నన్ను పస్తుపెట్ట లేదు
అమ్మ జ్ఞాపకం
మనిషి ప్రకృతికి దూరమవుతున్నాడు. మనిషి స్వచ్ఛత కోల్పోతున్నాడు, సహజత్వాన్ని కోల్పోతున్నాడు. కొన్నిసార్లు మనిషితనాన్నే కోల్పోతున్నాడు. కానీ... అమ్మ... తనలోని అమ్మతనాన్ని ఎప్పటికీ కోల్పోదు. అదే అమ్మతనంలోని గొప్పతనం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్ప కవికైనా అమ్మ గురించి పూర్తిగా చెప్పగలిగే పాండిత్యం ఉండదని నమ్ముతాను. తనకు తెలిసిన భాషలో, తెలిసిన పదాలతో, నేర్చుకున్న పాండిత్యంతో ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మప్రేమ గురించి చెప్పాలంటే ఏ పాండిత్యమూ చాలదు. వినమ్రంగా ఆమెకు తలవంచడం, ఆమె ఒళ్లో తలపెట్టుకుని ఆమె ఆత్మీయస్పర్శను ఆస్వాదించడమే.
అమ్మ ప్రేమను కరువు తీరా ఆస్వాదించిన జీవితం నాది. అది అనిర్వచనీయమైన అనుభూతి. సంపదలో పుట్టి పెరిగిన చాలామందికి అందనంత ప్రేమను మా అమ్మ పేదరికంలోనూ పంచింది మా అమ్మ. పేదరికంలోనూ మమ్మల్ని గారాబంగా, సంస్కారం నేర్పించి పెంచింది మా అమ్మ. నా పాటల్లో సాగే లాలిత్యానికి, అనురాగానికి ప్రేరణ మా అమ్మే. ‘పురిటిలో నీ తనువు పచ్చి పుండయినా... నా ఆకలి పాల జున్నుకుండ’ వంటి ప్రయోగాలు చేయగలిగానంటే అమ్మ పంచిన ప్రేమతోనే సాధ్యమైంది. వెన్నెల్లో మచ్చ ఉంటుందేమో, నీటిలో నాచు ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వచ్ఛత మాత్రమే ఉంటుంది. పుడమి తల్లికి, కన్నతల్లికి మరేదీ సాటిరాదు.
నేను తింటుంటే!
మా అమ్మ ఇప్పటికీ మమ్మల్ని చంటిబిడ్డల్లాగానే అనుకుంటుంది. నేను అన్నం తిన్నంత సేపు నా ఎదురుగానే ఉంటుంది. తన కంటితో చూస్తే తప్ప నేను తృప్తిగా కడుపు నిండా తిన్నానని చెప్పినా ఆమెకు తృప్తి ఉండదు. ఆమె కంటితో చూస్తేనే సంతోషం. చిన్నప్పుడు మాకు జ్వరమొస్తే రాత్రంతా ఆమెకూ నిద్ర ఉండేది కాదు. జ్వరం తగ్గి మేము తిన్న తర్వాతనే ఆమె అన్నం తినేది. పంట గింజలు మాకు పెట్టి మా అమ్మానాన్న పరిగి గింజలతో కడుపు నింపుకునే వారు. డెబ్బైలలో వచ్చిన తీవ్రమైన కరువు రోజుల్లోనూ మమ్మల్ని పస్తు పెట్టలేదు. మా కడుపు నింపడానికి వాళ్లు కడుపు మాడ్చుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదంటే నమ్ముతారా?
ఆమెకు బిడ్డలైన మమ్మల్నే కాదు ఎవరినీ పల్లెత్తు మాట అనే తత్వం కాదు. ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసి మేము తిరిగి బదులు చెప్పబోతే వారిస్తుంది. ‘రోజులు గడిస్తే ఏది నిజమో వారే తెలుసుకుంటారు. అప్పటి వరకు ఓపిక పట్ట’మని చెబుతుంది. ‘రోజులు గడిస్తే కాయ పండవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలె’ అంటుంది. ఆమెతో మాట్లాడుతుంటే సాహిత్యకారుల ప్రసంగం వింటున్నట్లు ఉంటుంది. తప్ప సాధారణ పల్లె మహిళ మాట్లాడినట్లు ఉండదు. చిన్నప్పుడు మంగళహారతులు, శ్రుతితో కూడిన పాటలు పాడిన అనుభవం ఆమెది. తన భావాన్ని ఎంత సున్నితంగా చక్కటి మాటలతో చెబుతుంది.
తాత్విక మూర్తి!
చేతిలో డబ్బు లేని రోజుల్లోనే కాదు, మేమిప్పుడు సంపాదిస్తున్న రోజుల్లోనూ తన కోసం ఏమీ కావాలనుకోదు. నేను డబ్బిచ్చినా కూడా ‘నాకెందుకు బిడ్డా డబ్బులు’ అంటుంది. హైదరాబాద్‌లో పెద్ద డాక్టర్‌కి చూపిస్తానంటే తెలకపల్లిలో ఆమె ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి దగ్గరే చూపించుకుంటుంది. జీవితం ప్రశాంతంగా, ఘర్షణలు లేకుండా జీవించాలనే సత్యాన్ని ఆమె ఆచరించి చూపించింది. నాకిప్పటికీ ఏ కష్టమొచ్చినా ఆమె దగ్గరకెళ్లి కూచుంటే... చల్లటి మాటలతో బాధను మైమరిపిస్తుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. చెబుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయి. ఆ ప్రేమ ఎప్పటికీ కావాలని గుండె ఆర్ద్రమవుతుంది.
వెంకన్న సొంతూరు: మహబూబ్‌నగర్ జిల్లా, తెలకపల్లి మండలం, గౌరారం
పుట్టింది: 1965,వైశాఖ పౌర్ణమి రోజు
అమ్మ: ఈరమ్మ, నాన్న... నరసింహ
చదువు: ఎంఎ తెలుగు లిటరేచర్
ఉద్యోగం: నాగర్‌కర్నూల్ కో ఆపరేటివ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్
గుర్తింపు: రచయిత, గాయకులు