చెంచుల జీవన స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్కు చెందిన సిందూరా గణపతి, నరెంధర్లతో కూడిన ఢిల్లీ బృందం సభ్యులు చెంచుల స్థితిగతులు జీవన విధానం, తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా నల్లమల లోతట్టు ప్రాంత చెంచు పెంటల్లో పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్లాపూర్లో ఐకేపీల ద్వారా 7.20 లక్షలు ఖర్చు చేసి ఉపాధి అవకాశంగా చెంచులకు ఇప్పించిన మేకలను, వాటి పోషణను సభ్యులు పరిశీలించారు.
అనంతరం మన్ననూర్లోని చెంచు కమ్యూనిటీ భవనంలో చెంచు మహిళా గ్రూపు ప్రతినిధులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంఘాల పొదుపు సంఘాల పనితీరు తదితర అంశాల గురించి ఇష్టాగోష్టిగా చర్చించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెంచుల అభివృద్ధి కోసం చేపట్టబోయే పలు నిర్ణయాలలో ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చిన పథకాలు అక్కడ రూపకల్పన చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యమని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీడీ సరోజ, యంగ్ ప్రొఫెషనల్ సభ్యులు లక్ష్మి, మల్లేష్, సంతోష్, పోతమ్మ, గురువమ్మ, మాసమ్మ తదితరులు పాల్గొన్నారు.