
అప్పుడు విరసం (విప్లవ రచయితల సంఘం) సభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ సభలో రావిశాస్త్రిగారు, కె.వి.రమణారెడ్డిగారు.. ఇలా మహామహులు ఎందరో ఉన్నారు. అప్పుడు నేను ‘అందుకోరా గుత్తందుకో..’ అనే పాట రాశాను. నేను స్టేజి మీద పాడుతూ, మనిషి ఎత్తుకు ఎగురుతున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి డోలక్ కొడుతూ, కోరస్ ఇచ్చారు. ఆయనే వంగపండు ప్రసాదరావు. ఆ తర్వాత నేను, వంగపండు.. నారాయణమూర్తి గారి సినిమాల ద్వారా కలిసి చాలాసార్లు వారాలు, నెలలపాటు గడిపాము. వంగపండు చేతిలో చిన్న అందెలు ఉండేవి. అవి పోయాయి. నేను దుబాయ్ వెళ్లినప్పుడు తీసుకొచ్చిన అందెలు నా దగ్గర పది జతలు ఉన్నాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నాకివ్వమని అడిగితే ఇచ్చాను. ఆయనకు ఇచ్చిన అందెలే నాకు ఇప్పుడు చివరి జ్ఞాపకంగా మిగిలాయి.
గద్దరన్న, వంగపండు రాసిన ప్రతి పాటా అపురూపమే. ఎందుకంటే వాళ్లు పేరు కోసమో, డబ్బు కోసమో పాటలు రాయరు. ఒక మహోన్నతమైన ఉద్యమం కోసం వాళ్లు పాటలు రాశారు. వంగపండు నిరాడంబరుడు. ఆయన జీవితానుభవాలే పాటలుగా ఆయన గుండెలోతుల్లో నుండి వచ్చాయి. ఆ కాలంలో గద్దరన్న ప్రవాహానికి, ఉప్పెనకు నిలబడ్డ ఏకైక వ్యక్తి వంగపండు. తర్వాత ఆయన స్టెప్పు, మాటతో ఎంతో విభిన్నంగా ఉండేవారు. చాలా నిఖార్సయిన విప్లవ కవి ఆయన. ఆయనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆర్. నారాయణమూర్తి చాలా సాయం చేశారు. ఆయన సినిమాల ద్వారా వంగపండుగారి పాటలు ఎంతోమందికి దగ్గరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment