అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నా..! | lyricists writer ramajogayya sathir interview | Sakshi
Sakshi News home page

అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నా..!

Published Sat, Oct 11 2014 10:40 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

lyricists  writer ramajogayya sathir interview

రామజోగయ్యశాస్త్రి

స్వరానికి మాటలు జోడించినంత మాత్రాన అది పాట అయిపోదు. సందర్భానికి తగ్గ భావవ్యక్తీకరణ ఉండాలి. గుండె లోతుల్లో నుంచి కవితావేశం ఉప్పొంగాలి. నిజమైన పాట అప్పుడు ఉద్భవిస్తుంది. దాంతో కవికి కావాల్సినంత ఆత్మసంతృప్తి. అయితే.. ప్రస్తుతం అలాంటి పాటలు అరుదైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భుక్తి కోసం రాసే పాటలే. ఈ పరిస్థితుల్లో కూడా అడపాదడపా తన పాటలతో తళుక్కున మెరుస్తుంటారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ఆలోచింపజేసే సాహిత్యంతో, అందమైన పద సరళితో శ్రోతలను రంజింపజేస్తున్నారాయన. దాదాపు అన్ని రకాల పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో మచ్చుకు ఓ అయిదింటి గురించి ఆయన మాటల్లోనే...  
 
‘శుభప్రదం’ - సినిమాలో ‘తప్పట్లో తాళాలోయ్’ అనే పాట రాశాను. విద్యాసాగర్ స్వరరచన చేసిన  పాట అది. కె.విశ్వనాథ్‌గారి సినిమాకు పాట రాయడం అదే ప్రథమం. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు వెలిగింది... కథానుగుణంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట వస్తుంది. ఈ పాట రాయమంది కె.విశ్వనాథ్‌గారు. సో... ఇది శివకేశవ ప్రేరేపితంగా భావించా. ఇప్పటికే శివకేశవులపై చాలా పాటలొచ్చాయి. అయితే... వైష్ణవావతారమైన కృష్ణుడితో శివుణ్ణి పోలుస్తూ పాట రాలేదు. ఎందుకో తెలీదుకానీ... శివుడికీ, కృష్ణుడికీ మధ్య పోలికలు కనిపించాయి నాకు.
 శివుడి మూడోకన్నే... నెమలికన్నుగా కృష్ణుని ఆభరణమైంది.
 శివుని ఓంకార నాదమే... కృష్ణుని మురళీనాదమైంది. భవుని విభూతే... బృందావనంలోని పుప్పొడిగా మారింది. ప్రమథగణ పూజితుడైన విరాగి శివుడైతే... యదుకాంతల ప్రేమను గెలిచిన విరాళి కృష్ణుడు. కైలాస నాట్యకేళి శివుడిదైతే... కాళింది పడగపై ఆనంద నాట్యహేళి కృష్ణుడిది. నాకు కనిపించిన ఈ పోలికలనే పాటగా మలిచాను.
 ‘తలపైన కన్నున్న ముక్కంటి తానేగా... శివమూర్తి శిఖిపించె మౌళీ...
 ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా... తన మోవి మురళీ స్వరాళీ...
 భవుని మేని ధూళి... తలపించదా వన మధూళీ...
 ప్రమథగణ విరాగి... యదుకాంతలకు ప్రియ విరాళీ...
 ఝణన ఝణన ఝన పద యుగళమే...
 జతపడే శివకేశవాభేద కేళీ...

 ఈ పోలిక చూసి... విశ్వనాథ్‌గారు ఎంతో సంతోషించారు.
 
‘విశ్వరూపం’ - కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో ‘అణువినాశ వర్షమిదీ...’ నేను రాసిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట. న్యూక్లియర్ బాంబు వినాశనం కారణంగా ప్రపంచం రెండు వర్గాలుగా మారి యుద్ధాలు మొదలయ్యాయి. టైజం పడగ విప్పింది. ప్రపంచం అశాంతికి లోనైంది.. ఈ పరిణామాలవల్ల మనకు ఒరిగిందేమింటి? అని ప్రశ్నించే పాట ఇది. తమిళ మాతృకను అక్కడి ప్రసిద్ధ సినీ గీతరచయిత వైరముత్తు రాశారు. ఆయన భావవ్యక్తీకరణ అద్భుతం. నాకు తెగ నచ్చేసింది. ఇది మాంటేజ్ సాంగ్ కావడంతో దాన్ని చక్కని తెలుగు పదబంధాలతో రాయొచ్చు. అందుకే...   భావం చెడకుండా... అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా రాశాను. వైరముత్తు స్థాయిలో రాయలేకపోయినా... అందులో కొంత స్థాయికైనా చేరాననే ఆనందం ఉంది.
 ఇక ఆ పాటలో ఓ చరణం ఇది...
 అణువినాశ వర్షమిదీ... చితుల చిగురు మొలచినదీ.
 ఒక తల్లి కన్న కొడుకేగా సైనికుడెవరైనా...
 కాలేది కన్న కడుపేగా... ఎవ్వరు బలి అయినా...
 ఈ పెనుదాహం... కోరేదేమిటో...
 రణ... మారణహోమం.... ఆగేదెప్పుడో... ఎన్నడో...
 ఈ జన్మకు ఈ దేహం... మరుజన్మకు నీదే దేశం?
 నిరంతరమై నీ వెంటే... ఏదీ రాదు నేస్తం...
 క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం../ఈ పెనుదాహం కోరేదేమిటో...
 రణ... మారణహోమం ఆగేదెప్పుడో... ఎన్నడో...

 కమల్‌హాసన్‌గారు ఈ పాట విని చాలా సంతోషించారు. పైగా ఈ పాట స్వయంగా ఆయనే పాడారు. నా పాట ఆయన నోట వింటుంటే.. చెప్పలేనంత ఆనందం కలిగింది. అంతకుముందే, ‘మన్మథబాణం’ సినిమాకు కమల్‌గారికి రాశాను. నా కష్టం చూసే ‘విశ్వరూపం’కి అవకాశం ఇచ్చారాయన.  
 
 ‘జులాయి’ - యువతరానికి సందేశాన్నీ, జోష్‌నీ ఇస్తూ నేను రాసిన పాట ‘పకడో పకడో...’. ‘జులాయి’ సినిమాలోని ఈ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా కెరీర్లో ముఖ్యమైన పాట. ముందు ఈ పాట ఒకే చరణం. హీరో పాత్రచిత్రణను ప్రతిబింబించేలా రాశాను. బాగుండటంతో ఇంకో రెండు చరణాలు రాయమన్నారు త్రివిక్రమ్. మిగిలిన రెండు చరణాలు నేటి యువతను లక్ష్యంగా చేసుకొని, వాళ్లకు ప్రేరణ కలిగించేలా రాశాను.
 నిన్న నువ్వు మిస్సయ్యింది పకడో... రేపు నీకు ప్లస్సయ్యేది పకడో..
 ఒంటరైన జీరో.. వేల్యులేనిదేరో... దాని పక్క అంకెయ్‌రో...
 గెలుపను మేటరుంది ఎక్కడో... దాన్ని గెలిచే... రూట్ పకడో...
 టాలెంటుంది నీలో... ఖుల్లమ్ ఖుల్ల ఖేలో.. బ్యాటు బంతి నువ్వేరో...
 చెదరని ఫోకస్సే... సీక్రెటాఫ్ సక్సెసై... అర్జునుడి విల్లువై...
 యారో మారో యాపిల్ పకడో...  పకడో పకడో పకడో...
 పకడో పకడో పకడో... పకడో పకడో...

 నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందనే స్ఫూర్తితో రాసిన పాట ఇది.  త్రివిక్రమ్‌కి కూడా బాగా నచ్చిన పాట.
 
 ‘రాజుభాయ్’ - సినిమాలో ఓ పాట రాశాను. కెరీర్ ప్రారంభంలో నాకు సంతృప్తినిచ్చిన పాట అది. ‘నువ్వు డేంజర్ జోన్‌లోకి అడుగుపెడుతున్నావ్’ అని హీరోని హెచ్చరించే పాట అది. సగటు మనిషికి కూడా ఉపయోగ పడే తత్వంతో ఈ పాట రాశాను.  
 లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా...
 గింజలు ఎరవేస్తే పంజరాన పడకురా..
 కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా...
 వేసే అడుగు నీవు ఆచితూచి వేయరా...
 సాలె గూడు గూడు కాదు, పాము పడగ నీడ కాదు...

 
సందర్భమే ఈ పాటకు ప్రేరణ. కథను ముందుకు నడిపించే ఇలాంటి పాట కూడా ఒకటి రాయగలిగాను అని గర్వంగా ఫీలవుతుంటా.
 
 ‘శిరిడిసాయి’ - బాబా అవతార ధర్మాన్ని ప్రతిబించేలా ‘షిరిడీసాయి’ సినిమా కోసం నేను రాసిన పాట ‘నీ పదమున ప్రభవించిన గంగా యమునా’. ఒక సాయిభక్తునిగా నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది. గంగా, యమునా సంగమాన్ని చూడాలని ప్రయాగ బయలుదేరిన దాసగణుని బాబా కటాక్షించిన సన్నివేశం అది. పైగా ఈ సందర్భంలో ఆత్రేయగారు పాట రాసి ఉన్నారు. అదే సందర్భానికి ఇప్పుడు నేను రాయడం ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. ‘షిరిడీసాయిబాబా మహత్మ్యం’లో ‘సాయి శరణం... బాబా శరణు శరణం’ పాటంటే కె.రాఘవేంద్రరావుగారికి చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్‌లోనే పాట రాయమన్నారు.
 నీ పదమున ప్రభవించిన గంగా యమునా...
 నా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా...
 ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా...
 ఏ జీవమైన భావమైన నీవేగా...
 నీవులేని చోటు లేదు సాయి... ఈ జగమే నీ ద్వారకామాయి

 
భగవంతుణ్ణి సర్వాంతర్యామి అంటారు. షిరిడీసాయి ద్వారకామాయి నివాసి. అందుకే... జగమంతా ద్వారకామాయి అని రాశాను. షిరిడీసాయి యద్భావం తద్భవతీ అన్నారు. ఆయన  ఆరడుగుల దేహం కాదు. భక్తుల అనుభూతికి ఆకృతి. ఆ భావమే ఈ పాటకు రూపమైంది.
 
ఈ అయిదు పాటలే కాదు.. ఓ కవికి తాను రాసిన ప్రతి పాట తన బిడ్డే. అయితే... తల్లితండ్రులకు ఆత్మానందాన్ని కలిగించే బిడ్డలు మాత్రం కొందరే ఉంటారు. నాకు అలాంటి బిడ్డలే ఈ అయిదు పాటలు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement