
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమఠం పీఠాధిపత్య వివాదం హైకోర్టుకు చేరింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి కుమారుడు ఎన్.గోవిందస్వామి, రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మఠం ప్రైవేటు ఆస్తి అని, అందువల్ల మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. మఠం వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం మాత్రమే అధికారులకు ఉంది తప్ప, మఠం నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి లేదని తెలిపారు.
1965లోనే కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. పీఠాధిపతి మొదటి భార్య కుమారుడైన వెంకటాద్రిస్వామికి పీఠాధిపత్యం వహించే అర్హత లేదన్నారు. ఆయన న్యాయవాదిగా కడపలో ప్రాక్టీస్ చేస్తున్నారని, ఎన్నడూ మఠంలో పూజాదికాలు నిర్వహించలేదని తెలిపారు. పెద్ద కుమారుడే పీఠాధిపత్యం వహించాలన్న ఆచారం ఏమీ లేదన్నారు. 2008లో పీఠాధిపతి రాసిన వీలునామా ప్రకారం మొదటి భార్య సంతానానికి మఠం వ్యవహారాలపై ఆసక్తి లేదని, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియదని పేర్కొన్నారు. తన కుమారుడు మైనర్ కాబట్టి అతను మేజర్ అయ్యేంతవరకు తాత్కాలికంగా పీఠాధిపత్యం వహించే అధికారం తనకు ఉందని మహాలక్ష్మి పేర్కొన్నారు.