‘మఠాధిపతి’ వెంకటాద్రిస్వామితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతి విషయంలో నెల రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. ఇటీవల శివైక్యం పొందిన మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసినట్లు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఇరు కుటుంబాలతో దాదాపు 4 గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం దేవదాయశాఖ సంయుక్త సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
కందిమల్లాయపల్లె గ్రామస్తులు, భక్తులు అందరి సహకారంతో శనివారం వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నిర్ణయించేందుకు పూర్వ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ అంగీకరించారని తెలిపారు. అలాగే ఉత్తరాధికారిగా వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి రెండో కుమారుడు వీరభద్రస్వామిని నియమించినట్లు చెప్పారు. వీరిద్దరి అనంతరం రెండో భార్య మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామిని మఠాధిపతిగా నియమించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మఠం అభివృద్ధికి దేవదాయశాఖ సహకరిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment