అరెస్టైన రామ్‌జీ ముఠా సభ్యులు
సాక్షి,సిటీబ్యూరో: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పనామా వద్ద గల యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద మే 7వ తేదీన రూ.58,97,600 నగదును చోరీ చేసిన రామ్‌జీనగర్ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల పాటు శ్రమించిన రాచకొండ ఎస్‌ఓటీ, సీసీఎస్, వనస్థలిపురం పోలీసులు.. నగరంలో మరో చోరీ చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యులతో కూడిన ముఠాను వనస్థలిపురం ఆటోనగర్‌లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4.10 లక్షల నగదు, కారు, 15 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ మీడియాకు వివరించారు.
ఏడాదిపాటు నేరాల క్యాలెండర్
తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లా రామ్‌జీనగర్ పేరుతో 15 ఏళ్ల క్రితం గుజరాతీ బిజినెస్‌మెన్ స్పిల్‌మిన్నింగ్ ప్రారంభించారు. దీంతో ఈ ఊరుకి రామ్‌జీనగర్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇక్కడి ప్రజలు ఈజీమనీ కోసం నేరాలబాట పట్టారు. ఏడాదంతా నేరాల కోసం క్యాలెండర్ పెట్టుకోని మరీ చోరీలు చేస్తున్నారు. 15 నుంచి 18 ముఠాలున్న ఈ గ్యాంగ్ సభ్యులు ఒక్కో నెలలో ఒక్కో ముఠా చోరీలు చేస్తుంటుంది. వీరిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, ఢిల్లీ, బెంగళూరు.. ఇలా చాలా రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదయ్యాయి. అయితే, మే 7న వనస్థలిపురంలో చాకచాక్యంగా దొంగతనం చేసిన ఈ ముఠాను పట్టుకునేందుకు వనస్థలిపురం, ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి 45 రోజులు పాటు రామ్‌జీనగర్ పరిసరాల్లో మాటు వేసి ప్రయత్నించారు. అయితే, తొలుత భాషా సమస్యతో వీరితో ఎవరూ మాట్లాడలేదు. 90 శాతం మంది తమిళ భాషలోనే మాట్లాడుతుండటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో తమకు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు ఇక్కడి ముఠా సభ్యుడైన దీపక్ ఇన్‌ఫార్మర్‌ను మర్డర్ చేశాడు. అయితే, రాచకొండ పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నా భయంతో స్థానికులు ఎవరూ సాహసించలేదు. కేసు సవాల్‌గా మారడంతో మరో రెండుసార్లు అక్కడికి వెళ్లి స్థానికులతో మాట్లాడి ముఠాపై నిఘా వేశారు. బుధవారం తెల్లవారుజామూన ఇండికా కారులో వస్తున్న రామ్‌జీనగర్ గ్యాంగ్ నాయకుడు ప్రతిబాన్ దీపక్ అలియాస్ టిప్పు, సత్యరాజ్, యోగేశ్, సురేశ్‌లు పోలీసులకు చిక్కారు. అయితే, అరెస్టయిన నలుగురిని పోలీసు కస్టడీకి తీసుకొని డబ్బు రికవరీపై దృష్టి సారిస్తామని, కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.. పీడీ యాక్ట్ కూడా తెరుస్తామని వివరించారు.
మూడు నెలల శ్రమకు ఫలితం..
ఈ ఏడాది మే 7న పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్‌లో రూ.58,97,600 నగదును డిపాజిట్ చేసేందుకు ఏపీ09టీవీ 2864 టాటా విక్టా వాహనంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్రైవర్, గన్‌మెన్‌తో పాటు రైటర్ సేఫ్‌గార్డు సంస్థకు చెందిన ఇద్దరు కస్టోడియన్లు ఉన్నారు. అయితే, ఇద్దరు కస్టోడియన్లు ఏటీఎం లోపలికి వెళ్లగా అక్కడే వాహనం సమీపంలో రామ్‌జీ ముఠా సభ్యులు కొన్ని నోట్లను పడేసి గన్‌మెన్ దృష్టిని మళ్లించి మొత్తం నగదు బ్యాగ్‌ను ఆటోలో వేసుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. దొగలు అక్కణ్నుంచి రైలులో సొంతూరెళ్లి అటునుంచి పారిపోయారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, లాడ్జ్‌లు అన్నీ గాలించినా ఫలితం లేకపోవడంతో వనస్థలిపురం, ఎస్‌ఓటీ, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి మూడుసార్లు రామ్‌జీనగర్, తిరుచిరపల్లికి వెళ్లొచ్చారు. అయితే అక్కడి లోకల్ అధికారులకు దొంగతనం చేసిన డబ్బుల్లో కొంత అందుతుండటంతో సమాచారం కష్టమైంది. ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో దొంగలపై నిఘా ఉంచిన పోలీసులకు వనస్థలిపురం ఆటోనగర్‌లో బుధవారం ఉదయం దొరికిపోయారు. కారులో మాదకద్రవ్యాలు ఉండటంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అనంతరం ఎల్‌బీనగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, వనస్థలిపురం డీఐ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఇతర సిబ్బందికి రివార్డులిచ్చి సత్కరించారు.
రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా
రామ్‌జీనగర్‌లో 300 నుంచి 500 కుటుంబాలతో 15 నుంచి 18 గ్రూపులు దొంగల ముఠాలున్నాయి. ఈ ముఠా సభ్యులు ఎక్కడైనా దొంగతనానికి వెళితే రూ.30 లక్షలపైన చోరీ చేసి తీసుకొస్తే వెంటనే డబ్బులిచ్చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు దొరికితే పోలీసులు దృష్టిలో ఉంటామనే భావనతో అక్కడి దొంగల ముఠా ఈ నిబంధనను పెట్టుకుంది. ఈ మేరకు పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.50 లక్షలతో కూడిన బ్యాగ్‌తో పరారైన ఈ గ్యాంగ్ వెంటనే ఆ డబ్బు సొతూరిలో ఇచ్చేసి ఇతర ప్రాంతాలకు పరారైంది. ఇదే అంశం వారికి కలిసిరావడంతో పాటు ఈ నేరం జరిగిన వెంటనే రాచకొండ పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసుల వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో చోరీ చేసింది రామ్‌జీ గ్రూప్ అని తెలిసిపోయింది. ఈ విషయం వారికి కూడా తెలిసిపోవడంతో చాకచాక్యంగా పరారయ్యారని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
రామ్‌జీ ముఠా నేరాలు ఇవీ..
ముఠా సభ్యుడు రామ్‌జీనగర్‌కు చెందిన పత్రివన్ దీపక్ అలియాస్ దీపుపై పోలీసులకు సమాచామిచ్చాడని 2012లో ఇన్‌ఫార్మర్‌ను హత్య చేశాడు. ఈ కేసు రామ్‌జీనగర్ ఠాణాలో నమోదైంది. 2017లో విశాఖపట్నం ద్వారాకానగర్ పోలీసు స్టేషన్, గుడివాడ పోలీసు స్టేషన్‌లో అటెన్షన్ డైవర్షన్ కేసులు, 2019లో వనస్థలిపురం అటెన్షన్ డైవర్షన్, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇతని ప్రధాన అనురచరుడు సత్యరాజ్‌పై కూడా వనస్థలిపురంతో పాటు ఇతర ఠాణాల్లో కేసులున్నాయి. యోగరాజ్, సురేశ్‌పై కూడా కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న దీపక్ ముఠా సభ్యులు ముఖేష్, సరవణన్, ఆర్ముగం, తొమోదరన్, కుమారన్, కుమార్, వడివేలు, రాజు, గోకుల్, ఆదిత్యను తొందర్లోనే పట్టుకుంటామని మహేష్ భగవత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment