‘సంక్రాంతి అంటే అదే’ | Sankranthi festival celebration | Sakshi
Sakshi News home page

కలాల క్రాంతి

Published Tue, Jan 15 2019 1:10 AM | Last Updated on Tue, Jan 15 2019 8:17 AM

Sankranthi festival celebration - Sakshi

సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి.

స్వాగతం
మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే  పలుకు తీయని స్వాగతం 
పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే  దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం.


రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం.
– సుద్దాల అశోక్‌తేజ

సమైక్య క్రాంతి
పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్‌ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి.


ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్‌ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి.

ఎలక్ట్రికల్‌ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). 
– సిరివెన్నెల

అందుకే ఈ పండగంటే ఇష్టం
సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం.


కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా  దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు.
– గోరటి వెంకన్న, కవి

అలా రెండు సంక్రాంతులు గడిచాయి  
సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్‌ ఫేవరేట్‌ ప్లేస్‌ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను.

ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు  నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి.


విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్‌. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక  ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్‌. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది.
– శ్రీమణి

ఇది కర్షకుల పండగ
పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. 


– రామజోగయ్య శాస్త్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement