ఈ సూపర్‌ మామ్స్‌కి కుడోస్‌.. మదర్స్‌ డే స్పెషల్‌ | Sakshi Funday Special Story On Mothers Day | Sakshi
Sakshi News home page

వందేమాతరం.. మదర్స్‌ డే స్పెషల్‌

Published Sun, May 14 2023 8:23 AM | Last Updated on Sun, May 14 2023 9:25 AM

Sakshi Funday Special Story On Mothers Day

కోవిడ్‌ టైమ్‌లో.. ఇటు ఆఫీస్‌ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్‌ మదర్స్‌ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్‌ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్‌ మదర్స్‌ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్‌ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు.

32.3 శాతమేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్‌ సెంటర్స్‌ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్‌ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్‌ చేసుకుంటూ కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్‌ కౌన్సెలర్స్‌ సపోర్ట్‌ అవసరమని స్పష్టం చేశారు.  అది జాబ్స్‌ ఫర్‌ హర్‌ అనే  సంస్థ నిర్వహించిన సర్వే వివరం. 

కోవిడ్‌ తర్వాతే.. సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్‌ మదర్స్‌ కోవిడ్‌ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్‌ మదర్స్‌ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట!

‘ప్రిడిక్‌మెంట్‌ ఆఫ్‌ రిటర్నింగ్‌ మదర్స్‌’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్‌ మదర్స్‌ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్‌ మదర్స్‌.. మెటర్నిటీ లీవ్, పాండమిక్‌ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్‌ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్‌ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్‌తో. 

ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్‌.. ఈ రోజు మదర్స్‌ డే! ఆ సందర్భంగా వర్కింగ్‌ మదర్స్‌ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్‌గా డిఫరెంట్‌ కెరీర్‌కి స్విచ్‌ ఆన్‌ అయిన వర్కింగ్‌ మదర్స్‌ పరిచయ ప్రయత్నమే ఈ కథనం..

మమీయూ
ఇదో మెటర్నిటీ గార్మెంట్స్‌ బ్రాండ్‌. శాలినీ శర్మ బ్రెయిన్‌ చైల్డ్‌. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి.

ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లోనూ వెదికింది. ఫారిన్‌ బ్రాండ్స్‌లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్‌ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది.

ఆ ప్రయాణానికి ముందు మార్కెట్‌ రీసెర్చ్‌ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్‌ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్‌ నుంచి మిజోరమ్‌ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది.

మమీయూను కమ్యూనిటీ బేస్డ్‌ క్లాతింగ్‌ బ్రాండ్‌గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్‌ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్‌లో మెటర్నిటీ గార్మెంట్స్‌కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్‌ను లాంచ్‌ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను.

రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా దేశంలోని డిఫరెంట్‌ సిటీస్‌లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్‌ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్‌కు చాలా హెల్ప్‌ అయింది. చాలెంజెస్‌ను హ్యాండిల్‌ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్‌ ప్రదేశ్‌లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్‌ ప్లేస్‌నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్‌ కోసం హిమాచల్, సోలన్‌ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్‌ వర్క్‌ స్కిల్స్‌.. డిఫరెంట్‌ వర్క్‌ టైమింగ్స్‌లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్‌ సక్సెస్‌కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్‌గా మారిన మదర్‌ శాలినీ శర్మ. 

జాబ్స్‌ ఫర్‌ హర్‌..
ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్‌ మదర్స్‌ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్‌ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్‌ అంట్రప్రెన్యూర్‌ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్‌లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్‌గా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది.

‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్‌ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్‌ స్టార్ట్‌ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్‌ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్‌లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్‌ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్‌ఫార్మెన్స్‌ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్‌కి సంబంధించి అప్‌టు డేట్‌ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు.

వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్‌ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్‌ మదర్స్‌కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్‌ చేసి.. వాళ్ల చేత సెకండ్‌ కెరీర్‌ స్టార్ట్‌ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్‌కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది. అదే జాబ్స్‌ ఫర్‌ హర్‌ సంస్థ.

మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చి.. మళ్లీ ఎంటర్‌ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్‌ ఫర్‌ హర్‌ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నా.

ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్‌ మదర్స్‌కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా.  

మిష్రీ డాట్‌ కామ్‌ 
జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్‌డీటీవీ ఫుడ్‌ చానెల్‌కి పదేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్‌ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్‌ చానెల్‌తో అసోసియేట్‌ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్‌కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ముందు సొంతంగా ఓ రెస్టారెంట్‌ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్‌ రివ్యూ వెబ్‌సైట్‌గా డిసైడ్‌ అయింది. అదే మిష్రీ డాట్‌ కామ్‌ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్‌హుడ్‌ కారణంగా జాబ్‌ వదిలేసిన తల్లులు తమ కిచెన్‌ స్కిల్స్‌కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేసే తొలి వెబ్‌సైట్‌ కూడా! ‘మన ఎక్స్‌పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్‌ చానెల్లోని నా వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌నే నా ఈ ఫుడ్‌ రివ్యూ వెబ్‌సైట్‌ మీద ఇన్వెస్ట్‌ చేశా. సక్సెస్‌ చూస్తున్నా. ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్‌లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. 

వీళ్లు సరే... సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తమ మదర్‌ హుడ్‌తో ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసి.. మామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వేల.. లక్షల ఫాలోవర్స్‌తో సోషల్‌ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. 

అనుప్రియ కౌర్‌.. 
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్‌ అండ్‌ ఫిట్‌ అని! కార్పొరేట్‌ ఉద్యోగిని. పేరెంటింగ్‌ టిప్స్‌ నుంచి ఫిట్‌నెస్, శారీ ఫ్యాషన్‌ వరకు చాలా విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది.

రిద్ధి డోరా
సర్టిఫైడ్‌ పేరెంటింగ్‌ అండ్‌ లైఫ్‌ కోచ్‌. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్‌ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్‌ కోసం బయట కూడా వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్‌.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నాను’ అంటుంది. 

చావి మిత్తల్‌
‘మామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డ్‌’విన్నర్‌. కంటెంట్‌ క్రియేటర్‌. ‘బీయింగ్‌ ఉమన్‌ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్‌కి సంబంధించి అన్ని విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

సరు ముఖర్జీ శర్మ
‘డైపర్స్‌ అండ్‌ లిప్‌స్టిక్స్‌’ పేరుతో పేరెంటింగ్‌ నుంచి ఫ్యాషన్, ఫిట్‌నెస్‌ దాకా అన్ని విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్‌లోని ‘బికాజ్‌ యూ ఆర్‌ మోర్‌ దాన్‌ జస్ట్‌ ఏ మామ్‌’ అనే స్టేట్‌మెంట్‌తో!

శ్రద్ధ సింగ్‌..
యూట్యూబ్‌లో చాలా పాపులర్‌. ఇన్‌స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్‌హుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్‌లను షేర్‌ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్‌స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్‌ శ్రాడ్స్‌తో ఇంకో ఇన్‌స్టా అకౌంట్‌ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్‌ చేస్తూంటుంది. 

మదర్స్‌ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్‌.. షెఫ్‌.. బైకర్‌ గర్ల్‌.. స్కూబా డైవర్‌ అండ్‌ యాక్టర్‌’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్‌ అన్నీ ఆమె ఫేస్‌బుక్‌ ప్రొఫైల్లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్‌ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. 

ఒకప్పుడు గ్లామర్‌ వరల్డ్‌లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్‌ లేకుండా తనను తనలాగే ఇన్‌స్టాలో ప్రెజెంట్‌ చేసుకుంటుంది. గ్లామర్‌ రంగంలో వైట్‌ స్కిన్‌ పట్ల ఉన్న అబ్సేషన్‌ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్‌ నుంచి కాస్మెటిక్‌ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్‌ఫెక్ట్‌లీపర్‌ఫెక్ట్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ క్యాంపెయినే చెప్తోంది.

ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్‌గా పోస్ట్‌లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్‌ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్‌పార్టమ్‌ స్ట్రెస్‌ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్‌గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్‌ క్యారెక్టర్లకు కాల్షీట్స్‌ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా  అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్‌లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్‌ గ్రామర్‌ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్‌ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్‌ వంటివారు కనిపిస్తున్నారు. 

ఈ సూపర్‌ మామ్స్‌కీ కుడోస్‌.. 
బాక్సర్‌ మేరీ కామ్‌ అంటే తెలియని వాళ్లుండరు!  2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్‌ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు.

వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్‌ మామ్‌ మేరీ కామ్‌. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్‌ టెన్నిస్‌ కోర్ట్‌లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్‌! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement