subhapradam
-
27 నుంచి టీటీడీ ‘శుభప్రదం’
సాక్షి, తిరుపతి: భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ, నైతిక విలువలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏడాదీ వేసవిలో ‘శుభప్రదం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27 నుండి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2012 నుండి నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వరుని జీవిత చరిత్ర, భగవద్గీత, సనాతనధర్మ పరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వాజ్మయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు–పరమార్థాలు, ఆచారాలు–వైజ్ఞానిక దృక్పథం, మాతృ భాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశం తిరుపతి కేంద్రంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 7, 8, 9 తరగతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 3,500 మందికి ఈ అవకాశం దక్కుతుంది, విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరు శిక్షణా తరగతులు ఉంటాయి.ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యుల కార్యాలయాలు, టీటీడీ కల్యాణ మండపాలతోపాటు టీటీడీ వెబ్సైట్లో కూడా దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను తిరిగి ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రోగ్రాం అసిస్టెంట్లకు సమర్పించాల్సి ఉంటుంది. తిరుపతిలోని విద్యార్థులు స్థానిక అన్నమాచార్య కళామందిరంలోని ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ వద్ద దరఖాస్తులు పొంది తిరిగి అక్కడే సమర్పించవచ్చు. ఏడు శిక్షణ కేంద్రాలు తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్పీడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్లు్య జూనియర్ కళాశాల, ఓరియంటల్ కళాశాల, ఎస్పీడబ్ల్యు పాలిటెక్నిక్ కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు మెటీరియల్, నిష్ణాతులతో బోధనతోపాటు భోజన వసతి, బస కల్పిస్తారు. -
‘శుభప్రదం’కు దరఖాస్తుల ఆహ్వానం
హిమాయత్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తాధ్వర్యంలో 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మప్రచార పరిషత్ ఏఈఓ బండి ఉషానందిని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కార్యాలయంలోలేదా www.tirumala.org వెబ్సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. ఈ నెల 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఉషానందిని తెలిపారు. -
అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నా..!
రామజోగయ్యశాస్త్రి స్వరానికి మాటలు జోడించినంత మాత్రాన అది పాట అయిపోదు. సందర్భానికి తగ్గ భావవ్యక్తీకరణ ఉండాలి. గుండె లోతుల్లో నుంచి కవితావేశం ఉప్పొంగాలి. నిజమైన పాట అప్పుడు ఉద్భవిస్తుంది. దాంతో కవికి కావాల్సినంత ఆత్మసంతృప్తి. అయితే.. ప్రస్తుతం అలాంటి పాటలు అరుదైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భుక్తి కోసం రాసే పాటలే. ఈ పరిస్థితుల్లో కూడా అడపాదడపా తన పాటలతో తళుక్కున మెరుస్తుంటారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ఆలోచింపజేసే సాహిత్యంతో, అందమైన పద సరళితో శ్రోతలను రంజింపజేస్తున్నారాయన. దాదాపు అన్ని రకాల పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో మచ్చుకు ఓ అయిదింటి గురించి ఆయన మాటల్లోనే... ‘శుభప్రదం’ - సినిమాలో ‘తప్పట్లో తాళాలోయ్’ అనే పాట రాశాను. విద్యాసాగర్ స్వరరచన చేసిన పాట అది. కె.విశ్వనాథ్‌గారి సినిమాకు పాట రాయడం అదే ప్రథమం. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు వెలిగింది... కథానుగుణంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట వస్తుంది. ఈ పాట రాయమంది కె.విశ్వనాథ్‌గారు. సో... ఇది శివకేశవ ప్రేరేపితంగా భావించా. ఇప్పటికే శివకేశవులపై చాలా పాటలొచ్చాయి. అయితే... వైష్ణవావతారమైన కృష్ణుడితో శివుణ్ణి పోలుస్తూ పాట రాలేదు. ఎందుకో తెలీదుకానీ... శివుడికీ, కృష్ణుడికీ మధ్య పోలికలు కనిపించాయి నాకు. శివుడి మూడోకన్నే... నెమలికన్నుగా కృష్ణుని ఆభరణమైంది. శివుని ఓంకార నాదమే... కృష్ణుని మురళీనాదమైంది. భవుని విభూతే... బృందావనంలోని పుప్పొడిగా మారింది. ప్రమథగణ పూజితుడైన విరాగి శివుడైతే... యదుకాంతల ప్రేమను గెలిచిన విరాళి కృష్ణుడు. కైలాస నాట్యకేళి శివుడిదైతే... కాళింది పడగపై ఆనంద నాట్యహేళి కృష్ణుడిది. నాకు కనిపించిన ఈ పోలికలనే పాటగా మలిచాను. ‘తలపైన కన్నున్న ముక్కంటి తానేగా... శివమూర్తి శిఖిపించె మౌళీ... ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా... తన మోవి మురళీ స్వరాళీ... భవుని మేని ధూళి... తలపించదా వన మధూళీ... ప్రమథగణ విరాగి... యదుకాంతలకు ప్రియ విరాళీ... ఝణన ఝణన ఝన పద యుగళమే... జతపడే శివకేశవాభేద కేళీ... ఈ పోలిక చూసి... విశ్వనాథ్‌గారు ఎంతో సంతోషించారు. ‘విశ్వరూపం’ - కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో ‘అణువినాశ వర్షమిదీ...’ నేను రాసిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట. న్యూక్లియర్ బాంబు వినాశనం కారణంగా ప్రపంచం రెండు వర్గాలుగా మారి యుద్ధాలు మొదలయ్యాయి. టైజం పడగ విప్పింది. ప్రపంచం అశాంతికి లోనైంది.. ఈ పరిణామాలవల్ల మనకు ఒరిగిందేమింటి? అని ప్రశ్నించే పాట ఇది. తమిళ మాతృకను అక్కడి ప్రసిద్ధ సినీ గీతరచయిత వైరముత్తు రాశారు. ఆయన భావవ్యక్తీకరణ అద్భుతం. నాకు తెగ నచ్చేసింది. ఇది మాంటేజ్ సాంగ్ కావడంతో దాన్ని చక్కని తెలుగు పదబంధాలతో రాయొచ్చు. అందుకే... భావం చెడకుండా... అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా రాశాను. వైరముత్తు స్థాయిలో రాయలేకపోయినా... అందులో కొంత స్థాయికైనా చేరాననే ఆనందం ఉంది. ఇక ఆ పాటలో ఓ చరణం ఇది... అణువినాశ వర్షమిదీ... చితుల చిగురు మొలచినదీ. ఒక తల్లి కన్న కొడుకేగా సైనికుడెవరైనా... కాలేది కన్న కడుపేగా... ఎవ్వరు బలి అయినా... ఈ పెనుదాహం... కోరేదేమిటో... రణ... మారణహోమం.... ఆగేదెప్పుడో... ఎన్నడో... ఈ జన్మకు ఈ దేహం... మరుజన్మకు నీదే దేశం? నిరంతరమై నీ వెంటే... ఏదీ రాదు నేస్తం... క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం../ఈ పెనుదాహం కోరేదేమిటో... రణ... మారణహోమం ఆగేదెప్పుడో... ఎన్నడో... కమల్‌హాసన్‌గారు ఈ పాట విని చాలా సంతోషించారు. పైగా ఈ పాట స్వయంగా ఆయనే పాడారు. నా పాట ఆయన నోట వింటుంటే.. చెప్పలేనంత ఆనందం కలిగింది. అంతకుముందే, ‘మన్మథబాణం’ సినిమాకు కమల్‌గారికి రాశాను. నా కష్టం చూసే ‘విశ్వరూపం’కి అవకాశం ఇచ్చారాయన. ‘జులాయి’ - యువతరానికి సందేశాన్నీ, జోష్నీ ఇస్తూ నేను రాసిన పాట ‘పకడో పకడో...’. ‘జులాయి’ సినిమాలోని ఈ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా కెరీర్లో ముఖ్యమైన పాట. ముందు ఈ పాట ఒకే చరణం. హీరో పాత్రచిత్రణను ప్రతిబింబించేలా రాశాను. బాగుండటంతో ఇంకో రెండు చరణాలు రాయమన్నారు త్రివిక్రమ్. మిగిలిన రెండు చరణాలు నేటి యువతను లక్ష్యంగా చేసుకొని, వాళ్లకు ప్రేరణ కలిగించేలా రాశాను. నిన్న నువ్వు మిస్సయ్యింది పకడో... రేపు నీకు ప్లస్సయ్యేది పకడో.. ఒంటరైన జీరో.. వేల్యులేనిదేరో... దాని పక్క అంకెయ్రో... గెలుపను మేటరుంది ఎక్కడో... దాన్ని గెలిచే... రూట్ పకడో... టాలెంటుంది నీలో... ఖుల్లమ్ ఖుల్ల ఖేలో.. బ్యాటు బంతి నువ్వేరో... చెదరని ఫోకస్సే... సీక్రెటాఫ్ సక్సెసై... అర్జునుడి విల్లువై... యారో మారో యాపిల్ పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో... నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందనే స్ఫూర్తితో రాసిన పాట ఇది. త్రివిక్రమ్‌కి కూడా బాగా నచ్చిన పాట. ‘రాజుభాయ్’ - సినిమాలో ఓ పాట రాశాను. కెరీర్ ప్రారంభంలో నాకు సంతృప్తినిచ్చిన పాట అది. ‘నువ్వు డేంజర్ జోన్లోకి అడుగుపెడుతున్నావ్’ అని హీరోని హెచ్చరించే పాట అది. సగటు మనిషికి కూడా ఉపయోగ పడే తత్వంతో ఈ పాట రాశాను. లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా... గింజలు ఎరవేస్తే పంజరాన పడకురా.. కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా... వేసే అడుగు నీవు ఆచితూచి వేయరా... సాలె గూడు గూడు కాదు, పాము పడగ నీడ కాదు... సందర్భమే ఈ పాటకు ప్రేరణ. కథను ముందుకు నడిపించే ఇలాంటి పాట కూడా ఒకటి రాయగలిగాను అని గర్వంగా ఫీలవుతుంటా. ‘శిరిడిసాయి’ - బాబా అవతార ధర్మాన్ని ప్రతిబించేలా ‘షిరిడీసాయి’ సినిమా కోసం నేను రాసిన పాట ‘నీ పదమున ప్రభవించిన గంగా యమునా’. ఒక సాయిభక్తునిగా నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది. గంగా, యమునా సంగమాన్ని చూడాలని ప్రయాగ బయలుదేరిన దాసగణుని బాబా కటాక్షించిన సన్నివేశం అది. పైగా ఈ సందర్భంలో ఆత్రేయగారు పాట రాసి ఉన్నారు. అదే సందర్భానికి ఇప్పుడు నేను రాయడం ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. ‘షిరిడీసాయిబాబా మహత్మ్యం’లో ‘సాయి శరణం... బాబా శరణు శరణం’ పాటంటే కె.రాఘవేంద్రరావుగారికి చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్లోనే పాట రాయమన్నారు. నీ పదమున ప్రభవించిన గంగా యమునా... నా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా... ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా... ఏ జీవమైన భావమైన నీవేగా... నీవులేని చోటు లేదు సాయి... ఈ జగమే నీ ద్వారకామాయి భగవంతుణ్ణి సర్వాంతర్యామి అంటారు. షిరిడీసాయి ద్వారకామాయి నివాసి. అందుకే... జగమంతా ద్వారకామాయి అని రాశాను. షిరిడీసాయి యద్భావం తద్భవతీ అన్నారు. ఆయన ఆరడుగుల దేహం కాదు. భక్తుల అనుభూతికి ఆకృతి. ఆ భావమే ఈ పాటకు రూపమైంది. ఈ అయిదు పాటలే కాదు.. ఓ కవికి తాను రాసిన ప్రతి పాట తన బిడ్డే. అయితే... తల్లితండ్రులకు ఆత్మానందాన్ని కలిగించే బిడ్డలు మాత్రం కొందరే ఉంటారు. నాకు అలాంటి బిడ్డలే ఈ అయిదు పాటలు.