srimani
-
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
పదేళ్ల కల నెరవేరింది
ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఏడడుగులు వేశారు. వారిది ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని శ్రీమణి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూశాం.. మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు శ్రీమణి. ఆయన ట్వీట్‌కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ, ‘శ్రీమణీ.. నీ రొమాంటిక్ లిరిక్స్ వెనక ఉన్న సీక్రెట్ ఇప్పుడు అర్థం అయ్యింది. ‘ఇష్క్ షిఫాయా’ అని పాడి, ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి, ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. హ్యాపీ మ్యూజికల్ మ్యారీడ్ లైఫ్’ అని పోస్ట్ చేశారు. -
‘సంక్రాంతి అంటే అదే’
సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. స్వాగతం మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం. రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం. – సుద్దాల అశోక్‌తేజ సమైక్య క్రాంతి పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి. ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి. ఎలక్ట్రికల్ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). – సిరివెన్నెల అందుకే ఈ పండగంటే ఇష్టం సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం. కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు. – గోరటి వెంకన్న, కవి అలా రెండు సంక్రాంతులు గడిచాయి సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్ ఫేవరేట్ ప్లేస్ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి. విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది. – శ్రీమణి ఇది కర్షకుల పండగ పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. – రామజోగయ్య శాస్త్రి -
ఎంత ఎత్తుకి ఎదిగినా... మూలాలే ఆధారం!
పాటతత్వం త్రివిక్రమ్‌గారితో సినిమా అంటే ఓ మంచి పుస్తకం చదివినట్లే. అలాంటిది ఆయనతో ‘జులాయి’ చిత్రం తర్వాత రెండో సారి పనిచేసే అవకాశం వచ్చింది. అదే ‘అత్తారింటికి దారేది’. పవన్‌కల్యాణ్ గారు హీరో అనగానే నాకు కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాకి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నాకు హీరో పరిచయ గీతం రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌గారు ఆల్రెడీ ట్యూన్ కూడా ఇచ్చేశారు. నేనిక పాట రాయడమే ఆలస్యం. ఫస్ట్ వెర్షన్ రాసుకెళ్లా. ఎందుకో త్రివిక్రమ్‌గారికి నచ్చలేదు. అలా ప్రతి రోజు రెండు మూడు వెర్షన్లు రాసుకెళ్లా. ఈ పాటలోని మొదటి రెండు లైన్లకే పది రోజులు టైమ్ పట్టేసింది. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లడంతో కొన్నాళ్లు నా మకాం చెన్నైకి మారింది. త్రివిక్రమ్‌గారు అందుబాటులో లేకపోతే అందులో కొన్ని లైన్లు దేవిశ్రీ ప్రసాద్‌గారు ఓకే చేశారు. ఇలా ఏకంగా ఒక్క పాట కోసమే 45 రోజులు టైం తీసుకున్నా. గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలిమబ్బు కోసం/ తరలింది తనకు తానే ఆకాశం పరదేశం/శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్కకోసం /విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం.. సిరి సంపదలున్నా, పేరు ప్రతిష్ఠలున్నా మన సంతోషాన్ని, బాధనీ పంచుకునే సొంతవాళ్లు దగ్గర లేనప్పుడు ఆ లేమిని తూకం వెయ్యలేం. కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ఇల్లు తాను చేసిన చిన్న పొరపాటు వల్ల వెలవెలబోతుంది. వారసుడిగా తాత సంపదనే కాకుండా బాధను కూడా పంచుకున్న ఆ కథానాయకుడు ఆ సిరిని మళ్లీ తిరిగి తీసుకొస్తానని బయలుదేరే సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. ఒక వ్యక్తి తాలూకు బాధని, గుండెలోతుని ప్రతిబింబించే విధంగా ఉన్న ఆ రెండు వాక్యాల్లో బోల్డెంత ఫిలాసఫీ కూడా ఉంది. ఇది త్రివిక్రమ్‌గారి తాత్వికత లేక సందర్భంలోని గాఢతో తెలియదుగానీ ఈ పాట రాయడానికి ఆయన చెప్పిన రెండు పిట్ట కథలే మూలం అని చెప్పొచ్చు. - ఒక చెట్టుపై ఓ పక్షి గూడుపెట్టుకుంది. కొంతకాలానికి ఆ పక్షి వలస వెళ్లిపోయింది. అలా వెళ్లి తిరిగిరాని పక్షి కోసం చెట్టు కదిలి వెళితే... - ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. అలా వెళ్లిపోయిన మబ్బు కోసం ఆకాశమే తరలి వెళితే... ఇవి మన నిత్యజీవితంలో జరిగే సన్నివేశాలే... మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విలువైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పక్కన ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. దూరం అయ్యాక అవి దొరికే అవకాశం ఉండదు. మనిషి ఎప్పుడూ ఈ రెండు సంఘటనల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అలా కోల్పోయిన అతి విలువైన వస్తువుల్ని తిరిగి పొందడం కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. సరిగ్గా అలాంటిదే ఈ సందర్భం కూడా. ‘అత్తారింటికి దారే ది’ సినిమాలో మొదటి పాటగా ఈ సందర్భోచితమైన పాట పెట్టడం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. ఆ తర్వాత పల్లవిగా మొదలయ్యే భైరవుడో, భార్గవుడో వాక్యాలు సినిమాలో కథానాయకుడి తదుపరి పరిణామ క్రమాన్ని ఊహిస్తున్నట్టుగా ఉన్నా ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు’ అనే పల్లవి ముగింపు పదాలతో వీడు అనుకున్నది సాధిస్తాడని చెప్పకనే చెబుతుంటాయి. ఈ పాట రాసేటప్పుడే హీరో పవ న్కల్యాణ్గారి ఇమేజ్‌నీ, త్రివిక్ర మ్గారి స్టాండర్డ్స్నీ హృదయంలో పెట్టుకుని మరీ రాశాను. మొదటి చరణంలో ‘దివినుంచి భువిపైకి భగభగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు’ లాంటి వాక్యాల ద్వారా కథనాయకుని గుణగణాలను వివరిస్తే, ‘శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు’ వాక్యాన్ని అతని మానసిక సంఘర్షణకి అద్దం పట్టేలా రాశాను. దీని ద్వారా సామాన్యులందరికీ ఆ భావం అర్థమయ్యేటట్లు, తమను తాము ఆ పాత్రలో ఊహించుకోవడానికి అవకాశం దొరికి నట్టైంది. తదుపరి చరణంలో ‘తన మొదలే వదులుకుని పెకైదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు.. తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి తన తూరుపు పరిచయమే చేస్తాడు’ వాక్యాల ద్వారా మనం ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదనీ, మనం ఎంత ప్రకాశిస్తున్నా ఆ వెలుగుకు కారణాన్ని మర్చిపోకూడదన్న గొప్ప సందేశంతో ఈ పాటను ముగించడం జరిగింది. సినిమాలో మొదట వచ్చే పాటైనా సరే, అన్ని పాటలకన్నా చివరిగా రికార్డ్ చేసిన పాట ఇదే. ఎన్నో ప్రశంసలను అందించిందీ పాట. ఒక వ్యక్తికే పరిమితం కాకుండా మొత్తం అందరికీ ఉపయోగపడే భావావేశం నింపడం వల్ల పవన్‌కల్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో పై ఈ పాటను చిత్రీకరించడంతో జనరంజకమైందని చెప్పొచ్చు. ఎన్ని పాటలు రాసినా, రాస్తున్నా ‘గగనపు వీధి వీడి...’ పాట నేనెప్పటికీ నేర్చుకునే పాఠంగా నా డైరీలో ఉండిపోతుంది. సేకరణ: శశాంక్.బి - శ్రీమణి, గీతరచయిత -
పాట వెనుక కథ 13th Dec 2014
-
పాట వెనుక కథ 6th Dec 2014
-
పాట వెనుక కథ 30th Nov 2014
-
పాట వెనుక కథ - శ్రీమణి
-
పాట వెనుక కథ 22nd Nov 2014