Julayi
-
హిందీలోకి అల్లు అర్జున్ హిట్ సినిమా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జులాయి’ సినిమా హిందీలో రీమేక్‌కి సిద్ధమైంది. జులాయి రీమేక్‌ని సూపర్ డైరెక్టర్ టోని డిసౌజ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని హిందీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’. ఈ సినిమా కూడా హిందీలో రిమేక్ కానుండగా.. ఇందులో కూడా నమషి చక్రవర్తి హీరోగా నటిస్తుడటం విశేషం. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'బ్యాడ్‌బాయ్'గా పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ఈ రెండు సినిమాల్లోనూ హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి హీరోయిన్ కావడం మరో విశేషం. (చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!) -
ఎంత ఎత్తుకి ఎదిగినా... మూలాలే ఆధారం!
పాటతత్వం త్రివిక్రమ్‌గారితో సినిమా అంటే ఓ మంచి పుస్తకం చదివినట్లే. అలాంటిది ఆయనతో ‘జులాయి’ చిత్రం తర్వాత రెండో సారి పనిచేసే అవకాశం వచ్చింది. అదే ‘అత్తారింటికి దారేది’. పవన్‌కల్యాణ్ గారు హీరో అనగానే నాకు కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాకి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నాకు హీరో పరిచయ గీతం రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌గారు ఆల్రెడీ ట్యూన్ కూడా ఇచ్చేశారు. నేనిక పాట రాయడమే ఆలస్యం. ఫస్ట్ వెర్షన్ రాసుకెళ్లా. ఎందుకో త్రివిక్రమ్‌గారికి నచ్చలేదు. అలా ప్రతి రోజు రెండు మూడు వెర్షన్లు రాసుకెళ్లా. ఈ పాటలోని మొదటి రెండు లైన్లకే పది రోజులు టైమ్ పట్టేసింది. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లడంతో కొన్నాళ్లు నా మకాం చెన్నైకి మారింది. త్రివిక్రమ్‌గారు అందుబాటులో లేకపోతే అందులో కొన్ని లైన్లు దేవిశ్రీ ప్రసాద్‌గారు ఓకే చేశారు. ఇలా ఏకంగా ఒక్క పాట కోసమే 45 రోజులు టైం తీసుకున్నా. గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలిమబ్బు కోసం/ తరలింది తనకు తానే ఆకాశం పరదేశం/శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్కకోసం /విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం.. సిరి సంపదలున్నా, పేరు ప్రతిష్ఠలున్నా మన సంతోషాన్ని, బాధనీ పంచుకునే సొంతవాళ్లు దగ్గర లేనప్పుడు ఆ లేమిని తూకం వెయ్యలేం. కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ఇల్లు తాను చేసిన చిన్న పొరపాటు వల్ల వెలవెలబోతుంది. వారసుడిగా తాత సంపదనే కాకుండా బాధను కూడా పంచుకున్న ఆ కథానాయకుడు ఆ సిరిని మళ్లీ తిరిగి తీసుకొస్తానని బయలుదేరే సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. ఒక వ్యక్తి తాలూకు బాధని, గుండెలోతుని ప్రతిబింబించే విధంగా ఉన్న ఆ రెండు వాక్యాల్లో బోల్డెంత ఫిలాసఫీ కూడా ఉంది. ఇది త్రివిక్రమ్‌గారి తాత్వికత లేక సందర్భంలోని గాఢతో తెలియదుగానీ ఈ పాట రాయడానికి ఆయన చెప్పిన రెండు పిట్ట కథలే మూలం అని చెప్పొచ్చు. - ఒక చెట్టుపై ఓ పక్షి గూడుపెట్టుకుంది. కొంతకాలానికి ఆ పక్షి వలస వెళ్లిపోయింది. అలా వెళ్లి తిరిగిరాని పక్షి కోసం చెట్టు కదిలి వెళితే... - ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. అలా వెళ్లిపోయిన మబ్బు కోసం ఆకాశమే తరలి వెళితే... ఇవి మన నిత్యజీవితంలో జరిగే సన్నివేశాలే... మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విలువైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పక్కన ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. దూరం అయ్యాక అవి దొరికే అవకాశం ఉండదు. మనిషి ఎప్పుడూ ఈ రెండు సంఘటనల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అలా కోల్పోయిన అతి విలువైన వస్తువుల్ని తిరిగి పొందడం కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. సరిగ్గా అలాంటిదే ఈ సందర్భం కూడా. ‘అత్తారింటికి దారే ది’ సినిమాలో మొదటి పాటగా ఈ సందర్భోచితమైన పాట పెట్టడం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. ఆ తర్వాత పల్లవిగా మొదలయ్యే భైరవుడో, భార్గవుడో వాక్యాలు సినిమాలో కథానాయకుడి తదుపరి పరిణామ క్రమాన్ని ఊహిస్తున్నట్టుగా ఉన్నా ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు’ అనే పల్లవి ముగింపు పదాలతో వీడు అనుకున్నది సాధిస్తాడని చెప్పకనే చెబుతుంటాయి. ఈ పాట రాసేటప్పుడే హీరో పవ న్కల్యాణ్గారి ఇమేజ్‌నీ, త్రివిక్ర మ్గారి స్టాండర్డ్స్నీ హృదయంలో పెట్టుకుని మరీ రాశాను. మొదటి చరణంలో ‘దివినుంచి భువిపైకి భగభగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు’ లాంటి వాక్యాల ద్వారా కథనాయకుని గుణగణాలను వివరిస్తే, ‘శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు’ వాక్యాన్ని అతని మానసిక సంఘర్షణకి అద్దం పట్టేలా రాశాను. దీని ద్వారా సామాన్యులందరికీ ఆ భావం అర్థమయ్యేటట్లు, తమను తాము ఆ పాత్రలో ఊహించుకోవడానికి అవకాశం దొరికి నట్టైంది. తదుపరి చరణంలో ‘తన మొదలే వదులుకుని పెకైదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు.. తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి తన తూరుపు పరిచయమే చేస్తాడు’ వాక్యాల ద్వారా మనం ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదనీ, మనం ఎంత ప్రకాశిస్తున్నా ఆ వెలుగుకు కారణాన్ని మర్చిపోకూడదన్న గొప్ప సందేశంతో ఈ పాటను ముగించడం జరిగింది. సినిమాలో మొదట వచ్చే పాటైనా సరే, అన్ని పాటలకన్నా చివరిగా రికార్డ్ చేసిన పాట ఇదే. ఎన్నో ప్రశంసలను అందించిందీ పాట. ఒక వ్యక్తికే పరిమితం కాకుండా మొత్తం అందరికీ ఉపయోగపడే భావావేశం నింపడం వల్ల పవన్‌కల్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో పై ఈ పాటను చిత్రీకరించడంతో జనరంజకమైందని చెప్పొచ్చు. ఎన్ని పాటలు రాసినా, రాస్తున్నా ‘గగనపు వీధి వీడి...’ పాట నేనెప్పటికీ నేర్చుకునే పాఠంగా నా డైరీలో ఉండిపోతుంది. సేకరణ: శశాంక్.బి - శ్రీమణి, గీతరచయిత -
ఆ దొంగల ముఠాకు 'జులాయి' ఆదర్శం
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన దోపిడీల గుట్టును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 'జులాయి' సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలను ఛేదించేందుకు ఆగంతకులు వదిలి వెళ్లిన ఇన్నోవా కారు ఉపయోగపడిందని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా సభ్యులు శంషాబాద్ సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి, అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు పసిగట్టనున్నారని అనుమానించిన వారు... సదరు విల్లాలను విక్రయించి చెన్నైకి చెక్కేశారని తెలిపారు. ఆ విషయం గమనించిన విల్లాలను సీజ్ చేసినట్లు చెప్పారు. రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నైకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ రాంజీ ముఠా రెండేళ్ల వ్యవధిలో ఎనిమిది బ్యాంకులను కొల్లగొట్టి... సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, నగదు దొంగిలించారని వివరించారు. ముఠాలో ఎనిమిది మంది సభ్యులు పిక్‌పాకెటర్ల నుంచి గజదొంగల స్థాయికి ఎదిగారన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నాట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. జులాయి ఆదర్శం.. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాను చూసిన ఈ ముఠా బ్యాంకులను దోచుకోవడం ప్రారంభించారు. ఆ సినిమాలో వలే ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కటర్, వాహనాన్ని ఉపయోగించారు. తొలిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. కోటి విలువైన బంగారం, నగదు దోచుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు, మరో రెండు జిల్లాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు దోచుకున్నారు. ఇబ్రహీంపట్నంలో జనవరి 11వ తేదీన డీసీపీబీని దోచుకునేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు.... అయితే అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో రాంజీ ముఠా సభ్యులు కారును వదిలి పారిపోయారు. ఈ కారుపై దొంగల వేలిముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయింది. -
త్రిశూలంతో వస్తారా..?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత విడివిడిగా ‘అత్తారింటికి దారేది’తో త్రివిక్రమ్, ‘రేసుగుర్రం’తో బన్నీ గ్రాండ్ సక్సెస్‌లు అందుకొని తమ సత్తా చాటారు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘జులాయి’ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘త్రిశూలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో సమంత, నిత్యామీనన్, అదా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రను ఉపేంద్ర చేస్తున్నారు. అలాగే, స్నేహ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరుస్తున్నారు. -
అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నా..!
రామజోగయ్యశాస్త్రి స్వరానికి మాటలు జోడించినంత మాత్రాన అది పాట అయిపోదు. సందర్భానికి తగ్గ భావవ్యక్తీకరణ ఉండాలి. గుండె లోతుల్లో నుంచి కవితావేశం ఉప్పొంగాలి. నిజమైన పాట అప్పుడు ఉద్భవిస్తుంది. దాంతో కవికి కావాల్సినంత ఆత్మసంతృప్తి. అయితే.. ప్రస్తుతం అలాంటి పాటలు అరుదైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భుక్తి కోసం రాసే పాటలే. ఈ పరిస్థితుల్లో కూడా అడపాదడపా తన పాటలతో తళుక్కున మెరుస్తుంటారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ఆలోచింపజేసే సాహిత్యంతో, అందమైన పద సరళితో శ్రోతలను రంజింపజేస్తున్నారాయన. దాదాపు అన్ని రకాల పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో మచ్చుకు ఓ అయిదింటి గురించి ఆయన మాటల్లోనే... ‘శుభప్రదం’ - సినిమాలో ‘తప్పట్లో తాళాలోయ్’ అనే పాట రాశాను. విద్యాసాగర్ స్వరరచన చేసిన పాట అది. కె.విశ్వనాథ్‌గారి సినిమాకు పాట రాయడం అదే ప్రథమం. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు వెలిగింది... కథానుగుణంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట వస్తుంది. ఈ పాట రాయమంది కె.విశ్వనాథ్‌గారు. సో... ఇది శివకేశవ ప్రేరేపితంగా భావించా. ఇప్పటికే శివకేశవులపై చాలా పాటలొచ్చాయి. అయితే... వైష్ణవావతారమైన కృష్ణుడితో శివుణ్ణి పోలుస్తూ పాట రాలేదు. ఎందుకో తెలీదుకానీ... శివుడికీ, కృష్ణుడికీ మధ్య పోలికలు కనిపించాయి నాకు. శివుడి మూడోకన్నే... నెమలికన్నుగా కృష్ణుని ఆభరణమైంది. శివుని ఓంకార నాదమే... కృష్ణుని మురళీనాదమైంది. భవుని విభూతే... బృందావనంలోని పుప్పొడిగా మారింది. ప్రమథగణ పూజితుడైన విరాగి శివుడైతే... యదుకాంతల ప్రేమను గెలిచిన విరాళి కృష్ణుడు. కైలాస నాట్యకేళి శివుడిదైతే... కాళింది పడగపై ఆనంద నాట్యహేళి కృష్ణుడిది. నాకు కనిపించిన ఈ పోలికలనే పాటగా మలిచాను. ‘తలపైన కన్నున్న ముక్కంటి తానేగా... శివమూర్తి శిఖిపించె మౌళీ... ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా... తన మోవి మురళీ స్వరాళీ... భవుని మేని ధూళి... తలపించదా వన మధూళీ... ప్రమథగణ విరాగి... యదుకాంతలకు ప్రియ విరాళీ... ఝణన ఝణన ఝన పద యుగళమే... జతపడే శివకేశవాభేద కేళీ... ఈ పోలిక చూసి... విశ్వనాథ్‌గారు ఎంతో సంతోషించారు. ‘విశ్వరూపం’ - కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో ‘అణువినాశ వర్షమిదీ...’ నేను రాసిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట. న్యూక్లియర్ బాంబు వినాశనం కారణంగా ప్రపంచం రెండు వర్గాలుగా మారి యుద్ధాలు మొదలయ్యాయి. టైజం పడగ విప్పింది. ప్రపంచం అశాంతికి లోనైంది.. ఈ పరిణామాలవల్ల మనకు ఒరిగిందేమింటి? అని ప్రశ్నించే పాట ఇది. తమిళ మాతృకను అక్కడి ప్రసిద్ధ సినీ గీతరచయిత వైరముత్తు రాశారు. ఆయన భావవ్యక్తీకరణ అద్భుతం. నాకు తెగ నచ్చేసింది. ఇది మాంటేజ్ సాంగ్ కావడంతో దాన్ని చక్కని తెలుగు పదబంధాలతో రాయొచ్చు. అందుకే... భావం చెడకుండా... అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా రాశాను. వైరముత్తు స్థాయిలో రాయలేకపోయినా... అందులో కొంత స్థాయికైనా చేరాననే ఆనందం ఉంది. ఇక ఆ పాటలో ఓ చరణం ఇది... అణువినాశ వర్షమిదీ... చితుల చిగురు మొలచినదీ. ఒక తల్లి కన్న కొడుకేగా సైనికుడెవరైనా... కాలేది కన్న కడుపేగా... ఎవ్వరు బలి అయినా... ఈ పెనుదాహం... కోరేదేమిటో... రణ... మారణహోమం.... ఆగేదెప్పుడో... ఎన్నడో... ఈ జన్మకు ఈ దేహం... మరుజన్మకు నీదే దేశం? నిరంతరమై నీ వెంటే... ఏదీ రాదు నేస్తం... క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం../ఈ పెనుదాహం కోరేదేమిటో... రణ... మారణహోమం ఆగేదెప్పుడో... ఎన్నడో... కమల్‌హాసన్‌గారు ఈ పాట విని చాలా సంతోషించారు. పైగా ఈ పాట స్వయంగా ఆయనే పాడారు. నా పాట ఆయన నోట వింటుంటే.. చెప్పలేనంత ఆనందం కలిగింది. అంతకుముందే, ‘మన్మథబాణం’ సినిమాకు కమల్‌గారికి రాశాను. నా కష్టం చూసే ‘విశ్వరూపం’కి అవకాశం ఇచ్చారాయన. ‘జులాయి’ - యువతరానికి సందేశాన్నీ, జోష్నీ ఇస్తూ నేను రాసిన పాట ‘పకడో పకడో...’. ‘జులాయి’ సినిమాలోని ఈ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా కెరీర్లో ముఖ్యమైన పాట. ముందు ఈ పాట ఒకే చరణం. హీరో పాత్రచిత్రణను ప్రతిబింబించేలా రాశాను. బాగుండటంతో ఇంకో రెండు చరణాలు రాయమన్నారు త్రివిక్రమ్. మిగిలిన రెండు చరణాలు నేటి యువతను లక్ష్యంగా చేసుకొని, వాళ్లకు ప్రేరణ కలిగించేలా రాశాను. నిన్న నువ్వు మిస్సయ్యింది పకడో... రేపు నీకు ప్లస్సయ్యేది పకడో.. ఒంటరైన జీరో.. వేల్యులేనిదేరో... దాని పక్క అంకెయ్రో... గెలుపను మేటరుంది ఎక్కడో... దాన్ని గెలిచే... రూట్ పకడో... టాలెంటుంది నీలో... ఖుల్లమ్ ఖుల్ల ఖేలో.. బ్యాటు బంతి నువ్వేరో... చెదరని ఫోకస్సే... సీక్రెటాఫ్ సక్సెసై... అర్జునుడి విల్లువై... యారో మారో యాపిల్ పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో... నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందనే స్ఫూర్తితో రాసిన పాట ఇది. త్రివిక్రమ్‌కి కూడా బాగా నచ్చిన పాట. ‘రాజుభాయ్’ - సినిమాలో ఓ పాట రాశాను. కెరీర్ ప్రారంభంలో నాకు సంతృప్తినిచ్చిన పాట అది. ‘నువ్వు డేంజర్ జోన్లోకి అడుగుపెడుతున్నావ్’ అని హీరోని హెచ్చరించే పాట అది. సగటు మనిషికి కూడా ఉపయోగ పడే తత్వంతో ఈ పాట రాశాను. లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా... గింజలు ఎరవేస్తే పంజరాన పడకురా.. కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా... వేసే అడుగు నీవు ఆచితూచి వేయరా... సాలె గూడు గూడు కాదు, పాము పడగ నీడ కాదు... సందర్భమే ఈ పాటకు ప్రేరణ. కథను ముందుకు నడిపించే ఇలాంటి పాట కూడా ఒకటి రాయగలిగాను అని గర్వంగా ఫీలవుతుంటా. ‘శిరిడిసాయి’ - బాబా అవతార ధర్మాన్ని ప్రతిబించేలా ‘షిరిడీసాయి’ సినిమా కోసం నేను రాసిన పాట ‘నీ పదమున ప్రభవించిన గంగా యమునా’. ఒక సాయిభక్తునిగా నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది. గంగా, యమునా సంగమాన్ని చూడాలని ప్రయాగ బయలుదేరిన దాసగణుని బాబా కటాక్షించిన సన్నివేశం అది. పైగా ఈ సందర్భంలో ఆత్రేయగారు పాట రాసి ఉన్నారు. అదే సందర్భానికి ఇప్పుడు నేను రాయడం ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. ‘షిరిడీసాయిబాబా మహత్మ్యం’లో ‘సాయి శరణం... బాబా శరణు శరణం’ పాటంటే కె.రాఘవేంద్రరావుగారికి చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్లోనే పాట రాయమన్నారు. నీ పదమున ప్రభవించిన గంగా యమునా... నా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా... ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా... ఏ జీవమైన భావమైన నీవేగా... నీవులేని చోటు లేదు సాయి... ఈ జగమే నీ ద్వారకామాయి భగవంతుణ్ణి సర్వాంతర్యామి అంటారు. షిరిడీసాయి ద్వారకామాయి నివాసి. అందుకే... జగమంతా ద్వారకామాయి అని రాశాను. షిరిడీసాయి యద్భావం తద్భవతీ అన్నారు. ఆయన ఆరడుగుల దేహం కాదు. భక్తుల అనుభూతికి ఆకృతి. ఆ భావమే ఈ పాటకు రూపమైంది. ఈ అయిదు పాటలే కాదు.. ఓ కవికి తాను రాసిన ప్రతి పాట తన బిడ్డే. అయితే... తల్లితండ్రులకు ఆత్మానందాన్ని కలిగించే బిడ్డలు మాత్రం కొందరే ఉంటారు. నాకు అలాంటి బిడ్డలే ఈ అయిదు పాటలు. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ
‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ పెన్ను ఎప్పటిలాగే వేగంగానే కదిలింది. బన్నీ కూడా ఆ డైలాగుల్ని చాలా ఫన్నీగా చెప్పేసి ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు. ‘పొద్దున్నే కోడి కూడా లేస్తుంది.. ఏం లాభం.. చికెనొండుకొని తినేయట్లా...’ ఈ డైలాగు సాధారణమైందే... కానీ దాన్ని బన్నీ పలికిన తీరే విభిన్నం. హీరో మంచి టైమింగ్ కలవాడైతే... డైలాగు రైటర్లు ఆటోమేటిగ్గా చెలరేగిపోతారు. ఇక త్రివిక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా? పైగా దర్శకుడు కూడా తనే కదా. పస్తుతం ఈ మాటల మాంత్రికుడి హవా నడుస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో వందకోట్ల దర్శకుడుగా కూడా చరిత్ర సృష్టించబోతున్నారాయన. ఈ విజయ పరంపర ‘జులాయి’ నుంచే మొదలైందని చెప్పాలి. అందుకే రెండోసారి కూడా బన్నీతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. అక్కినేని నట వారసుడు అఖిల్ తెరంగేట్రం చేసే సినిమాకు త్రివిక్రమే దర్శకుడంటూ వెబ్సైట్లు ఊదరగొడుతున్నాయి. కానీ అసలు విషయం ఏమిటంటే - త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘జులాయి’ చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుండటం విశేషం. ‘రేసుగుర్రం’ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారమ్.