రికార్డులున్నా... అసంతృప్తే!
రికార్డులున్నా... అసంతృప్తే!
Published Tue, Dec 24 2013 11:40 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
174 డెరైక్ట్ చిత్రాలు... కానీ విజయాలు మాత్రం పదిహేనే. 2013లో డిసెంబర్ 24 వరకూ మన చిత్రసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంకెల పరంగా చూస్తే ఓకే గానీ, విజయాల పరంగా మాత్రం వీకే. ఈ విజయాలు ఏ మాత్రం బాక్సాఫీస్ దప్పికను తీర్చలేవనేది కరాఖండీగా చెప్పేయొచ్చును. మన తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌కు (గ్రాస్ పరంగా) చేరుకోవడమనేది 2013లో ఓ గొప్ప విజయం. దాంతోపాటు మరో నాలుగు సినిమాలు 50 కోట్ల మైలురాళ్లను (షేర్ పరంగా) అందుకోవడం మరో తీయటి అనుభూతి. చాలామట్టుకు సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు.
కంటెంట్ లేకపోతే ఒక్క టిక్కెట్ కూడా తెగడంలేదనేది కాదనలేని వాస్తవం. రికార్డులను చూసి ఆనందపడాలో, పరాజయాలను తల్చుకుని కుమిలిపోవాలో తెలియని అసందిగ్ధావస్థ ఇది. విజయాలు సాధించిన సినిమాలను విశ్లేషించి చూస్తే, కుటుంబ కథాచిత్రాలకు మళ్లీ ఆదరణ మొదలైందని అర్థమవుతోంది. అందుకు నిదర్శనం ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల ఘనవిజయాలే. మరో పక్క మాస్ ఎంటర్‌టైనర్లకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. కుటుంబ కథ, ప్రేమకథ, మాస్ మసాలా, చివరకు హారర్ స్టోరీ అయినా వినోదం ఉండి తీరాల్సిందే.
అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉదృతంగా జరిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చిత్రసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చాలా సినిమాల విడుదలలు వెనక్కి ముందుకి ఊగిసలాడాల్సిన పరిస్థితి. ఒక దశలో పెద్ద సినిమాలన్నీ విడుదలకు వెనుకంజ వేస్తే... వారానికి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే.. ఇవన్నీ ఎంత త్వరగా వచ్చాయో... అంతే త్వరగా వెళ్లిపోయాయి. ఈ ఏడాది విజయతీరానికి చేరుకున్న 15 సినిమాలేంటో ఒకసారి చూద్దాం...
బ్లాక్‌బస్టర్ ఆఫ్‌ది ఇయర్: సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ ఈ లోగా రాష్ట్రంలోని ఉద్యమం ఊపందుకుంది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. జూలైలో అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకూ సెలైంట్‌గా ఉండిపోవాల్సివచ్చింది. ఈ లోగా ఓ పిడుగులాంటి వార్త. బాక్సాఫీస్‌కి గుండెపోటు తెప్పించే వార్త. ఈ సినిమా ప్రథమార్ధం అంతా ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చింది. దానికి తోడు అనేక పైరసీ ప్రింట్లు. ఇక ఈ సినిమా పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయినా మొండిగా సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. కట్ చేస్తే... ‘అత్తారింటికి దారేది’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇన్ని అవరోధాలను దాటుకొని ఇంతటి ఘనవిజయం సాధించడమంటే... మాటలు కాదు. ఇది పవన్‌కల్యాణ్ మ్యాజిక్. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్. వంద కోట్ల రూపాయల పై చిలుకు గ్రాస్‌నీ, 80 కోట్ల రూపాయల షేర్‌ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను బాక్సాఫీస్‌కి చాటిచెప్పింది. ‘గబ్బర్‌సింగ్’తో ఫామ్‌లోకొచ్చిన పవన్‌ని నంబర్‌వన్ రేస్‌లో ముందుండేలా చేసింది. కుటుంబ కథలు కనుమరుగైపోయిన నేటి తరుణంలో పవన్ ఈ కథను ఎంచుకొని మళ్లీ కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఓ సంచలనం. అత్త పాత్రలో నదియా కూడా పెద్ద ప్లస్.
నాయక్(జనవరి 9)
ఈ ఏడాదికి ఇదే తొలి హిట్. మాస్ అంశాలే ఈ సినిమాకు శ్రీరామరక్ష. ‘రచ్చ’ తర్వాత చరణ్‌కి ఇది మరో మాస్ హిట్. 50 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసింది. చరణ్, వినాయక్ కాంబినేషన్ మాస్‌ని ఆకట్టుకుంది.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11)
వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా. అదీ కుటుంబ కథ కావడం విశేషం. క్లీన్ మూవీ. అనుబంధాలు, అలకలు, అల్లర్లు, కోనసీమ అందాలు ప్రేక్షకుల మనసు నిండేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అందుకేనేమో 50 కోట్ట పైచిలుకు షేర్ రాబట్టగలిగింది. ఓవర్సీస్‌లో కొత్త రికార్డ్ సృష్టించింది. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్‌కి కొత్త ఊపిరిచ్చింది.
మిర్చి(ఫిబ్రవరి 8)
ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ కలగలిపితే వచ్చిన ఘాటైన సినిమా ఇది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్‌కి మరింత చేరువయ్యారు. రచయిత కొరటాల శివ దర్శకునిగా మెప్పించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది.
స్వామి రారా( మార్చి 23)
కొత్త కాన్సెప్ట్‌తో కొత్తగా తీస్తే... చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్‌లో ఆడుతుంది అనడానికి స్వామి రారా ఓ అందమైన నిదర్శనం. కొత్త దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను డీల్ చేసిన విధానమే మెయిన్ హైలైట్.
బాద్‌షా(ఏప్రిల్ 5)
ఈ ఏడాది యాభై కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిన సినిమాల్లో ‘బాద్‌షా’ ఒకటి. ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో పోల్చుకుంటే... ఎన్టీఆర్‌కి ఇది మంచి ఊరట. శ్రీనువైట్ల శైలి ఈ సినిమాకు కలిసొచ్చింది.
గుండెజారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19)
చాలాకాలం తర్వాత వచ్చిన క్లీన్ అండ్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. నితిన్, నిత్యామీనన్‌ల కెమిస్ట్రీ మరోసారి అదిరింది. అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ప్రయత్నం ఫలించింది.
తడాఖా(మే 10)
తమిళ ‘వేట్టై’కి రీమేక్ ఇది. సునీల్, నాగచైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ జతకూడింది. డాలీ ఈ రీమేక్‌ని బాగా డీల్ చేశారు.
ప్రేమకథాచిత్రమ్ (జూన్ 9)
హారర్ సినిమా చూసి ఎవరైనా భయపడతారు. కానీ హారర్‌తో కూడా పొట్టచెక్కలయ్యేంత కామెడీ సృష్టించొచ్చని ‘ప్రేమ కథాచిత్రమ్’ నిరూపించింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరామేన్ ప్రభాకరరెడ్డి డెరైక్ట్ చేశారీ సినిమా. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం ఇదే. సుధీర్‌బాబుని హీరోగా నిలబెట్టింది.
బలుపు(జూన్ 28)
రెండేళ్ల దోబూచులాట తర్వాత రవితేజకు ‘బలుపు’తో విజయం దక్కింది. పంచ్ డైలాగులు బాగా పండాయ్. పెరిగిన టికెట్ రేట్లను బాగా సద్వినియోగం చేసుకోగలిగిందీ సినిమా.
అంతకు ముందు ఆ తరువాత(ఆగస్ట్ 23)
సహజీవనం అనేది కత్తిమీద సాములాంటి కాన్సెప్ట్. ఏ మాత్రం అటూఇటూ అయినా... చాలా తేడా వస్తుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చాలా తెలివిగా ఈ సినిమాను మలిచారు. సుమంత్ అశ్విన్‌కి హీరోగా ఓ మంచి బ్రేక్. దామూకి నిర్మాతగా వేల్యూ పెంచింది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 29)
ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ కథను తెరకెక్కించాడు. సందీప్‌కిషన్‌కి సోలో హీరోగా తొలి విజయం.
మంచు మనోజ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘పోటుగాడు’. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఫలితంగా ప్రారంభ వసూళ్లు ఆకర్షణీయంగా వచ్చాయి. చాలా విరామం తర్వాత గోపిచంద్ చేసిన ‘సాహసం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. ఆయన స్థాయి విజయం కాకపోయినా... రన్ మాత్రం బాగానే వచ్చింది. ‘అడ్డా’ సినిమా కూడా సెలైంట్‌గా వసూళ్లు రాబట్టింది. సుశాంత్‌కి ఓ విధంగా ఇదే తొలి విజయం.
Advertisement