పాటతత్వం
త్రివిక్రమ్‌గారితో సినిమా అంటే ఓ మంచి పుస్తకం చదివినట్లే. అలాంటిది ఆయనతో ‘జులాయి’ చిత్రం తర్వాత రెండో సారి పనిచేసే అవకాశం వచ్చింది. అదే ‘అత్తారింటికి దారేది’. పవన్‌కల్యాణ్ గారు హీరో అనగానే నాకు కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాకి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నాకు హీరో పరిచయ గీతం రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌గారు ఆల్రెడీ ట్యూన్ కూడా ఇచ్చేశారు. నేనిక పాట రాయడమే ఆలస్యం.
ఫస్ట్ వెర్షన్ రాసుకెళ్లా. ఎందుకో త్రివిక్రమ్‌గారికి నచ్చలేదు. అలా ప్రతి రోజు రెండు మూడు వెర్షన్లు రాసుకెళ్లా. ఈ పాటలోని మొదటి రెండు లైన్లకే పది రోజులు టైమ్ పట్టేసింది. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లడంతో కొన్నాళ్లు నా మకాం చెన్నైకి మారింది. త్రివిక్రమ్‌గారు అందుబాటులో లేకపోతే అందులో కొన్ని లైన్లు దేవిశ్రీ ప్రసాద్‌గారు ఓకే చేశారు. ఇలా ఏకంగా ఒక్క పాట కోసమే 45 రోజులు టైం తీసుకున్నా.
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలిమబ్బు కోసం/ తరలింది తనకు తానే ఆకాశం పరదేశం/శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్కకోసం /విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం.. సిరి సంపదలున్నా, పేరు ప్రతిష్ఠలున్నా మన సంతోషాన్ని, బాధనీ పంచుకునే సొంతవాళ్లు దగ్గర లేనప్పుడు ఆ లేమిని తూకం వెయ్యలేం. కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ఇల్లు తాను చేసిన చిన్న పొరపాటు వల్ల వెలవెలబోతుంది.
వారసుడిగా తాత సంపదనే కాకుండా బాధను కూడా పంచుకున్న ఆ కథానాయకుడు ఆ సిరిని మళ్లీ తిరిగి తీసుకొస్తానని బయలుదేరే సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. ఒక వ్యక్తి తాలూకు బాధని, గుండెలోతుని ప్రతిబింబించే విధంగా ఉన్న ఆ రెండు వాక్యాల్లో బోల్డెంత ఫిలాసఫీ కూడా ఉంది. ఇది త్రివిక్రమ్‌గారి తాత్వికత లేక సందర్భంలోని గాఢతో తెలియదుగానీ ఈ పాట రాయడానికి ఆయన చెప్పిన రెండు పిట్ట కథలే మూలం అని చెప్పొచ్చు.
- ఒక చెట్టుపై ఓ పక్షి గూడుపెట్టుకుంది.
కొంతకాలానికి ఆ పక్షి వలస వెళ్లిపోయింది. అలా వెళ్లి తిరిగిరాని పక్షి కోసం చెట్టు కదిలి వెళితే...
- ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. అలా వెళ్లిపోయిన మబ్బు కోసం ఆకాశమే తరలి వెళితే...
ఇవి మన నిత్యజీవితంలో జరిగే సన్నివేశాలే... మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విలువైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పక్కన ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు.
దూరం అయ్యాక అవి దొరికే అవకాశం ఉండదు. మనిషి ఎప్పుడూ ఈ రెండు సంఘటనల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అలా కోల్పోయిన అతి విలువైన వస్తువుల్ని తిరిగి పొందడం కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. సరిగ్గా అలాంటిదే ఈ సందర్భం కూడా.
‘అత్తారింటికి దారే ది’ సినిమాలో మొదటి పాటగా ఈ సందర్భోచితమైన పాట పెట్టడం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది.
ఆ తర్వాత పల్లవిగా మొదలయ్యే భైరవుడో, భార్గవుడో వాక్యాలు సినిమాలో కథానాయకుడి తదుపరి పరిణామ క్రమాన్ని ఊహిస్తున్నట్టుగా ఉన్నా ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు’ అనే పల్లవి ముగింపు పదాలతో వీడు అనుకున్నది సాధిస్తాడని చెప్పకనే చెబుతుంటాయి. ఈ పాట రాసేటప్పుడే హీరో పవ న్‌కల్యాణ్‌గారి ఇమేజ్‌నీ, త్రివిక్ర మ్‌గారి స్టాండర్డ్స్‌నీ హృదయంలో పెట్టుకుని మరీ రాశాను.
మొదటి చరణంలో
‘దివినుంచి భువిపైకి భగభగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు’ లాంటి వాక్యాల ద్వారా కథనాయకుని గుణగణాలను వివరిస్తే, ‘శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు’ వాక్యాన్ని అతని మానసిక సంఘర్షణకి అద్దం పట్టేలా రాశాను. దీని ద్వారా సామాన్యులందరికీ ఆ భావం అర్థమయ్యేటట్లు, తమను తాము ఆ పాత్రలో ఊహించుకోవడానికి అవకాశం దొరికి నట్టైంది.
తదుపరి చరణంలో ‘తన మొదలే వదులుకుని పెకైదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు.. తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి తన తూరుపు పరిచయమే చేస్తాడు’ వాక్యాల ద్వారా మనం ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదనీ, మనం ఎంత ప్రకాశిస్తున్నా ఆ వెలుగుకు కారణాన్ని మర్చిపోకూడదన్న గొప్ప సందేశంతో ఈ పాటను ముగించడం జరిగింది. సినిమాలో మొదట వచ్చే పాటైనా సరే, అన్ని పాటలకన్నా చివరిగా రికార్డ్ చేసిన పాట ఇదే. ఎన్నో ప్రశంసలను అందించిందీ పాట.
ఒక వ్యక్తికే పరిమితం కాకుండా మొత్తం అందరికీ ఉపయోగపడే భావావేశం నింపడం వల్ల పవన్‌కల్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో పై ఈ పాటను చిత్రీకరించడంతో జనరంజకమైందని చెప్పొచ్చు. ఎన్ని పాటలు రాసినా, రాస్తున్నా ‘గగనపు వీధి వీడి...’ పాట నేనెప్పటికీ నేర్చుకునే పాఠంగా నా డైరీలో ఉండిపోతుంది.
సేకరణ: శశాంక్.బి
- శ్రీమణి, గీతరచయిత
ఎంత ఎత్తుకి ఎదిగినా... మూలాలే ఆధారం!
Published Sun, May 22 2016 3:33 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement