స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును చూపుతున్న అదనపు సీపీ సుధీర్ బాబు ,బైక్‌పై ఈ–చలాన్
సాక్షి, సిటీబ్యూరో/నేరేడ్‌మెట్: సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన బావ,బావమరుదుల బీబీనగర్‌లోని ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కడంతో 2016 ఫిబ్రవరిలో ఆంధ్రాబ్యాంక్‌లో జరిగిన నాలుగు కిలోల బంగారు ఆభరణాల చోరీ గుట్టురట్టయ్యింది. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డిలతో కలిసి అదనపు పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు బుధవారం మీడియాకు వెల్లడించారు. బొడుప్పల్ గాయత్రీనగర్‌కు చెందిన పెరిక ఎబ్బీ బేగంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్‌గా పని చేసేవాడు. అతను తన బావమరిది కత్తుల శివకుమార్‌తో కలిసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు బ్యాంక్ దోపిడీ చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో హైడ్రాలిక్ కట్టర్, కంప్రెషర్, స్క్రూడ్రైవర్, కిట్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఘట్‌కేసర్, బీబీనగర్ ప్రాంతాల్లోని బ్యాంక్‌ల వద్ద రెక్కీ నిర్వహించారు. హైవేకు సమీపంలో ఉన్న ఎస్‌బీఐలో చోరీ చేస్తే పారిపోయేందుకు సులువుగా ఉంటుందని భావించి అందుకు స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. జూన్ 4న స్థానిక సంస్థల ఫలితాలు, ఐదు, ఆరు తేదీల్లో రంజాన్ పండుగ నేపథ్యంలో పోలీసులు బందోబస్తులో బిజీగా ఉన్నారు. 8, 9 తేదీల్లో వరుసగా బ్యాంక్ సెలవులు ఉండటాన్ని అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ 7న రాత్రి చోరీకి పథకం పన్నిన వీరు అందుకు అవసరమైన పరికరాలను ముందుగానే బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచారు. రాత్రి జనసంచారం తగ్గగానే పెరిక ఎబ్బీ అలియాస్ చిన్నా భవనం మొదటి అంతస్తులో ఉన్న బ్యాంక్ వెనుకవైపున కిటికీ గ్రిల్‌ను కట్టర్‌తో తొలగించాడు. అనంతరం బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు కరెంట్ వైర్లను కత్తిరించే ప్రయత్నంలో ఏటీఎంకు అనుసంధానంగా ఉన్న వైర్లను కూడా కట్ చేశాడు. అయితే అదే సమయంలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు లావాదేవీలు జరగడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోనే బయటి వ్యక్తుల కదలికలను గమనిస్తున్న శివకుమార్ ఎబ్బీని అప్రమత్తం చేయడంతో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించగా అనుమానాస్పదంగా ఉన్న ఏపీ24ఏహెచ్ 0644బైక్‌ను గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా నిందితులు శివకుమార్, పెరిక ఎబ్బీని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఆంధ్రా బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.25,52,358 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ సొమ్ముతో జల్సా...
ఆంధ్రాబ్యాంక్‌లో చోరీచేసిన నాలుగు కిలోల బంగారంలో అర కిలో బంధువుల పెళ్లికి ఖర్చు చేశారు. మరో అరకిలో విక్రయించగా వచ్చిన సొమ్ముతో కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మిగతా 3 కిలోల బంగారాన్ని బెంగళూరులో ఉంటున్న అక్క, బావల వద్ద ఉంచినట్లు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం వారి నుంచి 510 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన చోరీ సొత్తును బెంగళూరులో ఉంటున్న వారి బంధువుల నుంచి స్వాధీనం చేసుకుంటామని అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
బైక్‌పై ఈ–చలాన్...
పంజాగుట్ట ఎక్స్‌రోడ్డులో ఈ ఏడాది ఫిబ్రవరి 9న మధ్యాహ్నం ట్రిపుల్ రైడింగ్‌తో వెళుతున్న నిందితుడు కత్తుల శివకుమార్‌కు చెందిన ఏపీ24ఏహెచ్ 0644యాక్టివాపై ట్రాఫిక్ పోలీసులు రూ.1200 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment