ఆ దొంగల ముఠాకు 'జులాయి' ఆదర్శం
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన దోపిడీల గుట్టును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 'జులాయి' సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలను ఛేదించేందుకు ఆగంతకులు వదిలి వెళ్లిన ఇన్నోవా కారు ఉపయోగపడిందని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా సభ్యులు శంషాబాద్ సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి, అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు పసిగట్టనున్నారని అనుమానించిన వారు... సదరు విల్లాలను విక్రయించి చెన్నైకి చెక్కేశారని తెలిపారు. ఆ విషయం గమనించిన విల్లాలను సీజ్ చేసినట్లు చెప్పారు.
రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నైకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ రాంజీ ముఠా రెండేళ్ల వ్యవధిలో ఎనిమిది బ్యాంకులను కొల్లగొట్టి... సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, నగదు దొంగిలించారని వివరించారు. ముఠాలో ఎనిమిది మంది సభ్యులు పిక్‌పాకెటర్ల నుంచి గజదొంగల స్థాయికి ఎదిగారన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నాట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
జులాయి ఆదర్శం..
అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాను చూసిన ఈ ముఠా బ్యాంకులను దోచుకోవడం ప్రారంభించారు. ఆ సినిమాలో వలే ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కటర్, వాహనాన్ని ఉపయోగించారు. తొలిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. కోటి విలువైన బంగారం, నగదు దోచుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు, మరో రెండు జిల్లాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు దోచుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో జనవరి 11వ తేదీన డీసీపీబీని దోచుకునేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు.... అయితే అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో రాంజీ ముఠా సభ్యులు కారును వదిలి పారిపోయారు. ఈ కారుపై దొంగల వేలిముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయింది.