బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
చోరీ కోసం వచ్చి దాడి!
ముంబై పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అలీకాన్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్.. సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
చోరీనా.. కుట్రనా?
సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు..పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌కి లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తి పోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం’ అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
సైఫ్ అలీఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్‌కు గురయ్యయానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దేవర 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025
విలన్‌గా రాణిస్తున్న సైఫ్ అలీఖాన్
ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సైఫ్ అలీఖాన్..ఇటీవల నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భైరవ పాత్రను సైఫ్ పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత సైఫ్ పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 1991లో, సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, అమృతలకు ఇద్దరు పిల్లలు - సారా, ఇబ్రహీం. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ కరీనాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment