బ్రహ్మంగారి మఠం: తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తును చాటిచెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. తాజా పరిస్థితులు పరిశీలిస్తే ఈ వివాదం పరిష్కారానికి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నెరపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలోని ఇతర మఠాధిపతుల బృందం ఆదివారం మఠానికి వచ్చి రెండోసారి చర్చలు జరుపుతారని.. తద్వారా వివాదానికి ముగింపు పలికే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. కానీ.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పట్టువదలకపోవడంతో ఇప్పుడు ఈ వివాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మధ్యవర్తిత్వానికి ‘నో’..
మఠాధిపతి వివాదంలో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశముందని, పీఠాధిపతుల జోక్యాన్ని సహించేదిలేదని, వీరిని మఠానికి రాకుండా నిలువరించాలంటూ డీజీపీ మొదలుకుని కిందిస్థాయి అధికారులందరికీ ఆమె శుక్రవారం లేఖలు రాశారు. అలాగే, తాము మఠాధిపతుల చర్చల్లో పాల్గొనేది కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. తాము దేవదాయ శాఖ నిబంధనల మేరకు మఠం పర్యవేక్షణలోనే మఠాధిపతి ఎంపిక నిర్వహించుకుంటామని, పీఠాధిపతుల జోక్యం అక్కర్లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. అలాగే, మఠాధిపతి నియామకం వారసత్వ చట్ట ప్రకారం ఉంటుందని దివంగత మఠాధిపతి మొదటి భార్య కుమారులు అంటున్నారు. ఈ విషయంపై శివస్వామి ఈనెల 2న వివిధ పీఠాధిపతులతో కలిసి ఇరువర్గాలతో చర్చలు జరిపినప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే.
రెండోదఫా చర్చలు ప్రశ్నార్ధకం
మరోవైపు.. శివస్వామి నేతృత్వంలోని పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి శనివారం రాత్రి రానుండడంతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పీఠాధిపతుల నేతృత్వంలో చర్చలకు మహాలకు‡్ష్మమ్మ ససేమిరా అనడంతో రెండవ దఫా చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో పోలీసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ విషయమై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం.
రాజీ ఫార్ములా!?
ఇదిలా ఉంటే.. స్థానిక ప్రజల్లో కొందరు దివంగత మఠాధిపతి మొదటి భార్య తనయుడికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు రెండో భార్యకు అండగా నిలుస్తుండడంతో ఈ వివాదంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, పీఠాధిపతులు వారి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు, మూడు రకాల ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇది విఫలమైన పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
పీఠాధిపతులకు అనుమతిలేదు
బి.మఠం మఠాధిపతి నియామకం కోసం చర్చల నిమిత్తం వస్తున్న వివిధ పీఠాధిపతులకు దేవస్థానంలోకి అనుమతిలేదు. వారు శనివారం రాత్రికి వస్తే వారు బి.మఠంలోని పల్నాటి అన్నదాన సత్రంలో ఉండేందుకు ఏర్పాట్లుచేశారు. పీఠాధిపతులు ఆదివారం కేవలం స్వామి దర్శనం కోసం వెళ్లొచ్చు కానీ చర్చలకు మాత్రం అందరి ఆమోదం ఉంటేనే పంపుతాం.
–విజయకుమార్, మైదుకూరు డీఎస్పీ
ఇదీ వివాదం..
పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందారు. భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణంతో పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య ఇప్పుడు పీఠాధిపత్యంపై పోటీ నెలకొంది. అయితే, గోవిందస్వామి మేజర్ అయ్యే వరకు తాను మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి పలువురు పీఠాధిపతులు గత వారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. కానీ, వీరి ప్రయత్నాలు ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment