atm robbery gang
-
ఏటీఎం దొంగలు దొరికారు
సాక్షి, మొయినాబాద్ : జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాగా ఏర్పడి ఈజీగా మనీ సంపాదించాలని దొంగతనాన్ని ఎంచుకున్నారు. ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా ఇరవై రోజుల వ్యవధిలో మొయినాబాద్, నార్సింగి, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించి విఫలమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సోమవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ సర్ఫరాజ్, మహ్మద్ అమీర్ రయీస్, అబ్దుల్ రహీం, మొయినాబాద్ మండలం ముర్తూజగూడ గ్రామానికి చెందిన మహ్మద్ ఫర్దీన్ స్నేహితులు. వీరిలో మహ్మద్ సర్ఫరాజ్ ఇంటర్ చదువుతుండగా మిగిలిన వారు ఇంటర్ వరకు చదివి ప్రైవేటు కంపెనీల్లో పనులు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రాల్లో చొరబడి మిషన్‌ను ధ్వంసం చేసి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేశారు. అర్ధరాత్రి చోరీలు... ముఠాగా ఏర్పడిన ఈ నలుగురు యువకులు ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా చోరీలు మొదలుపెట్టారు. జూన్ 27 అర్ధరాత్రి 2 గంటల సమయంలో మొయినాబాద్‌లో అంజనాదేవి గార్డెన్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్ ఎదుట ఉన్న సీసీ కెమరాలు ధ్వంసం చేసి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని డబ్బు తీసేందుకు ప్రయత్నించారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఉన్న బాక్స్ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అదే విధంగా జులై 11న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మొయినాబాద్ మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న యాక్సీస్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించారు. మనీ బాక్సు తెరుచుకోకపోవడంతో అక్కడ కూడా వారికి డబ్బులేమీ దొరకలేదు. అన్ని చోట్ల విఫలమే... మొయినాబాద్ మండలంలోని రెండు ఏటీఎం సెంటర్లతో పాటు 20 రోజుల వ్యవధిలో నార్సింగి పీఎస్ పరిధిలో మూడు చోట్ల, రాయదుర్గం పీఎస్ పరిధిలో ఒక చోట ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించారు. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు యత్నించిన దుండగులు అన్ని చోట్ల విఫలమయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుబడ్డారు ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించిన ముఠాను పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించారు. నిందితులు ఎక్కడ ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించినా.. అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే నిందితులు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చే దృశ్యాలు అప్పటికే నిక్షిప్తమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం మొయినాబాద్ మండలంలోని జేబీఐటీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వస్తున్న ముగ్గురు నిందితులు మహ్మద్ సర్ఫరాజ్, మహ్మద్ అమీర్ రయీస్, మహ్మద్ ఫర్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్‌తో పాటు ఒక టూల్ కిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రియాండ్‌కు తరలించారు. కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన మొయినాబాద్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్, కానిస్టేబుళ్లను డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి అభినందించారు. -
‘తీగ’ లాగితే...
సాక్షి, సిటీబ్యూరో/నేరేడ్మెట్: సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన బావ,బావమరుదుల బీబీనగర్‌లోని ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కడంతో 2016 ఫిబ్రవరిలో ఆంధ్రాబ్యాంక్‌లో జరిగిన నాలుగు కిలోల బంగారు ఆభరణాల చోరీ గుట్టురట్టయ్యింది. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డిలతో కలిసి అదనపు పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు బుధవారం మీడియాకు వెల్లడించారు. బొడుప్పల్ గాయత్రీనగర్‌కు చెందిన పెరిక ఎబ్బీ బేగంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్‌గా పని చేసేవాడు. అతను తన బావమరిది కత్తుల శివకుమార్‌తో కలిసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు బ్యాంక్ దోపిడీ చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఆన్లైన్లో హైడ్రాలిక్ కట్టర్, కంప్రెషర్, స్క్రూడ్రైవర్, కిట్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఘట్కేసర్, బీబీనగర్ ప్రాంతాల్లోని బ్యాంక్‌ల వద్ద రెక్కీ నిర్వహించారు. హైవేకు సమీపంలో ఉన్న ఎస్బీఐలో చోరీ చేస్తే పారిపోయేందుకు సులువుగా ఉంటుందని భావించి అందుకు స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. జూన్ 4న స్థానిక సంస్థల ఫలితాలు, ఐదు, ఆరు తేదీల్లో రంజాన్ పండుగ నేపథ్యంలో పోలీసులు బందోబస్తులో బిజీగా ఉన్నారు. 8, 9 తేదీల్లో వరుసగా బ్యాంక్ సెలవులు ఉండటాన్ని అవకాశంగా మలచుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 7న రాత్రి చోరీకి పథకం పన్నిన వీరు అందుకు అవసరమైన పరికరాలను ముందుగానే బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచారు. రాత్రి జనసంచారం తగ్గగానే పెరిక ఎబ్బీ అలియాస్ చిన్నా భవనం మొదటి అంతస్తులో ఉన్న బ్యాంక్ వెనుకవైపున కిటికీ గ్రిల్‌ను కట్టర్‌తో తొలగించాడు. అనంతరం బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు కరెంట్ వైర్లను కత్తిరించే ప్రయత్నంలో ఏటీఎంకు అనుసంధానంగా ఉన్న వైర్లను కూడా కట్ చేశాడు. అయితే అదే సమయంలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు లావాదేవీలు జరగడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోనే బయటి వ్యక్తుల కదలికలను గమనిస్తున్న శివకుమార్ ఎబ్బీని అప్రమత్తం చేయడంతో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించగా అనుమానాస్పదంగా ఉన్న ఏపీ24ఏహెచ్ 0644బైక్‌ను గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా నిందితులు శివకుమార్, పెరిక ఎబ్బీని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ఘట్కేసర్ ప్రాంతంలోని ఆంధ్రా బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.25,52,358 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొమ్ముతో జల్సా... ఆంధ్రాబ్యాంక్‌లో చోరీచేసిన నాలుగు కిలోల బంగారంలో అర కిలో బంధువుల పెళ్లికి ఖర్చు చేశారు. మరో అరకిలో విక్రయించగా వచ్చిన సొమ్ముతో కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మిగతా 3 కిలోల బంగారాన్ని బెంగళూరులో ఉంటున్న అక్క, బావల వద్ద ఉంచినట్లు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం వారి నుంచి 510 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన చోరీ సొత్తును బెంగళూరులో ఉంటున్న వారి బంధువుల నుంచి స్వాధీనం చేసుకుంటామని అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. బైక్‌పై ఈ–చలాన్... పంజాగుట్ట ఎక్స్‌రోడ్డులో ఈ ఏడాది ఫిబ్రవరి 9న మధ్యాహ్నం ట్రిపుల్ రైడింగ్‌తో వెళుతున్న నిందితుడు కత్తుల శివకుమార్‌కు చెందిన ఏపీ24ఏహెచ్ 0644యాక్టివాపై ట్రాఫిక్ పోలీసులు రూ.1200 జరిమానా విధించారు. -
కొనసాగుతున్న వేట
సాక్షి, సిటీబ్యూరో: వనస్థలిపురంలో ఇటీవల జరిగిన చోరీ రామ్జీనగర్ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాల వద్ద మాటువేసి.. నగదు, నగలు తరలించే వారి దృష్టి మళ్లించి దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. ఈ నెల 7న వనస్థలిపురం పరిధిలో ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే వాహనం నుంచి రూ.అర కోటికి పైగా ఎత్తుకుపోయింది వీరేనని గుర్తించిన పోలీసులుఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు తమిళనాడు బయలుదేరి వెళ్లాయి, ఈ ముఠా సభ్యులది తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని రామ్జీనగర్ కావడంతో వీరికి రామ్జీనగర్ ముఠా అని పేరు వచ్చింది. వీరు ఏడు నుంచి ఎనిమిది మంది కలిసి సంచరిస్తుంటారు. ఈ గ్యాంగ్ ఎక్కువగా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంలు, బంగారు దుకాణాలుండే ప్రాంతాల్లోనూ మాటువేసి భారీ మొత్తంలో నగదు, నగలు తరలించే వారిని గుర్తిస్తుంది. ఆపై మాటలు, చేతలతో వారి దృష్టి మళ్లించి నగదుతో ఉడాయిస్తుంది. ఎక్కువగా కరెన్సీ నోట్లకు కింద చల్లడం, ఆ డబ్బు తీసుకునేలా టార్గెట్‌ను ప్రేరేపించి దృష్టి మరల్చడం చేస్తుంటుంది. వనస్థలిపురం భారీ చోరీ సైతం ఈ రకంగానే జరిగింది. గతంలో మలక్‌పేట ఎస్బీఐ దగ్గర రూ. 20 లక్షలు స్వాహా చేయడం, ఆసిఫ్‌నగర్ పరిధిలోని కెనరా బ్యాంకు దగ్గర శంకరన్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షల లూటీ, సిద్ధి అంబర్‌బజార్‌లో వ్యాపార వేత్త నుంచి 3.2 కిలోల బంగారం స్వాహా... ఇలా వీరు చేసిన నేరాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహాలోనే దృష్టి మళ్లించి చోరీలు చేయడంలో చిత్తూరు జిల్లా నగరి గ్యాంగ్‌కు సైతం మంచి ప్రావీణ్యం ఉంది. అయితే, వనస్థలిపురంలో పంజా విసిరింది రామ్జీనగర్ ముఠా మాత్రమే అనడానికి బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేరాలు చేస్తున్న ఫలానా ముఠా అని స్పష్టంగా తెలిసినా... వారి స్వస్థలాలకు వెళ్లి నిందితులను అరెస్టు చేయడం అత్యంత కష్టసాధ్యమని పోలీసులు అంటున్నారు. గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ రకంగా చోరీ చేస్తుండగా నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే మాత్రం... అతను అంగీకరించిన మేర మొత్తం నగదును గ్రామస్తులే పక్కాగా చెల్లిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో వనస్థలిపురంలో నేరం చేసిన ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు చర ్యలు చేపట్టాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. ♦ బహిరంగంగా నగదు లావాదేవీలు చేయకూడదు. ♦ సాధ్యమైనంత వరకు భారీ మెుత్తాల మార్పిడి చెక్కులు, డ్రాఫ్టుల ద్వారా చేయాలి. ♦ పెద్ద మెుత్తంలో డబ్బు, నగలు తరలించాల్సి వస్తే తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలి. ♦ ఈ విషయంలో వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్త వహించాలి. ♦ కాలి నడకన, ఆర్టీసీ బస్సుల్లోనూ ఎక్కువ మెుత్తంలో డబ్బు, నగలు తీసుకొని వెళ్లకూడదు. ♦ కారు వంటి వాహనాలలో తీసుకెళ్లే సంచి, సూట్‌కేస్‌లను ఒళ్లోనే పెట్టుకోవాలి. ♦ ఎవరైన మీ వద్దకు వచ్చి డబ్బులు కిందపడ్డాయని, దుస్తులు, వాహనాలపై మరకలు పడ్డాయని, టైర్లలో గాలి పోయిందని, పెట్రోల్ కారుతోందని చెప్పినా, అర్థంకాని సైగలు చేసినా అప్రమత్తమవ్వాలి. ♦ వాహనం దిగే సమయంలో మీ దృష్టిని నగదు, నగల పైనుంచి మళ్లనీయకండి. ♦ ఎవరిపైనైనా అనుమానం కలిగితే 100 ఫోన్ చేయాలి లేదా పోలీసు అధికారిక వాట్సాప్, హాక్ ఐ యాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలి. -
ధనవంతురాలిని పెళ్లి చేసుకునేందుకు
చూసేందుకు చక్కగా, అందర్నీ ఆకర్షించే రీతిలో కనిపిస్తారు. బీఎం డబ్ల్యూ, ఇన్నోవా కార్లలో చక్కర్లు కొడుతూ, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. అందరి కళ్లకు మసిపూసి, స్కిమ్మర్ల సాయంతో ఏటీఎంలకు వచ్చే వారి ఖాతాల్లోని నగదును మాయం చేస్తూ చెక్కేస్తుంటారు. పట్టభద్రులైన యువతతో కూడిన ఈ ముఠా చాప కింద నీరులా సాగిస్తున్న పాపం పండి కోయంబత్తూరు పోలీసులకు చిక్కింది. ఆరుగురితో కూడిన ఈ ముఠా ఐదు రాష్ట్రాల్లో ఐదుకోట్ల మేరకు నగదును ఏటీఎంల ద్వారా అపహరించి ఉన్నట్టు విచారణలో తేలింది. సాక్షి, చెన్నై : ఈనెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోయంబత్తూరు శింగానల్లూరులోని ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంకు వచ్చి వెళ్లిన పదిహేను మంది ఖాతాల్లో నగదు మాయం అయింది. ఈ నగదు అంతా బెంగళూరులోని ఓ ఏటీఎం సెంట ర్ నుంచి డ్రా చేసినట్టు ఆయా ఖాతాదారులకు ఎస్ఎంఎస్ సమాచారం అందింది. ఒకేరోజు పది హేను మంది అకౌంట్లలో నగదు మాయం కావడంతో ఆ బ్యాంక్ అధికారులు సైబర్ క్రైంకు ఫిర్యాదుచేశారు. శింగానల్లూరు ఏటీఎంలో తనిఖీ చేయగా ఓ స్కిమ్మర్, స్లిట్ ఏసీ పైభాగంలో ఓ సెల్‌ఫోన్ చిక్కింది. దీంతో ఐదో తేదీ నుంచి ఆ ఏటీఎంకు వచ్చి వెళ్లిన వారి వీడియో పుటేజీలను పరిశీలించారు. ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా పదే పదే ఏటీఎంలోకి వచ్చి వెళ్లడంతో వారి మీద అనుమానాలు వచ్చాయి. ఆ ముగ్గురి ఫొటోలను కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నీలగిరి పోలీసులకు పంపించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శుక్రవా రం రాత్రి కృష్ణగిరి టోల్ ప్లాజా వైపు ఓ బీఎం డబ్ల్యూ, ఇన్నోవా కారు ఆగడం, సమీపంలోని ఏటీఎంలకు ముగ్గురు యువకులు వెళ్తుండడాన్ని అక్కడే విధుల్లో ఉన్న గస్తీ పోలీసులు గుర్తించారు. తక్షణం ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్న ఆ బృం దం సభ్యులు పథకం ప్రకారం తమ వద్ద ఉన్న ఫొటోలతో వారి ముఖాల్ని సరి చూసుకున్నారు. ముఖ పోలికలు ఉండడంతో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్లను, అందులో ఉన్న ఓ స్కిమ్మర్, నాలుగు ల్యాప్ టాప్, పదిహేనుకు పై గా సెల్ ఫోన్లను, 20 ఏటీఎంలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు తరలించి శనివారం అంతా వారి వద్ద విచారణ సాగించారు. విచారణలో ఏటీఎంలలో నగదు మాయం చేయడం లక్ష్యంగా తాము లగ్జరీ జీవితంతో ముందుకు సాగుతున్నామని వారు అంగీకరించారు. విలాస జీవితం కోసం : పట్టుబడ్డ వారు కృష్ణగిరి చెందిన తమిళరస్(20), వాసీం(30), శ్రీలంకనుంచి చెన్నైకి వచ్చి స్థిరపడ్డ శాంతను(30),తిరుచ్చికి చెందిన ఇషాక్(25), తిరుప్పూర్‌కు చెందిన మనోహర్(19), కానత్తూరుకు చెందిన నిరంజన్(25)గా గుర్తించారు. వారిలో తమిళరసన్ కోయంబత్తూరులోని ఓ కళాశాలలో బీఈ చదువుతున్నాడు. నిరంజన్ డిప్లొమో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. పదో తరగతి చదువుకున్న శాంతను ద్వారా వారందరూ ఏకం అయ్యారు. ఈ ముఠాకు నాయకుడిగా శాంతను వ్యవహరిస్తుండగా, సాంకేతికపరంగా నిరంజన్ పూర్తి సహకారం అందించే వాడు. మిగిలిన వారు ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చడం, నగదును డ్రాచేసి తీసుకొచ్చి ఇస్తూ వచ్చారు. ఈనెల ఐదో తేదీన శింగానల్లూరులోని ఏటీఎం వద్ద మనోహర్, వాసీం, ఇషాక్ స్కిమ్మర్ అమర్చారు. అలాగే, ఏసీ పైభాగంలో కేవలం ఇంటర్నెట్ సదుపాయం కల్గిన ఓ సెల్‌ఫోన్ అమర్చారు. దీని ద్వారా అక్కడికి వచ్చిన వారి బ్యాంక్ ఖాతా నంబర్లు, పిన్ నంబర్లను బీఎండబ్ల్యూ కారులో కూర్చుని ఉన్న నిరంజన్, తమిళరసన్ తమ ల్యాప్‌టాప్‌లకు వచ్చే సమాచారం మేరకు తస్కరించారు. దానిని ఇన్నోవాలో ఉన్న శాంతనుకు చేరవేశారు. దీని ఆధారంగా శాంతను నకిలీ ఏటీఎం కార్డులు సృష్టించాడు. అక్కడి నుంచి జారుకున్న మిగిలిన వాళ్లు బెంగళూరుకు వెళ్లి తమ వద్ద ఉన్న నకిలీ ఏటీఎం కార్డుల ద్వారా నగదును డ్రా చేశారు. విలాస జీవితాన్ని గడిపి, తాము అమర్చి ఉన్న స్కిమ్మర్‌ను తొలగించేందుకు వస్తూ ప్రత్యేక బృందానికి చిక్కారు. ఐదు రాష్ట్రాల్లో చేతివాటం ఈ ముఠా ఐదు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చడం, నగదు మాయం చేయడం చేస్తూ వచ్చింది. స్కిమ్మర్లను శాంతను చైనా నుంచి శ్రీలంక మీదుగా చెన్నైకి తెప్పించినట్టు విచారణలో తేలింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో అనేక ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చి నగదు డ్రా చేసుకుని గోవాకు చెక్కేస్తూ వచ్చారు. ఎక్కడకు వెళ్లినా లగ్జరీ జీవితాన్ని అనుభవించే రీతిలో స్టార్ హోటళ్లల్లో దిగడం, తాము సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చినట్టుగా సమాచారం ఇస్తూ వచ్చారు. తమ వద్ద ఉన్న కార్డుల ద్వారా పెట్రోల్ బంకుల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు విచారణలో తేలింది. 2016 నుంచి ఈ ముఠా గుట్టుచప్పుడు కాకుండా తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చినట్టు గుర్తించారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఐదుకోట్ల మేరకు నగదు ఏటీఎంల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల నుంచి మాయం చేసినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సమయంలో విమానంలోనే ఈ ఆరుగురు వేర్వేరుగా పర్యటించేవారు. ఆన్లైన్ ద్వారానే హోటళ్లను బుక్ చేసుకోవడం, లగ్జరీగా జీవితాన్ని గడుపుతూ పెద్ద మొత్తంలో నగదును దుబారా చేసినట్టు విచారణలో గుర్తించారు. ధనవంతురాలిని ప్రేమించిన నిరంజన్ నిరంజన్ బెంగళూరులో ఓ బంగ్లా సైతం కొనుగోలు చేసి ఉన్నట్టు తేలింది. చెన్నైలో తాను ప్రేమించిన ధనవంతురాలైన యువతిని పెళ్లి చేసుకునేందుకు అడ్డదారిలో కోటీశ్వరుడు కావాలన్న లక్ష్యంతో రేయింబవళ్లు ఏటీఎంల చుట్టూ తిరిగినట్టుగా నిరంజన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఆరుగుర్ని శనివారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి కోయంబత్తూరు కేంద్ర కారాగారా నికి తరలించారు. వారిని తమ కస్టడీకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కోయంబత్తూరు పోలీసులు సిద్ధం అయ్యారు. -
క్రైం బ్రాంచి పోలీసా.. మజాకా!
ఆయన ఢిల్లీ క్రైం బ్రాంచిలో పేరుమోసిన పోలీసు. ఆరు నెలల క్రితం ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఎట్టకేలకు ఆయన ఎక్కడున్నారో తెలిసింది. తీరా తెలిసిన తర్వాత పోలీసులు తల పట్టుకోవాల్సి వచ్చింది. అస్లుప్ ఖాన్ అనే ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో ఏటీఎం దోపిడీ గ్యాంగుకు నాయకుడని తేలింది. కేరళకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొన్నీమధ్య ఆ గ్యాంగులోని ఓ సభ్యుడైన సురేష్‌ను ఢిల్లీలో అరెస్టు చేసింది. సురేష్ స్విఫ్ట్ కారులో వెళ్తుండగా కస్తూర్బా గాంధీ మార్గ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అళప్పుళ జిల్లా ఎస్పీ వీఎం మహ్మద్ రఫీక్ తెలిపారు. అతడిని విచారించగా అస్లుప్ ఖాన్ విషయం కూడా తెలిసింది. ఢిల్లీ క్రైం బ్రాంచిలో ఆర్కే పురం స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఖాన్.. డిసెంబర్లో నెల రోజుల సెలవు పెట్టారు. ఆ తర్వాత సెలవును మరో నెల పొడిగించారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఏమైపోయారో ఎవరికీ తెలియలేదు. సురేష్‌ను అరెస్టు చేసిన తర్వాత వాళ్ల గ్యాంగు దోపిడీ వ్యవహారం మొత్తం బయటపడింది. సురేష్ మొదట్లో ఒక ఇన్ఫార్మర్గా ఖాన్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా అంతా కలిసి ఏటీఎంల దోపిడీకి శ్రీకారం చుట్టారు. కేరళలోని చెరియనాడు, కాళకూటం, రామాపురం, కంజికుళ్ ప్రాంతాల్లో పలు ఏటీఎంలను ఈ గ్యాంగు దోచుకుంది. సురేష్ ముందుగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ, సెక్యూరిటీ లేని ఏటీఎంలు ఎక్కడున్నాయో గమనిస్తాడు. ఆ తర్వాత ఖాన్, సురేష్ కలిసి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తారు. ఏటీఎంల గురించి బాగా తెలిసిన ఇతర గ్యాంగుసభ్యులు గ్యాస్ కట్టర్‌తో మిషన్లను కట్ చేస్తారు. అదే సమయంలో లోపలున్న నోట్లు కాలిపోకుండా వాళ్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సీసీ టీవీల దృష్టిలో పడకుండా ఇదంతా చేయడం వీరి ప్రత్యేకత. వీళ్లు ఉపయోగించే కారు నంబర్.. ఒక అంబులెన్స్ పేరు మీద రిజిస్టర్ అయింది. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ దోపిడీ గ్యాంగు నడిపాడు. మరి పోలీసా.. మజాకా!