క్రైం బ్రాంచి పోలీసా.. మజాకా!
ఆయన ఢిల్లీ క్రైం బ్రాంచిలో పేరుమోసిన పోలీసు. ఆరు నెలల క్రితం ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఎట్టకేలకు ఆయన ఎక్కడున్నారో తెలిసింది. తీరా తెలిసిన తర్వాత పోలీసులు తల పట్టుకోవాల్సి వచ్చింది. అస్లుప్ ఖాన్ అనే ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో ఏటీఎం దోపిడీ గ్యాంగుకు నాయకుడని తేలింది. కేరళకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొన్నీమధ్య ఆ గ్యాంగులోని ఓ సభ్యుడైన సురేష్‌ను ఢిల్లీలో అరెస్టు చేసింది. సురేష్ స్విఫ్ట్ కారులో వెళ్తుండగా కస్తూర్బా గాంధీ మార్గ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అళప్పుళ జిల్లా ఎస్పీ వీఎం మహ్మద్ రఫీక్ తెలిపారు. అతడిని విచారించగా అస్లుప్ ఖాన్ విషయం కూడా తెలిసింది.
ఢిల్లీ క్రైం బ్రాంచిలో ఆర్కే పురం స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఖాన్.. డిసెంబర్‌లో నెల రోజుల సెలవు పెట్టారు. ఆ తర్వాత సెలవును మరో నెల పొడిగించారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఏమైపోయారో ఎవరికీ తెలియలేదు. సురేష్‌ను అరెస్టు చేసిన తర్వాత వాళ్ల గ్యాంగు దోపిడీ వ్యవహారం మొత్తం బయటపడింది. సురేష్ మొదట్లో ఒక ఇన్ఫార్మర్‌గా ఖాన్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా అంతా కలిసి ఏటీఎంల దోపిడీకి శ్రీకారం చుట్టారు. కేరళలోని చెరియనాడు, కాళకూటం, రామాపురం, కంజికుళ్ ప్రాంతాల్లో పలు ఏటీఎంలను ఈ గ్యాంగు దోచుకుంది.
సురేష్ ముందుగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ, సెక్యూరిటీ లేని ఏటీఎంలు ఎక్కడున్నాయో గమనిస్తాడు. ఆ తర్వాత ఖాన్, సురేష్ కలిసి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తారు. ఏటీఎంల గురించి బాగా తెలిసిన ఇతర గ్యాంగుసభ్యులు గ్యాస్ కట్టర్‌తో మిషన్లను కట్ చేస్తారు. అదే సమయంలో లోపలున్న నోట్లు కాలిపోకుండా వాళ్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సీసీ టీవీల దృష్టిలో పడకుండా ఇదంతా చేయడం వీరి ప్రత్యేకత. వీళ్లు ఉపయోగించే కారు నంబర్.. ఒక అంబులెన్స్ పేరు మీద రిజిస్టర్ అయింది. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ దోపిడీ గ్యాంగు నడిపాడు. మరి పోలీసా.. మజాకా!