడు, రచయిత శక్తి ప్రసంగించనున్నారు. విప్లవ సాంస్కృతికోద్యమంపై ప్రజా రచయిత, కవి ఎన్.తిర్మల్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల నూతన కా ర్యవర్గాలను ఎన్నుకోనున్నారు. -
ఆర్పీ పట్నయక్,గోరటి వెంకన్నతో చిట్ చాట్
-
చూపున్న పాట
-
నా తెలంగాణ స్వచ్ఛంగా.. పాటలా.. తేటగా..
నవ తెలంగాణ: పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో.. కనిపించని కుట్రల.. అని గ్రామాల్లో జరుగుతున్న దుర్మార్గాలను, కనుమరుగు అవుతున్న పల్లె సంస్కృతిని చూసి బాధతో గొంతు పెకిలించినోడు ప్రజాకవి గోరటి వెంకన్న. తన గొంతు నుంచి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. గోరటి పాటలను భుజాన వేసుకుని జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు.. వేలల్లో ఉన్నారు.అలాంటి వెంకన్న.. నవ తెలంగాణ నిర్మాణంపై కోన సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రజల కల సాకారమైంది. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. ఇక కొత్త రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ పునర్నిర్మాణం జరగాలి. గ్రామీణ సంప్రదాయ కళా ైవె భవాలకు పునర్వైభవం తీసుకురావాలి. సెజ్‌ల పేరుతో తెలంగాణ గడ్డన భూములకు పడ్డ కంచెలు తొలగిపోవాలి. వివక్షకు అసలు కారణం భూమే కాబట్టి ఎవరికీ 20 ఎకరాలకు మించి ఉండకూడదు. భూమిలేనివారందరికీ ప్రభుత్వ భూమి ఇవ్వాలి. ప్రభుత్వమే చెరువులు తవ్వించాలి. అవసరం అనుకుంటే బోర్లు వేయించాలి. నీటి యాజమాన్యం పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి. అభివృద్ధి దిశగా ఆలోచించాలి. రెండు జీవనదుల మధ్యనున్న గడ్డ తెలంగాణ. సంపూర్ణంగా నీరు రావాలి. పెట్టుబడుల్లేని వ్యవసాయం, నీటి వాడకం తక్కువగా ఉన్న పంటలు రావాలి. పంటలు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలు ఈ రోజు నుంచి కొత్త తెలంగాణ రాష్ట్రం కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. లంచం తీసుకోబోమని, అవినీతి జోలికి వెళ్లబోమని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేయాలి. ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలి. అధికారులు అలసత్వం వీడాలి. తెలంగాణ స్వచ్ఛంగా, సంపూర్ణంగా ఉండాలి. పల్లెల బాగు కోసం.. సరళీకరణ ఆర్థిక విధానాలతో పల్లెల్లో చాలా మార్పులు వచ్చాయి. ఊహించని సదుపాయాలతోపాటు రాజకీయ దళారీ వ్యవస్థలూ వచ్చి చేరాయి. పల్లెలు బాగుపడాలంటే ఆదర్శవంతమైన ఉద్యమాలు రావాలి. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం మద్య నిషేధం చేయడంతోపాటు ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి. ప్రజలను పిప్పిచేస్తున్న వైద్య, విద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. పోలీసులు సోషల్ వర్కర్ల లాగా పనిచేయాలి. కుల వృత్తులను ఆధునికీకరించాలి. అప్పుడే తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి సిరిమల్లెచెట్లు మొలకెత్తుతాయి. విడిపోయిన మనమొక్కటే.. తెలంగాణ అంటే కరువు..కన్నీళ్లే. నీరు, కొలువుల విషయంలో బాగా అన్యాయం జరిగింది. ఇప్పుడు విడిపోయినా మంచిగానే విడిపోవాలి. భౌగోళికంగానే విడిపోతున్నాం తప్ప మన సంస్కృతి, జాతి ఒక్కటే కదా. ఇక సాంస్కృతికంగా తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. వలసవాదులు మొదట తెలంగాణ భాషపైనా, ఈ ప్రాంతపు సొగసులపైనా పడ్డారు. కళను మార్కెట్ చేసుకుని ఆ తర్వాత అందమైన తెలంగాణ సృజనాత్మకతను మింగేశారు. అందుకే.. ఆ పాట రాశా ఎందరో వలసవాద రాజకీయనేతలు, పెట్టుబడిదారులు ఇక్కడి వందలాది ఎకరాల పచ్చటి నేలను ఆక్రమించేశారు. ఉద్యోగాలను కొల్లగొట్టారు. మా తెలంగాణ బిడ్డలు యాడికిపోవాలి. వందలాది మంది మిసమిసలాడే మీసకట్టు కలిగిన యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు విడుస్తుంటే ఏమీ ఎరగని వారిలాగా ఆంధ్రావాళ్లు ఉంటే మాకు మండదా. అందుకే కడుపు మండి ‘పొమ్మంటే పోవేందిర ఓ ఆంధ్ర దొర’ అనే పాట రాశా. ఏ ఉద్యమానికైనా పాటే ఊపిరి పాటలేని ఉద్యమాన్ని ఊహించుకోలేం. ఆఫ్రికా జాతి ఉద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రజల పక్షాన నిలిచింది పాటే. ప్రగతీ శీల ఉద్యమాలకు ముందే పాట ఉంది. హింసకు, పెత్తనానికి, బాంచన్ దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పాటను ఆయుధంగా చేసుకున్నారు. ఆనందం, బాధ కలిగినప్పుడు పాట దానంతట అదే పుట్టుకొస్తుంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు పాట అనేకరకాలుగా దోహదం చేసింది. కోస్తాలో పౌరాణిక నాటకం, రాయలసీమలో తత్వ పద్యం, తెలంగాణలో జానపద పాటలు.. మూడు ప్రాంతాల్లో మూడు రకాలు. పల్లెనుంచి వచ్చాను కాబట్టే ఆ వాసన మాది మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని గౌరారం. మధ్యతరగతి కుటుంబం. నాలుగో తరగతి నుంచి పది వరకు రఘుపతిపేటలో, ఇంటర్ కల్వకుర్తిలో చదివాను. తల్లి ఈరమ్మ, తండ్రి నర్సింహ. టీచరు వెంకటరెడ్డి ప్రభావంతో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు కొంతకాలం మొగ్గాను. మా ఊరంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందరూ ఒకే కులంగా కలిసిమెలసి బతికేవారు. పల్లె నుంచి వచ్చిన వాణ్ణి కనుక నా పాటలో పల్లె వాసన ఉంటుంది. నిజాం రాక్షసత్వం, ప్రపంచీకరణ పరిస్థితులు చూశాను. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వామపక్షనేతల్ని, సర్వోదయ ఉద్యమాల్ని గమనించాను. దీంతో మనుషులంతా సమానం అన్న అభ్యుదయం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. 1985-86లో నీ పాట ఏమాయెరో అనే పాట రాశాను. సోషలిజం, సమానత్వం, సాటి మనిషికి సాయం చేయాలనేదే ఇప్పటికీ నా ఆలోచన. ఆ పార్టీ రాకముందే అన్యాయంపై పాటరాశా తెలంగాణపై మొత్తంగా 22పాటలు రాశా. సందర్భోచితంగా పాడినవి మరికొన్ని ఉన్నాయి. ‘రేలదూల తాలెల్లాడే తెలంగాణ నే’, తల్లి తెలంగాణ , ఎలమంద ఎలమంద, కంపతారు చెట్లు...ఇలా ఎన్నో రాశాను. పారుతున్న నదీజలాల పంపకంలో జరిగిన అన్యాయానికి మొగ్గతొడిగిన ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ రాకముందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పాట రాశా. బషీర్‌బాగ్ కాల్పులపై 12 పాటలు రాశాను. అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి ముందుగా వారి కుటుం బాలు బాగుపడాలి. ఇకనుంచి తెలుగు ప్రజల దుఃఖం గురించి పాడతా. వైఎస్ అభినందించారు నేను రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాట రాష్ట్రంలో ఓ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైందని చాలామంది అంటుంటారు. నిజానికి నాకైతే ఆ విషయం తెలియదు. 1996-97లో రాసిన ఆ పాటను ‘కుబుసం’ సినిమాలో వాడుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు ‘పార్టీ’ వాళ్లు ప్రకటనగా వాడుకున్నారు. అది అలా దోహదకారిగా అయిందని చాలామంది అప్పట్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడో రోజే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను, మరికొందరిని పిలిపించి అభినందించారు. నా ఊరే ప్రేరణ.. 1996-97లో ‘పల్లె కన్నీరు పెడుతుందో...’ అనే పాట రాశాను. దీనికి ప్రేరణ నా ఊరే. సంస్కరణల ప్రభావంతో ఊళ్ల నుంచి వలసలు మొదలైన కాలం. ప్రతి ఏటా మా ఊళ్లో మొహర్రం బాగా జరుగుతుంది. అలాంటిది ఆ ఏడాది మా ఊరికి పోతే ఊళ్లో జనాలే లేరు. రైతుల వ్యధలు, పల్లె ఉనికి కోల్పోతున్న వైనం నన్ను కదిలించింది. అదేపాటగా మారింది. ఆధునికతకు దూరమవుతున్న మనుషుల గురించి రాశాను. ఏ ఊళ్లో చూసినా కలవృత్తులు మూలనపడ్డాయి. ఒక సంవత్సర కాలం పట్టిందీ పాటకు. బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో నేనీ పాటను రాశా. -
తరమెల్లిపోతున్నదో...
ఈ రోజుల్లో వైద్య వృత్తి అన్నింటికన్నా ఆకర్షణీయమైన, ధనార్జనకు అవకాశమున్న రంగం. ైవైద్యో నారాయణో హరి అని ప్రసిద్ధిచెందిన వైద్యవృత్తి నేడు వ్యాపారంగా మారింది. వైద్య వృత్తి డాక్టర్‌కు స్టెతస్కోపును మాత్రమే కాదు, టెలి స్కోపును కూడా ఇస్తుంది. కొందరు గుండె చప్పుడే వింటారు. కొందరు టెలిస్కోపుతో సమాజం గుండె చప్పుడు కూడా వింటారు. కొందరు రోగ పరీక్షకే పరిమితమవుతారు. మరికొం దరు సమాజాన్ని పీడిస్తున్న రోగాల మూలాలను నిర్ధారిస్తారు. కొందరు వైద్యులు రోగానికే మందిస్తే, ఇంకొందరు ఆ రోగానికి కారణాలపైన దృష్టి పెడతారు. కొందరు వైద్యలు హాస్పిటల్‌కే పరిమితమైతే మరి కొందరు యావత్ ప్రపంచానికి అంకితమవుతారు. అలాంటి వైద్యల వల్లే ఆ వృత్తి నేటికీ గౌరవనీయమైన వృత్తిగా, మానవత్వం కలిగిన గొప్ప వృత్తిగా ఉంటోంది. తెలంగాణ సాయుధ పోరాట ప్రేరణ పొందిన పలువురు డాక్టర్లు తెలంగాణ మారుమూల గ్రామాలకు వెళ్లారు. ప్రజలకు వైద్య సేవలందించే ప్రజా వైద్యశాలలయ్యారు. అలాంటి వారిలో యలమంచిలి రాధాకృష్ణమూర్తి, ఏపీ విఠల్ లాంటి వాళ్లు కొందరు. 1952లో వైఆర్కే డాక్టర్‌గా ఖమ్మం జిల్లాకు చేరి, ప్రజానాయకునిగా కన్నుమూశాడు. ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ తిరిగిన ప్రజా వైద్యుడయ్యాడు. రోగుల నాడితో పాటూ జనం నాడి కూడా చూశాడు. ప్రజా కెరటం ఎంతగా ఎదిగి వస్తే తను కూడా అంత ఉద్యమంగా లేచాడు. అందుకే ఆయన మరణం తర్వాత అంతిమయాత్రకు బోరున కురిసే వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో జనం హాజరై జోహార్లు అర్పించారు. డాక్టర్‌గా రోగ నిర్ధారణ చేసినట్టే సామాజిక రుగ్మతలపై నిర్భయంగా రోగ నిర్ధారణ చేసి, ఉద్యమాల ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చాడు. 1975-77 మధ్య కాలం నాటి ఎమర్జెన్సీని ధిక్కరించి నిలబడ్డవాళ్లు చాలా తక్కువ మంది. వారిలో చాలా మందితో పాటూ యలమంచలి కూడా జైలుకు వెళ్లాడు. రాజ్యసభ సభ్యత్వాన్ని వైఆర్కే తన ఎదుగుదలకు సోపానం అనుకోలేదు. ప్రజల గొంతుకను వినిపించే అవకాశంగా చూశారు. ప్రపంచీకరణ దేశ దేశాల ప్రభుత్వాలతోపాటూ, సకల రంగాలను ధ్వంసం చేస్తోంది. బహుళజాతి కంపెనీలు వైద్యరంగాన్ని వ్యాపారమయం చేశాయి. ఈ వైనాన్ని వైఆర్కే తన రచనల ద్వారా తెలిపారు. పరిశోధన సామాన్యునికి అండగా ఉండటానికి బదులుగా కొత్త రోగాలకు కారణభూమవుతున్నదని లెక్కలతో సహా విప్పి చెప్పారు. పార్లమెంటులోని ప్రజాప్రతినిధులు రాధాకృష్ణలాగా ఉద్యమాలలో తడిసినవాళ్లు కావాలి. గొప్ప అధ్యయనశీలి. ప్రజావైద్యుడు. సామాజిక స్పృహ గలవాడు అయిన వైఆర్కే ఎప్పుడూ ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన వినయంగా నిలిచినవాడు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యల పట్ల ఎలా ఉండాలనేదానికి, జనం పట్ల ఎంత వినయంగా ఉండాలనే దానికి వైఆర్కే నమూనా. ప్రజల కోసం పని చేసిన వారు మరణించటం సమాజానికి తీరని లోటే. సీపీఎం నేత, ప్రజల డాక్టరు, ప్రజా వైద్యశాలకు శ్రీకారం చుట్టినవాడు అయిన వైఆర్‌కె మరణవార్త కలచివేసింది. ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఎమర్జెన్సీ నిర్బంధపు రోజులను ధిక్కరించిన ఆయన ధైర్యం, తాను నమ్ముకున్న సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి ఉన్న నిబద్ధత, ఎదుటివారిని పలకరించేటప్పుడు గుండెలకు హత్తుకునే ఆప్యాయత ఎన్నటికీ మరిచిపోలేం. వైఆర్కే చనిపోగానే ఆ పాత తరాని కుండే ఉద్యమ విలువలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పాత తరం ఉద్యమ విలువలను ‘‘తరమెల్లిపోతున్నదో... ఆ త్యాగాల స్వరమణిగిపోతున్నదో’’ అంటూ మా గోరటి వెంకన్న గొప్పగా తన పాటలో పొదిగాడు. తెలంగాణ సాయుధ పోరు వారసులను కీర్తిం చాడు. డాక్టర్‌కు గుండెజబ్బు వస్తే దాని తీవ్రతను ఊరికే పసిగట్టగలుగుతాడు. అందుకే ఆయన మరణానికి ముందు ‘‘చనిపోయిన తర్వాత నన్ను ఎక్కువ సేపు ఉంచకండి. రెండు మూడు గంటల్లో నా దేహాన్ని తీసేయండి. ఏ రకమైన హంగులు లేకుండానే అంతిమయాత్రను ముగించండి’’ అని సూచించారు. ఆయనకు నా జోహార్లు. - చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ