సాక్షి, సిటీబ్యూరో: వనస్థలిపురంలో ఇటీవల జరిగిన చోరీ రామ్‌జీనగర్ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాల వద్ద మాటువేసి.. నగదు, నగలు తరలించే వారి దృష్టి మళ్లించి దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. ఈ నెల 7న వనస్థలిపురం పరిధిలో ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే వాహనం నుంచి రూ.అర కోటికి పైగా ఎత్తుకుపోయింది వీరేనని గుర్తించిన పోలీసులుఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు తమిళనాడు బయలుదేరి వెళ్లాయి, ఈ ముఠా సభ్యులది తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని రామ్‌జీనగర్ కావడంతో వీరికి రామ్‌జీనగర్ ముఠా అని పేరు వచ్చింది. వీరు ఏడు నుంచి ఎనిమిది మంది కలిసి సంచరిస్తుంటారు. ఈ గ్యాంగ్ ఎక్కువగా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంలు, బంగారు దుకాణాలుండే ప్రాంతాల్లోనూ మాటువేసి భారీ మొత్తంలో నగదు, నగలు తరలించే వారిని గుర్తిస్తుంది.
ఆపై మాటలు, చేతలతో వారి దృష్టి మళ్లించి నగదుతో ఉడాయిస్తుంది. ఎక్కువగా కరెన్సీ నోట్లకు కింద చల్లడం, ఆ డబ్బు తీసుకునేలా టార్గెట్‌ను ప్రేరేపించి దృష్టి మరల్చడం చేస్తుంటుంది. వనస్థలిపురం భారీ చోరీ సైతం ఈ రకంగానే జరిగింది. గతంలో మలక్‌పేట ఎస్‌బీఐ దగ్గర రూ. 20 లక్షలు స్వాహా చేయడం, ఆసిఫ్‌నగర్ పరిధిలోని కెనరా బ్యాంకు దగ్గర శంకరన్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షల లూటీ, సిద్ధి అంబర్‌బజార్‌లో వ్యాపార వేత్త నుంచి 3.2 కిలోల బంగారం స్వాహా... ఇలా వీరు చేసిన నేరాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహాలోనే దృష్టి మళ్లించి చోరీలు చేయడంలో చిత్తూరు జిల్లా నగరి గ్యాంగ్‌కు సైతం మంచి ప్రావీణ్యం ఉంది. అయితే, వనస్థలిపురంలో పంజా విసిరింది రామ్‌జీనగర్ ముఠా మాత్రమే అనడానికి బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేరాలు చేస్తున్న ఫలానా ముఠా అని స్పష్టంగా తెలిసినా... వారి స్వస్థలాలకు వెళ్లి నిందితులను అరెస్టు చేయడం అత్యంత కష్టసాధ్యమని పోలీసులు అంటున్నారు. గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ రకంగా చోరీ చేస్తుండగా నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే మాత్రం... అతను అంగీకరించిన మేర మొత్తం నగదును గ్రామస్తులే పక్కాగా చెల్లిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో వనస్థలిపురంలో నేరం చేసిన ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు చర ్యలు చేపట్టాయి.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
♦ బహిరంగంగా నగదు లావాదేవీలు చేయకూడదు.
♦ సాధ్యమైనంత వరకు భారీ మెుత్తాల మార్పిడి చెక్కులు, డ్రాఫ్టుల ద్వారా చేయాలి.
♦ పెద్ద మెుత్తంలో డబ్బు, నగలు తరలించాల్సి వస్తే తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలి.
♦ ఈ విషయంలో వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్త వహించాలి.
♦ కాలి నడకన, ఆర్టీసీ బస్సుల్లోనూ ఎక్కువ మెుత్తంలో డబ్బు, నగలు తీసుకొని వెళ్లకూడదు.
♦ కారు వంటి వాహనాలలో తీసుకెళ్లే సంచి, సూట్‌కేస్‌లను ఒళ్లోనే పెట్టుకోవాలి.
♦ ఎవరైన మీ వద్దకు వచ్చి డబ్బులు కిందపడ్డాయని, దుస్తులు, వాహనాలపై మరకలు పడ్డాయని, టైర్లలో గాలి పోయిందని, పెట్రోల్ కారుతోందని చెప్పినా, అర్థంకాని సైగలు చేసినా అప్రమత్తమవ్వాలి.
♦ వాహనం దిగే సమయంలో మీ దృష్టిని నగదు, నగల పైనుంచి మళ్లనీయకండి.
♦ ఎవరిపైనైనా అనుమానం కలిగితే 100 ఫోన్ చేయాలి లేదా పోలీసు అధికారిక వాట్సాప్, హాక్ ఐ యాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment