చూసేందుకు చక్కగా, అందర్నీ ఆకర్షించే రీతిలో కనిపిస్తారు. బీఎం డబ్ల్యూ, ఇన్నోవా కార్లలో చక్కర్లు కొడుతూ, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. అందరి కళ్లకు మసిపూసి, స్కిమ్మర్ల సాయంతో ఏటీఎంలకు వచ్చే వారి ఖాతాల్లోని నగదును మాయం చేస్తూ చెక్కేస్తుంటారు. పట్టభద్రులైన యువతతో కూడిన ఈ ముఠా చాప కింద నీరులా సాగిస్తున్న పాపం పండి కోయంబత్తూరు పోలీసులకు చిక్కింది. ఆరుగురితో కూడిన ఈ ముఠా ఐదు రాష్ట్రాల్లో ఐదుకోట్ల మేరకు నగదును ఏటీఎంల ద్వారా అపహరించి ఉన్నట్టు విచారణలో తేలింది.
సాక్షి, చెన్నై : ఈనెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోయంబత్తూరు శింగానల్లూరులోని ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంకు వచ్చి వెళ్లిన పదిహేను మంది ఖాతాల్లో నగదు మాయం అయింది. ఈ నగదు అంతా బెంగళూరులోని ఓ ఏటీఎం సెంట ర్ నుంచి డ్రా చేసినట్టు ఆయా ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్ సమాచారం అందింది. ఒకేరోజు పది హేను మంది అకౌంట్లలో నగదు మాయం కావడంతో ఆ బ్యాంక్ అధికారులు సైబర్ క్రైంకు ఫిర్యాదుచేశారు. శింగానల్లూరు ఏటీఎంలో తనిఖీ చేయగా ఓ స్కిమ్మర్, స్లిట్ ఏసీ పైభాగంలో ఓ సెల్‌ఫోన్ చిక్కింది. దీంతో ఐదో తేదీ నుంచి ఆ ఏటీఎంకు వచ్చి వెళ్లిన వారి వీడియో పుటేజీలను పరిశీలించారు. ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా పదే పదే ఏటీఎంలోకి వచ్చి వెళ్లడంతో వారి మీద అనుమానాలు వచ్చాయి.
ఆ ముగ్గురి ఫొటోలను కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నీలగిరి పోలీసులకు పంపించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శుక్రవా రం రాత్రి కృష్ణగిరి టోల్ ప్లాజా వైపు ఓ బీఎం డబ్ల్యూ, ఇన్నోవా కారు ఆగడం, సమీపంలోని ఏటీఎంలకు ముగ్గురు యువకులు వెళ్తుండడాన్ని అక్కడే విధుల్లో ఉన్న గస్తీ పోలీసులు గుర్తించారు. తక్షణం ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్న ఆ బృం దం సభ్యులు పథకం ప్రకారం తమ వద్ద ఉన్న ఫొటోలతో వారి ముఖాల్ని సరి చూసుకున్నారు. ముఖ పోలికలు ఉండడంతో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్లను, అందులో ఉన్న ఓ స్కిమ్మర్, నాలుగు ల్యాప్ టాప్, పదిహేనుకు పై గా సెల్ ఫోన్లను, 20 ఏటీఎంలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు తరలించి శనివారం అంతా వారి వద్ద విచారణ సాగించారు. విచారణలో ఏటీఎంలలో నగదు మాయం చేయడం లక్ష్యంగా తాము లగ్జరీ జీవితంతో ముందుకు సాగుతున్నామని వారు అంగీకరించారు.
విలాస జీవితం కోసం : పట్టుబడ్డ వారు కృష్ణగిరి చెందిన తమిళరస్(20), వాసీం(30), శ్రీలంకనుంచి చెన్నైకి వచ్చి స్థిరపడ్డ శాంతను(30),తిరుచ్చికి చెందిన ఇషాక్(25), తిరుప్పూర్‌కు చెందిన మనోహర్(19), కానత్తూరుకు చెందిన నిరంజన్(25)గా గుర్తించారు. వారిలో తమిళరసన్ కోయంబత్తూరులోని ఓ కళాశాలలో బీఈ చదువుతున్నాడు. నిరంజన్ డిప్లొమో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. పదో తరగతి చదువుకున్న శాంతను ద్వారా వారందరూ ఏకం అయ్యారు. ఈ ముఠాకు నాయకుడిగా శాంతను వ్యవహరిస్తుండగా, సాంకేతికపరంగా నిరంజన్ పూర్తి సహకారం అందించే వాడు. మిగిలిన వారు ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చడం, నగదును డ్రాచేసి తీసుకొచ్చి ఇస్తూ వచ్చారు. ఈనెల ఐదో తేదీన శింగానల్లూరులోని ఏటీఎం వద్ద మనోహర్, వాసీం, ఇషాక్ స్కిమ్మర్ అమర్చారు. అలాగే, ఏసీ పైభాగంలో కేవలం ఇంటర్నెట్ సదుపాయం కల్గిన ఓ సెల్‌ఫోన్ అమర్చారు. దీని ద్వారా అక్కడికి వచ్చిన వారి బ్యాంక్ ఖాతా నంబర్లు, పిన్ నంబర్లను బీఎండబ్ల్యూ కారులో కూర్చుని ఉన్న నిరంజన్, తమిళరసన్ తమ ల్యాప్‌టాప్‌లకు వచ్చే సమాచారం మేరకు తస్కరించారు. దానిని ఇన్నోవాలో ఉన్న శాంతనుకు చేరవేశారు. దీని ఆధారంగా శాంతను నకిలీ ఏటీఎం కార్డులు సృష్టించాడు. అక్కడి నుంచి జారుకున్న మిగిలిన వాళ్లు బెంగళూరుకు వెళ్లి తమ వద్ద ఉన్న నకిలీ ఏటీఎం కార్డుల ద్వారా నగదును డ్రా చేశారు. విలాస జీవితాన్ని గడిపి, తాము అమర్చి ఉన్న స్కిమ్మర్‌ను తొలగించేందుకు వస్తూ ప్రత్యేక బృందానికి చిక్కారు.
ఐదు రాష్ట్రాల్లో చేతివాటం
ఈ ముఠా ఐదు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చడం, నగదు మాయం చేయడం చేస్తూ వచ్చింది. స్కిమ్మర్లను శాంతను చైనా నుంచి శ్రీలంక మీదుగా చెన్నైకి తెప్పించినట్టు విచారణలో తేలింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో అనేక ఏటీఎంలలో స్కిమ్మర్లను అమర్చి నగదు డ్రా చేసుకుని గోవాకు చెక్కేస్తూ వచ్చారు. ఎక్కడకు వెళ్లినా లగ్జరీ జీవితాన్ని అనుభవించే రీతిలో స్టార్ హోటళ్లల్లో దిగడం, తాము సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చినట్టుగా సమాచారం ఇస్తూ వచ్చారు. తమ వద్ద ఉన్న కార్డుల ద్వారా పెట్రోల్ బంకుల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు విచారణలో తేలింది. 2016 నుంచి ఈ ముఠా గుట్టుచప్పుడు కాకుండా తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చినట్టు గుర్తించారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఐదుకోట్ల మేరకు నగదు ఏటీఎంల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల నుంచి మాయం చేసినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సమయంలో విమానంలోనే ఈ ఆరుగురు వేర్వేరుగా పర్యటించేవారు. ఆన్‌లైన్ ద్వారానే హోటళ్లను బుక్ చేసుకోవడం, లగ్జరీగా జీవితాన్ని గడుపుతూ పెద్ద మొత్తంలో నగదును దుబారా చేసినట్టు విచారణలో గుర్తించారు.
ధనవంతురాలిని ప్రేమించిన నిరంజన్
నిరంజన్ బెంగళూరులో ఓ బంగ్లా సైతం కొనుగోలు చేసి ఉన్నట్టు తేలింది. చెన్నైలో తాను ప్రేమించిన ధనవంతురాలైన యువతిని పెళ్లి చేసుకునేందుకు అడ్డదారిలో కోటీశ్వరుడు కావాలన్న లక్ష్యంతో రేయింబవళ్లు ఏటీఎంల చుట్టూ తిరిగినట్టుగా నిరంజన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఆరుగుర్ని శనివారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి కోయంబత్తూరు కేంద్ర కారాగారా నికి తరలించారు. వారిని తమ కస్టడీకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కోయంబత్తూరు పోలీసులు సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment