
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యం విషయంలో ఏపీ ధార్మిక పరిషత్ ఏదైనా తీర్మానం చేసిందా? అని హైకోర్టు గురువారం దేవదాయ శాఖను ప్రశ్నించింది. ఒకవేళ తీర్మానం చేసి ఉంటే.. దానిని తమ ముందుంచాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో పీఠాధిపత్యం ఎవరికి చెందాలన్న విషయాన్ని తాము తేల్చబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పీఠాధిపత్యం విషయంలో దేవదాయ ప్రత్యేక కమిషనర్, సహాయ కమిషనర్ ఉత్తర్వుల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని చెప్పింది.
పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులిచ్చారు. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్షుమ్మ, కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.