Ramji gang
-
రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..
సాక్షి,సిటీబ్యూరో: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పనామా వద్ద గల యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద మే 7వ తేదీన రూ.58,97,600 నగదును చోరీ చేసిన రామ్జీనగర్ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల పాటు శ్రమించిన రాచకొండ ఎస్ఓటీ, సీసీఎస్, వనస్థలిపురం పోలీసులు.. నగరంలో మరో చోరీ చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యులతో కూడిన ముఠాను వనస్థలిపురం ఆటోనగర్‌లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4.10 లక్షల నగదు, కారు, 15 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ మీడియాకు వివరించారు. ఏడాదిపాటు నేరాల క్యాలెండర్ తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లా రామ్జీనగర్ పేరుతో 15 ఏళ్ల క్రితం గుజరాతీ బిజినెస్మెన్ స్పిల్మిన్నింగ్ ప్రారంభించారు. దీంతో ఈ ఊరుకి రామ్జీనగర్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇక్కడి ప్రజలు ఈజీమనీ కోసం నేరాలబాట పట్టారు. ఏడాదంతా నేరాల కోసం క్యాలెండర్ పెట్టుకోని మరీ చోరీలు చేస్తున్నారు. 15 నుంచి 18 ముఠాలున్న ఈ గ్యాంగ్ సభ్యులు ఒక్కో నెలలో ఒక్కో ముఠా చోరీలు చేస్తుంటుంది. వీరిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, ఢిల్లీ, బెంగళూరు.. ఇలా చాలా రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదయ్యాయి. అయితే, మే 7న వనస్థలిపురంలో చాకచాక్యంగా దొంగతనం చేసిన ఈ ముఠాను పట్టుకునేందుకు వనస్థలిపురం, ఎల్బీనగర్ ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి 45 రోజులు పాటు రామ్జీనగర్ పరిసరాల్లో మాటు వేసి ప్రయత్నించారు. అయితే, తొలుత భాషా సమస్యతో వీరితో ఎవరూ మాట్లాడలేదు. 90 శాతం మంది తమిళ భాషలోనే మాట్లాడుతుండటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో తమకు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు ఇక్కడి ముఠా సభ్యుడైన దీపక్ ఇన్ఫార్మర్ను మర్డర్ చేశాడు. అయితే, రాచకొండ పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నా భయంతో స్థానికులు ఎవరూ సాహసించలేదు. కేసు సవాల్‌గా మారడంతో మరో రెండుసార్లు అక్కడికి వెళ్లి స్థానికులతో మాట్లాడి ముఠాపై నిఘా వేశారు. బుధవారం తెల్లవారుజామూన ఇండికా కారులో వస్తున్న రామ్జీనగర్ గ్యాంగ్ నాయకుడు ప్రతిబాన్ దీపక్ అలియాస్ టిప్పు, సత్యరాజ్, యోగేశ్, సురేశ్‌లు పోలీసులకు చిక్కారు. అయితే, అరెస్టయిన నలుగురిని పోలీసు కస్టడీకి తీసుకొని డబ్బు రికవరీపై దృష్టి సారిస్తామని, కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.. పీడీ యాక్ట్ కూడా తెరుస్తామని వివరించారు. మూడు నెలల శ్రమకు ఫలితం.. ఈ ఏడాది మే 7న పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్‌లో రూ.58,97,600 నగదును డిపాజిట్ చేసేందుకు ఏపీ09టీవీ 2864 టాటా విక్టా వాహనంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్రైవర్, గన్‌మెన్‌తో పాటు రైటర్ సేఫ్‌గార్డు సంస్థకు చెందిన ఇద్దరు కస్టోడియన్లు ఉన్నారు. అయితే, ఇద్దరు కస్టోడియన్లు ఏటీఎం లోపలికి వెళ్లగా అక్కడే వాహనం సమీపంలో రామ్‌జీ ముఠా సభ్యులు కొన్ని నోట్లను పడేసి గన్‌మెన్ దృష్టిని మళ్లించి మొత్తం నగదు బ్యాగ్‌ను ఆటోలో వేసుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. దొగలు అక్కణ్నుంచి రైలులో సొంతూరెళ్లి అటునుంచి పారిపోయారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జ్‌లు అన్నీ గాలించినా ఫలితం లేకపోవడంతో వనస్థలిపురం, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి మూడుసార్లు రామ్జీనగర్, తిరుచిరపల్లికి వెళ్లొచ్చారు. అయితే అక్కడి లోకల్ అధికారులకు దొంగతనం చేసిన డబ్బుల్లో కొంత అందుతుండటంతో సమాచారం కష్టమైంది. ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో దొంగలపై నిఘా ఉంచిన పోలీసులకు వనస్థలిపురం ఆటోనగర్‌లో బుధవారం ఉదయం దొరికిపోయారు. కారులో మాదకద్రవ్యాలు ఉండటంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అనంతరం ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, వనస్థలిపురం డీఐ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఇతర సిబ్బందికి రివార్డులిచ్చి సత్కరించారు. రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా రామ్‌జీనగర్‌లో 300 నుంచి 500 కుటుంబాలతో 15 నుంచి 18 గ్రూపులు దొంగల ముఠాలున్నాయి. ఈ ముఠా సభ్యులు ఎక్కడైనా దొంగతనానికి వెళితే రూ.30 లక్షలపైన చోరీ చేసి తీసుకొస్తే వెంటనే డబ్బులిచ్చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు దొరికితే పోలీసులు దృష్టిలో ఉంటామనే భావనతో అక్కడి దొంగల ముఠా ఈ నిబంధనను పెట్టుకుంది. ఈ మేరకు పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.50 లక్షలతో కూడిన బ్యాగ్‌తో పరారైన ఈ గ్యాంగ్ వెంటనే ఆ డబ్బు సొతూరిలో ఇచ్చేసి ఇతర ప్రాంతాలకు పరారైంది. ఇదే అంశం వారికి కలిసిరావడంతో పాటు ఈ నేరం జరిగిన వెంటనే రాచకొండ పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసుల వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో చోరీ చేసింది రామ్‌జీ గ్రూప్ అని తెలిసిపోయింది. ఈ విషయం వారికి కూడా తెలిసిపోవడంతో చాకచాక్యంగా పరారయ్యారని ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. రామ్‌జీ ముఠా నేరాలు ఇవీ.. ముఠా సభ్యుడు రామ్‌జీనగర్‌కు చెందిన పత్రివన్ దీపక్ అలియాస్ దీపుపై పోలీసులకు సమాచామిచ్చాడని 2012లో ఇన్ఫార్మర్ను హత్య చేశాడు. ఈ కేసు రామ్జీనగర్ ఠాణాలో నమోదైంది. 2017లో విశాఖపట్నం ద్వారాకానగర్ పోలీసు స్టేషన్, గుడివాడ పోలీసు స్టేషన్లో అటెన్షన్ డైవర్షన్ కేసులు, 2019లో వనస్థలిపురం అటెన్షన్ డైవర్షన్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇతని ప్రధాన అనురచరుడు సత్యరాజ్‌పై కూడా వనస్థలిపురంతో పాటు ఇతర ఠాణాల్లో కేసులున్నాయి. యోగరాజ్, సురేశ్‌పై కూడా కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న దీపక్ ముఠా సభ్యులు ముఖేష్, సరవణన్, ఆర్ముగం, తొమోదరన్, కుమారన్, కుమార్, వడివేలు, రాజు, గోకుల్, ఆదిత్యను తొందర్లోనే పట్టుకుంటామని మహేష్ భగవత్ తెలిపారు. -
కొనసాగుతున్న వేట
సాక్షి, సిటీబ్యూరో: వనస్థలిపురంలో ఇటీవల జరిగిన చోరీ రామ్జీనగర్ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాల వద్ద మాటువేసి.. నగదు, నగలు తరలించే వారి దృష్టి మళ్లించి దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. ఈ నెల 7న వనస్థలిపురం పరిధిలో ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే వాహనం నుంచి రూ.అర కోటికి పైగా ఎత్తుకుపోయింది వీరేనని గుర్తించిన పోలీసులుఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు తమిళనాడు బయలుదేరి వెళ్లాయి, ఈ ముఠా సభ్యులది తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని రామ్జీనగర్ కావడంతో వీరికి రామ్జీనగర్ ముఠా అని పేరు వచ్చింది. వీరు ఏడు నుంచి ఎనిమిది మంది కలిసి సంచరిస్తుంటారు. ఈ గ్యాంగ్ ఎక్కువగా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంలు, బంగారు దుకాణాలుండే ప్రాంతాల్లోనూ మాటువేసి భారీ మొత్తంలో నగదు, నగలు తరలించే వారిని గుర్తిస్తుంది. ఆపై మాటలు, చేతలతో వారి దృష్టి మళ్లించి నగదుతో ఉడాయిస్తుంది. ఎక్కువగా కరెన్సీ నోట్లకు కింద చల్లడం, ఆ డబ్బు తీసుకునేలా టార్గెట్‌ను ప్రేరేపించి దృష్టి మరల్చడం చేస్తుంటుంది. వనస్థలిపురం భారీ చోరీ సైతం ఈ రకంగానే జరిగింది. గతంలో మలక్‌పేట ఎస్బీఐ దగ్గర రూ. 20 లక్షలు స్వాహా చేయడం, ఆసిఫ్‌నగర్ పరిధిలోని కెనరా బ్యాంకు దగ్గర శంకరన్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షల లూటీ, సిద్ధి అంబర్‌బజార్‌లో వ్యాపార వేత్త నుంచి 3.2 కిలోల బంగారం స్వాహా... ఇలా వీరు చేసిన నేరాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహాలోనే దృష్టి మళ్లించి చోరీలు చేయడంలో చిత్తూరు జిల్లా నగరి గ్యాంగ్‌కు సైతం మంచి ప్రావీణ్యం ఉంది. అయితే, వనస్థలిపురంలో పంజా విసిరింది రామ్జీనగర్ ముఠా మాత్రమే అనడానికి బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేరాలు చేస్తున్న ఫలానా ముఠా అని స్పష్టంగా తెలిసినా... వారి స్వస్థలాలకు వెళ్లి నిందితులను అరెస్టు చేయడం అత్యంత కష్టసాధ్యమని పోలీసులు అంటున్నారు. గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ రకంగా చోరీ చేస్తుండగా నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే మాత్రం... అతను అంగీకరించిన మేర మొత్తం నగదును గ్రామస్తులే పక్కాగా చెల్లిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో వనస్థలిపురంలో నేరం చేసిన ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు చర ్యలు చేపట్టాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. ♦ బహిరంగంగా నగదు లావాదేవీలు చేయకూడదు. ♦ సాధ్యమైనంత వరకు భారీ మెుత్తాల మార్పిడి చెక్కులు, డ్రాఫ్టుల ద్వారా చేయాలి. ♦ పెద్ద మెుత్తంలో డబ్బు, నగలు తరలించాల్సి వస్తే తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలి. ♦ ఈ విషయంలో వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్త వహించాలి. ♦ కాలి నడకన, ఆర్టీసీ బస్సుల్లోనూ ఎక్కువ మెుత్తంలో డబ్బు, నగలు తీసుకొని వెళ్లకూడదు. ♦ కారు వంటి వాహనాలలో తీసుకెళ్లే సంచి, సూట్‌కేస్‌లను ఒళ్లోనే పెట్టుకోవాలి. ♦ ఎవరైన మీ వద్దకు వచ్చి డబ్బులు కిందపడ్డాయని, దుస్తులు, వాహనాలపై మరకలు పడ్డాయని, టైర్లలో గాలి పోయిందని, పెట్రోల్ కారుతోందని చెప్పినా, అర్థంకాని సైగలు చేసినా అప్రమత్తమవ్వాలి. ♦ వాహనం దిగే సమయంలో మీ దృష్టిని నగదు, నగల పైనుంచి మళ్లనీయకండి. ♦ ఎవరిపైనైనా అనుమానం కలిగితే 100 ఫోన్ చేయాలి లేదా పోలీసు అధికారిక వాట్సాప్, హాక్ ఐ యాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలి. -
రాంజీ ముఠా దొరికింది..!
ఖమ్మంక్రైం: అక్కడొక కారు ఆగింది. డ్రైవర్ వద్దకు ఎవడో వచ్చాడు. ‘‘ఇక్కడ నోట్లు పడిపోయాయి. మీవేనా సార్..’’ అన్నాడు. ఆ డ్రైవర్ కిందికి దిగాడు. కింద చెల్లాచెదరుగా పడిపోయిన 50 రూపాయల నోట్లను ఏరుకోసాగాడు. అవి తనవి కాకపోవచ్చేమోన్న అనుమానం ఆ డ్రైవర్‌కు ఏమాత్రం కలగలేదు. ఆ నోట్లన్నీ ఏరుకుని చూసేసరికి.. కారులోని సూట్ కేసు మాయమైంది. నోట్లు పడిపోయాయని చెప్పిన మాయగాడు.. మాయమయ్యాడు..! ఖమ్మంలోని భద్రాద్రి బ్యాంక్ వద్ద, వైరా రోడ్డులోని వాసన్ ఐ కేర్ వద్ద సోమవారం ఇవి జరిగాయి. బ్యాంక్ వద్ద మాయమైన సూట్‌కేసులో పాతికలక్షల విలువైన నగలున్నాయి. ఐ కేర్ వద్ద మాయమైన సూట్‌కేసులో ల్యాప్‌టాప్, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఈ రెండుచోట్ల సూట్‌కేసులను మాయం చేసింది.. రాంజీ ముఠా..! ఈ ముఠాలోని నలుగురిని వెంటనే పట్టేశారు.. ఖమ్మం పోలీసులు..!! ఎక్కడిదీ ‘రాంజీ ముఠా’..? కరెన్సీ నోట్లను ఎరగా వేయడం, విలువైనవి (నగలు–నగదు) కాజేయడం.. ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రద్దీగా ఉండేచోట (బ్యాంకులు, నగల దుకాణాలు, ప్రధాన ప్రదేశాలు) ఈ ముఠా మాటు వేస్తుంది. ఎవరిని దోచుకుంటే గిట్టుబాటవుతుందో అంచనా వేస్తుంది. ఆ తరువాత పనిలోకి దిగుతుంది. క్షణాల్లో ముగిస్తుంది. నిముషాల్లో మాయమవుతుంది. దీని పేరే.. రాంజీ ముఠా. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి వద్ద ‘రాంజీనగర్’ అనే ప్రాంతం ఉంది. అక్కడికి చెందిన కొందరు దోపిడీ ముఠాగా ఏర్పడ్డారు. ఇదిగో.. ఇలా ఈ ముఠా దోపిడీలు సాగిస్తోంది. రాంజీనగర్ నుంచి వచ్చిన ఈ ముఠాకు అదే పేరు స్థిరపడింది. దోపిడీ ఎలా చేశారంటే.... ఈ ముఠా, దోపిడీ చేసిన తీరును గమనిస్తే.. సామాన్యులమైన మనకు ఆశ్చర్యమేస్తుంది. పట్టపగలు.. రద్దీ ప్రదేశంలో.. కేవలం కొన్ని క్షణాల్లోనే.. కారు అద్దం పగలగొట్టి/లాక్ చేసిన డోర్ తీసి, సూట్‌కేసుతో మాయమవడం.. అంత తేలికైన విషయం కాదు. ఇది ఈ ముఠా ప్రత్యేకత. లాక్ చేసిన కారు అద్దాలను ఏమాత్రం శబ్దం రాకుండా ఈ ముఠా పగలగొట్టగలదు. ఒక రకమైన పదార్థాన్ని ఉండలా చేసి, కారు అద్దానికి గట్టిగా కొడతారు. అంతే.. ఆ పదార్థం అంటుకున్నంత వరకు అద్దం ఏమాత్రం శబ్దం లేకుండా పగులుతుంది. అందులో చేయి పెట్టి కారు లాక్ తీస్తారు. లేదా.. చేతికందినవి తీస్తారు. ఖమ్మంలో ఇలాగే చేశారు. ఎలా పట్టుకున్నారు..? దోపిడీ జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు, శరవేగంగా కదిలారు. ఎంత వేగంగా అంటే... కేవలం గంటల్లోనే, జిల్లా సరిహద్దులు దాటక ముందే పట్టేశారు. దోపిడీ సమాచారం అందిన వెంటనే ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాను రంగంలోకి దిగారు. నగరంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అనుమానితులను గమనించారు. కోదాడ వైపు వెళుతున్న బస్సును ముదిగొండ వద్ద పోలీసులు ఆపారు. ఖమ్మం నుంచి అప్పటికే వారికి పక్కా సమాచారం అందింది. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. అంచనా తప్పలేదు..! నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు అధికారులు విచారించారు. తాము రాంజీ ముఠా సభ్యులమేనని ఆ నలుగురు ఒప్పుకున్నారు. ‘‘మేం మొత్తం పదిమందికి పైగా వచ్చాం. నగల సూట్‌కేసుతో మావాళ్లు వెళ్లిపోయారు. ఖమ్మంలో రెండుచోట్ల సూట్‌కేసులు మాయం చేసింది మేమే’’ అని చెప్పారు(ట). ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో చోరీ చేసింది కూడా ఇదే ముఠా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘సీసీసీ’లు.. వారెవ్వా...! ‘‘ఒకే ఒక్క సీసీసీ (క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా)... వందమంది పోలీసులతో సమానం..!’’ ఇటీవల, ఓ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ చెప్పిన అక్షర సత్యమన్న విషయం.. ఇక్కడ రుజువైంది. రాంజీ ముఠాను పట్టించింది.. ఈ నిఘా నేత్రాలే!! కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన రెండు ప్రాంతాలతోపాటు ఇతరచోట్ల కొన్న ?సీసీ కెమెరాలు అంత నాణ్యతగా లేవు. కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా ముఠా కదలికలను పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. చలో చెన్నై...! ఈ ముఠాలోని మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసుల బృందం చెన్నైకి బయల్దేరినట్టు తెలిసింది. ఈ ముఠా మొత్తం చిక్కితే.. వీరి గుట్టంతా రట్టవుతుంది. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా దోచుకుందీ తెలుస్తుంది. మింగినదంతా కక్కించేందుకు వీలవుతుంది. శరవేగంగా స్పందించి, అంతే వేగంగా దోపిడీ దొంగలను పట్టుకున్న ఖమ్మం కమిషనరేట్ పోలీసులకు నగర ప్రజలు సలాం చేస్తున్నారు. -
ఆ దొంగల ముఠాకు 'జులాయి' ఆదర్శం
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన దోపిడీల గుట్టును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 'జులాయి' సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలను ఛేదించేందుకు ఆగంతకులు వదిలి వెళ్లిన ఇన్నోవా కారు ఉపయోగపడిందని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా సభ్యులు శంషాబాద్ సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి, అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు పసిగట్టనున్నారని అనుమానించిన వారు... సదరు విల్లాలను విక్రయించి చెన్నైకి చెక్కేశారని తెలిపారు. ఆ విషయం గమనించిన విల్లాలను సీజ్ చేసినట్లు చెప్పారు. రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నైకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ రాంజీ ముఠా రెండేళ్ల వ్యవధిలో ఎనిమిది బ్యాంకులను కొల్లగొట్టి... సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, నగదు దొంగిలించారని వివరించారు. ముఠాలో ఎనిమిది మంది సభ్యులు పిక్‌పాకెటర్ల నుంచి గజదొంగల స్థాయికి ఎదిగారన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నాట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. జులాయి ఆదర్శం.. అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాను చూసిన ఈ ముఠా బ్యాంకులను దోచుకోవడం ప్రారంభించారు. ఆ సినిమాలో వలే ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కటర్, వాహనాన్ని ఉపయోగించారు. తొలిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. కోటి విలువైన బంగారం, నగదు దోచుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు, మరో రెండు జిల్లాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు దోచుకున్నారు. ఇబ్రహీంపట్నంలో జనవరి 11వ తేదీన డీసీపీబీని దోచుకునేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు.... అయితే అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో రాంజీ ముఠా సభ్యులు కారును వదిలి పారిపోయారు. ఈ కారుపై దొంగల వేలిముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయింది.