అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...
చురుగ్గా ఉండేలా...
ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పక
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?
అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.
వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్‌లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.
ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా?
ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.
మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం
మంచిది.
ప్రేమ పూరితమైన పలకరింపు!
అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.
ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే..
Comments
Please login to add a commentAdd a comment