pothuluri veerabrahmam
-
దార్మిక పరిషత్ తీర్మానాన్ని మా ముందుంచండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యం విషయంలో ఏపీ ధార్మిక పరిషత్ ఏదైనా తీర్మానం చేసిందా? అని హైకోర్టు గురువారం దేవదాయ శాఖను ప్రశ్నించింది. ఒకవేళ తీర్మానం చేసి ఉంటే.. దానిని తమ ముందుంచాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో పీఠాధిపత్యం ఎవరికి చెందాలన్న విషయాన్ని తాము తేల్చబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పీఠాధిపత్యం విషయంలో దేవదాయ ప్రత్యేక కమిషనర్, సహాయ కమిషనర్ ఉత్తర్వుల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని చెప్పింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులిచ్చారు. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్షుమ్మ, కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మమ్మల్ని పీఠాధిపతులుగా గుర్తించేలా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమఠం పీఠాధిపత్య వివాదం హైకోర్టుకు చేరింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి కుమారుడు ఎన్.గోవిందస్వామి, రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మఠం ప్రైవేటు ఆస్తి అని, అందువల్ల మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మఠం వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం మాత్రమే అధికారులకు ఉంది తప్ప, మఠం నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి లేదని తెలిపారు. 1965లోనే కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. పీఠాధిపతి మొదటి భార్య కుమారుడైన వెంకటాద్రిస్వామికి పీఠాధిపత్యం వహించే అర్హత లేదన్నారు. ఆయన న్యాయవాదిగా కడపలో ప్రాక్టీస్ చేస్తున్నారని, ఎన్నడూ మఠంలో పూజాదికాలు నిర్వహించలేదని తెలిపారు. పెద్ద కుమారుడే పీఠాధిపత్యం వహించాలన్న ఆచారం ఏమీ లేదన్నారు. 2008లో పీఠాధిపతి రాసిన వీలునామా ప్రకారం మొదటి భార్య సంతానానికి మఠం వ్యవహారాలపై ఆసక్తి లేదని, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియదని పేర్కొన్నారు. తన కుమారుడు మైనర్ కాబట్టి అతను మేజర్ అయ్యేంతవరకు తాత్కాలికంగా పీఠాధిపత్యం వహించే అధికారం తనకు ఉందని మహాలక్ష్మి పేర్కొన్నారు. -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం: మళ్లీ మొదటికొచ్చిన వివాదం
-
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం: మళ్లీ మొదటికొచ్చిన వివాదం
సాక్షి, వైఎస్ఆర్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదం ముగిసిందన్న క్రమంలో మరో మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పీఠాధిపత్యం విషయంతో తనపై ఒత్తిడి తెచ్చి అంగీకరించేలా చేశారంటూ మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 రోజుల క్రితం ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రాజీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కొడుకు వీరభద్రస్వామిని ఎన్నిక చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపత్యం వివాదంలో హైకోర్టు మెట్లు ఎక్కడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. చదవండి: కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక -
కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతి విషయంలో నెల రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. ఇటీవల శివైక్యం పొందిన మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసినట్లు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఇరు కుటుంబాలతో దాదాపు 4 గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం దేవదాయశాఖ సంయుక్త సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కందిమల్లాయపల్లె గ్రామస్తులు, భక్తులు అందరి సహకారంతో శనివారం వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నిర్ణయించేందుకు పూర్వ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ అంగీకరించారని తెలిపారు. అలాగే ఉత్తరాధికారిగా వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి రెండో కుమారుడు వీరభద్రస్వామిని నియమించినట్లు చెప్పారు. వీరిద్దరి అనంతరం రెండో భార్య మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామిని మఠాధిపతిగా నియమించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మఠం అభివృద్ధికి దేవదాయశాఖ సహకరిస్తుందన్నారు. -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యింది. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు. చదవండి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ -
బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే తెలిపాని అమె పేర్కొన్నారు. అంతే తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి ఏకాభిప్రాయంకు రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు తాను పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి మద్దతు పలకలేదని తెలిపారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయశాఖ అధికారితో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు. చదవండి: కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం -
కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని బ్రహ్మంగారి మఠం వారసులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా మఠం వారసులు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చామని, పీఠాధిపతి ఎంపిక సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి సమక్షంలో నేటి సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, సాంప్రదాయం ప్రకారం త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో మఠం పీఠాధిపతి సమస్య పరిష్కారం అయిందన్నారు. ఈ సమస్య పరిష్కారం తాము చేయలేదని, బ్రహ్మంగారి అజ్ఞానుసరమే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పీఠాధిపతిని ప్రకటిస్తామని తెలిపారు. కడప: బ్రహ్మంగారి మఠంలో ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. బ్రహ్మంగారి మఠంలోని వారసత్వం, ఆచారాలు, గ్రామస్తుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. మఠానికి సంబంధించిన సేకరించిన పలు అభిప్రాయాల నివేదికను ఆయన ప్రభుత్వానికి అందజేయనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య -
బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతో పాటు కొందరు మండల స్థాయి నేతలు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. అలాగే, త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. నేడు దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ రాక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శనివారం దేవదాయశాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రికి నివేదక అందిస్తారని దేవాలయం ఫిట్ పర్సన్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ తెలిపారు. -
కొలిక్కి వచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం, పీఠాధిపతి ఆయనే
సాక్షి, వైఎస్సార్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం వివాదం కొలిక్కి వచ్చింది. రెండు కుటుంబాల మధ్య రాజీ చర్చలు ఫలించాయి. 12వ మఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామికి అవకాశం దక్కింది. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానుంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి సారథ్యంలో, కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పరస్పర అంగీకారంతో రెండు కుటుంబాల మధ్య కుదిరిన సయోధ్య కుదిరింది. రేపు ఇరు కుటుంబాలు మీడియా ముందుకు రానున్నట్టు సమాచారం. 11వ మఠాధిపతి కుటుంబ వివరాలు... శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారికి ఇరువురు భార్యలు.పెద్ద భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా.. పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు. (చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!) -
జూలైలో మఠాధిపతుల భేటీ
సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొలిక్కి రాకపోవడంతో.. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని పరిష్కరించేందుకు దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. తదుపరి మఠాధిపతి ఎంపిక కోసం జూలై నెలాఖరులో సమావేశం నిర్వహించబోతోంది. దీనికి వివిధ మఠాధిపతులు విచ్చేసి.. కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. వారితో చర్చించిన అనంతరం మఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ సమావేశం నిర్వహణ కోసం జాయింట్ కమిషనర్ ఆజాద్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత సమస్యను పరిష్కరించాలంటే నిబంధనల ప్రకారం.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలను అనుసరించే దేవదాయ శాఖ పరిధిలోని మఠాధిపతులతోనే సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దేవదాయ శాఖ పరిధిలో 128 మఠాలున్నాయి. ఇందులో 13.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాల ప్రకారం పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అవకాశాన్ని బట్టి ఆ 13 మంది మఠాధిపతులు గానీ.. లేదంటే అందులో ఐదుగురు గానీ.. కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. ఇందులో వచ్చే అభిప్రాయం మేరకు మఠాధిపతిని ఎంపిక చేస్తారు. ఈ సమావేశాన్ని బ్రహ్మం గారి మఠంలో గానీ లేదంటే కడప, విజయవాడలో గానీ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. 30 రోజుల ముందస్తు నోటీసుతో.. ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం.. సమావేశం నిర్వహణ కోసం 30 రోజుల ముందు ఆయా మఠాధిపతులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు çసమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి ఆజాద్ ఒకటి, రెండు రోజుల్లో బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించి రికార్డులు పరిశీలిస్తారు. అనంతరం మఠాధిపతుల సమావేశం ఏర్పాటుకు ఈ నెల 28, 29 తేదీల్లో మీడియా ప్రకటన రూపంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆ మీడియా నోటిఫికేషన్ జారీ అనంతరం 30 రోజులకు సమావేశం నిర్వహిస్తారు. చదవండి: మన పిల్లలకు హైఎండ్ స్కిల్స్ నేర్పించాలి -
బ్రహ్మంగారి మఠం: తెగని పంచాయితీ, చర్చలు విఫలం
సాక్షి, వైఎస్సార్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపత్యం వివాదంలో జరపుతున్న చర్చలు విఫలమయ్యాయి. శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి రెండు కుటుంబాల మధ్య ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. పీఠాధిపత్యం విషయంలో చర్చలు కొలిక్కిరావడం లేదు. మఠం పీఠాధిపతి పదవికి తానే అర్హుడని వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి పట్టుడుతుండగా.. తనను మఠం మాతృశ్రీగా నియమించాలన్న రెండో భార్య మహాలక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. వీరితోపాటు తనకూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి అంటున్నాడు. ఇదిలా ఉండగా డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. నేనంటే.. నేనే వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి(53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి(9)ల మధ్య పీఠాధిపత్యంలో పోటీ నెలకొంది. గోవిందస్వామి మేజర్ అయ్యేంత వరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి రావడం వివాదం నెలకొంది. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. చదవండి: శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యం కోసం ఇరువర్గాల పోరు -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలోనే తెర
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు. కాగా బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలో తెరపడనుందనే సంకేతాలు ఇచ్చారు. వివాదానికి కారణమైన రెండు వర్గాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి రావాలని కోరిన ఆయన త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది. చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి! -
ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!
సాక్షి ప్రతినిధి, కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు నెలకొంది. డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. మఠం పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10 కోట్లు విలువజేసే 84.24 ఎకరాల భూములున్నాయి. వీటిపై వచ్చే కౌలుతోపాటు దేవస్థానం పరిధిలోని వివిధ దుకాణాల కోసం కేటాయించిన గదుల ద్వారా ఏటా మఠానికి సుమారు రూ.4 కోట్ల మేర రాబడి వస్తున్నట్లు చూపిస్తున్నా వాస్తవానికి రెట్టింపు రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం, ఆ మొత్తాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేసే అధికారాలు ఉండడంతో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపత్యం కోసం పోటీ ఏర్పడింది. మఠానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు పంపుతుంటారు. వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడైన గాలి జనార్దన్‌రెడ్డి మఠం అభివృద్ధికి డబ్బులు వెచ్చించి సొంతంగా పలు భవనాలు కట్టించారు. ఇద్దరూ.. ఇద్దరే శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి మొదటి భార్య కుమారుడితోపాటు రెండో భార్య మారుతి మహాలక్షుమ్మలు మఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ సిద్ధపడుతున్నారు. ఇద్దరికీ స్థానిక నేతలతోపాటు బంధుగణం, సన్నిహితులు మద్దతు పలుకుతూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. ఆమెది నిరుపేద కుటుంబం. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. స్వయం ప్రతిపత్తితో.. మఠం స్వయం ప్రతిపత్తితో నడుస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మఠాధిపతులు నచ్చినట్లుగా ఖర్చు చేయవచ్చు. ఏడాదికి ఒకసారి రాబడి, ఖర్చులను దేవదాయశాఖకు వెల్లడించాలి. మఠం పరిధిలో 46 మంది ఉద్యోగులు ఉండగా జీతాల కింద నెలకు రూ.6 లక్షలు ఖర్చవుతోంది. మఠాధిపతికి నెలకు రూ. 40 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. బ్రహ్మంగారి ఆరాధన, మహా శివరాత్రి, బ్రహ్మంగారి జయంతి, దసరా ఉత్సవాల కోసం ఏటా రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా రాబడిలో దేవదాయశాఖకు కాంట్రిబ్యూషన్ కింద 8 శాతం, ఆడిటింగ్ ఫీజు 1.05 శాతం, సీజీఎఫ్ 9 శాతం, అర్చక వెల్ఫేర్ 8 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. మఠం స్థిరాస్తుల వివరాలు – కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని కేతారంలో 50 సెంట్లు – గుంటూరు జిల్లా ఎల్లలూరులో 50 సెంట్లు, నగరంలో 1.10 ఎకరాలు, కంతేరులో 1.16 ఎకరాలు – ప్రకాశం జిల్లా రెడ్డిచర్లలో 16 సెంట్లు, పల్లెగుట్టపల్లెలో 6.43 ఎకరాలు – అనంతపురం జిల్లా చలివెందులలో 27 సెంట్లు – వైఎస్సార్ జిల్లా సోమిరెడ్డిపల్లెలో 18 ఎకరాలు, చీపాడులో 2.26 ఎకరాలు, పెద్ద గురవలూరులో 1.18 ఎకరాలు, మడూరులో 2.96 ఎకరాలు, వాసుదేవపురంలో 68 సెంట్లు, ఉప్పరపల్లెలో 1.19 ఎకరాలు, రంగాపురంలో 10.57 ఎకరాలు, దుంపలగట్టులో 1.93 ఎకరాలు, నందిపల్లెలో 1.93 ఎకరాలు, చెన్నూరు ఉప్పరపల్లెలో 50 సెంట్లు, పెద్దపుత్తలో 78 సెంట్లు, పైడికాల్వలో 60 సెంట్లు, బుగ్గరాపురంలో ఒక ఎకరా, సంకటితిమ్మాయపల్లెలో 2.24 ఎకరాలు. – కర్నూలు జిల్లా నరసాపురంలో 4.57 ఎకరాలు, ఆలమూరులో 7.60 ఎకరాలు – కర్నూలు జిల్లాలోని భూములతోపాటు వైఎస్సార్ జిల్లా శోస్తి వెంగన్నపల్లెలో 1.10 ఎకరాల భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి. బంగారం, వెండి, ఎఫ్డీలు – మఠం పరిధిలో 3.20 కిలోల బంగారం, 142 కిలోల వెండి ఉంది. – దుకాణాల బాడుగలపై ఏటా రూ. 6 లక్షల ఆదాయం – పలు బ్యాంకుల్లో రూ. 12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు – తలనీలాలు, హుండీ ఆదాయం, టెంకాయల వేలం ద్వారా రాబడి -
మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ
సాక్షి, అమరావతి: చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్పర్సన్ (పర్సన్ ఇన్చార్జి)గా వైఎస్సార్ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మంచి నిర్ణయమే తీసుకుంటాం: మంత్రి సమావేశానంతరం మంత్రి వెలంపల్లి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మఠం పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా మఠాధిపతి ఎంపికపై మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి విద్వేషాలకు తావులేకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయ్యాక, అప్పటి నుంచి వారి వంశమే మఠాధిపత్యం స్వీకరిస్తూ వచ్చిందని.. ఇలా ఇప్పటివరకు 11 మంది కొనసాగారని ఆయన తెలిపారు. ప్రస్తుత మఠాధిపతి మే 8న పరమపదించారని.. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరి భార్యల వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడడంతో వివాదం ఏర్పడిందన్నారు. ఇరుపక్షాలు తమ వద్ద వీలునామాలు ఉన్నాయని చెబుతున్నాయని.. కానీ, ఇప్పటివరకు ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందలేదని మంత్రి వెలంపల్లి చెప్పారు. నిబంధనల ప్రకారం.. వీలునామా రాసిన 90 రోజుల వ్యవధిలో దానికి ఒక విన్నపాన్ని జతపరిచి దేవదాయ శాఖకు అందజేయాల్సి ఉందని.. అయినా ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందనందున తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందున మఠాధిపతి ఎంపిక సంప్రదాయ బద్ధంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. పీఠాధిపతి ఉన్నప్పుడే తదుపరి ఉత్తరాధికారిని ప్రకటించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్నారు. ముందస్తు నోటీసు ఇచ్చే కమిటీ సమావేశం.. ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ పరిధిలో 128 వరకు మఠాలు, పీఠాలు ఉన్నాయని.. వాటిలో బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలు కలిగిన ఇతర మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని.. కమిటీ సూచనలను ధార్మిక పరిషత్ పరిశీలించి తదుపరి మఠాధిపతి ఎంపిక పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కమిటీ సమావేశం నిర్వహణకు 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమావేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని వెలంపల్లి చెప్పారు. -
వీడని ‘పీఠ’ముడి!
బ్రహ్మంగారి మఠం: తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తును చాటిచెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. తాజా పరిస్థితులు పరిశీలిస్తే ఈ వివాదం పరిష్కారానికి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నెరపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలోని ఇతర మఠాధిపతుల బృందం ఆదివారం మఠానికి వచ్చి రెండోసారి చర్చలు జరుపుతారని.. తద్వారా వివాదానికి ముగింపు పలికే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. కానీ.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పట్టువదలకపోవడంతో ఇప్పుడు ఈ వివాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యవర్తిత్వానికి ‘నో’.. మఠాధిపతి వివాదంలో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశముందని, పీఠాధిపతుల జోక్యాన్ని సహించేదిలేదని, వీరిని మఠానికి రాకుండా నిలువరించాలంటూ డీజీపీ మొదలుకుని కిందిస్థాయి అధికారులందరికీ ఆమె శుక్రవారం లేఖలు రాశారు. అలాగే, తాము మఠాధిపతుల చర్చల్లో పాల్గొనేది కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. తాము దేవదాయ శాఖ నిబంధనల మేరకు మఠం పర్యవేక్షణలోనే మఠాధిపతి ఎంపిక నిర్వహించుకుంటామని, పీఠాధిపతుల జోక్యం అక్కర్లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. అలాగే, మఠాధిపతి నియామకం వారసత్వ చట్ట ప్రకారం ఉంటుందని దివంగత మఠాధిపతి మొదటి భార్య కుమారులు అంటున్నారు. ఈ విషయంపై శివస్వామి ఈనెల 2న వివిధ పీఠాధిపతులతో కలిసి ఇరువర్గాలతో చర్చలు జరిపినప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే. రెండోదఫా చర్చలు ప్రశ్నార్ధకం మరోవైపు.. శివస్వామి నేతృత్వంలోని పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి శనివారం రాత్రి రానుండడంతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పీఠాధిపతుల నేతృత్వంలో చర్చలకు మహాలకు‡్ష్మమ్మ ససేమిరా అనడంతో రెండవ దఫా చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో పోలీసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ విషయమై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. రాజీ ఫార్ములా!? ఇదిలా ఉంటే.. స్థానిక ప్రజల్లో కొందరు దివంగత మఠాధిపతి మొదటి భార్య తనయుడికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు రెండో భార్యకు అండగా నిలుస్తుండడంతో ఈ వివాదంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, పీఠాధిపతులు వారి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు, మూడు రకాల ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇది విఫలమైన పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. పీఠాధిపతులకు అనుమతిలేదు బి.మఠం మఠాధిపతి నియామకం కోసం చర్చల నిమిత్తం వస్తున్న వివిధ పీఠాధిపతులకు దేవస్థానంలోకి అనుమతిలేదు. వారు శనివారం రాత్రికి వస్తే వారు బి.మఠంలోని పల్నాటి అన్నదాన సత్రంలో ఉండేందుకు ఏర్పాట్లుచేశారు. పీఠాధిపతులు ఆదివారం కేవలం స్వామి దర్శనం కోసం వెళ్లొచ్చు కానీ చర్చలకు మాత్రం అందరి ఆమోదం ఉంటేనే పంపుతాం. –విజయకుమార్, మైదుకూరు డీఎస్పీ ఇదీ వివాదం.. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందారు. భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణంతో పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య ఇప్పుడు పీఠాధిపత్యంపై పోటీ నెలకొంది. అయితే, గోవిందస్వామి మేజర్ అయ్యే వరకు తాను మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి పలువురు పీఠాధిపతులు గత వారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. కానీ, వీరి ప్రయత్నాలు ఫలించలేదు. -
‘కాలజ్ఞాని’ కుటుంబంలో కలహాలు
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్య మరింత జటిలం అయ్యింది. ఈ నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకుగాను రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి 7గురు పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. వీరిలో శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి, బనగానపల్లె రవ్వలకొండ పీఠాధిపతి జ్ఞానేశ్వర్ స్వామి, రుద్ర పీఠాధిపతి అతిదేనందేశ్వర స్వామి, రంగనాథ స్వామి, మారుతి మహానంద స్వామి, ఆత్మానంద భారతీ స్వామి, శివ స్వామి ఉన్నారు. వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి శివైక్యం చెందిన అనంతరం స్వామి పెద్ద భార్య కుమారులు, రెండో భార్య కుమారుల మధ్య నెలకొన్న మఠాధిపత్య పోరును పరిష్కరించేందుకు తాము ఇక్కడికి వచ్చినట్లు పీఠాధిపతులు తెలిపారు. మఠంలో రెండు రోజుల పాటు ఉండి ఈ మఠం సిద్ధాంతాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మఠాధిపతి నియామకం గురించి చర్చిస్తామని చెప్పారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యకు రాసిచ్చిన వీలునామాలో ఏముందనే విషయాన్ని కూడా తాము పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే మఠాధిపతులు, లేక పీఠాధిపతుల ఎంపికలో దేవదాయ శాఖ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది పరిశీలిస్తామన్నారు. నూతన మఠాధిపతి నియామకం శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని గుంటూరు జిల్లా శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి తెలిపారు. -
కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది
One of the pleasant things in the world is going a journery; but I like to go by myself. I can enjoy society in a room; but out of doors, Nature is company enough for me. I am then never less alone than when alone. ‘ఆన్ గోయింగ్ ఎ జర్నీ’ గురించి విలియం హాజ్లిట్ చెప్పిన మాటలు గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. ‘‘ఏ బంధనాలూ లేకుండా తమ జీవితానుభవంతో లోకానికి మంచిని బోధిస్తూ తిరుగాడిన ఎందరో లోక సంచారులు... పోతులూరి వీరబ్రహ్మం, వేమన.. ముఖ్యంగా శైవదాసులు నాకు ఆదర్శం’’ అన్నాడు వెంకన్న. అదే తత్వానికి అద్దం పడుతూ రాసిన పాట ‘సంచారం’. ‘ఇల్లు పొల్లు లేని, ముల్లె మూట లేని...’ ఐహిక కౌటుంబిక లంపటాలూ, సిరిసంపదల వ్యామోహాలూ లేని సంచారమే ఆనందమంటాడందులో. ‘కిరీటమేమో భారమై ఉన్నది/ కిందేసితే నడక భలే ఉన్నది..’-- మతమూ, కులమూ, సంపదా, హోదా, కీర్తీ లాంటి వాటి వల్ల అహాన్ని పెంచుకుంటే, చివరకు ఆ అహ మే బరువైన కిరీటంగా మారి, గమనానికే ఆటంకమవుతుందని ధ్వనించాడు. ‘మంచుతో మెరిసేటీ కొండున్నది/ మిహ మల తొవ్వెంట సెవ్విన్నది/ కొంచెం ఎడం బోతే ఏదో మేలున్నది/ మురిపాల మెరుపులు అడ్డున్నవి/ దాటిపోతె నడకతీరె వేరున్నది’ అన్నాడు. ఇక్కడ ‘మంచుతో మెరిసే కొండ’ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతీకగా ప్రయోగించానని ఒక ఉపన్యాసంలో ఆయనే చెప్పాడు. పటాటోపాలనూ, ఆడంబ రాలనూ వదులుకున్నప్పుడే జీవిత వాస్తవాన్ని తెలుసుకోగలమనే భావాన్ని ‘పైవన్నీ వదులుకొమ్మన్నది/ పైరగాలి తడిపి పోతున్నది’ అని మార్మికంగా వ్యక్తం చేశాడు. పండిన జానపండు రుచికరంగానే ఉన్నా, దాని గింజ చేదుగా ఉంటుంది. ఆ చేదు గింజను కూడ నమిలే కొద్దీ తీపిని ఇస్తుందన్నాడు. సుఖాల వెనుక ఉండే కష్టాలకూ, ఆనందాల మరుగున దాగిన విషాదాలకూ ప్రతీక చేదుగింజ. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనేది భావం. ‘ఊరి ఊరికి దారులేరున్నవి/ ఊటలోలె బాటలొస్తున్నవి/ వింత వింత పూలు పూసున్నవి/ తోవ ఎంత నడిసిన వొడువకుంటున్నది’-- ఈ సంచారంలోనే వివిధ సిద్ధాంతాలూ, మార్గాలూ, లక్ష్యాలూ, వివిధ నాగరికతలూ, సంస్కృతులూ, వాటిలోని వైవిధ్యాలూ తెలుస్తుంటాయి. ఈ ‘తెలివిడి’ వల్లనే తనకు తెలిసింది చాల తక్కువనీ, తెలుసుకోవలసింది అంతులేనంత ఉన్నదనీ బోధపడుతుంది. ఈ లోకంలో తన అల్పత్వం పట్ల ‘ఎరుక’ కలుగుతుంది. ‘పండితులకూ కవులకూ దేశాటనం అనివార్యమైన విహిత ధర్మం. మానరానిదది. కీర్తి, ధనము మాత్రమే కాదు, అనేకాలు చూడ్డమూ, అనేకాలు వినడమూ, జ్ఞానం పరిణతం కావడమూ, ప్రతిభ నిశితం కావడమూ వంటి అనుభావాలు కలిగి, ప్రౌఢిమ అబ్బుతుంది’’ అన్నారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. ‘గాలిలో తేలాడే గద్దున్నది/ గగనమంచుల దాక పోతున్నది/ ఏటిలో గాలాడే చేపున్నది/ నీటిపాతి దాక ఈతున్నది’-- ఏ బంధాలూ, బంధనాలూ లేని గద్ద, నింగి అంచుల దాక విహరించ గలుగుతున్నదనీ, చేప నీటి అడుగు దాకా ఈద గలుగుతున్నదనీ, భూమ్యాకాశాల మధ్యన ఉన్న మనిషి మాత్రమే మోహపాశ బద్ధుడవుతున్నాడనీ సారాంశం. ‘సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి’ అనే చివరి పంక్తుల్లో rolling stone gathers no moss అన్న వాక్య భావం నిక్షిప్తం చేయబడింది. ఒక సందర్భంలో వెంకన్నే అన్నట్టు, సంచారమంటే ఒక్క కాళ్ళతో తిరగడమనే కాదు, చలనశీలమైన జగత్తులో చేసే నిరంతర ప్రయాణం, ఆలోచనల ప్రయాణం, ఆసక్తుల ప్రయాణం. పాటతో, పదముతో నిత్య పథికుడు గోరటి వెంకన్న. - పెన్నా శివరామకృష్ణ 9440437200