chenchu life styles
-
అడవే చెంచులకు అమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలోనే నివసించే చెంచుల జీవనశైలి...బాహ్య ప్రపంచానికి కొంచెం వైవిధ్యంగానే ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో చెంచులు కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ సరైన ఆహారానికి నోచుకోవడం లేదు. కారం మెతుకులు, చింత పులుసు, ఎప్పుడోసారి పప్పు ఇదే వారి రోజువారీ మెనూ. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వారి జీవన ప్రమాణస్థాయిల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పౌష్టికాహార లోపం, ఉపాధి సన్నగిల్లడం, సరైన వైద్యం అందకపోవడంతో సగటు చెంచుల ఆయుర్దాయం 50ఏళ్లకే పరిమితమవుతోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న 120 చెంచు పెంటల్లో కలిపి చెంచుల జనాభా పదివేల లోపే. వీరి కుటుంబాల్లోని పిల్లలు కనీసం బడిచదువుకు కూడా నోచుకోవడం లేదు. నిత్యం ఒక్కటే..: చెంచు చిన్నారుల నుంచి పెద్దల వరకు పోషకాహారం కరువవుతోంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెంచులు కూరగాయలు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని మన్ననూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. పదిహేను, నెల రోజులకు ఒకసారి మన్ననూర్ వెళ్లి తెచ్చుకున్న సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏమీ దొరక్కపోతే పప్పులు, తొక్కులు, చింత పులుసుతోనే రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యమే వీరికి ప్రధాన ఆహారం. అడవిలో లభించే చెంచుగడ్డలు, చింతపులుసు, చింతచిగురు, నెమలినార, ఆకుకూరలు, యార్లగడ్డ, మూలగడ్డ, శాదగడ్డ తదితర గడ్డలు, కందమూలాలను చెంచులు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇవి సీజ¯న్లోనే లభిస్తాయి. చెంచుగడ్డలు, ఇతర గడ్డలను ఎండాకాలంలో గడ్డి ఎండిపోయాక మాత్రమే సేకరించేందుకు వీలుంటుంది. దీంతో మిగతా సమయాల్లో వీరికి పోషకాహారం దొరకడం లేదు. బడికి దూరం.... చెంచు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ గేటు నుంచి మల్లాపూర్, రాంపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల తదితర చెంచు పెంటలకు అప్పాపూర్‌లోని ఒక్క గిరిజన పాఠశాలే దిక్కు. ఇందులో ఐదో తరగతి వరకు ఉండటంతో చిన్నారుల చదువు అక్కడికే పరిమితమవుతోంది. అడవి నుంచి బయటకు వెళ్లి విద్యాబోధన సాగించేందుకు చెంచులు ఇష్టపడడం లేదు. అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తే కనీసం పదోతరగతి వరకైనా చదువుతారు. ఇంటర్, డిగ్రీ వరకు చదివేవారు పదుల సంఖ్యలోనే ఉంది. ఉపాధి హామీ పథకమే ఆదాయ వనరు చెంచులు ప్రధానంగా తేనె, చింతకాయలు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో ఉపాధి సైతం కరువైందని చెంచులు వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీ డబ్బులే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. గిరిపోషణ అంతంతే... చెంచు చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన గిరిపోషణ తూతూమంత్రమే అయ్యింది. జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో పౌష్టికాషారాన్ని అందించేలా హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్రిశాట్ సంయుక్తంగా పోషకాహార ప్రణాళిక రూపొందించాయి. ఈ మేరకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో 3,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఐటీడీఏతో పాటు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ లేని చెంచు పెంటల్లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా తృణధాన్యాలతో ఉదయం, సాయంత్రం మలీ్టగ్రెయిన్ మీల్, స్వీట్ మీట్, రాగులు, జొన్నలతో చేసిన చిక్కీలు, పట్టీలు, జవార్ బైట్స్ వంటి బలవర్ధక ఆహారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమం రెండు, మూడు నెలలకే పరిమితమైంది. ఐదో తరగతి వరకే... అప్పాపూర్‌లో ఐదోతరగతి వరకు బడి ఉంది. అంతవరకే చదువుకున్నా. తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లలేదు. నాతో పాటు చాలామంది ఇక్కడితోనే ఆపేశారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. – తోకల గురువయ్య, చెంచు యువకుడు, అప్పాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా దెబ్బ తాకినా, చేయివిరిగినా నాటు వైద్యమే రెండు నెలల కిందట చెట్టు నుంచి జారి కింద పడ్డ. చేయి విరిగింది. డిండికి పోయి కట్టు కట్టించుకున్న. సుస్తీ అయితే ఆస్పత్రికి పోము. ఆస్పత్రికి వెళ్లాలంటే మన్ననూర్ లేకుంటే వటవర్లపల్లికి పోవాలి. అటు ఎటు పోవాలన్నా దూరం 50 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మందులు మాత్రమే ఇస్తారు. మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లామంటారు. అటు 80 కిలోమీటర్ల బదులు డిండికి వెళ్లా. ఇక్కడ అందరికి నాటువైద్యమే. – నాగయ్య, అప్పాపూర్ సార్లు వస్తేనే సౌకర్యాలు గిరిపోషణ కింద ఇంతకు ముందు జొన్నలు, సజ్జలతో ఉదయం, సాయంత్రం ఉప్మా ఇచ్చారు. ఏడాది కాలంగా ఏమీ ఇవ్వడం లేదు. గవర్నర్ మేడం, సార్లు వస్తున్నప్పుడు మాత్రమే సౌకర్యాలు చేస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – నాగమ్మ, మల్లాపూర్ పెంట, నాగర్‌కర్నూల్ -
నల్లమల ప్రయాణం... ఓ నిర్వేద జ్ఞాపకం!
ఆర్తి అంజన్న ... ‘తల్లి నల్లమల’ నాకు ఇచ్చిన అన్న! దివంగత సోలిపేట రామలింగన్న తరువాత అంతే గాఢమైన ప్రేమను పంచే ఆత్మ బంధువు. నల్లమల కీకారణ్య ఆదివాసీ. కుమ్మెనపెంట పెద్దమనిషి. ఆయనతో 21 ఏళ్ల అనుబంధం. వయసులో నాకంటే చాలా పెద్ద. కానీ ఆయన ఇంట జరిగే ప్రతి కార్యానికి నేనే పెద్ద. పెళ్లి, పండగ, పురుడు, పుణ్యం... కార్యం ఏదైనా నాదే పెద్దరికం! తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావు పోరాట స్ఫూర్తిని విని ‘హరీష్ అన్న ఎట్లుంటడు’ అని అడిగి, ఆయన్ను నల్లమల సానువు మన్ననూరు వరకు రప్పించి, చెంచులతో ఆత్మీయ సభ పెట్టించింది ఈ అంజన్నే. ఇప్పుడు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తన ఇంటి గుమ్మం వరకు నడిపించిండు. చెంచులకు క్యాలెండర్ లేదు. నాగరిక కాలమానం లేదు. రేల పూతలు, కోయిల కూతలతోనే కాల కొలమానం ఆరంభం అవుతుంది. కోయిల పిట్ట రేల పూత మేసి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మల కొన చివుర్ల నుంచి నీళ్లు తాగి, కమ్మని కూతతో తోటి పిట్టలను పిలుస్తుంది. అట్లా కోయిల తొలి కూత నుంచి కోయిలలు విరివిగా కూసే కాలాన్ని తొలి కార్తెగా గుర్తిస్తారు. చెంచుల తొలి కార్తె రోణి (రోహిణి). ఆ కార్తె ప్రాంభ నేపథ్యంలో అంజన్న దేవర్లకు పెట్టుకున్నడు. అమ్రాబాద్ కు వచ్చి నాకు ఫోన్ చేసిండు. నేనప్పుడు యాదృచ్ఛికంగా ప్రజాకవీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న; టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ కలిసే ఉన్నాం. ‘నా పెంటకు రాయే... పండ్గ సేద్దం’ అని గోరటినీ, సాగర్‌నూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. వెంకన్న కూడా నాగరికపు నీడ సోకని దట్టమైన అడవిలో, ప్రిమిటివ్ తెగల మధ్య ఓ రాత్రి గడపాలనీ, ఓ కావ్యం రాయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు... సాగర్ ఆయన ఛానల్ కోసం ఓ స్టోరీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. డీఎఫ్ఓ కిష్ట గౌడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అడవికి తొవ్వ సాగింది. చీకటి ప్రయాణం! అంజన్న దండు రక్షణగా వచ్చింది. అమ్రాబాద్ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి పాలకుర్వ ఎక్కినం. కుందేటి సుక్క పొడిచే యాళ్లకు ఇంకో ఆరు కిలోమీటర్లు సాగి మర్రి సెట్టు సార్వ దిగి కోయిలపడె చేరినం. చెలిమ నీళ్లు దొరికినయి. చల్లటి, తియ్యటి నీళ్లు దోసిళ్లతో కడుపారా తాగినం. అసలు సిసలైన అడవి ఆరంభం అయింది. కింద పదును తేలిన ఏనె రాళ్లు... పైన మొన తేలిన కొక్కెల్లాంటి పరిక కంప... దారికి రెండు వైపులా జిట్టీత పొదలు... నాకు పాత తొవ్వే. వెంకన్న అడవి జంతువును మించిన సంచార జీవి. 60 ఏళ్ళ వయసులోనూ అలుపు లేకుండా... అడుగు తడబడకుండా నడుస్తుండు. గోరటి పాటలతో, పరిశీలనతో తెలవకుండానే అడవి సాగిపోతున్నం. నర్లింగల పొదలకు కలేవచ్చినం. దీన్నే ఎలుగల బయలు అంటారట. ‘ఎలుగులు ఉంటయి... చూసి నడువురి’ అంజన్న ఆదేశం . అంజన్నకు అడవి మీద అంతులేని పట్టుంది. ఏ కుర్వన ఏ జంతువు ఉంటదో... ఏ సార్వకు ఏ పాము ఉంటదో... కార్తెను బట్టి పొద్దును చూసి వాటి నడత, నడక అంచనా వేసి చెప్పగలడు. ‘ఇది పులి తిరిగే సోటు.. మాట్లాడకుంటా నడువురి’ అని అంజన్న హెచ్చరించిండు. అంజన్న బావమర్ది ఈదన్న చేతిలో సోలార్ టార్చి లైటు ఉంది. దాని ఫోకస్‌కు ఎర్రటి కొర్రాయి తీరున రెండు కండ్లు మెరుస్తూ కనిపించాయి. రెండో సారి ఈదన్న టార్చిలైటు ఫోకస్‌ను రెండు కళ్ల మీద కేంద్రీకరించాడు. ఈ సారి ఒక్క కన్నే కనిపించింది. ‘పులి’ అని గట్టిగా అరిచిండు. అంజన్న, ఈదన్న, లింగయ్య, అంజన్న కొడుకు చిన అంజన్న అంతా ఆరేడు మంది పెద్ద కత్తులు, దబ్బలు పట్టుకొని మా చుట్టూ రక్షణగా నిలబడ్డారు. లైటు వెలుతురుకు ఒక కన్ను మూసి, ఇంకో కన్నుతో చూడటం పులి సహజ లక్షణమట. మాకు సరిగ్గా వంద మీటర్ల లోపే కడితి పోతు చెంగున ఎగిరి దూకింది. పులి వెంట పడ్డది అని అర్థం అయింది. ఈ పులి కోపగొండిదనీ, ఎప్పుడూ ఆకలి మీదనే ఉంటదనీ అంజన్న చెప్పిండు. తెలంగాణ పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 2018లో తీసిన గణనలో 19 పులులు ఉన్నట్లు తేలింది. ఆ సంఖ్య ఇప్పుడు 30కి పెరిగినట్టు అటవీ అధికారులు చెప్పారు. వీటిలో 7 నుంచి 8 పులికూనలు ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా... ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా... మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. నల్లమలలో లక్ష ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఈ భూమిని చెంచులకు స్వాధీన పరిచి, వ్యవసాయం ప్రోత్సహించాలని భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్ 1940వ దశకంలో నైజాం సర్కార్‌కు సిఫారసు చేశాడు. ఆమేరకు నైజాం సర్కార్ ఫర్మానా జారీ చేసింది. కానీ స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అటవీ హక్కుల చట్టానికి సాధికారత కల్పిస్తూ నల్లమలలో ప్రతి చెంచుకు ఎకరన్నర భూమిని పట్టా చేసి, దాదాపు 11 వేల చెంచు కుటుంబాలకు హక్కులు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే హక్కుదారులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసీఆర్ ‘రైతు బంధు’ పథకం అందిస్తున్నారు. అవన్నీ మనసులో మెదులుతుండగా అర్ధ రాత్రి వేళ కుమ్మినిపెంటకు చేరుకున్నాం. మా అంజన్న పెంట ఇదే. ఓ గుడిసె మాకు విడిది ఇల్లుగా ఇచ్చారు. వేడి వేడి తైద అంబలి కాసి పోశారు. నులక మంచం ఆల్చుకొని పడుకున్నం. నెమలి పిట్ట, అడవి కోడి కూసింది... తెల్లారింది. గోరటి వెంకన్న కలం ‘కథం’ తొక్కుతోంది. గళం పదం పాడుతోంది. ‘వెదురు తడకలతోని ఎంతందమీ ఇండ్లు, ఆవు పేడ తోని అలికిన వాకిల్లు, చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు, రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ, ఉరిమె నగరి కెరవ అడవి చెంతకు నడువ, అమ్మలా లాలించి అన్నిటిని మరిపించే పరుసుకున్న, రావి నీడల తావున పట్టిన కునుకులో పుట్టెనే ఈ పదం’ అంటూ కమ్మటి పాట పొద్దు పొద్దున్నే చెవులకు ఇంపుగా తాకంగ నిద్ర లేచినం. దేవర్ల కార్యం మొదలైంది. మేకపోతు తెగింది. రక్త తర్పణం జరిగింది. కూర ఉడికింది. తంతు ఆరంభం అయింది... జోరందుకుంది... సూర్యాస్తమయంతో పాటే ముగిసింది. మిత్రుడు మారుతీ సాగర్ తన ఛానల్ స్టోరీ కోసం మైక్ ముందు పెట్టినప్పుడు చెంచుల్లో ఓ భయం బయట పడ్డది. అదీ అంతులేని భయం! మృత్యు భయం. తల్లి పాల పొదుగు నుంచి లేగ దూడను వేరు చేసినట్టుగా... అడవి తల్లి నుంచి చెంచులను వేరు చేయడానికి కేంద్ర పాలకులు పన్నిన ఉచ్చుల భయం! అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ... వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ‘అడవి బయట బతకలేమనీ... వనం విడిచిన కోతి బతుకు అయితదనీ’ దండం పెట్టి చెప్పినా కేంద్ర పాలకులకు వినపడటం లేదు. చెంచుల తరలింపునకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమని స్పష్టం చేసినా... కేంద్రం తన పంతం వీడలేదు. ఇప్పటి దాక జాతి సమస్యగా ఉన్నదాన్ని పాలకులు దిగ్విజయంగా జాతుల వైరంగా మార్చేశారు. నల్లమల నుంచి బయటికి రావటానికి ఇష్టపడే జాతి... ససేమిరా అంటున్న జాతి అని రెండు వర్గాలను నిట్ట నిలువుగా చీల్చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వటువార్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎస్సీ, బీసీ, లంబాడాలు ఎక్కువ ఉన్నారు. వీళ్లు రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకొని అడవిని వదలటానికి సిద్ధపడ్డారు. చెంచులు ఆ ప్యాకేజీని తృణీకరించారు. ‘అడవి నుంచి బయటికి వెళ్ళటానికి ఇష్టపడని చెంచులతోనే మీరు కూడా నష్టపోతున్న’రంటూ ఫారెస్ట్ అధికారులు గిరిజనేతరులకు నూరి పోస్తున్నారు. ఇది చెంచు, లంబాడీ, ఇతర జాతుల మధ్య ఘర్షణకు దారి తీసింది. వటువార్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచునే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ‘మల్లెల తీర్థా’నికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుడికి అడవి... తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమిస్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? యురేనియం నిక్షేపాల కోసం అడవినే బలిపెట్ట చూసిన మోదీ సర్కారుకు పులి మీద జాలి ఎందుకో అని మదిని తొలుస్తుండగా మర్మం తెలియక నిర్వేదంతో నల్లమలను వీడాం! వ్యాసకర్త: వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మీడియా కో ఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -
చెంచుల జీవన స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన సిందూరా గణపతి, నరెంధర్లతో కూడిన ఢిల్లీ బృందం సభ్యులు చెంచుల స్థితిగతులు జీవన విధానం, తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా నల్లమల లోతట్టు ప్రాంత చెంచు పెంటల్లో పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్లాపూర్‌లో ఐకేపీల ద్వారా 7.20 లక్షలు ఖర్చు చేసి ఉపాధి అవకాశంగా చెంచులకు ఇప్పించిన మేకలను, వాటి పోషణను సభ్యులు పరిశీలించారు. అనంతరం మన్ననూర్లోని చెంచు కమ్యూనిటీ భవనంలో చెంచు మహిళా గ్రూపు ప్రతినిధులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంఘాల పొదుపు సంఘాల పనితీరు తదితర అంశాల గురించి ఇష్టాగోష్టిగా చర్చించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెంచుల అభివృద్ధి కోసం చేపట్టబోయే పలు నిర్ణయాలలో ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చిన పథకాలు అక్కడ రూపకల్పన చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యమని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీడీ సరోజ, యంగ్ ప్రొఫెషనల్ సభ్యులు లక్ష్మి, మల్లేష్, సంతోష్, పోతమ్మ, గురువమ్మ, మాసమ్మ తదితరులు పాల్గొన్నారు.