
నేడు ఏయూలో పీవీ స్మారకోపన్యాసం
గోరటి వెంకన్నకు ’లోక్‌నాయక్’ పురస్కార ప్రదానం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఐదవ స్మారకోపన్యాసాన్ని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఆర్ అంబేడ్కర్ హాలులో శనివారం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ’నాగరికత–సంస్కృతి–సమాజం’ అనే అంశంపై ప్రసంగిస్తారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభకు అధ్యక్షత వహిస్తారని, సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జ్యుడిషియల్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జస్టిస్ గోడె రఘురాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో అధిపతి దూపాటి విజయకుమార్‌లు పాల్గొంటారని చెప్పారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 13వ వార్షిక పురస్కార ప్రదాన కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ఏయూ అసెంబ్లీ హాల్లో జరుగుతుందని యార్లగడ్డ తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది గోరటి వెంకన్నకు ఈ పురస్కారానికి ఎంపిక చేశామని, అవార్డుతో పాటు రూ.లక్షా 50 వేల నగదును అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు.