తరమెల్లిపోతున్నదో...
ఈ రోజుల్లో వైద్య వృత్తి అన్నింటికన్నా ఆకర్షణీయమైన, ధనార్జనకు అవకాశమున్న రంగం. ైవైద్యో నారాయణో హరి అని ప్రసిద్ధిచెందిన వైద్యవృత్తి నేడు వ్యాపారంగా మారింది. వైద్య వృత్తి డాక్టర్‌కు స్టెతస్కోపును మాత్రమే కాదు, టెలి స్కోపును కూడా ఇస్తుంది. కొందరు గుండె చప్పుడే వింటారు. కొందరు టెలిస్కోపుతో సమాజం గుండె చప్పుడు కూడా వింటారు. కొందరు రోగ పరీక్షకే పరిమితమవుతారు. మరికొం దరు సమాజాన్ని పీడిస్తున్న రోగాల మూలాలను నిర్ధారిస్తారు. కొందరు వైద్యులు రోగానికే మందిస్తే, ఇంకొందరు ఆ రోగానికి కారణాలపైన దృష్టి పెడతారు. కొందరు వైద్యలు హాస్పిటల్‌కే పరిమితమైతే మరి కొందరు యావత్ ప్రపంచానికి అంకితమవుతారు. అలాంటి వైద్యల వల్లే ఆ వృత్తి నేటికీ గౌరవనీయమైన వృత్తిగా, మానవత్వం కలిగిన గొప్ప వృత్తిగా ఉంటోంది.
తెలంగాణ సాయుధ పోరాట ప్రేరణ పొందిన పలువురు డాక్టర్లు తెలంగాణ మారుమూల గ్రామాలకు వెళ్లారు. ప్రజలకు వైద్య సేవలందించే ప్రజా వైద్యశాలలయ్యారు. అలాంటి వారిలో యలమంచిలి రాధాకృష్ణమూర్తి, ఏపీ విఠల్ లాంటి వాళ్లు కొందరు. 1952లో వైఆర్‌కే డాక్టర్‌గా ఖమ్మం జిల్లాకు చేరి, ప్రజానాయకునిగా కన్నుమూశాడు. ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ తిరిగిన ప్రజా వైద్యుడయ్యాడు. రోగుల నాడితో పాటూ జనం నాడి కూడా చూశాడు. ప్రజా కెరటం ఎంతగా ఎదిగి వస్తే తను కూడా అంత ఉద్యమంగా లేచాడు. అందుకే ఆయన మరణం తర్వాత అంతిమయాత్రకు బోరున కురిసే వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో జనం హాజరై జోహార్లు అర్పించారు. డాక్టర్‌గా రోగ నిర్ధారణ చేసినట్టే సామాజిక రుగ్మతలపై నిర్భయంగా రోగ నిర్ధారణ చేసి, ఉద్యమాల ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చాడు. 1975-77 మధ్య కాలం నాటి ఎమర్జెన్సీని ధిక్కరించి నిలబడ్డవాళ్లు చాలా తక్కువ మంది. వారిలో చాలా మందితో పాటూ యలమంచలి కూడా జైలుకు వెళ్లాడు. రాజ్యసభ సభ్యత్వాన్ని వైఆర్‌కే తన ఎదుగుదలకు సోపానం అనుకోలేదు. ప్రజల గొంతుకను వినిపించే అవకాశంగా చూశారు.
ప్రపంచీకరణ దేశ దేశాల ప్రభుత్వాలతోపాటూ, సకల రంగాలను ధ్వంసం చేస్తోంది. బహుళజాతి కంపెనీలు వైద్యరంగాన్ని వ్యాపారమయం చేశాయి. ఈ వైనాన్ని వైఆర్‌కే తన రచనల ద్వారా తెలిపారు. పరిశోధన సామాన్యునికి అండగా ఉండటానికి బదులుగా కొత్త రోగాలకు కారణభూమవుతున్నదని లెక్కలతో సహా విప్పి చెప్పారు. పార్లమెంటులోని ప్రజాప్రతినిధులు రాధాకృష్ణలాగా ఉద్యమాలలో తడిసినవాళ్లు కావాలి. గొప్ప అధ్యయనశీలి. ప్రజావైద్యుడు. సామాజిక స్పృహ గలవాడు అయిన వైఆర్‌కే ఎప్పుడూ ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన వినయంగా నిలిచినవాడు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యల పట్ల ఎలా ఉండాలనేదానికి, జనం పట్ల ఎంత వినయంగా ఉండాలనే దానికి వైఆర్‌కే నమూనా. ప్రజల కోసం పని చేసిన వారు మరణించటం సమాజానికి తీరని లోటే. సీపీఎం నేత, ప్రజల డాక్టరు, ప్రజా వైద్యశాలకు శ్రీకారం చుట్టినవాడు అయిన వైఆర్‌కె మరణవార్త కలచివేసింది. ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఎమర్జెన్సీ నిర్బంధపు రోజులను ధిక్కరించిన ఆయన ధైర్యం, తాను నమ్ముకున్న సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి ఉన్న నిబద్ధత, ఎదుటివారిని పలకరించేటప్పుడు గుండెలకు హత్తుకునే ఆప్యాయత ఎన్నటికీ మరిచిపోలేం.
వైఆర్‌కే చనిపోగానే ఆ పాత తరాని కుండే ఉద్యమ విలువలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పాత తరం ఉద్యమ విలువలను ‘‘తరమెల్లిపోతున్నదో... ఆ త్యాగాల స్వరమణిగిపోతున్నదో’’ అంటూ మా గోరటి వెంకన్న గొప్పగా తన పాటలో పొదిగాడు. తెలంగాణ సాయుధ పోరు వారసులను కీర్తిం చాడు. డాక్టర్‌కు గుండెజబ్బు వస్తే దాని తీవ్రతను ఊరికే పసిగట్టగలుగుతాడు. అందుకే ఆయన మరణానికి ముందు ‘‘చనిపోయిన తర్వాత నన్ను ఎక్కువ సేపు ఉంచకండి. రెండు మూడు గంటల్లో నా దేహాన్ని తీసేయండి. ఏ రకమైన హంగులు లేకుండానే అంతిమయాత్రను ముగించండి’’ అని సూచించారు. ఆయనకు నా జోహార్లు.
- చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ