brahmamgari matam
-
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ధార్మిక పరిషత్ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు తెలిపింది. టీటీడీ ఈవో సంతకం లేదు కాబట్టి తీర్మానం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. -
దార్మిక పరిషత్ తీర్మానాన్ని మా ముందుంచండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యం విషయంలో ఏపీ ధార్మిక పరిషత్ ఏదైనా తీర్మానం చేసిందా? అని హైకోర్టు గురువారం దేవదాయ శాఖను ప్రశ్నించింది. ఒకవేళ తీర్మానం చేసి ఉంటే.. దానిని తమ ముందుంచాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో పీఠాధిపత్యం ఎవరికి చెందాలన్న విషయాన్ని తాము తేల్చబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పీఠాధిపత్యం విషయంలో దేవదాయ ప్రత్యేక కమిషనర్, సహాయ కమిషనర్ ఉత్తర్వుల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని చెప్పింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులిచ్చారు. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్షుమ్మ, కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం: మళ్లీ మొదటికొచ్చిన వివాదం
-
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం: మళ్లీ మొదటికొచ్చిన వివాదం
సాక్షి, వైఎస్ఆర్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదం ముగిసిందన్న క్రమంలో మరో మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పీఠాధిపత్యం విషయంతో తనపై ఒత్తిడి తెచ్చి అంగీకరించేలా చేశారంటూ మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 రోజుల క్రితం ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రాజీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కొడుకు వీరభద్రస్వామిని ఎన్నిక చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపత్యం వివాదంలో హైకోర్టు మెట్లు ఎక్కడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. చదవండి: కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక -
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యింది. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు. చదవండి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ -
బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే తెలిపాని అమె పేర్కొన్నారు. అంతే తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి ఏకాభిప్రాయంకు రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు తాను పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి మద్దతు పలకలేదని తెలిపారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయశాఖ అధికారితో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు. చదవండి: కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం -
కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని బ్రహ్మంగారి మఠం వారసులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా మఠం వారసులు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చామని, పీఠాధిపతి ఎంపిక సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి సమక్షంలో నేటి సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, సాంప్రదాయం ప్రకారం త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో మఠం పీఠాధిపతి సమస్య పరిష్కారం అయిందన్నారు. ఈ సమస్య పరిష్కారం తాము చేయలేదని, బ్రహ్మంగారి అజ్ఞానుసరమే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పీఠాధిపతిని ప్రకటిస్తామని తెలిపారు. కడప: బ్రహ్మంగారి మఠంలో ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. బ్రహ్మంగారి మఠంలోని వారసత్వం, ఆచారాలు, గ్రామస్తుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. మఠానికి సంబంధించిన సేకరించిన పలు అభిప్రాయాల నివేదికను ఆయన ప్రభుత్వానికి అందజేయనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య -
కొలిక్కి వచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం, పీఠాధిపతి ఆయనే
సాక్షి, వైఎస్సార్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం వివాదం కొలిక్కి వచ్చింది. రెండు కుటుంబాల మధ్య రాజీ చర్చలు ఫలించాయి. 12వ మఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామికి అవకాశం దక్కింది. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానుంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి సారథ్యంలో, కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పరస్పర అంగీకారంతో రెండు కుటుంబాల మధ్య కుదిరిన సయోధ్య కుదిరింది. రేపు ఇరు కుటుంబాలు మీడియా ముందుకు రానున్నట్టు సమాచారం. 11వ మఠాధిపతి కుటుంబ వివరాలు... శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారికి ఇరువురు భార్యలు.పెద్ద భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా.. పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు. (చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!) -
బ్రహ్మంగారి మఠంపై తేలని నిర్ణయం
బ్రహ్మంగారిమఠం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జిల్లాలోని శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన పీఠాధిపతి నియామకం విషయమై కుటుంబసభ్యుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఫలించలేదు. చర్చలకు సంబంధించిన వివరాలను శివైక్యం చెందిన పీఠాధిపతి వీరభోగ వసంతవేంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి ‘సాక్షి’కి వివరించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు తమ పినతల్లితో తాను, తన సోదరులు పీఠాధిపత్యంపై మాట్లాడినట్లు చెప్పారు. తమ పినతల్లి మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పీఠాధిపత్యం ఆమెకే కావాలని తేల్చిచెప్పారన్నారు. ఒకవేళ లేదంటే పెద్దభార్య రెండో కుమారుడు వీరభద్రయ్యకు అప్పజెప్పాలని సూచించారన్నారు. పెద్దకుమారుడినైన తనకు కావాలంటే బ్రహ్మంగారి గురించి ప్రచారం చేసేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పారన్నారు. ‘ఇంతకుముందు మీ పెద్దకుమారుడికి పీఠాధిపత్యం కావాలన్నారు. ఇప్పుడేమో తెరపైకి మా రెండో తమ్ముడి పేరు ప్రతిపాదిస్తున్నారు. అసలు పీఠాధిపతి కుమారులు అనర్హులు అయినందువల్లే.. పీఠాధిపతి రెండో వివాహం చేసుకున్నారు. తన పిల్లలకు మాత్రమే పీఠాధిపత్యం కావాలని వీలునామా కూడా రాశారు అని గతంలో చెప్పారు కదా..’ అని తమ పినతల్లిని అడిగినట్లు తెలిపారు. దీనిపై తమ పినతల్లి స్పందిస్తూ ‘అది అప్పటిమాట. ఇప్పుడు నాకు రాకపోయినా వీరభద్రయ్యకు రావాలి’ అని చెప్పారన్నారు. లేనిపక్షంలో కోర్టునైనా ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. తాను మాత్రం దేవదాయశాఖ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయాన్ని అమలు చేయాలని సూచించాం: శివస్వామి బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంలో సంప్రదాయాలను, హిందూధర్మాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు సూచించినట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసిన శివస్వామి మఠం పీఠాధిపతి వ్యవహారంపై రెండో నివేదికను అందజేశారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి వారసులు, పలు పీఠాధిపతులు, విశ్వబ్రాహ్మణ సంఘాల వారు, కందిమల్లయ్యపల్లి గ్రామస్తులు, ఉపమఠాల వారి అభిప్రాయాలు, సూచనలతో విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక పక్షాన మంత్రికి రెండో నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. హిందూధర్మం, శాస్త్రాలు, పెద్దల మనోభావాల మేరకు పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని సూచించామన్నారు. త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారన్నారు. -
శివస్వామి ముందుగా నిర్ణయం ప్రకటించడం సరికాదు
సాక్షి, అమరావతి : బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం వెళ్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలని తెలిపారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివస్వామి ముందుగా నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, ఏదైనా చట్టప్రకారమే జరగుతుందని అన్నారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్‌కు వెళ్తామన్నారు. ఒక కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రాగానే గెలిచినట్లు కాదన్నారు. మేం ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా వెళ్తామని అన్నారు. -
బ్రహ్మంగారి మఠం వద్ద టెన్షన్.. పోలీసుల మోహరింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద సోమవారం టెన్షన్ నెలకొంది. విశ్వబ్రాహ్మణ సంఘం ఛైర్మన్ శ్రీకాంత్ ఆచారిని మఠం నాయకులు అడ్డుకున్నారు. మఠం వివాదంపై మీడియాతో మాట్లాడుతున్న శ్రీకాంత్ ఆచారిపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కాగా, బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే, చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్పర్సన్ (పర్సన్ ఇన్చార్జి)గా వైఎస్సార్ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: వీలునామాలకు ఆస్కారంలేదు మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ -
వీలునామాలకు ఆస్కారంలేదు
బ్రహ్మంగారి మఠం: బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారంలేదని ఆయన తేల్చిచెప్పారు. ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తామన్నారు. మఠాధిపతి మృతిపై అనుమానాలు ఇదిలా ఉంటే.. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
సాంప్రదాయబద్ధంగా పీఠాధిపతి ఎంపిక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బ్రహ్మంగారి మఠాధిపతులుగా 11 మంది పనిచేశారని.. మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన బ్రహ్మంగారి మఠం వివాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని.. వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మఠం నిర్వహణకు తాత్కాలిక అధికారిని నియమించామని ఆయన చెప్పారు. మఠం ఆచారాలు, సంప్రదాయాలను త్వరితగతిన సేకరిస్తామని పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. చదవండి: వీడని ‘పీఠ’ముడి! నేడు, రేపు భారీ వర్షాలు -
బ్రహ్మంగారి మఠం: వారసుల మధ్య ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది. చదవండి: చిన్నారులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సమయం పెంపు.. -
బ్రహ్మంగారి మఠం వారసత్వంపై కొనసాగుతోన్న వివాదం
-
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన దుంగలతోపాటు స్మగ్లర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.