chenchulu
-
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
అడవే చెంచులకు అమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలోనే నివసించే చెంచుల జీవనశైలి...బాహ్య ప్రపంచానికి కొంచెం వైవిధ్యంగానే ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో చెంచులు కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ సరైన ఆహారానికి నోచుకోవడం లేదు. కారం మెతుకులు, చింత పులుసు, ఎప్పుడోసారి పప్పు ఇదే వారి రోజువారీ మెనూ. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వారి జీవన ప్రమాణస్థాయిల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పౌష్టికాహార లోపం, ఉపాధి సన్నగిల్లడం, సరైన వైద్యం అందకపోవడంతో సగటు చెంచుల ఆయుర్దాయం 50ఏళ్లకే పరిమితమవుతోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న 120 చెంచు పెంటల్లో కలిపి చెంచుల జనాభా పదివేల లోపే. వీరి కుటుంబాల్లోని పిల్లలు కనీసం బడిచదువుకు కూడా నోచుకోవడం లేదు. నిత్యం ఒక్కటే..: చెంచు చిన్నారుల నుంచి పెద్దల వరకు పోషకాహారం కరువవుతోంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెంచులు కూరగాయలు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని మన్ననూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. పదిహేను, నెల రోజులకు ఒకసారి మన్ననూర్ వెళ్లి తెచ్చుకున్న సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏమీ దొరక్కపోతే పప్పులు, తొక్కులు, చింత పులుసుతోనే రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యమే వీరికి ప్రధాన ఆహారం. అడవిలో లభించే చెంచుగడ్డలు, చింతపులుసు, చింతచిగురు, నెమలినార, ఆకుకూరలు, యార్లగడ్డ, మూలగడ్డ, శాదగడ్డ తదితర గడ్డలు, కందమూలాలను చెంచులు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇవి సీజ¯న్లోనే లభిస్తాయి. చెంచుగడ్డలు, ఇతర గడ్డలను ఎండాకాలంలో గడ్డి ఎండిపోయాక మాత్రమే సేకరించేందుకు వీలుంటుంది. దీంతో మిగతా సమయాల్లో వీరికి పోషకాహారం దొరకడం లేదు. బడికి దూరం.... చెంచు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ గేటు నుంచి మల్లాపూర్, రాంపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల తదితర చెంచు పెంటలకు అప్పాపూర్‌లోని ఒక్క గిరిజన పాఠశాలే దిక్కు. ఇందులో ఐదో తరగతి వరకు ఉండటంతో చిన్నారుల చదువు అక్కడికే పరిమితమవుతోంది. అడవి నుంచి బయటకు వెళ్లి విద్యాబోధన సాగించేందుకు చెంచులు ఇష్టపడడం లేదు. అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తే కనీసం పదోతరగతి వరకైనా చదువుతారు. ఇంటర్, డిగ్రీ వరకు చదివేవారు పదుల సంఖ్యలోనే ఉంది. ఉపాధి హామీ పథకమే ఆదాయ వనరు చెంచులు ప్రధానంగా తేనె, చింతకాయలు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో ఉపాధి సైతం కరువైందని చెంచులు వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీ డబ్బులే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. గిరిపోషణ అంతంతే... చెంచు చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన గిరిపోషణ తూతూమంత్రమే అయ్యింది. జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో పౌష్టికాషారాన్ని అందించేలా హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్రిశాట్ సంయుక్తంగా పోషకాహార ప్రణాళిక రూపొందించాయి. ఈ మేరకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో 3,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఐటీడీఏతో పాటు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ లేని చెంచు పెంటల్లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా తృణధాన్యాలతో ఉదయం, సాయంత్రం మలీ్టగ్రెయిన్ మీల్, స్వీట్ మీట్, రాగులు, జొన్నలతో చేసిన చిక్కీలు, పట్టీలు, జవార్ బైట్స్ వంటి బలవర్ధక ఆహారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమం రెండు, మూడు నెలలకే పరిమితమైంది. ఐదో తరగతి వరకే... అప్పాపూర్‌లో ఐదోతరగతి వరకు బడి ఉంది. అంతవరకే చదువుకున్నా. తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లలేదు. నాతో పాటు చాలామంది ఇక్కడితోనే ఆపేశారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. – తోకల గురువయ్య, చెంచు యువకుడు, అప్పాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా దెబ్బ తాకినా, చేయివిరిగినా నాటు వైద్యమే రెండు నెలల కిందట చెట్టు నుంచి జారి కింద పడ్డ. చేయి విరిగింది. డిండికి పోయి కట్టు కట్టించుకున్న. సుస్తీ అయితే ఆస్పత్రికి పోము. ఆస్పత్రికి వెళ్లాలంటే మన్ననూర్ లేకుంటే వటవర్లపల్లికి పోవాలి. అటు ఎటు పోవాలన్నా దూరం 50 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మందులు మాత్రమే ఇస్తారు. మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లామంటారు. అటు 80 కిలోమీటర్ల బదులు డిండికి వెళ్లా. ఇక్కడ అందరికి నాటువైద్యమే. – నాగయ్య, అప్పాపూర్ సార్లు వస్తేనే సౌకర్యాలు గిరిపోషణ కింద ఇంతకు ముందు జొన్నలు, సజ్జలతో ఉదయం, సాయంత్రం ఉప్మా ఇచ్చారు. ఏడాది కాలంగా ఏమీ ఇవ్వడం లేదు. గవర్నర్ మేడం, సార్లు వస్తున్నప్పుడు మాత్రమే సౌకర్యాలు చేస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – నాగమ్మ, మల్లాపూర్ పెంట, నాగర్‌కర్నూల్ -
చెంచులకు ‘ఉపాధి హామీ’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల బతుకు దెరువు కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మారిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది చెంచులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో అత్యల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధి హామీ కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ప్రత్యేక పథకంగా ఉపాధి హామీని 2009 నుంచి వర్తింపజేసి 180 రోజుల పనిదినాలు కల్పించారు. దీనికి తోడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధన కాకుండా సడలించి.. ముగ్గురికి జాబ్‌కార్డ్ ఇచ్చారు. ఆ ముగ్గురికి మొత్తంగా 540 పనిదినాలు ఇచ్చేవారు. పోషకాహారలోపంతో బలహీనంగా ఉండే చెంచులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇచ్చారు. 70 % పని చేస్తే వంద శాతం పనిచేసినట్టు చూపి చెల్లింపులు జరిపేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 గ్రామాల్లోని చెంచు కుటుంబాల బతుక్కి భరోసా దక్కేది. వారికి కేటాయించే పని దినాలను లెక్కగట్టి ఉపాధి కూలి మొత్తంలో పని చేయకముందే సగం డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చేవారు. మిగిలిన సగం పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేవారు. మొత్తం పనిదినాల్లో మొత్తం కూలిని సగం నగదుగాను, మిగిలిన సగాన్ని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కందిపప్పు, బియ్యం, చింతపండు, బెల్లం, చక్కెర వంటి 20 రకాల సరుకులు ఇచ్చేవారు. దీన్నే ఫుడ్ బాస్కెట్ అని పిలిచేవారు. కాగా, ఫుడ్ బాస్కెట్ పద్ధతి 2012తో ఆగిపోవడంతో మొత్తం నగదును ఇవ్వడం ప్రారంభించారు. వారికి నిర్ణయించిన రోజువారీ వేతనం డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ చెంచు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు లీడర్లకు ఉపాధి హామీ పనుల నగదు చెల్లింపులు బాధ్యతలు అప్పగించేవారు. ఇలా అన్ని రకాలుగా ఊతమిచ్చిన ఉపాధి హామీ కేంద్రం నిబంధనలతో గతేడాదిలో ఆగిపోవడంతో చెంచులు ఆవేదన చెందుతున్నారు. చెంచులకు ఉపాధి కోసం కేంద్రాన్ని కోరాం దేశంలో అత్యంత అల్ప సంఖ్యాకులుగా ఉన్న చెంచుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టాం. వారికి ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిలిపివేయడం ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని 171 చెంచు గూడెంలలో ప్రజలకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సానుకూలంగా ఆలోచించి చెంచులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని కోరాం. ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన శాఖలతో నిర్వహించిన సమావేశంలోను కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌ముండాకు చెంచుల పరిస్థితిని వివరిస్తూ ఉపాధి కొనసాగింపు కోసం నివేదిక ఇచ్చాం. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి -
తేనె సేకరిస్తున్నప్పడు ఆ తాడును బావమరిది మాత్రమే పట్టుకోవాలి!
సాక్షి, అచ్చంపేట (మహబూబ్‌నగర్): అడవి బిడ్డలు సేకరించే తేనె అంటే ఎంతో స్వచ్ఛమైనది. ఎలాంటి కల్తీ లేని తేనె పట్టు వారి వద్ద లభిస్తుంది. తరతరాలుగా వారు తేనె సేకరణ కులవత్తిగా సాగుతోంది. ప్రకతి దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తేనె సేకరణకు బయలుదేరే చెంచులు.. చెట్లపైకి ఎక్కే దగ్గరి నుంచి తేనె సేకరణ పూర్తి చేసే వరకు ఓ ప్రత్యేకమైన ఆచారాన్ని నేటికీ అవలంబిస్తున్నారు. తమ ఆచారాన్ని కొనసాగిస్తూనే పుష్కరకాలంగా శాస్త్రీయ పద్ధతుల్లో సైతం తేనెను సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే తేనె సేకరణ చేస్తారు. సీజన్ల వారీగా అడవి బిడ్డలు తేమ సేకరణ విధానం, అందుకోసం ఉపయోగించే పద్ధతులు.. తదితర వాటిపై సండే స్పెషల్.. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) తేనె సేకరణ కోసం చెట్టు ఎక్కేందుకు సిద్ధమైన చెంచు వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో చెంచు కుటుంబాలకు తేనె ముఖ్య జీవనాధారం. సీజన్లను బట్టి వివిధ రకాల తేనె సేకరణ చేస్తుంటారు. తొలకరి వర్షాకాలంలో దేవదారి పూతతో వచ్చే తేనె శ్రేష్టమైనది. మామిడి పూతతో వచ్చే తేనె చాలా మధురంగా, వామ తోటల మకరందాన్ని సేకరించిన సమయంలో వచ్చే తేనె కొంత ఘాటుగా ఉంటుంది. పొద్దుతిరుగుడు, కందిపూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. తాటి పూతతో వచ్చే తేనె కొంత అరుదుగా దొరుకుతుంది. చెంచులకు తేనె సేకరణలో అవగాహన పెంపొందించే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పదేళ్లుగా కోనేరు స్వచ్ఛంద సంస్థ అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో చాలామంది చెంచులకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. తేనె సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన కిట్లను అందజేస్తున్నారు. చెంచులు చూడడానికి నీరసంగా ఉన్నప్పటికీ తేనె సేకరణ సమయంలో కొండలు, చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు. (చదవండి: రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం) వేప చెట్టు కొమ్మపై పొదిగి ఉన్న పెద్ద తేనె తుట్ట తుట్టె నుంచి తేనెను వేరు చేయడం తుట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్ల వస్త్రంలో వేసి జల్లెడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిండుతారు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేతులతో పిండి తేనెను తుట్ట నుంచి వేరు చేస్తారు. ఇది చూడడానికి అంతగా బాగో లేనప్పటికీ, తేనెతో పాటు వచ్చే మైనం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో తెనే సేకరిస్తున్న చెంచులు శాస్త్రీయ పద్ధతిలో సేకరణ తేనెటీగలు నశించిపోకుండా చూడటంతో పాటు ఒకే తేనె తుట్ట నుంచి 5–6 సార్లు తేనె సేకరించే విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయవచ్చు. 12 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెంచులతో మమేకమై, వారికి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వచ్ఛంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రామం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీజన్ల వారీగా తేనె సేకరిస్తున్నారు. తేనె సేకరణకు సంబంధించి కిట్టులో బలమైన రెండు తాళ్లు, ఎలిమెంట్, గ్లౌజెస్ బూట్లు, తెల్లనిప్యాంట్, షార్టు, బకెట్, కత్తి ఉంటాయి. (చదవండి: ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది) తుట్టలో తేనె ఉన్న భాగం తేనె సేకరణ ఇలా.. తేనె సేకరణకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ప్రకతి, వన దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం తేనె తుట్ట కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఊపిరాడక కొన్ని చనిపోవడంతో పాటూ మరికొన్ని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత తేనెను సునాయసంగా తీస్తారు. కొండభాగంలో ప్రత్యేక ఆచారం.. కొండభాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో చెంచులు ఆచారం ప్రకారం కొండపై నుంచి జాలువారే తాడును బావమరిదిని మాత్రమే పట్టుకొనిస్తారు. తాడు సహాయంతో తేనె తుట్టె వద్దకు వెళ్లే సమయంలో ఓ ప్రత్యేకమైన శబ్ధం చేస్తూ వెంట తెచ్చుకున్న సుడేకు మంటపెట్టి, ఆ పొగతో తేనెటీగలను తేనె పట్టుకు దూరం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న శిబ్బెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న వారికి చేరవేస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు.. తేనె సేకరణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం లేదు. రోజురోజుకీ నశించి పోతున్న తేనెటీగలు పెంపకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. జీసీసీలో కొనుగోలు చేసే ధర కంటే బయటి వ్యక్తులకు అమ్మకుంటే అధిక డబ్బలు వస్తున్నాయి. కల్తీ లేని తేనెను సేకరిస్తున్నాం. అందుకే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తేనె కోసమే మా చెంచుపెంటలకు వస్తున్నారు. – చిగుర్లపెద్ద లింగయ్య, రాంపూర్ పెంట ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన క్లిట్లు కూడా పాడైనవి. కొత్త వాటిని ఇవ్వలేదు. ప్రస్తుత సీజన్లో తేనె ఎక్కవ సేకరణ జరుపుతాం. అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది – బయన్న, మల్లాపూర్ చెంచుపెంట -
చెంచులు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపు పాణ్యం చెంచుకాలనీలో స్టేడియం ప్రారంభం పాణ్యం: చెంచులు అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి సాధించాలని జిల్లా ఎస్పీ అకే రవికృష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రం పాణ్యం చెంచుకాలనీలో నూతనంగా నిర్మించిన సో్పర్ట్స్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెంచులకు క్రీడలపై ఆసక్తి పెంచాలని సే్టడియాన్ని నిర్మించి క్రీడాపరికరాలు ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాల్లో గిరిజన కుటుంబాలకు సరైన విద్య అందడం లేదని చెప్పారు. సారా తయారీ, ఇతర అలవాట్లను వీడి పిల్లలను బాగా చదివించుకోవాలని గిరిజనులకు సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇక నుంచి చెంచు కాలనీలో ప్రతి రోజు ఉదయం ఒక పోలీస్ అధికారి పర్యటించి పిల్లలు ఇళ్ల వద్ద కనిపిసే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఒకరిని ఉద్యోగుడిగా చూడాలని ఉందన్నారు. త్వరలో జరిగే జాబ్‌మేళాకు గిరిజన యువకులు హాజరుకావాలని కోరారు. అనంతరం చెంచు యువతకు క్రీడా దుస్తులను అందించారు. అంతకుముందు చెంచులు ఎస్పీని ఘన స్వాగతం పలికి సత్కరించారు. వీటీడీఏ ప్రెసిడెంట్, పాణ్యం మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, జెడ్పీటీసీ నారాయణమ్మ, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, పాణ్యం ఉపసర్పంచ్ ఆటోమాబు, పాణ్యం ఎస్ఐ మురళీమోహన్రావు, గడివేముల ఎస్ఐ రామాంజినేయరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నాగశేషు, జాకీర్ ఉసేన్, హోటల్ బాబు, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మద్యంతో భవిష్యత్తు నాశనం పాణ్యం: యువతరం మద్యానికి బానిస అయితే భవిష్యత్తు నాశనమవుతుందని జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక చెంచుకాలనీలోని సుంకులాపరమేశ్వరీ ఆలయానిన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలో యువత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు.