అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు | Suspects Identified In Afzalgunj Shooting Incident, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు

Jan 18 2025 11:23 AM | Updated on Jan 18 2025 1:01 PM

Suspects Identified In Afzal Gunj Shooting Incident

అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు.

సాక్షి, హైదరాబాద్‌: అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. మనీష్‌తో అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. నిందితుల చోరీలు వారం రోజుల క్రితం మొదలయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల క్రితం  ఏటీఎం సిబ్బందిని బెదిరించి  మనీష్ అండ్ కో రూ.70 లక్షల రూపాయలు కాజేశారు. గురువారం బీదర్‌లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసి 93 లక్షలు ఎత్తుకెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్‌గంజ్‌ వచ్చిన మనీష్‌ కాల్పులు జరిపాడు. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులు ఉన్నాయి.

గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్‌ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. కేసు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టాడు. మనీష్‌ను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో మనీష్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ గ్రామంలోని హనుమాన్‌ టెంపుల్‌ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్‌పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్‌కల్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్‌ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్‌ పట్టుకొని, మరొకరు బ్యాక్‌ ప్యాక్‌ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్‌ ట్రావెల్స్‌ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్‌ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్‌ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. 

రాయ్‌పూర్‌ వెళ్లడానికి అమిత్‌కుమార్‌ పేరుతో రెండు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్‌ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్‌ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్‌ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్‌ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్‌ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్‌ టాయిలెట్‌లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్‌ పెట్టారు. బ్యాక్‌ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు.  

రోషన్‌ ట్రావెల్స్‌ కార్యాలయం అఫ్జల్‌గంజ్‌ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్‌ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్‌ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్‌ ట్రావెల్స్‌ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్‌ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్‌ ఉద్యోగి జహంగీర్‌ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్‌ ప్యాక్‌ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్‌ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్‌ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్‌ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు.

 

ఇదీ చదవండి: Saif Ali Khan Case: హైప్రొఫైల్‌ కేసులో ఇంత అలసత్వమా?

అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్‌ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్‌ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్‌ ట్రావెల్స్‌ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది.  

దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్‌ మీదుగా సికింద్రాబాద్‌ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్‌ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement