కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది | Goreti venkanna songs to go worldwide his journey of life | Sakshi
Sakshi News home page

కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది

Published Mon, Jul 11 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది

కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది

One of the pleasant things in the world is going a journery; but I like to go by myself. I can enjoy society in a room; but out of doors, Nature is company enough for me. I am then never less alone than when alone.
 ‘ఆన్ గోయింగ్ ఎ జర్నీ’ గురించి విలియం హాజ్‌లిట్ చెప్పిన మాటలు గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. ‘‘ఏ బంధనాలూ లేకుండా తమ జీవితానుభవంతో లోకానికి మంచిని బోధిస్తూ తిరుగాడిన ఎందరో లోక సంచారులు... పోతులూరి వీరబ్రహ్మం, వేమన..  ముఖ్యంగా శైవదాసులు నాకు ఆదర్శం’’ అన్నాడు వెంకన్న. అదే తత్వానికి అద్దం పడుతూ రాసిన పాట ‘సంచారం’. ‘ఇల్లు పొల్లు లేని, ముల్లె మూట లేని...’ ఐహిక కౌటుంబిక లంపటాలూ, సిరిసంపదల వ్యామోహాలూ లేని సంచారమే ఆనందమంటాడందులో. ‘కిరీటమేమో భారమై ఉన్నది/ కిందేసితే నడక భలే ఉన్నది..’-- మతమూ, కులమూ, సంపదా, హోదా, కీర్తీ లాంటి వాటి వల్ల అహాన్ని పెంచుకుంటే, చివరకు ఆ అహ మే బరువైన కిరీటంగా మారి, గమనానికే ఆటంకమవుతుందని ధ్వనించాడు. ‘మంచుతో మెరిసేటీ కొండున్నది/ మిహ మల తొవ్వెంట సెవ్విన్నది/ కొంచెం ఎడం బోతే ఏదో మేలున్నది/ మురిపాల మెరుపులు అడ్డున్నవి/ దాటిపోతె నడకతీరె వేరున్నది’ అన్నాడు. ఇక్కడ ‘మంచుతో మెరిసే కొండ’ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతీకగా ప్రయోగించానని ఒక ఉపన్యాసంలో ఆయనే చెప్పాడు. పటాటోపాలనూ, ఆడంబ రాలనూ వదులుకున్నప్పుడే జీవిత వాస్తవాన్ని తెలుసుకోగలమనే భావాన్ని ‘పైవన్నీ వదులుకొమ్మన్నది/ పైరగాలి తడిపి పోతున్నది’ అని మార్మికంగా వ్యక్తం చేశాడు.
 
 పండిన జానపండు రుచికరంగానే ఉన్నా, దాని గింజ చేదుగా ఉంటుంది. ఆ చేదు గింజను కూడ నమిలే కొద్దీ తీపిని ఇస్తుందన్నాడు. సుఖాల వెనుక ఉండే కష్టాలకూ, ఆనందాల మరుగున దాగిన విషాదాలకూ ప్రతీక చేదుగింజ. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనేది భావం. ‘ఊరి ఊరికి దారులేరున్నవి/ ఊటలోలె బాటలొస్తున్నవి/ వింత వింత పూలు పూసున్నవి/ తోవ ఎంత నడిసిన వొడువకుంటున్నది’-- ఈ సంచారంలోనే వివిధ సిద్ధాంతాలూ, మార్గాలూ, లక్ష్యాలూ, వివిధ నాగరికతలూ, సంస్కృతులూ, వాటిలోని వైవిధ్యాలూ తెలుస్తుంటాయి.
 
 ఈ ‘తెలివిడి’ వల్లనే తనకు తెలిసింది చాల తక్కువనీ, తెలుసుకోవలసింది అంతులేనంత ఉన్నదనీ బోధపడుతుంది. ఈ లోకంలో తన అల్పత్వం పట్ల ‘ఎరుక’ కలుగుతుంది. ‘పండితులకూ కవులకూ దేశాటనం అనివార్యమైన విహిత ధర్మం. మానరానిదది. కీర్తి, ధనము మాత్రమే కాదు, అనేకాలు చూడ్డమూ, అనేకాలు వినడమూ, జ్ఞానం పరిణతం కావడమూ, ప్రతిభ నిశితం కావడమూ వంటి అనుభావాలు కలిగి, ప్రౌఢిమ అబ్బుతుంది’’ అన్నారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.
 
 ‘గాలిలో తేలాడే గద్దున్నది/ గగనమంచుల దాక పోతున్నది/ ఏటిలో గాలాడే చేపున్నది/ నీటిపాతి దాక ఈతున్నది’-- ఏ బంధాలూ, బంధనాలూ లేని గద్ద, నింగి అంచుల దాక విహరించ గలుగుతున్నదనీ, చేప నీటి అడుగు దాకా ఈద గలుగుతున్నదనీ, భూమ్యాకాశాల మధ్యన ఉన్న మనిషి మాత్రమే మోహపాశ బద్ధుడవుతున్నాడనీ సారాంశం. ‘సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి’ అనే చివరి పంక్తుల్లో rolling stone gathers no moss అన్న వాక్య భావం నిక్షిప్తం చేయబడింది.  ఒక సందర్భంలో వెంకన్నే అన్నట్టు, సంచారమంటే ఒక్క కాళ్ళతో తిరగడమనే కాదు, చలనశీలమైన జగత్తులో చేసే నిరంతర ప్రయాణం, ఆలోచనల ప్రయాణం, ఆసక్తుల ప్రయాణం. పాటతో, పదముతో నిత్య పథికుడు గోరటి వెంకన్న.
 - పెన్నా శివరామకృష్ణ
 9440437200

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement