గోరటి వెంకన్నకు జ్ఞాపికను ఇస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఆయన కుమార్తె
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసిద్ధ తెలుగు కవి, గేయకర్త, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్, గోరటికి పురస్కారాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని 24మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను అవార్డులు అందించింది.
గ్రహీతలకు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికను అందించారు. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబరులో జన్మించిన గోరటి వెంకన్న అనేక పాటలు రాసి, పాడటంతో పాటు ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్ర వంక’, ‘పూసిన పున్నమి’, ‘వల్లంకితాళం’ వంటి కవితా సంపుటాలను రచించారు. గోరటి 2006లో కళారత్న (హంస) పురస్కారం, 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారంతోపాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన గోరటి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను గోరటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. తన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా గోరటి ని జస్టిస్ ఎన్వీ రమణ పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం సీజేఐ అభ్యర్థన మేరకు గోరటి ‘అడవి తల్లి’పై పాట పాడి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment