నిర్మాత ప్రసాద్‌పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్‌పై హీరో పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఆయన మాట తప్పారని ఆరోపించారు.
సినిమా సమయంలో ఆయన తనకు కొంత వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల సమయంలో ఇస్తానని చెప్పారని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఆయన 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.
2013 సెప్టెంబర్‌లో అత్తారింటికి దారేది విడుదలైంది. దానికి ముందే సినిమాలో కొంత భాగం లీకైంది. దాంతో సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందేమోనన్న అనుమానంతో.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో పవన్ కల్యాణ్ తమ రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని ఆపుకొన్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అయితే మళ్లీ మిగిలిన మొత్తం ఇస్తామన్నారు. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాక.. భారీ వసూళ్లు సాధించింది. బాహుబలికి ముందువరకు అదే ఇండస్ట్రీ రికార్డుగా ఉంది. పవన్‌కు నిర్మాత ప్రసాద్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంది. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందే ఆ మొత్తం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇవ్వకపోవడంతో 'మా'కు ఆయన ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు, అటు నుంచి నిర్మాత ప్రసాద్‌కు వెళ్లింది. సాయంత్రంలోగా ఆ విషయం సెటిలైతే పర్వాలేదు గానీ, లేని పక్షంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదలకు కూడా ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. 13న నాన్నకు ప్రేమతో, 14న డిక్టేటర్ విడుదలవుతున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో ఇప్పటికే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనికి పలు ప్రాంతాల్లో థియేటర్లు తగ్గించడం లాంటి సమస్యలున్నాయి. డబ్బింగ్ చెప్పే ఒక అమ్మాయి యూనిట్ మీద కేసు పెట్టింది. పవన్ కల్యాణ్ కూడా టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చారు కాబట్టి.. ఆయన కూడా టీడీపీ వాళ్ల ఒత్తిడి మేరకు ఇప్పుడే ఫిర్యాదు చేశారా అన్న అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.