ప్రపంచవ్యాప్తంగా వున్న గొప్ప ప్రజావాగ్గేయకారులు స్ఫురణలో కొచ్చినప్పుడు, గోరటి వెంకన్న గుర్తుకొస్తాడు. లేదు గోరటి వెంకన్న గుర్తుకొచ్చినప్పుడు విశ్వ ప్రజావాగ్గేయకారులు గుర్తుకొస్తారు. నిన్న మొన్నటి దాకా ప్రపంచసాహిత్యంలో పాటకి మొదటిస్థానం యివ్వటానికి మేధావులు, విమర్శకులు వెనుకాడారు. కానీ అమెరికన్ ప్రజావాగ్గేయకారుడు బాబ్ డిలాన్‌కు నోబెల్ అవార్డు వచ్చాక ఆ రేఖ చెరిగిపోయింది; ఏ ప్రక్రియలో వున్నా గొప్ప సాహిత్యం గొప్ప సాహిత్యమే. అన్ని దేశాలు తమవయిన వాగ్గేయకారులను సృష్టించుకున్నాయి. ప్రజాజీవన లోతుల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, వెతల్ని, హింసల్ని, పీడనల్ని ఈ వాగ్గేయకారులు అద్భుతంగా పట్టుకుని, స్థిరస్థాయిని కల్పించారు. ఎరిక్ క్లాప్‌టన్‌ను వినండి; ట్రేసీ చాప్‌మన్‌ను వినండి; సర్వమానవుల ఉనిక్కి సంబంధించిన సారమేదో, వేదనేదో ప్రతిధ్వనిస్తుంది.
జీవనానందాన్ని, జీవనదుఃఖాన్ని పాట బ్రహ్మాండంగా పట్టుకుంది. వీళ్ల పాట విన్నాక ఒక సమరోత్సాహం, ఒళ్లు తెలియని అనంతమయిన ఆశ ఉబుకుతుంది. ఒక్కసారి వేలవేల పక్షులు ఆకాశంలోకి లేస్తాయి. మనలోని నదులు కదలబారతాయి. ఈ అఖండ భూమిని రెండు చేతుల్తో కౌగిలించుకుంటాం. అన్యాయాన్ని అధర్మాన్ని సహించం. దునుమాడటానికి సిద్ధమవుతాం.
కొన్ని వేల సంవత్సరాల దేశ సంచారుల, బైరాగుల, భక్తికవుల సారమంతా, వారసత్వమంతా వెంకన్న పుణికిపుచ్చుకున్నాడు. ఒక ఆశ సాంప్రదాయపు జీవలక్షణాన్ని, తాజాదనాన్ని తత్కాలపు మేలిమి గుణాల్ని అందుకున్నాడు. అన్ని సాహిత్య ప్రక్రియలు అందులో లీనమై, కరిగిపోయి పాటగా ప్రత్యక్షమవుతాయి. పాట నివేదిస్తుంది. నీచే మాట్లాడిస్తుంది. దేహాన్ని ఖడ్గంగా మారుస్తుంది. ఒకానొక ఉద్యమం వున్నప్పుడు పాట జన్మించి ఉ«ధృతమై ఉనికి రహస్యాన్ని విప్పిచెప్పవచ్చు. ఏకవ్యక్తి నిర్మితమయిన పాట ఈ దశలో బహుముఖమై, జాజ్వల్యమానమై బహు సోయగాల్తో విరాజిల్లుతుంది. ఈ పాటల్ని వాళ్లు వేదికమీద ప్రదర్శించేటప్పుడు బహు భంగిమల్తో, బహు అర్థాల్తో లోలోపలికి తొలుచుకుపోతాయి. ఆ పాట నాదం జీవితాంతం లోలోపల వెలుగుతూనే వుంటుంది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్న ఈ ఉచ్ఛస్థాయినందుకున్నాడు. పాటకి ఒక శాశ్వతత్వాన్ని అద్భుతమయిన అందాన్ని లాలిత్యాన్ని మృదుత్వాన్ని, ఒక గొప్ప మెలకువను ప్రసాదించాడు. ప్రకృతిని యింతగా సంలీనం చేసుకున్న కవి అరుదుగా కనిపిస్తాడు. లీనంగాకుండా జీవితంలో, జనజీవితంలో పాటెట్టా రాస్తాడు; వరుసలు వరుసలుగా ఎలా కడతాడు, తీర్చిదిద్దుతాడు. కరిగిపోవటం, లీనం కావటం కవి ప్రథమ లక్షణం. తర్వాత ఆ ద్రవస్థితిని, పాటగా, కవితగా ఘనీభవింపజేస్తాడు. ఆ గడ్డ కట్టిన పాట మళ్లీ పాఠకుల, శ్రోతల, గాయకులలో కరిగి, కరిగి పాట ప్రవాహమై పోతుంది. ఈ పాటలు ఊరక రావు. అనేక తత్వాలు కలిసి, అనేక దేశాల జీవన రీతుల్ని లీనం చేసుకుని, తనకేమీ పట్టనట్టు జనప్రవాహాల మీద పారబోసుకుంటూ వెడతాడు.
అతను సమస్త దేహంతోనూ, దేహాత్మతోనూ బతుకును పట్టుకుని పాటల్ని సీతాకోక చిలుకల్లా అంతటా ఎగరేసుకుంటూ పోతాడు. అతనికొక కచ్చితమయిన తాత్వికత వుంది. జీవన దర్శనముంది. అతనికి మార్గనిర్దేశం చేసే ఒక వామపక్ష భావజాల తాత్వికత వుంది. అది గడ్డ కట్టుకుపోయేది కాదు. బహుముఖమైంది. ‘ఆకలా, దాహమా, చింతలా, వంతలా’ అని కృష్ణశాస్త్రి పాడుకున్నట్టు వెంకన్న మనమధ్య పాడుకుంటూ తిరుగుతున్నాడు. వెంకన్న వామపక్ష పక్షపాతయినా బహు ప్రజాస్వామికవాది. మన రాజ్యం ఏర్పడ్డాక గూడా రాజ్యంమీద కవి విజిలెన్స్ అవసరం. ప్రకృతి సమాజపు మేలికలయిక వెంకన్న కవిత్వంలో స్పష్టంగా కన్పడుతుంది.
వెంకన్న పాటలు విన్నాక మనలో మనం దృశ్యమానం చేసుకున్నాక, మన రూపురేఖలే మారిపోతాయనుకుంటా. ప్రతి అంశంలోనూ అందాన్ని, శోభని చూడగల సౌందర్యవాది.
‘‘అందాల తనువెల్ల వంపుకున్న అడవి
అలరించి తలపించె ఆకుపచ్చని కడలి’’
షెల్లీ అనుకుంటా సముద్రాన్ని ‘వాటర్ మెడో’ అన్నాడు. అలవోకగా అద్భుతమయిన ఇమేజెస్ పడుతూ వుంటాయి. అపురూపంగా, హాయిగా వుంటాయి. మనదయినతనమేదో వాటికంటుకుని వుంటుంది.
‘నీడల ఊడ’ అనే పాట చూడండి.
‘‘పూసిన పూలకు దోసిలొగ్గితె
వాసన పరిమళమొంపునుర
కోసి మెడలో వేసుకు తిరిగితె
వాడి తాడయి మిగులునురా’’
వెంకన్న సారం నిలుపుకున్న, వడకట్టిన సిద్ధుడుగా పరిణామం చెందుతూ వస్తున్నాడు. అతని పాటలన్నీ ఈ పరిణామ ప్రతిఫలనాలే. పైపైన పలకటం, పాడటం అతనివల్ల కాదు. నిండా మునగాలి, లోతులకెళ్లి జీవనసారాన్ని తీసుకురావాలి. ‘నల్లతుమ్మ చెట్టు’ గానీ, ‘బెడలగువ్వ’ గానీ, ‘కానుగనీడ’ గానీ, ఏదయినా సరే, తనే పాటలా బయటికొస్తాడు. ‘సిగమొగ్గ’ పేరుతో ఉత్తరాంధ్రమీద గొప్పపాట కట్టాడు; ఉత్తరాంధ్ర చరిత్రని, దాని పోరాట పటిమని, దాని నైసర్గిక స్వరూపాన్ని, దాని జీవతత్వాన్ని అద్భుతంగా పట్టుకున్నాడు.వెంకన్నకడ్డేముంది. జీవనస్థలిలో బతుకు పండుగ జరుపుకుంటున్నాడు. అతని పాటలన్నీ బతుకులను ఊరేగించటం, గొప్పగా మురిసిపోవటం, గొప్పగా ఆనందించటం, నృత్యం చేయటం! (గోరటి వెంకన్న మూడు పుస్తకాల– వల్లంకి తాళం, పూసిన పున్నమి, గోరటి కవితలకు ఆంగ్లానువాదం ‘ద వేవ్ ఆఫ్ ద క్రెసెంట్’– ఆవిష్కరణ సభ నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది.)
- కె.శివారెడ్డి
జీవనానందం, జీవనదుఃఖం
Published Mon, Nov 4 2019 1:29 AM | Last Updated on Mon, Nov 4 2019 1:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment