మల్లాపూర్ పెంటలోని చెంచు నివాసం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలోనే నివసించే చెంచుల జీవనశైలి...బాహ్య ప్రపంచానికి కొంచెం వైవిధ్యంగానే ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో చెంచులు కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ సరైన ఆహారానికి నోచుకోవడం లేదు. కారం మెతుకులు, చింత పులుసు, ఎప్పుడోసారి పప్పు ఇదే వారి రోజువారీ మెనూ. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వారి జీవన ప్రమాణస్థాయిల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
పౌష్టికాహార లోపం, ఉపాధి సన్నగిల్లడం, సరైన వైద్యం అందకపోవడంతో సగటు చెంచుల ఆయుర్దాయం 50ఏళ్లకే పరిమితమవుతోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న 120 చెంచు పెంటల్లో కలిపి చెంచుల జనాభా పదివేల లోపే. వీరి కుటుంబాల్లోని పిల్లలు కనీసం బడిచదువుకు కూడా నోచుకోవడం లేదు.
నిత్యం ఒక్కటే..: చెంచు చిన్నారుల నుంచి పెద్దల వరకు పోషకాహారం కరువవుతోంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెంచులు కూరగాయలు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని మన్ననూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. పదిహేను, నెల రోజులకు ఒకసారి మన్ననూర్ వెళ్లి తెచ్చుకున్న సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏమీ దొరక్కపోతే పప్పులు, తొక్కులు, చింత పులుసుతోనే రోజులు గడుపుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యమే వీరికి ప్రధాన ఆహారం. అడవిలో లభించే చెంచుగడ్డలు, చింతపులుసు, చింతచిగురు, నెమలినార, ఆకుకూరలు, యార్లగడ్డ, మూలగడ్డ, శాదగడ్డ తదితర గడ్డలు, కందమూలాలను చెంచులు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇవి సీజ¯న్‌లోనే లభిస్తాయి. చెంచుగడ్డలు, ఇతర గడ్డలను ఎండాకాలంలో గడ్డి ఎండిపోయాక మాత్రమే సేకరించేందుకు వీలుంటుంది. దీంతో మిగతా సమయాల్లో వీరికి పోషకాహారం దొరకడం లేదు.
బడికి దూరం....
చెంచు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ గేటు నుంచి మల్లాపూర్, రాంపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల తదితర చెంచు పెంటలకు అప్పాపూర్‌లోని ఒక్క గిరిజన పాఠశాలే దిక్కు. ఇందులో ఐదో తరగతి వరకు ఉండటంతో చిన్నారుల చదువు అక్కడికే పరిమితమవుతోంది. అడవి నుంచి బయటకు వెళ్లి విద్యాబోధన సాగించేందుకు చెంచులు ఇష్టపడడం లేదు. అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తే కనీసం పదోతరగతి వరకైనా చదువుతారు. ఇంటర్, డిగ్రీ వరకు చదివేవారు పదుల సంఖ్యలోనే ఉంది.
ఉపాధి హామీ పథకమే ఆదాయ వనరు
చెంచులు ప్రధానంగా తేనె, చింతకాయలు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో ఉపాధి సైతం కరువైందని చెంచులు వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీ డబ్బులే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది.
గిరిపోషణ అంతంతే...
చెంచు చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన గిరిపోషణ తూతూమంత్రమే అయ్యింది. జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో పౌష్టికాషారాన్ని అందించేలా హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్రిశాట్ సంయుక్తంగా పోషకాహార ప్రణాళిక రూపొందించాయి.
ఈ మేరకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో 3,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఐటీడీఏతో పాటు ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. అంగన్‌వాడీ లేని చెంచు పెంటల్లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా తృణధాన్యాలతో ఉదయం, సాయంత్రం మలీ్టగ్రెయిన్ మీల్, స్వీట్ మీట్, రాగులు, జొన్నలతో చేసిన చిక్కీలు, పట్టీలు, జవార్ బైట్స్ వంటి బలవర్ధక ఆహారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమం రెండు, మూడు నెలలకే పరిమితమైంది.
ఐదో తరగతి వరకే...
అప్పాపూర్‌లో ఐదోతరగతి వరకు బడి ఉంది. అంతవరకే చదువుకున్నా. తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లలేదు. నాతో పాటు చాలామంది ఇక్కడితోనే ఆపేశారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి.
– తోకల గురువయ్య, చెంచు యువకుడు, అప్పాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా
దెబ్బ తాకినా, చేయివిరిగినా నాటు వైద్యమే
రెండు నెలల కిందట చెట్టు నుంచి జారి కింద పడ్డ. చేయి విరిగింది. డిండికి పోయి కట్టు కట్టించుకున్న. సుస్తీ అయితే ఆస్పత్రికి పోము. ఆస్పత్రికి వెళ్లాలంటే మన్ననూర్ లేకుంటే వటవర్లపల్లికి పోవాలి. అటు ఎటు పోవాలన్నా దూరం 50 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మందులు మాత్రమే ఇస్తారు. మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లామంటారు. అటు 80 కిలోమీటర్ల బదులు డిండికి వెళ్లా. ఇక్కడ అందరికి నాటువైద్యమే.
– నాగయ్య, అప్పాపూర్
సార్లు వస్తేనే సౌకర్యాలు
గిరిపోషణ కింద ఇంతకు ముందు జొన్నలు, సజ్జలతో ఉదయం, సాయంత్రం ఉప్మా ఇచ్చారు. ఏడాది కాలంగా ఏమీ ఇవ్వడం లేదు. గవర్నర్ మేడం, సార్లు వస్తున్నప్పుడు మాత్రమే సౌకర్యాలు చేస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
– నాగమ్మ, మల్లాపూర్ పెంట, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment