
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతో పాటు కొందరు మండల స్థాయి నేతలు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. అలాగే, త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
నేడు దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ రాక
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శనివారం దేవదాయశాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రికి నివేదక అందిస్తారని దేవాలయం ఫిట్ పర్సన్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ తెలిపారు.