ఖమ్మంక్రైం: అక్కడొక కారు ఆగింది. డ్రైవర్ వద్దకు ఎవడో వచ్చాడు. ‘‘ఇక్కడ నోట్లు పడిపోయాయి. మీవేనా సార్..’’ అన్నాడు. ఆ డ్రైవర్ కిందికి దిగాడు. కింద చెల్లాచెదరుగా పడిపోయిన 50 రూపాయల నోట్లను ఏరుకోసాగాడు. అవి తనవి కాకపోవచ్చేమోన్న అనుమానం ఆ డ్రైవర్‌కు ఏమాత్రం కలగలేదు. ఆ నోట్లన్నీ ఏరుకుని చూసేసరికి.. కారులోని సూట్ కేసు మాయమైంది. నోట్లు పడిపోయాయని చెప్పిన మాయగాడు.. మాయమయ్యాడు..!
ఖమ్మంలోని భద్రాద్రి బ్యాంక్ వద్ద, వైరా రోడ్డులోని వాసన్ ఐ కేర్ వద్ద సోమవారం ఇవి జరిగాయి. బ్యాంక్ వద్ద మాయమైన సూట్‌కేసులో పాతికలక్షల విలువైన నగలున్నాయి. ఐ కేర్ వద్ద మాయమైన సూట్‌కేసులో ల్యాప్‌టాప్, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఈ రెండుచోట్ల సూట్‌కేసులను మాయం చేసింది.. రాంజీ ముఠా..! ఈ ముఠాలోని నలుగురిని వెంటనే పట్టేశారు.. ఖమ్మం పోలీసులు..!!
ఎక్కడిదీ ‘రాంజీ ముఠా’..?
కరెన్సీ నోట్లను ఎరగా వేయడం, విలువైనవి (నగలు–నగదు) కాజేయడం.. ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రద్దీగా ఉండేచోట (బ్యాంకులు, నగల దుకాణాలు, ప్రధాన ప్రదేశాలు) ఈ ముఠా మాటు వేస్తుంది. ఎవరిని దోచుకుంటే గిట్టుబాటవుతుందో అంచనా వేస్తుంది. ఆ తరువాత పనిలోకి దిగుతుంది. క్షణాల్లో ముగిస్తుంది. నిముషాల్లో మాయమవుతుంది. దీని పేరే.. రాంజీ ముఠా. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి వద్ద ‘రాంజీనగర్’ అనే ప్రాంతం ఉంది. అక్కడికి చెందిన కొందరు దోపిడీ ముఠాగా ఏర్పడ్డారు. ఇదిగో.. ఇలా ఈ ముఠా దోపిడీలు సాగిస్తోంది. రాంజీనగర్ నుంచి వచ్చిన ఈ ముఠాకు అదే పేరు స్థిరపడింది.
దోపిడీ ఎలా చేశారంటే....
ఈ ముఠా, దోపిడీ చేసిన తీరును గమనిస్తే.. సామాన్యులమైన మనకు ఆశ్చర్యమేస్తుంది. పట్టపగలు.. రద్దీ ప్రదేశంలో.. కేవలం కొన్ని క్షణాల్లోనే.. కారు అద్దం పగలగొట్టి/లాక్ చేసిన డోర్ తీసి, సూట్‌కేసుతో మాయమవడం.. అంత తేలికైన విషయం కాదు. ఇది ఈ ముఠా ప్రత్యేకత. లాక్ చేసిన కారు అద్దాలను ఏమాత్రం శబ్దం రాకుండా ఈ ముఠా పగలగొట్టగలదు. ఒక రకమైన పదార్థాన్ని ఉండలా చేసి, కారు అద్దానికి గట్టిగా కొడతారు. అంతే.. ఆ పదార్థం అంటుకున్నంత వరకు అద్దం ఏమాత్రం శబ్దం లేకుండా పగులుతుంది. అందులో చేయి పెట్టి కారు లాక్ తీస్తారు. లేదా.. చేతికందినవి తీస్తారు. ఖమ్మంలో ఇలాగే చేశారు.
ఎలా పట్టుకున్నారు..?
దోపిడీ జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు, శరవేగంగా కదిలారు. ఎంత వేగంగా అంటే... కేవలం గంటల్లోనే, జిల్లా సరిహద్దులు దాటక ముందే పట్టేశారు. దోపిడీ సమాచారం అందిన వెంటనే ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాను రంగంలోకి దిగారు. నగరంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అనుమానితులను గమనించారు. కోదాడ వైపు వెళుతున్న బస్సును ముదిగొండ వద్ద పోలీసులు ఆపారు. ఖమ్మం నుంచి అప్పటికే వారికి పక్కా సమాచారం అందింది. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. అంచనా తప్పలేదు..! నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు అధికారులు విచారించారు. తాము రాంజీ ముఠా సభ్యులమేనని ఆ నలుగురు ఒప్పుకున్నారు. ‘‘మేం మొత్తం పదిమందికి పైగా వచ్చాం. నగల సూట్‌కేసుతో మావాళ్లు వెళ్లిపోయారు. ఖమ్మంలో రెండుచోట్ల సూట్‌కేసులు మాయం చేసింది మేమే’’ అని చెప్పారు(ట). ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో చోరీ చేసింది కూడా ఇదే ముఠా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
‘సీసీసీ’లు.. వారెవ్వా...!
‘‘ఒకే ఒక్క సీసీసీ (క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా)... వందమంది పోలీసులతో సమానం..!’’ ఇటీవల, ఓ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ చెప్పిన అక్షర సత్యమన్న విషయం.. ఇక్కడ రుజువైంది. రాంజీ ముఠాను పట్టించింది.. ఈ నిఘా నేత్రాలే!! కమాండ్ కంట్రోల్‌లోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన రెండు ప్రాంతాలతోపాటు ఇతరచోట్ల కొన్న ?సీసీ కెమెరాలు అంత నాణ్యతగా లేవు. కమాండ్ కంట్రోల్‌లోని సీసీ కెమెరాల ద్వారా ముఠా కదలికలను పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.
చలో చెన్నై...!
ఈ ముఠాలోని మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసుల బృందం చెన్నైకి బయల్దేరినట్టు తెలిసింది. ఈ ముఠా మొత్తం చిక్కితే.. వీరి గుట్టంతా రట్టవుతుంది. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా దోచుకుందీ తెలుస్తుంది. మింగినదంతా కక్కించేందుకు వీలవుతుంది. శరవేగంగా స్పందించి, అంతే వేగంగా దోపిడీ దొంగలను పట్టుకున్న ఖమ్మం కమిషనరేట్ పోలీసులకు నగర ప్రజలు సలాం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment